ఆధ్యాత్మిక వికాసం

అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్నిస్తాడు. మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే, మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్న. తల్లి తన మాటలతో బిడ్డలకు ధైర్యం చెబితే నాన్న తన చేతలతో మనలో ధైర్యం నింపుతాడు. మన తొలి గురువు, తొలి స్నేహితుడూ నాన్నే. మనల్ని తీర్చిదిద్ది, మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు మనల్ని వేలుపట్టి నడిపించి, విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయడానికి అమ్మతో కలిసి నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. మనం ఒక్కో మెట్టూ ఎక్కుతుంటే తానే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినంత ఆనందాన్ని పొందుతాడు. బతికే బతుకు కేవలం తన కోసమే కాకపోవడంలోని గొప్ప సంతృప్తి నాన్నలకే తెలుస్తుంది. ఎందుకంటే, తన బిడ్డల కోసం నాన్న- వాన ముసురులో గొడుగులా, మండుటెండలో చెట్టునీడలా, చలిపొద్దుల్లో వెచ్చని రగ్గులా మారిపోతాడు కనుక! స్క్రీన్‍ మీద ఎందరు హీరోలను చూసినా నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ రియల్‍ హీరో మాత్రం నాన్నే! మన ఎదుగుదలలో, మన జీవితంలో ఇంత ముఖ్యమైన పాత్ర పోషించే నాన్నను మనం ఎంతగా ప్రేమిస్తు న్నామో ఆయనకు తెలియజేయడానికి ‘ఫాదర్స్ డే’ ఒక చక్కని సందర్భం. 2026 జూన్‍ 21 అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

నాన్నలందరికీ పిల్లలంటే ప్రేమే. ఆ ప్రేమని వ్యక్తం చేయడంలో మాత్రం ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా. పిల్లల మీద అతి ప్రేమతో మంచీ చెడూ విచక్షణ మరిచే ధృత రాష్ట్రులూ, తాను చెప్పిందే చెయ్యాలని బిడ్డల్ని నరకయాతన పెట్టే హిరణ్యకశిపులూ, చేజేతులా బిడ్డను దూరం చేసుకుని కుమిలిపోయే దశరథులూ.. అప్పుడే కాదు.. ఇప్పుడూ ఉన్నారు. వీళ్లే కాదు బిడ్డ కోరితే కొండ మీది కోతినైనా తెచ్చిచ్చే డాబుసరి నాన్నలూ, పిల్లల పుట్టిన రోజుని అనాథాశ్రమంలో జరిపే నిరాడంబర నాన్నలూ, పిల్లల్లో ఒకడిగా కలిసిపోయి ఆడిపాడే అల్లరి నాన్నలూ, కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత గల నాన్నలూ, కనడమే తప్ప వారి పెంపకంతో తనకేమీ సంబంధం లేదనుకునే నిర్లక్ష్యపు నాన్నలూ.. వీరు కూడా ఉన్నారు.
మనస్తత్వ నిపుణుల పరిశోధనల ప్రకారం.. పిల్లల వ్యక్తిత్వం రూపొందడంలో 49 శాతం పాత్ర జన్యువులది కాగా, మిగిలిన 51 శాతం పెంపకానిదే. తల్లి పాత్రలో తరతరా లుగా పెద్ద మార్పేమీ లేదు కానీ తండ్రి పాత్ర కాలంతో పాటు మారుతూ వస్తోందని గుర్తిం చారు. నాన్నల స్వభావాల్లోని రకాల గురించీ, పిల్లలపై దాని ప్రభావం గురించి విశ్లేషించారు. అవేమిటంటే..
నిరంకుశ నాన్నలు..
హిట్లర్‍ అనీ, నియంత అనీ పిల్లలు పిలుచుకునే ఈ నాన్నల్ని మనస్తత్వ శాస్త్రవేత్తలు ‘నిరంకుశులు’ అంటారు. ఇప్పటి సినిమా భాషలో చెప్పాలంటే ‘బొమ్మరిల్లు ఫాదర్‍’ అన్న మాట. ‘నా ఆట కూడా నువ్వే ఆడితే ఇక నేనెందుకు నాన్నా ఆడటం’ అంటాడు కదా అందులో కొడుకు. ఆటలోనూ ఓడిపోకూడదన్న తపనతో కొడుక్కి ఆడుకునే ఆనందాన్ని కూడా ఇవ్వని నాన్న అతడు. అలాంటి వాళ్లకి పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు. పిల్లలకి ఏమీ తెలియదని, వాళ్లకు ఏది మంచో ఏది చెడో తమకే బాగా తెలుసనీ అనుకుంటారు ఇలాంటి నాన్నలు. సామర్థ్యాలతో సంబంధం లేకుండా పిల్లలకు లక్ష్యాలను నిర్దేశిస్తారు. పిల్లల కోసం తామే కలలు కంటారు. ఆ కలల్ని పిల్లలు నెరవేర్చాలని ఆశిస్తారు. అందుకు విపరీతమైన క్రమశిక్షణ అమలు చేస్తారు. చిన్నప్పుడు చదువైనా, పెద్దయ్యాక పెళ్లయినా.. ప్రతి విషయంలో తమ నిర్ణయమే సరైనదంటారు. విచిత్రమేమిటంటే ఇదంతా పిల్లలపై విపరీతమైన ప్రేమతోనే చేస్తారు. ఆ ప్రేమ వారిని ఇబ్బంది పెడుతుందని తెలుసుకోలేరు. ఇలాంటి తండ్రు లున్న పిల్లలు ఆత్మన్యూనతకు గురవుతారు. నచ్చని పని చేయలేక, తండ్రికి ఎదురు చెప్పలేక సతమతం అవుతారు. తమ సామర్థ్యంపై నమ్మకం కోల్పోతారు. దాంతో వారిలో జీవన నైపుణ్యాలు కొరవడతాయి. ఎందులోనూ రాణించలేరు. పిల్లల్లో మానసిక ఆందోళన, కుంగుబాటు సమస్యలు పెరగడానికి ఈ తరహా పెంపకమే కారణమని యూనివర్సిటీ ఆఫ్‍ మేరీ వాషింగ్టన్‍ పరిశోధకులు తేల్చారు.
నిమిత్తమాత్ర నాన్నలు..
బొమ్మరిల్లు నాన్నకు పూర్తి వ్యతిరేకం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా నాన్న. ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగతుందంటూ నిమిత్త మాత్రుల్లా వ్యవహరిస్తారు వీళ్లు. పిల్లలకు మార్గదర్శకం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తించరు. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. వాళ్లపై వాళ్లకు నమ్మకం ఉండదు. దాంతో పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. ఇంట్లో ఒక క్రమశిక్షణా, పద్ధతీ, పాడూ అంటూ ఉండవు. పిల్లలపై ప్రేమ, కోపం లాంటి ఉద్వేగాలేవీ ప్రద ర్శించలేరు. ఊళ్లో వాళ్లందరికీ మంచోళ్లుగానే కనిపిస్తారు కానీ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి చేతకాని వాళ్లుగానే మిగిలిపోతారు. దాంతో గాలివాటుకు కొట్టుకుపోయినట్టు పిల్లలు ఒక లక్ష్యం లేకుండా పెరుగుతారు. ఇలా తండ్రి ఆజమాయిషీ సరిగా లేని పిల్లలు దేన్నీ సీరియస్‍గా తీసుకోరు. చట్టవ్యతిరేక పనులకు త్వరగా ఆకర్షితులవుతారు. క్రమశిక్షణ లేని పౌరులుగా, సంఘవిద్రోహ శక్తులుగా మారే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి తండ్రులున్న ఆడపిల్లలు పెళ్లి విషయంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. మనుషుల్ని సరిగా అంచనా వేయలేక, వ్యక్తిత్వం లేని యువకుల్ని ఇష్టపడే ప్రమాదం ఉంది.

‘పనిరాక్షస’ నాన్నలు..
ఈ నాన్నలు ఇంట్లోనే ఉంటారు కానీ పిల్లల జీవితాల్లో కనిపించరు. తామూ తమ ఉద్యోగమూ తప్ప మరో విషయం పట్టదు వీరికి. కన్నబిడ్డలతో అంటీముట్టనట్టు ఉంటారు. పిల్లల రాకతో తమ బాధ్యత పెరిగిందనీ, ఇంకా ఎక్కువ సంపాదించా లనీ భావిస్తారు. ఫలితంగా ఒత్తిడికి లోనవుతారు. దాంతో పిల్లలతో ఆటాపాటా మరిచి సంపాదనపై దృష్టి పెడతారు. తండ్రిగా అదే తమ బాధ్యత అనుకుంటారు. ఇంతమంది కడుపు నింపాలి, ఫీజులు కట్టాలి, చదివించాలి.. ఇదే ధ్యాస తప్ప పార్కుకు తీసుకెళ్లి ఆడుకోవాలి, స్కూల్లో పేరెంట్‍ టీచర్‍ మీటింగ్‍కు వెళ్లాలి వంటివి పట్టవు. సహో ద్యోగులో, స్నేహితులో అలా చేస్తున్నట్టయితే సమయం వృథా చేస్తున్నారని వారిని చిన్నచూపు చూస్తారు. ఇంట్లో పిల్లలు ఏ కాస్త అల్లరి చేసినా అరిచేస్తారు. చెడిపోతున్నారని కోప్పడతారు. సంపాదించి తేవడం వరకే తమ బాధ్యతగా భావించే వీళ్లు.. భార్య తన బాధ్యత సరిగా నిర్వ హించనందునే పిల్లలు అల్లరిగా తయారయ్యారని ఆరోపిస్తారు. ఇంట్లో మిలటరీ క్రమశిక్షణను అమలు చేసే ఇలాంటి నాన్నలను పిల్లలు తప్పించుకు తిరుగుతారు. బాల్యంలో తండ్రితో గడిపిన మధురమైన జ్ఞాపకాలేవీ లేకుండా, నాన్న ప్రేమకు ముఖం వాచినట్టుండే ఈ పిల్లలు మానసికంగా బేలగా తయారవుతారు. దీర్ఘకాలిక డిప్రెషన్‍కు గురవు తారు. తాము తండ్రయ్యాక- అయితే పిల్లల్ని అతి గారాబం చేయడమో లేక తమ తండ్రిలాగే అంటీ ముట్టనట్టు ఉండటమో చేస్తారు.
అన్నీ తామైన నాన్నలు..
ఈ తరహా నాన్నలకి అనుక్షణం పిల్లల ధ్యాసే. పిల్లల మీద తమ ప్రేమను వ్యక్తం చేయడంలో మొదటి వరసలో ఉంటారు. బిడ్డ పనులన్నీ తామే చేయాలని అనుకుంటారు. వారు నిద్రలో కదిలినా, చిన్న శబ్దం చేసినా ఏమైందోనని లేచి కూర్చుంటారు. స్కూలు ఎంపిక, చదువు, హోంవర్కులు, పరీక్షలూ.. ప్రతీదీ పట్టించుకుం టారు. పిల్లలకు ఏ లోటూ లేకుండా పెంచడం తమ బాధ్యత అనుకుంటారు. పిల్లల అలవాట్లే మిటో, వారికి ఏ బొమ్మలు ఇష్టమో, ఏ ఆటలు ఇష్టమో వీళ్లకు పక్కాగా తెలుసు. వాళ్ల ఫ్రెండ్స్ ఎవరో, వాళ్లకు ఏ టీచర్లు ఇష్టమో కూడా తెలుసు కుంటారు. పిల్లలు పరీక్షకు వెళ్తుంటే పెన్నూ, హాల్‍టికెట్‍ లాంటివి సర్దిపెడతారు. వాళ్లకేం కావాలో అడగక ముందే కొనిపెడతారు.
మంచి నాన్నలు
తన బాధ్యతలను సాధికారతతో నిర్వహించే తండ్రిని ‘బెస్ట్ పేరెంట్‍’ అంటారు నిపుణులు.

వీళ్లు పిల్లల్ని చక్కని క్రమశిక్షణతో పెంచుతారు. పిల్లలకు ఎక్కడ, ఎప్పుడు ఎంత స్నేచ్ఛనివ్వాలో, ఎక్కడ నియం త్రించాలో వీరికి బాగా తెలుసు. పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో అంతగా వారిలో సొంత వ్యక్తిత్వం రూపుదిద్దుకునే వాతావరణాన్ని కల్పి స్తారు. విలువలు నేర్పుతారు కానీ తమ కలల్ని వాళ్లపై రుద్దరు. సొంత నిర్ణయాలు తీసుకునేలా, తమ ఇష్టాయిష్టాలను నెరవేర్చుకునేలా పిల్లల్ని ప్రోత్సహిస్తారు. వాళ్ల అభిప్రాయాలను నిర్భ యంగా చెప్పే స్వేచ్ఛనిస్తారు. అవసరమైన చోట అండగా నిలబడతారు. ఆడేటప్పుడు తామూ వారిలో ఒకరిగా కలిసి ఆడతారు. వాళ్లు చదువు కునేటప్పుడు సందేహాలు తీర్చే టీచరుగా మారతారు. ఇంట్లో ఏ విషయాన్నయినా మనసు విప్పి చర్చించే వాతావరణం కల్పిస్తారు ఇలాంటి నాన్నలు. దాంతో పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరు గుతారు. వారి వ్యక్తిత్వాల్లో పరిణితి ఉంటుంది. ప్రయోగాలు చేసి నిలదొక్కుకోగల స్థైర్యం ఉంటుంది. దాంతో ఆ పిల్లలు అన్ని రకాలుగానూ విజయం సాధించగలరు. మనస్తత్వ నిపుణులు ఇలాంటి నాన్నలకు మంచి నాన్నలన్న కితాబునిస్తున్నారు.
నాన్నలపై దాదాపు 500 అధ్యయనాలను క్రోడీకరించగా తేలిందేమిటంటే- పిల్లల మీద అమ్మానాన్న.. ఇద్దరి ప్రభావమూ ఉంటుంది కానీ, ఏ విషయంలోనైనా పిల్లల కోరికను తిరస్క రించినట్టయితే- దానికి నాన్న కారణమైతే ఆ ప్రభావం పిల్లలపై ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందట. జీవితాంతం వారికి అది ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుందట. అందుకే పిల్లలు ఏదైనా కోరినప్పుడు ఒక్కసారే కఠినంగా ‘నో’ అని చెప్పకుండా సమయం తీసుకోవాలనీ, ఆ తరువాత మెల్ల మెల్లగా దాని గురించి అవగాహన కల్పిస్తూ ఎందుకు వద్దన్నదీ అర్థమయ్యేలా చెప్పాలని అంటున్నారు నిపుణులు.

నాన్నంటే.. అన్నింటికన్నా మిన్న!
కొడుకును అడవికి పొమ్మని దశరథుడు ఏనాడూ అనలేదు. కైకమ్మకు ఆయన ఒకప్పుడు వరాలిచ్చిన మాట నిజమే. ఇప్పుడా మాట వెనక్కి తీసుకుంటే మాట తప్పిన వాడవుతాడు. అసత్య దోషం సోకుతుంది. కాబట్టి కైక చెప్పగానే రాముడు మారు మాట లేకుండా అడవి బాట పట్టాడు. అంటే, తండ్రి ఇచ్చిన మాటను తాను నిలబెట్టాడు. పితృవాక్య పాలనకు సరికొత్త నిర్వచనాన్నిచ్చాడు.
రాజ్యాన్ని వదులుకోమని కాని, బ్రహ్మచర్యం పాటించాలని కాని దేవవ్రతుడి (భీష్ముడు)కి తండ్రి శంతనుడు ఎక్కడా సూచించలేదు. సత్యవతిని శంతనుడికి ఇచ్చి చేసేందుకు ఆమె తండ్రి దాశరాజు పెట్టిన షరతులవి. ‘ఈ లలితాంగికి ఉద్భవించిన తనయుడె రాజ్యమును సేయును’ అని ప్రకటించి భీష్ముడు అధికారాన్ని త్యజించాడు. ‘నీకు వివాహమై పిల్లలు పుడితే వారు పోటీకి రావచ్చుగా..’ అని శంకించాడు దాశరాజు. దాంతో ‘నేను ఆజన్మాంతము బ్రహ్మచారినై సేవింతున్‍ సదా రాజ్యమున్‍’ అని శంతన పుత్రుడు భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు.
మాట విలువ తెలిసిన రాముడు, మనసెరిగిన భీష్ముడు తండ్రుల కోసం త్యాగాలు చేశారు. భారత, రామాయణాలు నేర్పుతున్న విలువైన పాఠాలివి.
నాన్నంటే- రాముడి వియోగంతో పొగిలి పొగిలి విలపించిన దశరథుడు.
నాన్నంటే- భీష్ముడి భీషణ ప్రతిజ్ఞతో బెంగటిల్లిన శంతనుడు.
నాన్నంటే- శకుంతల కోసం బెంగపడిన కణ్వుడు.
నిజానికి కణ్వుడు శకుంతలకు కన్నతండ్రి కూడా కాదు. పెంచి పెద్ద చేసిన వాడు మాత్రమే. ఆయన సర్వసంగ పరిత్యాగి.
శకుంతలను దుష్యంతుడికి అప్పజెబుతూ, ‘ప్రత్యర్పితన్యాస ఇవాంతరాత్మా.. ఇంతవరకూ దాచిపెట్టిన సొమ్మును దాని యజమానికి తిరిగిచ్చి తేలికపడ్డాను’ అన్నాడు. అయినా పెంపుడు కుమార్తె వియోగ భారంతో బావురుమన్నాడు.
హిమాలయాల్లో దారితప్పి తిరుగుతూ.. ‘వృద్ధులైన నా తల్లిదండ్రులు ఆకలితో, ఆందోళనతో ఎదురుచూస్తూ ఉంటారు’ అని ఆతృతపడ్డాడు ప్రవరాఖ్యుడు.
కావడిలో కూర్చోబెట్టి అమ్మానాన్నలను తీర్థయాత్రలకు తిప్పాడు శ్రవణ కుమారుడు.
వీరు నాన్నలు గన్న సుపుత్రులు.
అనుబంధాలంటే ఏమిటో తెలియాలంటే పిల్లలకు మన పురాణాల్లోని ఇలాంటి కథలన్నీ చెప్పాలి.

Review ఆధ్యాత్మిక వికాసం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top