రామేశ్వరం..

లోకంలో మనుషులు
‘దాత – అదాత’ అని రెండు
రకాలుగా ఉంటారట. ఇతరులకు అన్నం దానం చేసి
తాను తినేవాడు దాత.
ఇతరులకు దానం చేయకుండా.. ఇతరులను కూడా దానం చేయనివ్వకుండా తాను మాత్రమే తినేవాడు అదాత.
దాతకు కాలాంతరాన అన్నం లభిస్తుంది.
అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా, అతడిని అగ్ని నశిపంచేస్తాడు. ఈ విషయాన్ని తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతోంది.
ఇతరులకు అన్నం పెట్టకుండా తానే తింటే ఆ అన్నం విషంతో సమానమట. దాత, అదాత ఇద్దరూ.. అన్న సంపాదనకు ప్రయత్నిస్తారు. కానీ దాత ఇతరులకు దానం చేయడం కోసం అన్నం సంపాదిస్తాడు. అది ఉత్క•ష్టమైన లక్ష్యం. అదాత తాను తినడం కోసం మాత్రమే సంపాదిస్తాడు. అది నీచమైన ప్రవృత్తి.
లోకంలో అన్నదానానికి మించిన దానం లేదని పెద్దలు చెబుతారు. ధనం, బంగారం.. మరేదైనా దానం చేస్తే.. వాటిని పొందిన వ్యక్తి మరింత
ఆశిస్తాడు. అదే అన్నాన్ని దానం చేస్తే కడుపు నిండా తిన్న తరువాత మరేమీ ఆశించడు. పైగా తృప్తిగా ఆశీర్వచనం అందిస్తారు. అన్నదానం శుభ ఫలితాలను కలిగిస్తుంది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు ఇతర శుభకార్యక్రమాల్లో అన్నం పెడతారు. దాన్ని కడుపారా భుజించిన వారి నోట వచ్చే శుభమైన మాటలు ఆశీర్వాదంగా మారతాయని, అవి అన్నం పెట్టిన వారికి మేలు చేస్తాయని అంటారు. ఇక పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో అన్నదానం చేస్తే అంతకు రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు. ఆయా క్షేత్రాల్లోని అన్నదాన సత్రాలు అందించే భోజనం.. సాక్షాత్తూ ఆ క్షేత్రంలో కొలువైన దేవుని ప్రసాదమే అవుతుంది. అందుకే తన అన్నదాన మహత్కార్యానికి అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం సంస్థ పుణ్యక్షేత్రాలను ఎంచుకుంది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఆలయాల్లో నిరతాన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ రామేశ్వర ఫుణ్యక్షేత్రంలో భక్తులకు భోజన, వసతి
సదుపాయాలను అందచేస్తోంది. ఈ కార్యక్రమాలకు
తోడ్పడాలనుకునే వారు ఈశ్వరకృపను
పొందడం తథ్యం.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో దేశానికి దక్షిణ భాగంలో ఉన్న మహా క్షేత్రం రామేశ్వరం. అబ్బురపరిచే శిల్పకళా వైభవానికి ప్రతీకగా ఎన్నో వింతలకు నెలవై భాసిల్లుతోంది ఈ క్షేత్రం. పరమేశ్వరుడు ఇక్కడ రామనాథస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలోని శివలింగాన్ని సీతాదేవి తయారు చేసిందని చెబుతారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ మహిమాన్వితమైన క్షేత్ర దర్శనం సర్వ పాపహరణమని పురాణాలు చెబుతున్నాయి.
చూడాలంటే రోజైనా సరిపోదు..
రామేశ్వరం.. తమిళనాడులోని హిందూ మహా సముద్రం, బంగాళాఖాతం సంగమ స్థానంలో కనిపించే చిన్న ద్వీపం. అలాంటి ద్వీపంలో పరమేశ్వరుడు రామనాథస్వామిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధిపొందిన ఈ రామనాథస్వామి ఆలయ నిర్మాణం భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఇక్కడ కొలువైన స్వామి స్వరూపం వెనుకా ఆసక్తికరమైన కథనం ఉంది. అందుకే రామేశ్వరం ఆధ్యాత్మికధామంగానూ, పర్యాటక ప్రాంతంగానూ పేరుగాంచి అటు భక్తులనీ, ఇటు పర్యాటకులనీ ఆకట్టుకుంటోంది. ఈ ఆలయంలోకి ప్రవేశించి, ఇక్కడి తీర్థాలను చుట్టేస్తూ ఆ తరువాత ఆలయ శిల్పకళా సంపదను వీక్షిస్తూ స్వామిని దర్శించుకోవడానికి రోజైనా సరిపోదంటే అతిశయోక్తి కాదు. ఆలయం అంత గొప్పగా ఉంటుంది. పదిహేను ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి నాలుగు వైపులా నాలుగు గోపురాలతో కనిపించే ఈ ఆలయంలోని మూడో ప్రాకారంలో దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో వెయ్యికి పైగా స్తంభాలు ఉంటాయి. 690 అడుగుల పొడవు, 435 అడుగుల వెడల్పు, 1212 స్తంభాలతో కూడిన ప్రాకారం ఈ ఆలయం సొంతం. అందుకే ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాకారం కలిగిన ఆలయంగా ఈ గుడి ప్రసిద్ధిగాంచింది. ప్రారంభంలో కేవలం గడ్డి పాక రూపంలో ఉన్న ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా నిర్మించడం వెనుక ఎందరో రాజుల కృషి ఉంది. 15వ శతాబ్దం మొదట్లో పాండ్యులు ఈ పాంతాన్ని పాలించారు. తరువాత సేతుపతి రాజుల పాలనలోకి వచ్చింది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయంలో స్వామి ఎలా కొలువుదీరాడంటే..
సీతమ్మ చేసిన శివలింగం
త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచే రామసేతును నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడట. రావణ సంహారం అనంతరం రాముడు- సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడితో కలిసి అయోధ్యకు ప్రయాణమవుతూ ఇక్కడ కొద్దిసేపు సేదదీరాడట. ఆ సమయంలో మహాజ్ఞానీ, శివభక్తుడూ అయిన రావణబ్రహ్మను సంహరించినందుకు బాధపడుతూ తనకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా పరిష్కారం చూపాలని మహర్షులను అడిగాడట. అంతా కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని సలహా ఇవ్వడంతో కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురావాలని రాముడు హనుమంతుడిని పూజలు అందుకుంటున్నాడు. రామాయణంతో సంబంధమున్న, రాముడు నడయాడిన, రాముడు తన పాప పరిహారం చేసుకున్న, రాముడు శివుడికి ఆలయం నిర్మించిన పవిత్ర ప్రదేశం రామేశ్వరం. రావణవధ తరువాత రాముడు ఈ ప్రాంతంలోనే విభీషణుడికి లంకాధిపతిగా పట్టాభిషేకం నిర్వహించినట్టు స్థల పురాణం చెబుతోంది.
అగ్నితీర్థంలో స్నానమాచరించాకే..
రామేశ్వరంలో మొత్తం అరవై నాలుగు (64) బావులు ఉంటే వాటిలో ఆలయంలో ఉన్న ఇరవై రెండు (22) బావులు అతి ప్రధానమైనవని చెబుతారు. రావణ సంహారం అనంతరం రాముడి అమ్ములపొదిలో మిగిలిన ఇరవై రెండు బాణాలతోనే ఇక్కడ ఇరవై రెండు బావులనూ సృష్టించాడని అంటారు. ఇక్కడకు వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డున ఉన్న అగ్నితీర్థంలో స్నానమాచరించాకే ఆలయం లోపలికి వెళ్తారు. రావణుడి చెర నుంచి విడిపించి తీసుకొచ్చిన సీతాదేవి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు రాముడు ఇక్కడే అగ్నిప్రవేశం చేయించాడు. అప్పుడు సీతాదేవి పాతివ్రత్యం తట్టుకోలేని అగ్నిదేవుడు సముద్రంలో మునిగి ఉపశమనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనికి అగ్నితీర్థమనే పేరొచ్చింది. అలాగే ఆలయం లోపల ఉన్న ఇతర తీర్థాలన్నింటిల్లో కాకపోయినా ఒకటి రెండింట్లోనైనా స్నానమాచరించవచ్చు. ఈ తీర్థాలన్నీ సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఒక్కో బావి నీటి రుచి ఒక్కోలా ఉండటం విశేషం. మరికొన్ని బావుల్లోని నీరు తియ్యగానూ ఉంటుంది. ప్రతి తీర్థానికీ ఆయుర్వేద సుగుణాలు ఉంటాయనీ చెబుతారు. ఈ తీర్థాలకు సావిత్రి, గాయత్రి, సరస్వతి, నల, నీల, సూర్య, చంద్ర, గంగ.. తదితర పేర్లు ఉంటాయి.
108 శివలింగాలు..
తీర్థాల్లో స్నానమాచరించిన భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకున్నాకే రాముడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగాన్ని పూజిస్తారు. శివలింగాల దర్శనం అయ్యాక పర్వతవర్ధినిగా పూజలు అందుకుంటున్న పార్వతీదేవి మందిరానికి వెళ్తారు. ఆ తరువాత విశ్వేశ్వరుడు, విశాలాక్షి, విష్ణుమూర్తి, మహాలక్ష్మి, సంతాన – సౌభాగ్య గణపతి, నటరాజు, నవగ్రహ మండపం, వల్లీదేవసేన సమేత కార్తికేయుడు.. తదితర దేవతామూర్తులనూ దర్శించుకోవచ్చు. ఆలయం ప్రాకారాల్లో నడిచే భక్తులు.. వివిధ మహర్షులు ప్రతిష్టించిన 108 శివలింగాలనూ చూసి మంత్రముగ్ధులవుతారు. రామలింగ ప్రతిష్ఠను తెలియచేసే మందిరమూ ఉంది ఇక్కడ. నంది మండపంలోని నంది విగ్రహం దాదాపు పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది. హనుమంతుడి విగ్రహం శ్రీలంక వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడున్న లక్ష్మణ తీర్థంలో పితృతర్పణ కార్యక్రమాలనూ నిర్వహించవచ్చు.
శివపార్వతుల కల్యాణం చూసి తరించాల్సిందే..
ఆలయ ప్రాంగణంలో ఏడాది మొత్తం జరిపే పూజలు ఒక ఎత్తయితే ప్రత్యేక పర్వదినాల్లో నిర్వహించే ఉత్సవాలు మరొక ఎత్తు. ముఖ్యంగా మహా శివరాత్రి సందర్భంగా పది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతామూర్తులను పురవీధుల్లో ఊరేగించడం, అభిషేకాలూ, దీపాల అలంకరణలు చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. అలాగే, జూలై, ఆగస్టు మాసాల్లో తిరు కల్యాణం పేరుతో పదిహేడు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో జరిగే రామనాథస్వామి – పర్వతవర్ధిని కల్యాణాన్నీ, ఇతర సాంస్క•తిక కార్య క్రమాలనూ చూసి తరించాల్సిందే. దేవీశరన్నవరాత్రులు, నటరాజ నిజరూప దర్శనం, రామలింగ ప్రతిష్ఠను పురస్కరించుకుని నిర్వహించే ప్రత్యేక ఉత్సవం, ఆరుద్ర దర్శనం పేరుతో విశేషమైన కార్యక్రమాలు, శ్రీరామనవమి.. ఇలా ఏడాది మొత్తం ఎన్నో వేడుకలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి.
గంధమాదన పర్వతంపై రాముడి పాదుకలు
రామేశ్వరానికి వచ్చే భక్తులు కేవలం స్వామి దర్శనంతోనే వెనుదిరిగి వచ్చేయరు. ఇక్కడున్న ధనుష్కోడి, పాంబన్‍ కొత్త-పాత వంతెనలు, తేలే ఇటుకలు, గంధమాదన పర్వతాన్నీ కూడా సందర్శిస్తారు. రాముడి పాదుకలు ఉండే గంధమాదన పర్వతంపైకి ఎక్కితే రామేశ్వరం మొత్తం కనిపిస్తుందట. రామేశ్వరంలోని సముద్రానికి శాంత సముద్రమని పేరు. అలల ఉధృతి లేని సముద్రాన్ని ఇక్కడ మాత్రమే చూడవచ్చు. 1964లో ధనుష్కోటిలో ఏర్పడిన ప్రళయం నుంచి బయటపడిన ఒకేఒక చారిత్రక నిర్మాణం రామేశ్వరమే.
రామేశ్వర యాత్రను ఒక పద్ధతి ప్రకారం చేస్తే పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించిన ఫలితం దక్కుతుందట. భక్తులు మొదట వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథుడిని పూజించి అక్కడి నుంచి గంగాజలాన్ని తీసుకొచ్చి రామేశ్వరంలోని శివుడిని అభిషేకించాలి. మళ్లీ ఇక్కడున్న ఇసుకను తీసుకెళ్లి కాశీలోని గంగలో కలపాలని అంటారు. పైగా భారతదేశంలో ఉన్న నదులన్నీ ఇక్కడున్న బావుల అంతర్భాగం నుంచే ప్రవహిస్తాయని చెబుతారు. అందుకే రామనాథస్వామిని దర్శించుకుంటే సమస్త యాత్రా ఫలితం కలుగుతుందని ప్రతీతి.
ఎలా చేరుకోవాలంటే..
రామేశ్వరానికి సమీప విమానాశ్రయం మధురై. అక్కడి నుంచి వాహనం లేదా రైలులో ప్రయాణించి చేరుకోవచ్చు.
మధురైతో పాటు పలు ప్రాంతాల నుంచి కూడా రైలు, రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి.
మండపం నుంచి రామేశ్వర ద్వీపానికి బ్రిటిష్‍ వారు 1914లో రైలు మార్గం నిర్మించారు. సముద్రంలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ మార్గం ఇంజనీరింగ్‍ ప్రతిభకు తార్కాణం. మధ్యలో నౌకలు వెళ్లాల్సి వస్తే కొంచెం మేర రైలు మార్గం పైకి లేచి దారి ఇచ్చే విధంగా దీనిని నిర్మించారు. ఇటీవల ఈ పాత పంబన్‍ వంతెన స్థానంలో కొత్తది నిర్మించారు.

త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచే రామసేతును నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడట. రావణ సంహారం అనంతరం రాముడు- సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడితో కలిసి అయోధ్యకు ప్రయాణమవుతూ ఇక్కడ కొద్దిసేపు సేదదీరాడట. ఆ సమయంలో మహాజ్ఞానీ, శివభక్తుడూ అయిన రావణబ్రహ్మను సంహరించినందుకు బాధపడుతూ తనకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా పరిష్కారం చూపాలని మహర్షులను అడిగాడట.

కరివెన నిత్యాన్నదాన సత్రం రామేశ్వరం చిరునామా:
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం, 37-ఏ, సన్నిధి వీధి, రామేశ్వరం, తమిళనాడు- 623526
ముఖ్యమైన ఫోన్‍ నంబర్లు:
మేనేజర్‍: 83339 07793, హెల్ప్లైన్‍: 83339 07813
04573-222156
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్‍ ఖాతా:
స్టేట్‍ బ్యాంక్‍ ఆఫ్‍ ఇండియా:
అకౌంట్‍ నంబర్‍: 11250273141
ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్‍: ఎస్‍బీఐఎన్‍0004894
(ఇక్కడి కరివెన నిత్యాన్నదాన సత్రంలో భోజన వసతి అందుబాటులో ఉంది. అలాగే సత్రం తరపున నిర్వహిస్తున్న భవనంలో పదహారు (16) వసతి గదులు అందుబాటులో ఉన్నాయి. తన సేవల విస్తరణకు కరివెన నిత్యాన్నదాన సత్రం దాతల నుంచి విరాళాలను కోరుతోంది. వివరాలకు పై ఫోన్‍ నంబర్లలో సంప్రదించవచ్చు)

Review రామేశ్వరం...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top