పుణ్యభూమి

పంచారామాలూ, పంచభూత స్థలాలూ, ద్వాదశ జ్యోతిర్లింగాలూ, అష్టాదశ శక్తిపీఠాలూ.. ఈ మాదిరిగానే అష్ట వినాయక క్షేత్రాలూ ఉన్నాయి. స్థల పురాణాలను బట్టి చూస్తే వేటి ప్రత్యేకత వాటిదే. కానీ ఈ అష్ట వినాయక క్షేత్రాల్లో గణపతి స్వయంభూ కావడమే విశేషం. అందుకే ఒకే యాత్రలో ఆ ఆలయాలన్నింటినీ సందర్శించుకుని మళ్లీ మొదటి క్షేత్రానికి వస్తేనే ఆ యాత్ర పరిపూర్ణం అవుతుందని, మోక్షం కలుగుతుందనీ విశ్వసిస్తారు భక్తులు. సెప్టెంబరు 14, 2026 వినాయక చవితి సందర్భంగా.. మహారాష్ట్రలోని పుణె నగరం చుట్టుపక్కల ఉన్న ఈ విశిష్ట
గణపతి ఆలయాల విశేషాలు తెలుసుకుందాం..

మయూరేశ్వరుడు- మోర్గావ్‍:
నెమలి (మయూరి) వాహనం వినాయకుడి తమ్ముడైన కుమారస్వామిది కదా! కానీ, పుణె జిల్లాలోని మోర్గావ్‍లో కొలువైన గణపతికి మాత్రం నెమలే వాహనమైంది. అష్ట వినాయక యాత్రలో ముందుగా దర్శించాల్సింది మోర్గావ్‍లో కొలువైన ఈ మయూరేశ్వరుడినే. సింధురాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను హింసిస్తుంటే, మునులు దేవతలను వీరి పీడ వదిలించాలని వేడుకున్నారు. ఈ క్రమంలో వినాయకుడు మయూరాసనుడై వచ్చి ఆ రాక్షసుడిని వధించాడట. అందుకే ఇక్కడి స్వామిని మోరేశ్వర్‍, మయూరేశ్వర్‍ అని పిలుస్తారు. బహమనీల కాలంలో నిర్మించిన ఈ ఆలయం నాలుగు మీనార్లతో మసీదును తలపిస్తుంది. అసలైన గణపతి ప్రతిమ ప్రస్తుతం మనం దర్శించుకునే విగ్రహానికి వెనుక ఉందనీ, అప్పట్లో ఆ విగ్రహాన్ని పాండవులు పూజించారనీ స్థానికులు చెబుతారు.
సిద్ధి వినాయకుడు-శ్రీగొండ
అష్ట వినాయక క్షేత్రాల్లో ఇక్కడ మాత్రమే గణపతి కుడి వైపు తొండంతో దర్శనమిస్తాడు. సిద్ధి, బుద్ధి సమేతంగా ఇక్కడ కొలువుదీరిన ఈ లంబోదరుడిని విష్ణుమూర్తే స్వయంగా ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ ప్రాంతంలోనే మధు, కైటభ అనే అసురులను విష్ణువు సంహరించాడట. అయితే వారిని వధించే విషయంలో విష్ణుమూర్తి వినాయకుడి సహాయం తీసుకున్నాడని, అందుకు కృతజ్ఞతగా ఇక్కడ ఆలయం నిర్మించాడని చెబుతారు. అహ్మద్‍నగర్‍ జిల్లాలోని శ్రీగొండ సమీపంలో చిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయాన్ని తరువాత కాలంలో పేష్వాలు నిర్మించారు. ఇక్కడ స్వామిని కార్యసిద్ధి వినాయకుడిగా భావించి భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

బల్లాలేశ్వరుడు- పాలి:
ఓ భక్తుడి పేరున వెలిసిన వాడే పాలిలోని బల్లాలేశ్వరుడు. అయనాంతం తరువాత సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు గణేశమూర్తిపై పడేలా నిర్మించిన ఈ ఆలయశోభ అద్భుతమనే చెప్పాలి. పల్లిపూర్‍కు చెందిన కల్యాణ్‍సేఠ్‍ కొడుకైన బల్లాల్‍ తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లి రాతి వినాయకుడిని పూజించే వాడు. రోజూ ఇంటికి ఆలస్యంగా వస్తున్న పిల్లల తల్లిదండ్రులు, సేఠ్‍కు ఫిర్యాదు చేస్తారు. దాంతో అతను అడవికి వెళ్లి తన కొడుకు ఏం చేస్తున్నాడో చూస్తాడు. తన కొడుకుపై తోటి పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదుకు కారణం ఆ వినాయక రాతి విగ్రహమే కారణమని భావించి, విగ్రహాన్ని విసిరేసి, బల్లాల్‍ను చెట్టుకు కట్టేసి కొట్టి ఇంటికి వెళ్లిపోతాడు. అపస్మారకస్థితిలోనూ ఆ బాలుడు గణపతిని ప్రార్థిస్తూనే ఉంటాడు. దీంతో స్వామి ప్రత్యక్షమై కట్లు విప్పి బల్లాల్‍ కోరిక మేరకు అక్కడే ఉన్న రాయిలో ఐక్యమై బల్లాలేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. మొదట్లో ఉన్న చెక్క దేవాలయం స్థానంలో అనంతర కాలంలో రాతి దేవాలయాన్ని నిర్మించారు. దీని వెనుకగా ధుండి గణేశాలయం ఉంటుంది. సేఠ్‍ విసిరికొట్టిన విగ్రహంగా భావించి భక్తులు ముందుగా ధుండి గణేశుడినే దర్శించుకుంటారు.

వరద వినాయకుడు- ఖోపోలి:
పుణెకి సమీపంలోని ఖోపోలి దగ్గరలో ఉందీ ఆలయం. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన రుక్మాంగదుడనే రాజు ఒకసారి గ్రామంలోని వాచక్నవి అనే రుషి దర్శనం కోసం వస్తాడు. ఆ రాజును చూసిన రుషి పత్ని ముకుంద ఆయనపై మనసు పడుతుంది. రాజు ఆమెను తిరస్కరించి వెళ్లిపోతాడు. అనంతరం ఎన్నాళ్లగానో ఆమెపై కన్నేసిన ఇంద్రుడు రుక్మాంగదుడి రూపంలో వచ్చి ముకుందను కలుస్తాడు. అలా వారిద్దరి కలయికతో పుట్టిన వాడే గృత్సమధుడు. అతడు పెరిగి పెద్దయ్యాక తన జన్మ రహస్యం గురించి తెలుసుకుని అందరి పాపాలూ తొలగిపోయేందుకు గణపతిని ప్రార్థిస్తాడు. దీంతో స్వామి ఇక్కడ స్వయంభూగా వెలసి వరద వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు.

చింతామణి గణపతి- థేవూర్‍:
పుణెకి 22 కిలోమీటర్ల దూరంలోని థేవూర్‍ గ్రామంలో ఉందీ ఆలయం. పూర్వం కపిల మహాముని దగ్గర భక్తుల కోరికలను తీర్చే చింతామణి ఉండేదట. ఒకసారి ఆ ప్రాంతాన్ని పాలించే రాజు కొడుకు గుణ ఆ మణిని అపహరిస్తాడు. అంతట ముని వినాయకుడి సాయంతో తిరిగి ఆ మణిని చేజిక్కించుకుంటాడు. అందుకు కృతజ్ఞతగా ఆ మణిని కదంబ చెట్టు కింద కొలువైన గణపతి మెడలో అలంకరిస్తాడు. అప్పటి నుంచి స్వామి చింతామణి గణపతిగా ప్రాచుర్యం పొందాడు. పేష్వాల కాలంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు.

గిరిజాత్మజ్‍ వినాయక్‍- లేన్యాద్రి:
లేన్యాద్రి పర్వతం మీద ఉన్న బౌద్ధ గుహల సముదాయంలో ఏక శిలాలయంలో కొలువైన వాడే ఈ గిరిజాత్మజుడు. గిరిజ అంటే పర్వతపుత్రిక పార్వతి. ఆత్మజ్‍ అంటే తనయుడని అర్థం. కాబట్టే ఇక్కడ కొలువైన స్వామిని గిరిజాత్మజుడు అని పిలుస్తారు. పుణెకి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్లాలంటే 307 మెట్లు ఎక్కాలి. పుత్రుడి కోసం దాదాపు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి, నలుగు పిండితో బాల గణపతిని సృష్టించి, ప్రాణం పోస్తుంది పార్వతీదేవి. అందుకు గుర్తుగా ఇక్కడి ప్రతిమ రూపురేఖలు కచ్చితంగా ఉండవు. కౌమారప్రాయం వచ్చే వరకూ తల్లితో ఈ గిరిజాత్మజుడు ఇక్కడే ఉన్నాడనేది పురాణ కథనం.

విఘ్నేశ్వరుడు- ఓజార్‍:
ఓజార్‍ పట్టణంలో కుకడీ నదీ తీరాన ఉన్న ఈ ఆలయంలో రిద్ధి, సిద్ధి సమేతంగా దర్శనమిస్తాడు ఇక్కడి విఘ్నేశ్వరుడు. ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను ముప్పుతిప్పలు పెడుతుండే వాడు. దీంతో మునులంతా కలిసి అతడి పీడ విరగడ చేయాలని వినాయకుడిని వేడుకుంటారు. దీంతో వినాయకుడు ఆ అసురుడితో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో విఘ్నాసురుడు వినాయకుడిని గెలవలేక శరణు కోరతాడు. ఆపై తన పేరు మీదనే అక్కడే కొలువుండాలని కోరతాడు. అందుకే ఇక్కడి వినాయకుడిని విఘ్నహర్‍ వినాయక్‍ లేదా విఘ్నేశ్వర్‍గా పిలుస్తారు.

మహా గణపతి- రంజన్‍గావ్‍:
పుణెకి యాభై కిలోమీటర్ల దూరంలో గల రంజన్‍గావ్‍లోని ఈ ఆలయంలో సిద్ధి, రిద్ధి సమేతంగా పద్మంలో వినాయకుడు దర్శనమిస్తాడు. ఈ విగ్రహానికి కింద పది తొండాలు, ఇరవై చేతులతో మహోత్కట్‍గా పిలిచే వినాయక విగ్రహం ఉందని చెబుతారు. వర ప్రభావంతో లోక కంటకుడిగా మారిన త్రిపురాసురుడిని అంతమొందించేందుకు పరమశివుడు తొలుత గణేశుడిని పూజించాడట. ప్రతిగా ఈ ఆలయాన్ని శివుడే నిర్మించగా, తరువాత కాలంలో పేష్వాలు పునర్నిర్మించారని చెబుతారు. ఇక్కడితో అష్ట వినాయక యాత్ర పూర్తవుతుంది. ఇక్కడి నుంచి మళ్లీ మోర్గావ్‍ వెళ్లి మయూరేశ్వరుడిని దర్శించుకుంటే యాత్ర లక్ష్యం పరిపూర్ణమైనట్టే.

Review పుణ్యభూమి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top