చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులను గర్భ నవరాత్రులని కూడా పిలుస్తారట. ఎందుకు? ఇలా పిలవడానికి శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏమిటి?
శ్రీరాముడు తల్లి గర్భంలో ఉన్న చివరి తొమ్మిది రోజులు.. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ ఉండే తొమ్మిది రోజులూ పరమ పవిత్రమైనవి. ఈ రోజులనే వసంత నవరాత్రులనీ, గర్భ నవరాత్రులనీ పిలుస్తారు. ఇవి ఆధ్యాత్మికపరంగా, ఆరోగ్యపరంగా కూడా విశిష్టమైనవి. శ్రీమహావిష్ణువు మానవ రూపంలో జన్మించి, ఆదర్శ జీవనం గడిపాడు. సాధారణ ప్రజానీకం కూడా శ్రీరాముడి మార్గంలో పయనించి ఉన్నత జీవితాన్ని గడపాలనే సూచన చైత్ర నవరాత్రులు అందిస్తున్నాయి. ఈ తొమ్మిది రోజులు రామాయణాన్ని పారాయణం చేయడం సంప్రదాయం. రామ నామాన్ని పలికినంత మాత్రానే సకల పాపాలూ తొలగిపోతాయన్నాడు భక్త గోపన్న. వసంత నవరాత్రుల్లో దివ్య మంగళస్వరూపుడైన ఆ పురుషోత్తముడిని ధ్యానిస్తూ భక్తి భావనతో గడపడం వల్ల ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుంది.
శ్రీరాముడి జీవితానికి, వసంత రుతువుకి విడదీయలేని అనుబంధం ఉంది. రామ జననం, సీతారామ కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం.. ఇలా అన్నింటికీ ఈ వసంత రుతువే సాక్ష్యం. అందువల్లే చైత్ర నవరాత్రులకు మరింత విశిష్టత చేకూరింది. కాలం రాముడిని అనేక రకాలుగా పరీక్షలకు గురిచేసింది. వేదనలన్నింటినీ చిరునవ్వుతో భరించాడు రామచంద్రుడు. మనం కూడా కొత్త సంవత్సరంలోని తొలి తొమ్మిది రోజులూ ఆ మహిమాన్వితుడిని స్మరిస్తూ గడిపి.. జన్మను సార్థకం చేసుకోవాలనేది వసంత నవరాత్రుల వెనుక అంతరార్థం.
ఉత్తర భారతదేశంలోని రామాలయాల్లో శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తూ వసంత నవరాత్రులు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులూ రామాయణంలోని సప్తకాండలను పారాయణం చేస్తారు. ‘శ్రీరామ రామ రామేతి.. రమే రామే మనోరమే..’ అనే శ్లోకాన్ని అనుసరించి రామ నామాన్ని మూడుసార్లు పలికితే వెయ్యిసార్లు స్మరించినంత పుణ్యం చేకూరుతుంది.
వసంత నవరాత్రుల కాలంలో లలితా సహస్ర నామ పారాయణ కూడా చేయాలని అంటారు. వసంత నవరాత్రులకు లలితాదేవికి సంబంధం ఏమిటి? దీని వెనుక ఏదైనా నేపథ్యం ఉందా?
శ్రీరామచంద్రుడు, లలితా త్రిపురాంబికల మధ్య అభేదాన్ని సూచించింది దేవీ భాగవతం. ఆ కారణంతో వసంత నవరాత్రుల కాలంలో లలితా సహస్ర నామ పారాయణతో పాటు పూజాదికాలను నిర్వహించడం కూడా ఆచారమైంది. సర్వ దేవతలకూ ఆరాధ్య దైవం లలితాదేవి. ‘హరి బ్రహ్మేంద్ర సేవితా, సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవితా’ మొదలైన నామాలతో ఆ అమ్మను పూజిస్తే సమస్త దేవతలను సేవించిన పుణ్యఫలం దక్కుతుంది. ‘లలితాంబిక’ అనే ఒక్కటి తప్పించి తక్కిన నామాలన్నీ అమ్మవారి బిరుదులు కావడం లలితా సహస్ర నామాల్లోని విశిష్టత. సాధారణ నామంతో కన్నా బిరుదు నామంతో పిలిచినపుడు ఎవరికైనా సంతోషం కదా!. అలాంటి సంతోషాన్ని అమ్మవారికి కలిగేలా చేసి భక్తిని చాటుకునేందుకు లలితా సహస్ర నామాలను పారాయణం చేస్తారు. ఆ నామాలను స్మరిస్తున్నప్పుడు ఆ పేరు రావడానికి ఉన్న చరిత్ర మనోఫలకంపై మెదిలి అపరిమిత ఆనందం కలుగుతుంది.
కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలతో జీవితాన్ని సాగించాలని అందరం వాంఛిస్తాం. అయితే కొన్ని వ్యర్థ కోరికలు మనల్ని సన్మార్గం నుంచి మరలిస్తాయి. పూర్వం శివపార్వతుల కల్యాణం సమయంలో స్వామి మూడో కంటి వేడికి మన్మథుడు భస్మమయ్యాడు. ఆ భస్మం నుంచి భండాసురుడనే రాక్షసుడు పుట్టగా, లలితాదేవి అతడిని సంహరించింది. ఆ రాక్షసుడు మనలో చెలరేగే అపరిమిత కోరికలకు ప్రతీక. మన హృదయంలో అనేక వాంఛలు పుట్టుకొచ్చి ఆధ్యాత్మిక ఉన్నతిని అందుకోనివ్వకుండా అడ్డుపడతాయి. లలితా సహస్ర నామాలను పారాయణ చేయడం, అమ్మవారిని శాస్త్రోక్తంగా నవరాత్రుల్లో పూజించడం వల్ల వాంఛారహిత స్థితిని అందుకుంటారనేది అసలు రహస్యం. సమస్త చరాచర జగత్తుకు మాతృ స్వరూపిణి అయిన లలితా మాత త్రిమూర్తులకు ఎలా ఆధారంగా నిలుస్తుందో శంకరాచార్యుల వారు ‘సౌందర్యలహరి’లో తెలియజేశారు. బ్రహ్మదేవుడు లలితాదేవి పాదపద్మాల్లోని ఒక పరాగ రేణువుతో సకల చరాచరాలను సృజిస్తున్నాడు. సృష్టి రూపం ధరించిన ఆ రేణువును తన అనంత శిరస్సులతో ధరించి విష్ణువు స్థితి కారకుడు అవుతాడు. ఆ సృష్టినే యుగాంతంలో మహేశ్వరుడు అమ్మ అనుజ్ఞతో క్షణకాలంలో లయం చేసి విభూతిని దేహానికి భస్మంగా రాసుకుంటాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కర్తవ్య నిర్వహణకు తోడ్పడుతున్న అమ్మవారిని అర్చిస్తే గొప్ప ప్రతిఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఆ నమ్మకంతోనే వసంత నవరాత్రుల కాలంలో లలితాదేవిని పూజించి జన్మ చరితార్థం చేసుకుంటారు.

























































































































































































































































































































































































































Review వసంత నవరాత్రులను గర్భ నవరాత్రులని ఎందుకంటారు?.