కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామిని దర్శించుకోవడమే భాగ్యంగా భావించే భక్తులు కోకొల్లలు. అయితే, భగవంతుని సన్నిధిలో చేతనైన సేవ చేసుకుని తరించాలని, తద్వారా పుణ్యం పొందాలని తలచే భక్తులూ పెద్దసంఖ్యలోనే ఉంటారు. అటు శ్రీవారి దర్శనంతో పాటు.. ఇటు ఆయన సన్నిధిలో తోటి భక్తులకు సేవలందించడం మహత్కార్యంగా భావించే వారికి మాధవుడి సన్నిధిలో సేవ చేసుకునే అవకాశం కల్పిస్తోంది తిరుమల తిరుపతి
దేవస్థానం. అందుకు సంబంధించి విధి విధానాలేమిటి? శ్రీవారి సమక్షంలో తోటి భక్తులకు, దేవస్థానం కోసం సేవ చేయడానికి
ఎటువంటి అవకాశాలున్నాయి? ఎన్ని రకాల సేవలున్నాయి? వాటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే వివరాలు మీ కోసం..
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే/టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవారి సన్నిధిలో సేవ చేసుకునేందుకు మహిళలు, పురుషులు ఒక్కొక్కరుగా కానీ, బృందంగా కానీ వెళ్లవచ్చు. బృందంలో అయితే పదిహేను (15) మంది వరకు ఉండాలి. హిందువులను మాత్రమే ఆయా సేవలకు అనుమతిస్తారు.
శ్రీవారి సేవ (జనరల్)
శ్రీవారి సేవలో మహిళలు, పురుషులు పాల్గొనే అవకాశం ఉంది. సాధారణ రోజుల్లో పద్దెనిమి (18) నుంచి అరవై (60) సంవత్సరాల లోపు, పర్వదినాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి తదితర విశేష దినాల్లో పద్దెనిమిది (18) నుంచి యాభై (50) సంవత్సరాల వయసు గల వారు అర్హులు. ఆయా పర్వదినాలు, విశేష దినాల్లో శ్రీవారికి సంబంధించిన సేవల్లో వీరంతా సహాయకారులుగా పాలుపంచుకోవచ్చు. ఎవరు ఎలాంటి సేవలో పాల్గొనాలనేది తిరుమల తిరు పతి దేవస్థానం అధికారులు నిర్ణయించి ఆయా సేవల బాధ్యతలు అప్పగిస్తారు.
పరకామణి సేవ
ఈ సేవలో పాల్గొనాలనుకునే వారు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఉద్యోగులైతే ఇరవై అయిదు (25) నుంచి అరవై ఐదు (65) సంవత్స రాల వయో పరిమితి, మిగతా వారైతే ఇరవై ఐదు (25) నుంచి అరవై (60) ఏళ్ల వయసు కలిగి ఉండాలి. శ్రీవారి హుండీ ఆదాయం లెక్కించడం, ఆయన ఆస్తులకు సంబంధించిన ఇతర కార్యకలా పాల్లో వీరు తమ సేవలను అందించాల్సి ఉంటుంది.
నవనీత సేవ
ముప్పై ఐదు (35) నుంచి యాభై (50) సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలు మాత్రమే ఈ సేవకు అర్హులు. ఈ సేవకు ఎంపికైన వారు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వ హించే గోశాలలో సేవలు అందించాల్సి ఉంటుంది. గోవులకు గ్రాసం వేయడం, గోశా లను శుభ్రంగా ఉంచడం, పాలు పితకడం, గోవుల నిర్వహణ వంటి పనుల్లో పాలుపంచు కోవచ్చు. ఈ సేవలో పాల్గొనడానికి కేవలం ఏడు రోజులు (వారం రోజులు) మాత్రమే అనుమతిస్తారు.
సీనియర్ సేవకులు, సూపర్‍వైజర్లు
నలభై ఐదు (45) నుంచి అరవై (60) సంవత్సరాల లోపు వారు ఈ సేవల్లో పాల్గొన డానికి అర్హులు. వీరు తమకప్పగించిన బాధ్యతల్లో పదిహేను (15) రోజులు, 30 రోజులు (నెల), మూడు నెలల (90 రోజులు) పాటు సేవ చేసేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. పండు గలు, పర్వదినాలు, ఇతర రద్దీ సమయాల్లో వీరు భక్తుల క్యూలైన్లను పర్యవేక్షించడం, రద్దీని క్రమబద్ధీకరించడం, దర్శనార్థం క్యూలో ఉన్న భక్తుల అవసరాలు తీర్చడం, వారికి తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
సేవకుల డ్రెస్ కోడ్ ఇదే..
టీటీడీ అవకాశం కల్పించే ఆయా సేవల్లో పాల్గొనాలనుకునే వారు మహిళలైతే కాషాయ రంగు చీర, మెరూన్ రంగు జాకెట్టు ధరించాల్సి ఉంటుంది. పురుషులు తెల్లని చొక్కా, పంచె ధరించి ఆయా సేవల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
ఎలా నమోదు చేసుకోవాలి?
శ్రీవారి సేవ కోసం దరఖాస్తు చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‍సైట్ (••••వఙ•••ష్ట్ర•అ•ఎ•.•జూ.స్త్రశీఙ.ఱఅ) లేదా మొబైల్ యాప్‍లోకి వెళ్లాలి.
ముందుగా వెబ్‍సైట్/యాప్‍లో ‘శ్రీవారి సేవ’ అనే ఆప్షన్‍ను ఎంపిక చేసుకుని ఆన్‍లైన్ ఫారాన్ని పూర్తి చేయాలి.
ఆ తరువాత మొబైల్ నంబరుతో లాగిన్ అయిన వెంటనే ఆరు అంకెల ఓటీపీ నంబరు వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే వివిధ సేవల వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి. వాటిలో మనం ఏ తరహా సేవలో పాల్గొనదల్చుకున్నామో ఎంచుకోవాలి.
ప్రతి నెలా చివరి వారంలో.. వచ్చే మూడు నెలల తరువాతకు సంబంధించిన తేదీలను అందుబాటులో ఉంచుతారు.
మనం ఎప్పుడు సేవకు వెళ్లదల్చుకున్నామో ఆ తేదీని ఎంచుకోవాలి.
తొలుత ఆధార్ నంబరును నమోదు చేసిన వ్యక్తిని టీం లీడరుగా పరిగణనలోకి తీసుకుంటారు.
ఇతర సభ్యులను గ్రూపులో చేర్చేందుకు వారి ఆధార్ కార్డులోని వివరాలు, ఫొటోలు, చిరు నామాను నమోదు చేయాలి.
దరఖాస్తు నింపడం పూర్తయిన తరువాత ‘కంటిన్యూ’ అనే ఆప్షన్‍పై క్లిక్ చేయాలి.
వెరిఫై చేసిన తరువాత కన్ఫర్మ్పై క్లిక్ చేయాలి.
వసతి కూడా కల్పిస్తారు..
శ్రీవారి సేవలకు పేర్లు నమోదు చేసుకున్న వారు తిరుమలలోని సేవాసదన్-2లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించిన గుర్తింపు కార్డుల (ఐడీ కార్డులు)ను ధరించి, యూనిఫామ్‍తో మాత్రమే వారికి కేటా యించిన సేవలో పాల్గొనాలి. మహిళలు, పురుషు లకు రోజుకు నాలుగు నుంచి ఆరు గంటల పాటు ఏడు రోజులు సేవ చేసే అవకాశం కల్పిస్తారు. ఎవరు ఎక్కడ సేవ చేయాలనే అంశంపై లక్కీడిప్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇలా ఆయా సేవలకు ఎంపికైన శ్రీవారి సేవకులకు టీటీడీ సేవా సదన్‍లో వసతి సౌకర్యం కల్పిస్తారు. మహిళా వాలంటీర్లకు సేవాసదన్-1లో, పురుషులకు సేవాసదన్-2లో బస సదుపాయం ఉంటుంది.
అలాగే, ఆయా సేవలకు ఎంపికైన వారికి శ్రీవారి దర్శన భాగ్యం కూడా ఉంటుంది. ఉచితంగా శ్రీవారి దర్శన సౌకర్యాన్ని కల్పిస్తారు.
శ్రీవారి సేవల్లో పాల్గొనే వారి విషయంలో కాస్త కఠిన నియమాలనే అనుసరిస్తారు. ఉదయాన్నే నిద్రలేవడం, క్రమశిక్షణ కలిగి ఉండటం, భక్తులతో మృదువుగా మాట్లాడగలగడం, శుచి- శుభ్రత పాటించడం, చిరునవ్వుతో ఉండటం, సున్నితంగా వ్యవహరించడం వంటి లక్షణాలను కలిగి ఉండాలి. అలాగే, ఆయా సేవల్లో పాల్గొనే వారికి ముందుగానే వాటిపై అవగాహన కలిగిస్తారు.

























































































































































































































































































































































































































Review ఆలయ దర్శనం.