ఆధ్యాత్మి‘కథ’

పూర్వం అనగనగా ఒక ఊరిలో ఒక నిరుపేద ఉండేవాడు. అతడు ఎంత నిరుపేద అంటే.. యాయవారాలు ఎత్తుకుని ఇల్లు గడుపుకునే వాడు.

దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అన్నట్టుగా అతనికి ముగ్గురూ కూతుళ్లే పుట్టారు.

రోజూ యాయవారాలెత్తుతూ ముగ్గురు కూతుళ్లు, భార్యను ఎలాగో పోషించుకునే వాడు.

ముగ్గురు కూతుళ్లలో పెద్దదాని పేరు పేరమ్మ. రెండో దాని పేరు అంకమ్మ. మూడో దాని పేరు ముత్యాలమ్మ.

ఈ ముగ్గురినీ ఆ ముసలి నిరుపేద కష్టపడి పెంచి పెద్దవాళ్లను చేశాడు
ముగ్గురూ చాలా అందంగా ఉండేవాళ్లు. అందువల్ల వాళ్ల ముగ్గురికీ మంచి సంబంధాలు వచ్చాయి.

ఆ నిరుపేద పెద్దమ్మాయిని ఒక కరణానికి, రెండో అమ్మాయిని ఒక అగ్రహారికుడికి, మూడో అమ్మాయిని ఒక జమీందారుకు ఇచ్చి పెళ్లి చేశాడు.

పెళ్లి, పేరంటాల రూపేణా చాలా ఖర్చయినా కానీ, ఇక ఆనాటి నుంచి కూతుళ్ల పోషణ భారం తీరిపోవడంతో గుండెల మీద నుంచి కుంపటి దించినట్టయింది ఆ నిరుపేదకు.

అయితే కొంతకాలానికి మళ్లీ అతనికి కూతుళ్ల రూపేణా కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి.

అవెలాగంటే- బంగారం లాంటి కాపురాలు ఏర్పాటైనా ఆ ముగ్గురి పిల్లలకి సంతృప్తి అనేది లేకుండా పోయింది.

ఒకసారి శ్రావణ శుక్రవారం వచ్చింది. పెద్దమ్మాయి పేరమ్మ ఇంట్లో అన్ని పనులూ అయిపోయాయి. పేరమ్మ అత్త ముసలిదే అయినా ఆనాడు చీకటితోనే లేచి అన్ని పనులు చేసింది. కోడలికి తానే తలంటి పోసి, వెంట్రుకలు ఆర్చి, చిక్కుతీసి, జట్టు దువ్వి జడ వేసింది. వంట కూడా చేసి కొడుకూ కోడలికి వడ్డించించింది. ఇంకా ఇంట్లో ఎన్ని పనులున్నాయో అన్నీ అత్తే చేసింది. ఆ పనులతోనే ఆమెకు పొద్దుగూకింది.

అత్త పేరమ్మ దగ్గరకు వెళ్లి ‘అమ్మాయీ! అమ్మాయీ! కాస్త దేవుడి దర్శనం చేసుకుని వస్తాను. తిల్లిక పెట్టమ్మా’ అని చెప్పిపోయింది.

ఈ మాటతో పేరమ్మకు ఒళ్లు భగ్గున మండింది.

‘అన్నింటికీ నేనే చేయాలి. పోయే ముండ తిల్లిక పెట్టి పోకూడదూ! ఈ వెట్టిచాకిరి ఎవరు చేస్తారు? మా అమ్మ అయితే ఇలా చేసేదా? ఈ కాపురం బుగ్గికాను’ అంటూ పుటుకు పుటుకున మెటికలు విరిచి పోసింది.

ఆ కోపంతో అత్తింటి నుంచి బయటపడి పుట్టింటికి బయల్దేరింది.

ఆ దారిలోనే అంకమ్మ ఊరు కూడా.

పోతూ పోతూ పేరమ్మ చెల్లెలి ఇంటికి వెళ్లింది. చెల్లెలు అంకమ్మకు తన కష్టాలన్నీ చెప్పుకుని ఏడ్చింది.

అంకమ్మ పేరమ్మను ఓదారుస్తూ ‘అక్కా.. అక్కా! అలా అంటున్నావు. మరి, నా చెర ఎవరికి చెప్పుకోను? నీకు అత్తముండ తగలడింది. నాకు అలా కాదే! కట్టుకున్న మొగుడే నా పాలిట యముడయ్యాడు. నిన్నగాక మొన్ననే ఒక బంగారపు గొలుసు తెచ్చి మెడలో వేశాడు. అది ఎంత బరువు ఉందనుకున్నావు. ఏదో సంతోషిస్తాడని అంత బరువు వేసుకుని మోశాను. ఎంత కసాయి గుండే అతనిది? అలా చూస్తూ ఉన్నాడే కానీ అంత బరువు మోయలేక అలసిపోయిందే అని కాస్త విసనకర్ర పట్టుకుని విసిరిన పాపాన పోలేదు. రామ.. రామ.. ఏ జన్మ నక్షత్రంలో పుట్టాడో కానీ జాలి అనేది ఏ కోశానా లేదు గదా! ఇలాంటి మొగుడితో కాపురం చేసేది ఎలాగ? ఇక లాభం లేదు. అమ్మ దగ్గరకు వెళ్లిపోదామా అనుకుంటున్నాను. ఇంతలో నువ్వు ఇటు వచ్చావు’ అని వలవలా ఏడుస్తూ తన గోడు వెళ్లబోసుకుంది.

అంకమ్మ శోకాలకు తానూ జత కలిసింది పేరమ్మ.

ఇద్దరూ వలవలా ఏడుస్తూ ఇక ఇక్కడ క్షణం కూడా ఉండకూడదని అనుకుంటూ ఇద్దరూ కలిసి పుట్టింటికి బయల్దేరారు.

ఆ దారిలో ముత్యాలమ్మ ఊరు కూడా ఉంది.

పేరమ్మ, అంకమ్మ ఇద్దరూ ముత్యాలమ్మ ఇంటికి వెళ్లారు.

తీరా లోపలికి వెళ్లి చూస్తే తలకు వాసెన కట్టుకుని ముత్యాలమ్మ ఏడుస్తూ ఉంది.

అక్కలిద్దరూ కూడా చెల్లెలితో కలిసి కంటికి మిన్నుగా ఏడ్చారు. కొంతసేపటి తరువాత నీ ఏడుపునకు కారణం ఏమిటని అడిగారు.

‘ఏమి కాపురమే దిక్కుమాలిన కాపురం? నిన్న రాత్రి వెన్నెల్లో ఆయనా నేను తోటలోకి వెళ్లాము. నేను ఆయన తొడ మీద తల పెట్టుకుని పడుకున్నాను. గాలికి పారిజాతం పువ్వులు నాలుగు రాళ్లు రువ్వినట్టుగా వచ్చి నా మీద పడ్డాయి. ఆయన అది చూసీ చూడనట్టుగా ఊరుకున్నాడు కానీ, ‘అన్ని పువ్వులు ముఖాన పడ్డాయి. దెబ్బ కాని తగిలిందా? అని కూడా అడిగిన పాపాన పోలేదు. ఇలాంటి మొగుడితో కాపురం చేసే కన్నా గంగలో దూకడం మంచిది. ఇంక ఇక్కడ క్షణం కూడా ఉండకూడదు. అమ్మగారి ఇంటికి వెళ్లిపోదామని నిశ్చయించుకున్నాను. ఇంతలో మీరు వచ్చారు’ అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది ముత్యాలమ్మ.

ఇక ఉండకూడదంటే ఉండకూదను కుని ముగ్గురు అక్కాచెల్లెళ్లు బయలుదేరి పుట్టింటికి వెళ్లారు.

అమ్మకు తమ కష్టాలు చెప్పుకుని బావురుమని ఏడ్చారు.

అప్పుడు వాళ్లమ్మ- ‘నా అల్లుళ్లే కాస్తలో కాస్తన్న నయం. మీ నాన్న వంటి వాడు ఈ భూలోకంలో ఇంకొకడు పుట్టడు.. పెరగబోడు. అతనితో వేగలేక చచ్చిపోతున్నాను. ఎంత అని సర్దుకుపోవాలి? ఎన్నని ఓర్చుకోవాలి’ అంటూ బావురుమంది.

‘ఏమైందే అమ్మా?’ అని అడిగారు ముగ్గురు కూతుళ్లు.

‘ఏం చెప్పమంటారే! మీ నాయన మొన్న యాయవారానికి వెళ్లి గిద్దెడంటే గిద్దెడు బియ్యం తెచ్చాడు. అందులో ఇంత పప్పు పోసి రొట్టెలు కాలుద్దామని పొయ్యి దగ్గర కూర్చున్నాను కదా! ఆ సమయంలో మీ నాన్న స్నానానికి వెళ్లాడు. నేను మూడే రొట్టెలు కాల్చాను. ఉప్పు చాలిందా? లేదా? అని చూసేటప్పటికి ఒక రొట్టె మాయమైపోయింది. కాలిందో లేదో అని చూసేటప్పటికి రెండోది అయిపోయింది. ఆయన వచ్చిందాకా చేతులు ముందేసుకుని ఎలా కూర్చునేది? ఆయన వచ్చేటప్పటికి మూడో రొట్టె కూడా అయిపోయింది. మీ నాయన మట్టుకు గుడ్లప్పగించి చూశాడే కానీ ‘అయ్యో! అన్ని రొట్టెలు తిన్నావు కాబోలు కడుపునొప్పి వచ్చిందా? మందు తెచ్చేదా? అన్న పాపాన కూడా పోలేదు’ అంటూ కొంగు నోట్లో కుక్కుకుని, కళ్లలో నీళ్లు కక్కుకుంటూ ఏకబిగిన శోకాలు పెట్టింది.

తల్లీకూతుళ్లు నలుగురూ పెద్దగా శోకాలు మొదలుపెట్టారు.

లౌక్యం తెలియని, సంతృప్తి లేని, బతకడం చాతకాని ఆ నలుగురినీ చూసి దేవుళ్లకు పట్టరాని ఆగ్రహం కలిగింది.

‘నిజంగా సమస్య ఉండి ఏడ్చినా ఒక అర్థముంటుంది. మీకు అన్నీ తగినన్ని ఉన్నా కూడా ఏడుపే! ఇన్ని భోగాలిచ్చినా ఇంకా ఏడుపు దేనికి? మీరు సుఖపడరు. మీతో ఉన్నవాళ్లను సుఖంగా ఉండనివ్వరు. అవతల ఒక మనిషి యాయవారాలెత్తుకుంటూ ముగ్గురు కూతుళ్లకు ఉన్నంతలో మంచి మంచి సంబంధాలు చేశాడు. పెద్దదానికి అనుకూలమైన అత్త దొరికింది. మిగతా ఇద్దరికీ భార్యలను ప్రేమగా చూసుకునే భర్తలు దొరికారు. అయినా వాళ్లతో మీరు ఇమడలేకపోయారు. కారణం లేకున్నా, సమస్య లేకున్నా దాన్ని సృష్టించుకుని మరీ., అది వింటే అందరూ నవ్వే కారణాలతో అత్తిళ్లను, మంచి భర్తలను వదిలి వచ్చేశారు. వాళ్లకు బుద్ధి చెప్పి మందలించాల్సిన తల్లి మరీ బుద్ధి లేని దానిలా, మందమతిలా మారింది. మీలాంటి వాళ్లకు సంతోషంగా ఎలా ఉండాలో తెలియదు. కాపురంలో స్వయంగా నిప్పులు పోసుకునే మనుషులు మీరు. మీలాంటి వాళ్లు మా సృష్టిలోనే ఉండకూడదు. మీరు, మీరు సృష్టించుకున్న సమస్యలు విన్న వారికి వెగటు కలిగిస్తాయి. కాబట్టి మీరు మనుషుల్లా బతకడం అసాధ్యం. అందుకే కలియుగంలో నల్లులై పుట్టండి. అవి కూడా మీలాంటివే. ఎంత రక్తం పీల్చినా వాటికి తృప్తి ఉండదు. కాబట్టి అదే మీకు తగిన జన్మ’ అని దేవతలు ముక్తకంఠంతో శపించారు.
ఆ శాపం వల్లనే మనకు నల్లులు వచ్చాయట!

వాటి పూర్వజన్మలో తల్లీకూతుళ్లు కావడం వల్ల, వాళ్లు బతికినంత కాలం తృప్తి లేకుండా బతికినందున ఈ జన్మలో మన నెత్తురు పీల్చినా వాటికి సంతృప్తి లేదట!.
ఇంకా ఇంకా కుట్టి బాధిస్తూనే ఉన్నాయి, ఉంటాయి.

Review ఆధ్యాత్మి‘కథ’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top