పురాణ పాత్రలు

హిందూ సాహిత్యంలో సాటిలేనిది రామాయణం. మన ప్రాచీన
ఇతిహాసాలలో ఇదొకటి. దీనిని వాల్మీకి మహర్షి రచించారు. ఇందులో పలు పాత్రలున్నాయి. ముఖ్యమైన పాత్రల సంక్షిప్త పరిచయం..

కైకసి:
రాక్షస రాజు సుమాలి, కేతుమతి దంపతుల కుమార్తె. ఈమె సోదరులు మారీచుడు, సుబాహుడు. కైకసి విశ్రవసుడి భార్య. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖలకు తల్లి.

కైకేయి:
దశరథ మహారాజు మూడవ భార్య. భరతుని తల్లి. తన దాసి అయిన మంథర మాటలు విని శ్రీరాముడిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపాలని, భరతుడికి రాజ్యాభిషేకం చేయించాలని దశరథుడిని కోరుతుంది. ఈ కారణంగా సీతారాముల వనవాసానికి ప్రధాన కారకురాలైంది.

కౌసల్య:
శ్రీరాముడి తల్లి. దశరథుని ముగ్గురు భార్యలలో పెద్దది. అయోధ్య రాజ్యానికి మహారాణి. ఆమె మగథ సామ్రాజ్యపు (కోసల) రాకుమారి. దశరథునికి ఇష్టమైన భార్యగా రామాయణంలో వర్ణించారు.

ఖర:
ఖర నరరూప భక్షక రాక్షసుడు. ఇతడు దూషణుడికి కవల సోదరుడు. రావణుడి బంధువు. కైకసి సోదరి అయిన రాకా కుమారుడు. ఖరదూషణులు దండక వనాన్ని పాలించే రాక్షసులు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోసి అవమానించిన తరువాత ఖరదూషణులు శ్రీరామలక్ష్మణులపై యుద్ధానికి వెళ్లారు. ఈ పోరులో ఖర రాముడి చేతిలో హతమయ్యాడు.

కుంభకర్ణుడు:
విశ్రవుడు, కైకసిల రెండో కుమారుడు. రావణుడి పెద్ద తమ్ముడు. రాక్షసుడు. అసాధారణ బలవంతుడు. మహాకాయుడు. రామాయణం మొదట్లో ఇతను మంచి స్వభావం గల గొప్ప యోధుడిగా వర్ణింప బడ్డాడు. బ్రహ్మ వరం ఇచ్చినపుడు శాశ్వతమైన నిద్రను కోరుకుని మోసపోయాడు. ఆ తరువాత సోదర ప్రేమతో రావణుడు ఆ వరాన్ని సవరించాలని బ్రహ్మను వేడుకున్నాడు. దీనికి బ్రహ్మ- సంవత్సరంలో ఆరు నెలలు నిద్రపోయేలా, మరో ఆరు నెలలు మేల్కొని ఉండేలా వరం ఇచ్చాడు. రావణుడు సీతా దేవిని అపహరించడాన్ని గట్టిగా వ్యతిరేకించిన రాక్షసుల్లో ఇతను మొదటి వాడు.

కుశుడు:
సీతారాముల కుమారుడు. లవుడికి కవల సోదరుడు. కుశుడు తండ్రి రాముడి వలే నీలమేఘం వంటి శరీర రంగు గలవాడు.

లక్ష్మణుడు:
దశరథ మహారాజు యొక్క మూడవ కుమారుడు. రాముడికి సవతి సోదరుడు. ఇతనికి శత్రుఘ్నుడు కవల సోదరుడు. వీరిద్దరూ రాణి సుమిత్రకు జన్మించారు. తన సోదరుడైన రాముడి పట్ల చాలా అంకితభావం కలిగిన వాడు లక్ష్మణుడు. సీతాదేవి చెల్లెలు ఊర్మిళను వివాహం చేసుకున్నాడు. సీతారాముల వనవాస సమయంలో లక్ష్మణుడు వారిని పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్రలేకుండా కాపాడినట్టు రామాయణ కథనం.

లవుడు:
సీతారాముల కుమారుడు. కుశుడికి కవల సోదరుడు. కుశుడికి తమ్ముడు. ఇతను తన తల్లి సీత వలే గోధుమ రంగు శరీర ఛాయను కలిగి ఉండేవాడు.

మాల్యవంతుడు:
మాల్యవంతుడు దేవాసుర భయంకరుడైన సుకేశుడి ముగ్గురు కుమారులలో ఒకడు. ఇతనికి మాలి, సుమాలి అనే సోదరులు ఉన్నారు. ఇతను ధర్మవర్తనుడు. సుందరి అనే కాంతను వివాహం చేసుకున్నాడు. వీరికి వజ్రముష్టి, విరూపాక్ష, దుర్ముఖ, సుప్తఖ్న, యజ్ఞకోశ, మత్త, ఉన్మత్త అనే కుమారులతో పాటు నల అనే కుమార్తె ఉంది. రావణుడు సీతాదేవిని అపహరించడానికి వ్యతిరే కించిన రాక్షసుల్లో ఇతను కూడా ఒకడు.

మాండవి:
రాజు కుశధ్వజుడు, రాణి చంద్రభాగ దంపతుల కుమార్తె. శ్రీరాముడి తమ్ముడైన భరతుడికి భార్య. వారికి తక్ష, పుష్కల అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రుతకీర్తి ఈమెకు సోదరి.

మండోదరి:
రావణుడి పెద్ద భార్య. పంచకన్యలలో ఒకరు. ఈమె మహా పతివ్రత. మాయాసురుడి కుమార్తె. ఆమె తల్లి హేమ అనే దేవకన్య. మండోదరికి ఇంద్రజిత్తు, అక్షయ కుమారుడు అనే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరూ గొప్ప వీరులు. సీతాదేవిని భర్త అయిన రావణుడు అపహరించడాన్ని ఈమె గట్టిగా వ్యతిరేకించింది. భర్తకు ఎంతగానో నచ్చచెప్పాలని చూసి విఫలమైంది.

మంథర:
దశరథుని భార్య కైకేయికి సేవకురాలు. తన కపటబుద్ధితో కైకేయి ద్వారా రాముడిని వనవాసానికి పంపడానికి కారణమైంది. మంచి వాక్చాతుర్యం కలిగిన మహిళ. శ్రీరాముడి పట్టాభిషేకం జరగబోతున్న వార్త విని అయోధ్య నగరమంతా కోలాహలంగా ఉన్న సమయంలో మంథర కైకేయి మనసు విరిచి, దశరథుడు గతంలో కైకేయికి ఇచ్చిన వరాలను గుర్తుచేసి భరతుడికి పట్టాభిషేకం చేయించాలని, రాముడిని వనవాసానికి పంపడానికి ఇదే తగిన సమయం, అవకాశమని కైకేయికి నూరిపోసింది.

మారీచుడు:
రాక్షస రాజైన సుందుడు, తాటకి దంపతుల కుమారుడు. సుబాహుడికి అన్న. మిక్కిలి జిత్తులమారి. బంగారు జింక రూపాన్ని ధరించి శ్రీరాముడి భార్య సీతాదేవిని రావణుడు అపహరించేలా చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

నల:
రావణుడితో యుద్ధం సమయంలో శ్రీరాముడికి సహాయం చేసిన వానరుడు నల. శ్రీరాముడు లంకకు చేరుకోవడానికి వీలుగా నిర్మించిన రామసేతుకు ఈయనే సాంకేతిక నిపుణుడని గుర్తింపు పొందాడు. నీల ఈయన కవల సోదరి.

నరాంతక:
రావణుడి కుమారుడని చెబుతారు. అంగదుడి చేతిలో హతమయ్యాడు.

నీల:
రావణుడితో రాముడు చేసిన యుద్ధంలో వానర సైన్యానికి నీల సేనాధిపతిగా వ్యవహరించాడు. రామసేతు నిర్మాణంలో సోదరుడైన నలతో పాటు నీల కూడా కీలకపాత్ర పోషించాడు.

నిర్వాణి:
నిర్వాణి ఒక యక్షిణి. ఆమె యక్ష రాజు అయిన సుకేతుని మేనకోడలు.

పరశురాముడు:
ఈయన విష్ణువు దశావతారాలలో ఆరవ అవతారం. సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివ ధనుస్సును విరిచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరిచినందుకు పరశురాముడు కోపించి రాముడిపై యుద్ధానికి సిద్ధమవుతాడు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టాలంటూ తన ధనుస్సును రాముడికి ఇస్తాడు. శ్రీరాముడు దానిని ఆవలీలగా ఎక్కుపెడతాడు. దీంతో శ్రీరాముడు కూడా తనలాగే విష్ణువు అవతారమని అంగీకరించి పరశురాముడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ప్రహస్తుడు:
సుమాలి, కేతుమతి దంపతుల కుమారుడు. రావణుడికి మామ. లంక సైన్యానికి అధిపతి. ప్రహస్తుడు సుగ్రీవ సైన్యంలోని అనేక మంది యోధులను సంహరించాడు. శ్రీరాముడి సైన్యానికి నిజమైన ముప్పు ప్రహస్తుడే అనిపించేలా యుద్ధరంగంలో తన ఘనతను చాటాడు. చివరకు లక్ష్మణుడి చేతిలో హతమయ్యాడు.

రాముడు:
రామాయణ మహా కావ్యానికి కథానాయకుడు రాముడు. హిందూ దేవతలలో ప్రముఖుడు. త్రేతాయుగంలో విష్ణువు అవతారమైన రాముడిగా రూపుదాల్చాడు. కోసల రాజ్యానికి చెందిన దశరథుడు, కౌసల్యల కుమారుడు. న్యాయం, ధర్మం యొక్క స్వరూపంగా, వాటికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. మిథిలా యువరాణి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. లంకలో రావణుడి చెరలో ఉన్న తన భార్య సీతను రక్షించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, పోరాటాల సమాహారమే రామాయణ మహా కావ్యం.

రావణుడు:
రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడు ఈయనే. విశ్రవుడు, కైకసి దంపతుల కుమారుడు. లంకకు రాక్షసరాజు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నా కూడా ధర్మం పాటించకపోతే అవన్నీ వ్యర్థమే అనడానికి ఒక ఉదాహరణగా నిలిచినవాడు. శ్రీరాముడి భార్య సీతాదేవిని అపహరించడం అనేది రామాయణ ఇతిహాసంలో సంఘర్షణకు దారితీసిన ప్రధాన ఘటన. ఇవన్నీ పక్కన పెడితే రావణుడు గొప్ప శివభక్తుడు. గొప్ప సంగీతజ్ఞుడు. సంగీత, సాహిత్యాలలో మేటి. అందుకే ఈయనను రావణ బ్రహ్మగా కొనియాడారు. కానీ, ధర్మం తప్పి ప్రవర్తించడం వల్ల ఈయన కీర్తి అంతా పాతాళానికి పడిపోయింది.

రుష్యశృంగుడు:
ఒక మహర్షి. దశరథ మహారాజు అశ్వమేథ యాగం, పుత్రకామేష్టి యాగాలకు ఈయనే పురోహితుడు. ఈయన పేరిట కర్ణాటక రాష్ట్రం శృంగేరికి పది మైళ్ల దూరంలోని కిగ్గా అనే గ్రామంలో దేవాలయం కూడా ఉంది. శృంగేరికి ఆ పేరు రుష్యశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా ప్రతీతి.

రుమ:
సుగ్రీవుడి భార్య. కిష్కింధకాండలో ఈమె ప్రస్తావన ఉంటుంది. రుమ, సుగ్రీవులు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ రుమ తండ్రి అడ్డుపడతాడు. హనుమంతుడి సాయంతో సుగ్రీవుడు ఈమెను అపహరించి వివాహం చేసుకుంటాడు.

Review పురాణ పాత్రలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top