ఆంధప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం.. శ్రీశైల క్షేత్రానికి తూర్పుద్వారంగా భాసిల్లుతోన్న దివ్యక్షేత్రం. ఇక్కడ బాలాత్రిపుర సుందరిదేవి, త్రిపురాంతకేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం లేదా ఇక్కడ పెట్టే అన్నదానాన్ని స్వీకరించడం వల్ల అక్షయమైన పుణ్యఫలం లభిస్తుందని అంటారు. ఇక్కడ అమ్మవారు బాలిక రూపంలో స్వయంభువుగా వెలిశారు. ఇది శక్తిపీఠంతో సమానమైన మహిమ గల క్షేత్రం. త్రిపురాంతక క్షేత్రంలో అన్నదానం చేయడం లేదా అన్నదాన కార్యక్రమాలకు విరాళాలు తదితర రూపాల్లో తోడ్పాటు అందించడం ద్వారా బాలాత్రిపురసుందరి దేవి అనుగ్రహం పొంది జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయని నమ్మకం.
కాశీ, రామేశ్వరం, శ్రీశైలం వంటి క్షేత్రాల్లో అన్నదానం మరణాంతర మోక్షాన్ని ప్రసాదిస్తుందని, పాపాలను హరిస్తుందని నమ్మకం. తిరుమల, అన్నవరం, భద్రాచలం వంటి దేవాలయాల్లో అన్నదానంలో భాగస్వామ్యం కావడం వల్ల కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని అంటారు. ఇక, త్రిపురాంతక క్షేత్రంలో అన్నదానం చేసినా, అన్నదాన కార్యక్రమాలకు సహకరించినా, అన్నదానం స్వీకరించినా సకల పాపాలు హరించుకుపోతాయని, పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయని విశ్వాసం.
ముల్లోకాలనూ పాలించే జగన్మాత దుష్టసంహారిణిగా ఎన్నో అవతారాలను దాల్చిందనేది తెలిసిందే. ఈ రూపాల్లో ఒకటి బాలా త్రిపురసుందరి. భక్తుల కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకునే బాల నిర్గుణాకారంలో స్వయంభువుగా కొలువుదీరిన మహిమాన్వితమైన క్షేత్రమే త్రిపురాంతకంలోని బాలా త్రిపురసుందరీ దేవస్థానం. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని స్థాపించడం విశేషం. శ్రీశైల మల్లన్న ఆలయానికి తూర్పు ద్వారంగా భాసిల్లుతోన్న ఈ ఆలయం పదకొండో శతాబ్దానికి చెందినదని ప్రతీతి.
అయ్య త్రిపురాంతకేశ్వరుడు.. అమ్మ బాలా త్రిపురసుందరి
అమ్మవారిని బాల రూపంలో పూజించే ఆలయమే బాలా త్రిపురసుందరీ దేవి దేవస్థానం. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో కుమారగిరిపై కనిపించే ఈ ఆలయంలో పరమశివుడు త్రిపురాంతకేశ్వరుడిగా, అమ్మవారు బాలా త్రిపురసుందరిగా పూజలందుకుంటున్నారు. సాధారణంగా వజ్ర వైఢూర్యాలు, నవరత్నఖచిత ఆభరణాలతో కళకళలాడుతూ కనిపించే అమ్మవారు ఇక్కడ ఏ అలంకరణ లేకుండా నిర్గుణాకారంలో కొలువుదీరింది. అంటే గర్భాలయంలో అమ్మవారి విగ్రహం వెనక్కి తిరిగి ఉన్నట్టుగా ఓ శిలా రూపంలో మాత్రమే కనిపిస్తుంది. అందుకే భక్తుల దర్శనార్థం మరో ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో భక్తులు ఈ రెండింటికీ పూజలు చేస్తారు. శ్రీశైలం కంటే అతి ప్రాచీనమైన ఆలయంగా భావించే ఈ క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు వెలసిన వైనం ఎంతో ఆసక్తికరం.
అమ్మ సాయంతో అసుర సంహారం
పూర్వం తారకాసురుడనే రాక్షసుడు దేవతలనూ, రుషులనూ బాధించడంతో అంతా కలిసి పరమేశ్వరుడితో మొరపెట్టుకున్నారు. దాంతో కుమారస్వామి ఆ అసురుడిని సంహరించిన అనంతరం అలసిపోయి ఈ పర్వతంపైన విశ్రాంతి తీసుకున్నాడట. అందుకే ఈ శిఖరానికి కుమారగిరి అనే పేరు వచ్చింది. అయితే తండ్రి మరణాన్ని తట్టుకోలేని తారకాసురుడి ముగ్గురు కుమారులైన త్రిపురాసురులు (తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు) దేవతలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశారు. చివరకు బ్రహ్మ అనుగ్రహించడంతో ఎవరి చేతిలోనూ మరణం సంభవించకూడదని వరం పొందారు. ఆ తరువాత మూడు లోకాలను సృష్టించుకుని దేవతలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. పరమేశ్వరుడు వారిని సంహరించేందుకు ఎంత ప్రయత్నించినా చివరకు విఫలమయ్యాడట. చివరకు స్వామి పరదేవతను ధ్యానించడంతో అమ్మవారు బాలా త్రిపురసుందరిగా ఆవిర్భవించింది. అలా శివుడు అమ్మవారి సాయంతో త్రిపురాసురులను సంహరించారనేది కథ. అందుకే స్వామికి త్రిపుర హంతకుడు అనే పేరు వచ్చిందనీ క్రమంగా త్రిపురాంతకుడిగా మారాడనీ ఐతిహ్యం. స్వామి పేరు మీదనే ఈ ఊరు త్రిపురాంతకం అయింది. అమ్మవారు కూడా స్వామితో పాటుగా ఇక్కడ బాలా త్రిపురసుందరిగా కొలువుదీరింది. ఇక కుమారస్వామితో కూడా ముడిపడి ఉన్నందున ఈ క్షేత్రం శైవ, శాక్తేయ క్షేత్రాల్లో అత్యంత ప్రధాన మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఒకప్పుడు ఈ ఆలయం నుంచి శ్రీశైలం వెళ్లేందుకు గుహ మార్గం ఉండేదట. మునులు ఆ మార్గాన్నే ఉపయోగించే వారట.
రాక్షసులు నిర్మించిన ఆలయం
ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించినా అందులో త్రిపురాంతకేశ్వరుడి పేరును ఉచ్ఛరించాలని అంటారు.
నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్ మహాదేవాయ నమో నమ: అంటూ మంత్ర శ్లోకంతో అభిషేకిస్తారు. ఈ క్షేత్రానికి అంతటి గొప్ప ప్రత్యేకత ఉంది. ఏ ఆలయానికి వెళ్లినా ఉత్తరం లేదా తూర్పు ద్వార ప్రవేశంతో స్వామి వారిని దర్శించుకోవాలి. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం రాక్షసులు నిర్మించినది కావడంతో నైరుతి ద్వార ప్రవేశంతో స్వామిని దర్శించుకుంటారు. దీనివల్ల రాక్షస లక్షణాలు అలవడతాయని, అవి తొలగిపోయేందుకు అమృతంతో సమానమైన తేనెతో స్వామిని అభిషేకించి తీర్థం ఇస్తుంటారు. ఆలయంలో నందీశ్వరుడు కొలువైన మండపంలో ప్రతి నిత్యం పుట్టెడు బియ్యం వండి మధ్యాహ్నం బండపై పోసి స్వామికి మహా నైవేద్యాన్ని నివేదించేవారు. ఒక ముద్ద చొప్పున భక్తులకు పంచినా ప్రసాదం సరిపోయేది కాదని ప్రతీతి. అంటే అప్పట్లోనే అంతమంది భక్తులు ఆలయాన్ని దర్శించుకునే వారట. కాకతీయులు, రెడ్డిరాజుల కాలంలో త్రిపురాంతక క్షేత్రం దివ్య తేజస్సుతో అలరారినట్టు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో ఎటుచూసినా శిల్ప సంపదే కనిపిస్తుంది.
విశేష పూజలు
త్రిపురాంతకానికి వచ్చే భక్తులు ముందుగా కొండపై ఉన్న పరమేశ్వరుడిని దర్శించుకుం టారు. ఆ తరువాత కొండ దిగువకు చేరుకుంటే చెరువు మధ్యలో అమ్మవారి దేవస్థానం కనిపిస్తుంది. అమ్మవారు చెరువులో కొలువైన ప్రాంతాన్ని చిదగ్ని గుండమని పిలుస్తారు. కదంబవనంగా కూడా పిలిచే ఈ దేవస్థానంలో అమ్మవారి దర్శనమయ్యాక చిన్నమస్తాదేవినీ, కదంబ వృక్షాన్ని పూజిస్తారు భక్తులు. సంతానం లేనివారూ, వివాహం ఆలస్యం అయ్యే వారూ ఇక్కడకు వచ్చి అమ్మవారిని పూజించి కదంబ వృక్షానికి ముడుపు కడితే ఆ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మిక. రాక్షస సంహారం అనంతరం అమ్మవారు ఉగ్రరూపంతో ఉండటంతో కొన్నాళ్లకు శంకరాచార్యులు ఇక్కడకు వచ్చి శ్రీచక్రాన్ని స్థాపించి దేవిని శాంతింప చేశారట. ప్రతి సోమ, శుక్రవారాల్లో ఆలయంలో విశేష పూజలు జరిగితే మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి జరిపే ప్రత్యేక పూజలు, అభిషేకాలూ చూసి తరించాల్సిందే.
ఎలా చేరుకోవాలంటే..
ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి రైలులో రావాలనుకునే భక్తులు వినుకొండ స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి 30 కిలోమటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని చేరుకునేందుకు బస్సులూ, ఆటోలూ ఉంటాయి. అదే బస్సు మార్గంలో అయితే, వినుకొండ, మార్కాపురం వరకూ వచ్చి ఆటోలూ, బస్సుల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.
కరివెన నిత్యాన్నదాన సత్రం
త్రిపురాంతకం చిరునామా:
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం
బాలా త్రిపురసుందరి ఆలయం వద్ద, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా, ఆంధప్రదేశ్- 523326
ముఖ్యమైన ఫోన్ నంబర్లు:
మేనేజర్: 83339 07794, హెల్ప్‌లైన్: 83339 07795
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్ ఖాతా:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
అకౌంట్ నంబర్: 37572310382
ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0003728
(ఇక్కడి కరివెన నిత్యాన్నదాన సత్రంలో భోజన వసతి అందుబాటులో ఉంది. అలాగే సత్రం తరపున వసతి గదుల నిర్మాణానికి స్థల సేకరణ జరిగింది. ప్రస్తుతం వసతి గదుల భవనం నిర్మాణంలో ఉంది. హోమ, వైదిక కార్యక్రమాలను సత్రం ద్వారా నిర్వహించుకోవచ్చు. వసతి గదుల సేవల విస్తరణకు కరివెన నిత్యాన్నదాన సత్రం దాతల నుంచి విరాళాలను కోరుతోంది. వివరాలకు పై ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు

























































































































































































































































































































































































































Review బాలాత్రిపుర సుందరిదేవి.