ఆకలితో గుక్కపట్టిన శిశువు తల్లి స్తన్యం నుంచి పాలచుక్కలు గొంతులో పడగానే ఆనందంతో కేరింతలు కొడుతుంది. వానజల్లు లక్షలాది చినుకులుగా భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి సారవంతం చేసినట్టు.. ఒక్క మెతుకు శరీరాన్ని తేజోవంతం చేసి బతుకు నిలుపుతుంది. ఒకసారి భృగు మహర్షికి పరమాత్మ ఎవరో తెలుసుకోవాలనే కోరిక పుట్టిందట. ఘోర తపస్సు చేశాడు. బుద్ధి, ప్రాణం, అన్నం వంటివి కూడా పరబ్రహ్మమేనని గుర్తించాడు. జీవులన్నిటికీ ప్రాణాధారమైనది ఆహారం. అందుకే ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఎంచి పూజిస్తాం. భుజిస్తాం. జీవితం ఫలప్రదం కావాలంటే పుణ్యం చేయాలి. పుణ్యం చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి.
అలాంటి పుణ్యకార్యాల్లోకెల్లా మహా పుణ్యకార్యం- అన్నదానం. అటువంటి మహత్కార్యంలో నిమగ్నమై ఏళ్లుగా ఓ యజ్ఞంలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తోంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం. అనేక పుణ్యక్షేత్రాల్లో ఈ కరివెన నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తున్న సత్రాల్లో అలంపూర్ సత్రం ఒకటి. అలంపూర్‍లోని జోగులాంబదేవి క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ నిత్యాన్నదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడ కరివేన నిత్యాన్నదాన సత్రంలో తినే భోజనాన్ని సాక్షాత్తూ అమ్మవారి ప్రసాదంగానే భావిస్తారు. ఒకరి ఆకలి తీర్చడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
తుంగభద్రా నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదమని చెబుతారు. అమ్మవారి ప్రసాదాన్ని తీసుకున్న భక్తులు ఎలా మానసిక ప్రశాంతత చెందుతారో.. కరివెన నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేసిన భక్తులు అంతే సంతృప్తిని చెందుతారు. అలాంటి భక్తుల తృప్తి అనే ఆశీర్వాద బలంతోనే కరివెన సత్రం వారు తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నారు. అన్నదాన రూపేణా ఈ సంస్థకు సాయం చేసినా దాతలకు కూడా అంతే పుణ్యం దక్కుతుంది. ప్రస్తుతానికి కరివెన నిత్యాన్నదాన సత్రం తరపున అన్నదానం నిర్విఘ్నంగా సాగుతోంది. ఇక్కడ వసతి సౌకర్యం కల్పించేందుకు అవసర మైన స్థలం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. దాతలు వసతి రూపేణా కూడా సాయమందించి అమ్మవారి కృపను పొందవచ్చు.
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీజోగులాంబ ఆలయం తెలంగాణలోని గద్వాల జిల్లా అలంపూర్‍లో ఉంది. కృష్ణానదిలో తుంగభద్ర నది సంగమించేది ఇక్కడికి సమీపంలోనే. జోగులాంబ ఆలయంతో పాటు అలంపురంలో అడుగడుగునా కనిపించే దేవాలయాలు మనలో ప్రతిక్షణం భక్తి భావనలను రేకెత్తిస్తాయి.
అలంపురం మహాక్షేత్రం తుంగాచోత్తర వాహినీ
బాలబ్రహ్మేశ్వరో దేవ: జోగులాంబ సమన్విత।
తీర్థం పరశురామస్య నవబ్రహ్మ సమన్వితం
అలంపురే జోగులాంబా విశాలాక్ష్యా సమాస్మ•తా
భువికా శ్యా సమక్షేత్రం సర్వదేవ సమర్చితం
సదాన: పాతుసా దేవీ లోకానుగ్రహతత్పరా
జోగులాంబ ఆలయ విశిష్టతను తెలిపే ఈ మాటలకు అర్థం.. ‘అలంపురం సర్వోత్తమమైన క్షేత్రం. ఇక్కడ తుంగభద్ర ఉత్తరవాహిని. స్వామి వారు బాలబ్రహ్మేశ్వరుడు. అమ్మవా రేమో జోగులాంబ. ఇది పరశురాముని తీర్థం. నవబ్రహ్మలకు నిలయం. ఈ క్షేత్రంలోని జోగులాంబ కాశీ విశాలాక్షితో సమానం. సకల దేవతల చేతా ఈ స్థలం పునీతమైనది. వీరి చేత జోగులాంబ పూజలందుకుంది. ఈ దేవి మనల్ని అనుగ్రహించు గాక!’ అని.
స్థల పురాణం
ఒకప్పుడు హమతాపూర్, అమలాపూర్ పేర్లతో పిలిచిన క్షేత్రమే ప్రస్తుత అలంపూర్. జిల్లా కేంద్రం గద్వాల్‍కు అరవై కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయమైన అలంపూర్‍లో అయిదో శక్తిపీఠమైన జోగులాంబ ఆలయం ప్రధానమైనది. ఈ అమ్మవారిని లలితా సహస్ర నామాల్లో పలుమార్లు పేర్కొన్నారు. దక్షయజ్ఞం సమయంలో దక్ష ప్రజాపతి శివనింద చేస్తూ పరిహాసంగా మాట్లాడటంతో ఆ అవమానాన్ని భరించలేని సతీదేవి (దక్ష ప్రజాపతి కుమార్తె, శివుడి అర్ధాంగి) యాగాన్నికి ఆహుతి అవుతుంది. పరివార గణం ద్వారా ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు కోపోద్రిక్తుడై అక్కడికి చేరి యాగాన్ని సమూలంగా నాశనం చేస్తాడు. అనంతరం అమ్మవారి దేహాన్ని భుజంపై వేసుకుని ప్రళయతాండవం చేస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుడిని శాంతింప చేసేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ సుదర్శనం అమ్మవారి శరీరాన్ని పద్దెనిమి భాగాలుగా ఖండిస్తుంది. ఒక్కొక్క భాగం ఒక్కో ప్రాంతంలో పడుతుంది. అవే తరువాత పద్దెనిమి శక్తిపీఠాలుగా ఉద్భవించాయి. ఇందులో అమ్మవారి పై దవడ భాగం అలంపూర్‍లో పడినట్టు పురాణాలు చెబుతున్నాయి. కింద దవడ కంటే పై దవడ కాస్త వేడిగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ తల్లి రౌద్ర స్వరూపిణిగా వెలసింది. అమ్మవారు ఉగ్రరూపంలో ఉండటంతో ఆమెను శాంతింపచేసేందుకు ఆలయ కింద భాగంలో జలగుండం ఏర్పాటు చేసి నిత్యం నీటితో నింపి ఉంచుతారు. మిగతా చోట్ల స్త్రీ దేవతలకు తల వెంట్రుకలు వెనక్కి ఉంటే ఇక్కడ మాతకు మాత్రం పైకి ఉంటాయి. ఇలా ఉండటాన్ని ‘జట’ అంటారు. పరమేశ్వరుడికి మాత్రమే ఇలా జట ఉంటుంది. దేవతల్లో జోగులాంబకు మాత్రమే ఇలా ఉంటుంది. జటాజూటధారి అయిన తల్లి తల వెంట్రుకల్లో బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం ఉంటాయి. వీటితో పాటు అమ్మవారు ప్రేతాసనంలో ఉంటారు. ఈ అయిదూ ఈ క్షేత్ర ప్రత్యేకతలు. పరమేశ్వరుడు ఎక్కువ కాలం శ్మశానవాసి కాబట్టి దేవి కూడా ఆయనలో భాగమని చెప్పడానికే ఈ ప్రత్యేకతలు ఉంటాయి.
ఆ రోజు నిజరూప దర్శనం
జోగులాంబ ఆలయాన్ని మొదట క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో బాదామి చాళుక్యుడైన రెండో పులకేశి నిర్మించాడు. 17వ శతాబ్దంలో మహమ్మదీయుల దండయాత్ర సమయంలో ఆలయం ధ్వంసమైనట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే అమ్మవారి విగ్రహాన్ని మాత్రం సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోని నైరుతి భాగంలో ఏర్పాటు చేశారు. 2005లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జోగులాంబ ఆలయాన్ని ప్రస్తుతం ఉన్నట్టు నిర్మించింది. ఈ సమయంలోనే అమ్మవారి విగ్రహాన్ని పున:ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచీ ఈ ఆలయానికి సందర్శకులు పెరిగారు. ప్రతి పౌర్ణమి, అమవాస్యలకు జోగులాంబ ఆలయంలో చండీహోమాలు, ప్రతి శుక్రవారం వారోత్సవ పూజ, ప్రతి రోజూ అమ్మవారి సన్నిధిలో త్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఇక్కడ ఏటా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తారు. ఏటా మాఘ
శుద్ధ పంచమి నాడు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు భక్తులకు జోగులాంబ నిజరూప దర్శనం లభిస్తుంది. అదేరోజు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు.
ఆలయాల పురం..
బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించిన నవబ్రహ్మల దివ్యధామమూ అలంపూర్‍లోనే ఉంది. ఈ నిర్మాణశైలి దేశంలోనే ప్రథమంగా భావించే ఆలయ నిర్మాణ శైలుల్లో ఒకటి. 1,400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక స్థానం పొంది శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా విరాజిల్లుతున్నాయి. శ్రీశైలం ఆనకట్ట నిర్మాణ సమయంలో కృష్ణా తీరంలోని ముంపు ప్రాంతం నుంచి రాళ్లను తరలించి యథాతథంగా పునర్నిర్మించిన సంగమేశ్వర ఆలయమూ అలంపూర్‍లోనే ఉంది. ఇక్కడకు దగ్గరలోనే పాపనాశేశ్వర ఆలయాల సముదాయం కూడా ఉంది. ఇలా ఎన్నో ఆలయాలకు ఆలవాలం అలంపురం.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ – కర్నూలు రహదారి మార్గంలో కర్నూలుకు పది కిలోమీటర్ల దూరంలోని అలంపూర్ చౌరస్తా నుంచి అలంపూర్ చేరుకోవచ్చు. హైదరాబాద్ – కర్నూలు రైలు మార్గంలో కర్నూలు స్టేషన్‍కు ముందు జోగులాంబ హాల్ట్ వస్తుంది.
కరివెన నిత్యాన్నదాన సత్రం
అలంపూర్ చిరునామా:
అఖిల భారతీయ బ్రాహ్మణ
కరివెన నిత్యాన్న దాన సత్రం జోగులాంబ ఆలయం వెనుక గేటు, దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద, బ్రాహ్మణ వీధి, అలంపూర్, తెలంగాణ- 509152
ముఖ్యమైన ఫోన్ నంబర్లు:
మేనేజర్: 83339 07806
హెల్ప్లైన్: 83339 07805
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్ ఖాతా:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
అకౌంట్ నంబర్: 208710100046896
ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్: యూబీఐఎన్0820873
(ఇక్కడి కరివెన నిత్యాన్నదాన సత్రంలో భోజన వసతి అందుబాటులో ఉంది. సత్రం తరపున వసతి గదుల నిర్మాణం కోసం స్థల సేకరణ కూడా పూర్తయింది. త్వరలో వసతి సౌకర్యం కల సాకారం కావడానికి దాతలు భూదాన యజ్ఞంలో పాల్గొనవచ్చు. వివరాలకు పై ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు)

























































































































































































































































































































































































































Review జోగులాంబ నిజరూప దర్శనం.