ఇక్కడ ఎనభై ఎనిమిది వేల మంది రుషులు సూత మహర్షి ద్వారా పురాణాలు విన్నారని

ఎందరో మునులు, రుషులు తపమాచరించిన పుణ్యభూమి నైమిశారణ్యం. అక్షయ పుణ్యఫలాన్ని ఇచ్చే ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం అపారమైన యశస్సును, జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఒక్కరికి ఒక్కరోజు ఆకలి తీర్చినా సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఆహారం పెట్టినంత ఫలం, ఫలితం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఎనభై ఎనిమిది వేల మంది రుషులు సూత మహర్షి ద్వారా పురాణాలు విన్నారని, ఇక్కడ అన్నదానం చేస్తే వారందరి ఆశీస్సులు లభిస్తాయని అంటారు. నైమిశారణ్యాన్ని సందర్శించడం, అక్కడ అన్నదానం చేయడం వంటి సేవలు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తాయి. కలియుగంలో అన్నదానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. నైమిశారణ్యం వంటి క్షేత్రంలో అది మరింత మహిమాన్వితమైనది. నైమిశారణ్యానికి వెళ్లినపుడు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడం, భక్తులకు అన్నదానం చేయడం లేదా అన్నదాన కార్యక్రమాలకు విరాళాలివ్వడం వంటివి జీవితంలో శ్రేయస్సును కలిగిస్తాయి.

మన పురాణ కథల్లో ‘సూతుడు.. నైమిశారణ్యం.. సూతుడు శౌనకాది మునులతో ఈ విధంగా చెప్పాడు..’ అనే పదాలను, వాక్యాలను వింటుంటాం, చదువుతుంటాం. ఇంతకీ ఈ నైమిశారణ్యం ఎక్కడుంది? దాని విశిష్టతేమిటి?..
అనేక ఆధ్యాత్మికానుభూతులకు ఆలవాలం నైమిశారణ్యం. అందమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు, సహజమైన వనసంపదలతో తులతూగే నైమిశారణ్య దివ్యధామం ఉత్తరప్రదేశ్‍లోని లక్నోకు 150 కి.మీ. దూరంలోని సీతాపూర్‍ జిల్లాలో ఉంది. మన దేశంలోని పరమ పుణ్య తీర్థాలలో నైమిశారణ్య దివ్య క్షేత్రమే మొదటిదని చెప్పవచ్చు. పవిత్ర గోమతీ నదీ తీరంలో సూత, శౌనకాది మునులు వసించిన ఈ దివ్యధామం మహా రుషుల యజ్ఞాల వల్ల యజ్ఞభూమిగా ప్రశస్తి పొందింది. సమస్త పురాణాలకు పుట్టినిల్లుగా భాసిల్లిన ఈ క్షేత్రం మునుల తపోశక్తితో మరింత పవిత్రతను ఆపాదించుకుంది. అందుకే నైమిశారణ్య క్షేత్రాన్ని కేత్రాల్లోకెల్లా ఉత్తమ క్షేత్రమని అంటారు. స్థానికులు ఈ క్షేత్రాన్ని నీమ్‍సార్‍ అని, నీమ్‍చార్‍ అని వ్యవహరిస్తుంటారు.
ఒకసారి మునులంతా బ్రహ్మ వద్దకు వెళ్లి కలి ప్రభావం సోకని పుణ్య ప్రదేశం ఎక్కడైనా ఉంటే తాము ఆ ప్రాంతంలో తపోయజ్ఞ కార్యనిర్వహణ చేసుకుంటామని అడిగారు. బ్రహ్మ కలియుగంలో సత్పురుషులను దృష్టిలో ఉంచుకుని ఒక చక్రాన్ని సృష్టించి ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అక్కడే మీరంతా నివసించండని చెప్పాడు. ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు నైమిశారణ్య ప్రాంతంలో ఆగింది. చక్రం నేమి (అంచు) తాకిన భూప్రదేశం నైమిషంగా పిలవబడింది. చక్రం సృ•శించిన ప్రాంతం అరణ్యం కావడం వల్ల నైమిశారణ్యం అనే పేరొచ్చింది. చక్రం భూమిని చీల్చుకుని దిగడం వల్ల అక్కడో నీటిగుండం ఏర్పడింది. ఫలితంగా భూమి నుంచి పవిత్ర జలధారలు పెల్లుబికాయి. అందుకే ఈ పవిత్ర తీర్థానికి చక్ర తీర్థమని పేరు. చక్రాకారంలో ఉన్న ఈ తీర్థంలో రోజూ వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అమావాస్య, సోమవారం.. ఈ రెండూ కలిసి సోమవతీ అమావాస్య పర్వదినాన లక్షలాది మంది భక్తులు చక్రతీర్థంలో స్నానాలు చేసి తరిస్తారు. అనేక మంది దేవీదేవతల కొలువుతో పవిత్ర తీర్థరాజంగా విరాజిల్లే ఈ క్షేత్రం అనుక్షణం భగవంతుని నామస్మరణతో మార్మోగుతూ, ఓ సరికొత్త ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెస్తుంది. దధీచి మహర్షి లోక కల్యాణార్థం తన దేహాన్ని త్యాగం చేసిన స్థలంగా నైమిశారణ్యానికి మరో పురాణ వృత్తాంతం ప్రచారంలో ఉంది. ఇది వైష్ణవ దివ్యదేశాలలో ఒక ప్రదేశంగా ప్రసిద్ధిలో ఉంది.
చూడాలంటే రెండు కళ్లూ చాలవు..
నైమిశారణ్యంలో చక్రతీర్థం సమీపంలో భూతేశ్వరనాథ్‍ ఆలయం ఉంది. ఇక్కడ భూతేశ్వరనాథ్‍ స్వామికి ముఖం ఉండటం విశేషంగా చెబుతారు. ఫణి ఫణాచత్రంతో, త్రిశూల చిహ్నంతో అభిముఖంగా ఉన్న నందీశ్వరునితో భూతనాథుడు భక్త కల్పవృక్షమై విరాజిల్లుతున్నాడు. ఈ స్వామికి చేసే అభిషేకం ద్వాదశ జ్యోతిర్లింగాలకు చేసిన అభిషేక ఫలంతో సమానమని శివపురాణం చెబుతోంది. ఈ ఆలయంలో ఉన్న వినాయకుడిని విక్రమాదిత్య మహారాజు ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు. ముందు ఈ వినాయకుడికి ప్రణామాలు చేసిన తరువాతే భక్తులు నైమిశారణ్య దర్శనం చేసుకుంటారు.
నైమిశారణ్యంలో ఉన్న మరో పవిత్రమైన దివ్యధామం లలితామాత ఆలయం. రోజూ వేలాది భక్తులు దర్శించుకుంటారు. అలాగే వ్యాసుడు తపమాచరించిన తపస్థలి వ్యాసగద్ధి, సూతుడు తపమాచరించిన తపస్థతి సూతగద్ది కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణంలో అలరారుతూ ఆధ్యాత్మికానురక్తిని పెంచుతాయి. అలాగే వాలి, సుగ్రీవులు విశ్రాంతి తీసుకున్న హనుమత్‍ టిలామహేశ్వరాలయం తదితర ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ క్షేత్రంలో పాండవులు సైతం సంచరించారని పురాణాలు చెబుతున్నాయి.
ప్రత్యేక ఆకర్షణ బాలాజీ మందిరం
ఈ క్షేత్రంలో బాలాజీ మందిరం ఓ ప్రత్యేక ఆకర్షణ. తిరుపతిలో మాదిరిగా ఇక్కడ అర్చన విధులు నిర్వర్తిస్తుంటారు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం వల్ల ఉత్తరాదిలో సైతం శ్రీవేంకటేశ్వర స్వామిని స్వయంగా దర్శించుకునే మహద్భాగ్యం భక్తులకు కలిగింది. భక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన మహిమాన్విత పుణ్యస్థలం- నైమిశారణ్యం.
ఎలా వెళ్లాలంటే..
దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి నైమిశారణ్యానికి రైలు, విమాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్‍ నుంచి నైమిశారణ్యం 1,482 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్‍ నుంచి లక్నోకు రైలు, విమానాల ద్వారా చేరుకోవచ్చు. లక్నో వెళ్తే అక్కడి నుంచి రైలు లేదా బస్సులు, ట్యాక్సీలలో నైమిశారణ్యానికి చేరుకోవచ్చు. భోజన, వసతి సదుపాయాల కోసం ధర్మసత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల భారత బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం చాలా ఏళ్ల క్రితం నుంచే ఇక్కడ భక్తులకు భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తోంది. ఈ సత్రం వారి వసతి భవనంలో ఐదు గదులు అందుబాటులో ఉన్నాయి.

కరివెన నిత్యాన్నదాన సత్రం
నైమిశారణ్యం చిరునామా:

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం
వార్డు నంబర్‍: 3, షోనాక్‍ గడ్డి,
లలితాదేవి ఆలయం, చక్రతీర్థం రోడ్డు మధ్యలో, నైమిశారణ్యం, మిస్రిఖ్‍,
సీతాపూర్‍ జిల్లా, ఉత్తరప్రదేశ్‍- 261402

ముఖ్యమైన ఫోన్‍ నంబర్లు:
మేనేజర్‍: 83339 07804
83339 07813

వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్‍ ఖాతా:
యూనియన్‍ బ్యాంక్‍ ఆఫ్‍ ఇండియా
అకౌంట్‍ నంబర్‍: 062010011004739
ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్‍: యూబీఐఎన్‍0806200

(ఇక్కడ కరివెన నిత్యాన్నదాన సత్రం తరపున భోజన సదుపాయం అందుబాటులో ఉంది. అలాగే, సత్రం వారు వసతి భవనాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో ఐదు గదులు
అందుబాటులో ఉన్నాయి)

Review ఇక్కడ ఎనభై ఎనిమిది వేల మంది రుషులు సూత మహర్షి ద్వారా పురాణాలు విన్నారని.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top