తిరుమల దర్శిని

‘శ్రీనివాసా..’ అంటే చాలు మనసంతా తేలికైపోతుంది. ‘ఆపద మొక్కులువాడా..’ అని పిలిస్తే చాలు క్షణంలో మనసంతా ఆనందంతో నిండిపోతుంది.. అలుపూ సొలుపూ లేకుండా ‘గోవింద’ నామాలను స్మరిస్తూ శ్రీవారిని మెట్ల మార్గంలో వెళ్లి దర్శించుకోవాలంటే.. సులువైన మార్గాలున్నాయి.

గతంలో వేసవి సెలవుల్లోనూ, ఇతరత్రా సెలవు రోజుల్లోనూ తిరుమలలో రద్దీ ఉండేది. ఇప్పుడు సెలవులతో నిమిత్తం లేకుండా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎప్పుడు చూసినా రద్దీ గణనీయంగా ఉంటోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు రైల్వేస్టేషన్‍, బస్సుస్టేషన్‍లో దిగి.. అక్కడి నుంచి నేరుగా తిరుమల కొండకు కాలినడకన చేరు కుంటారు.
ఇలాంటి వారు అలిపిరి నుంచి వెళ్తే 3,650 మెట్లు, శ్రీవారి మెట్ల మార్గం నుంచి వెళ్తే 2,100 మెట్లు ఎక్కాలి. ఎకాఎకీన ఇన్ని మెట్లు ఎక్కాలంటే మానసికంగానే కాదు.. శారీరకంగానూ ముందస్తు సన్నద్ధత ఉండాలి. మధ్యలో అలసిపోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యవంతులు, రోజూ వ్యాయామం చేసే వారికి ఇబ్బందులు లేకపోయినా, శారీరక శ్రమ చేయని వారు ఈ రెండు మెట్ల మార్గాల్లో వెళ్లదల్చుకుంటే వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఆలకించాలి. లేకపోతే సగం మెట్లు ఎక్కాక అలసిపోవడం, కాళ్లు పట్టేయడం, నీరసానికి గురవడం వంటి సమస్యలకు గురవుతారు.

ముందే సన్నద్ధత ఇలా..
అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం ఎంతో క్లిష్టమైనవి. ఈ మార్గాల్లో వెళ్లాలంటే రోడ్డు మీద నడిచేందుకు అవసరమైన శక్తి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అవసరం.
ఊబకాయులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, గుండెపోటు, ఆస్తమా, మోకాళ్ల నొప్పులు ఉన్న వారు, అరవై ఏళ్లు పైబడిన వారు మెట్ల దారి ఎంచుకుంటే కొన్ని రోజుల ముందు నుంచే శరీరాన్ని అందుకు సన్నద్ధం చేసుకోవాలి.
శారీరక స్థితి ఏమాత్రం సన్నద్ధంగా లేకున్నా నడకదారిని ఎంచుకోకూడదు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే వారిలో కొందరు ప్రయాణంతో అలసిపోతుంటారు. అలాంటి వారిలో కొందరు నడకదారిని ఎంచుకుంటారు. ఇలాంటి వారు కాసేపు తప్పక విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా వెళ్లాలి.
ఆరోగ్యంగా లేని వారు, ఒక్కసారిగా ఎక్కువ మెట్లు ఎక్కితే అప్పటికప్పుడు గుండె సంబంధ సమస్యలూ బయటపడే ప్రమాదం ఉంది. అమర్‍నాథ్‍ యాత్రకు వైద్య పరీక్షలు చేయించుకున్న వారినే అనుమతించేది ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండటం కోసమే.
అలిపిరి మెట్ల మార్గం లేదా శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లాలనుకునే వారు గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడం మంచిది.
శారీరక శ్రమ అసలు అలవాటు లేని వారు మెట్ల మార్గాల్లో శ్రీవారిని చేరుకోవాలంటే.. అందుకు సన్నద్ధంగా ముందు నుంచే నడకను అలవాటు చేసుకోవాలి. రోజూ కొంత దూరం పాటు అలా క్రమంగా దూరాన్ని పెంచుకుంటూ, ఎత్తయిన ప్రాంతాలకు నడుస్తూ ఉండాలి. తేలికపాటి వ్యాయామాలను అభ్యాసం చేయాలి.

అందుబాటులో వైద్యసేవలు..
తిరుమలకు నడక మార్గాల్లో వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వైద్యసేవలు అందిస్తోంది.
అలిపిరి మెట్ల మార్గంలోని 1,500వ మెట్లు, గాలి గోపురం వద్ద వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటాయి.
అలిపిరి పాదాల మండపం, ఏడో మైలు వద్ద, భాష్యకార్ల సన్నిధి వద్ద, శ్రీవారి మెట్ల మార్గంలోని 1,200వ మెట్టు వద్ద ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వైద్య సేవలు అందిస్తారు.
అత్యవసర సమయంలో, అకస్మాత్తుగా ఇబ్బందులకు గురయ్యే భక్తులకు సీపీఆర్‍ అందించేందుకు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భద్రత సిబ్బంది, పోలీసులకు శిక్షణనిచ్చారు. మెట్ల మార్గంలో ఆరోగ్య సమస్యలకు గురయ్యే వారికి వీరు ప్రాథమిక వైద్యసేవలు అందిస్తారు.

పుష్పయాగం టికెట్‍తో ఒకేరోజు రెండు దర్శనాలు
నవంబరు 16న భక్తులకు
అరుదైన అవకాశం
తిరుమల శ్రీవారిని ఒకే టికెట్‍తో రెండుసార్లు దర్శించుకునే అరుదైన అవకాశం భక్తులకు దక్కనుంది. ఈ సంవత్సరం నవంబరు 16న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించ నున్నారు. అందుకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. టికెట్‍ ధర 700 రూపాయలు కాగా, గరిష్టంగా ఇద్దరికి బుక్‍ చేసుకునే అవకాశం ఉంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్ల జరిగే అనుకోని దోషాల నివారణకు ప్రతి సంవత్సరం శ్రీవారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ.
టికెట్‍ పొందిన భక్తులు ఉదయం ఆరు గంటలకు సుపథం మార్గంలో ప్రవేశించి ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో జరిగే అభిషేక సేవలో పాల్గొనవచ్చు. అనంతరం స్వామి వారిని దర్శించుకుంటారు.
రెండోసారి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సుపథం మార్గంలో ప్రవేశించి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారికి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పుష్పయాగ మహోత్సవంలో పాల్గొనే అవకాశం దక్కనుంది. ఆ తరువాత సాధారణ దర్శనాలకు అనుమతిస్తారు.
ఇలా ఒకేరోజు రెండుసార్లు శ్రీవారిని దర్శించుకోవచ్చు.
బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 2026, సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు ఆర్జిత సేవలైన అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‍సేవ, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.
వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‍ఆర్‍ఐలు, దాతల దర్శనాలను సైతం బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజుల్లోనూ రద్దు చేసింది.

Review తిరుమల దర్శిని.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top