శ్రీవారి దర్శనానికి దారిదే!

క్షణకాల దర్శనం.. జీవితకాల ఆధ్యాత్మిక అనుభవం.. తలచుకున్నంతనే ఏ దేవదేవుడినీ దర్శింపచేయలేం కదా!. ఇక, తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవాలంటే ఎంతో ప్రణాళిక కావాలి. ముందస్తు ఏర్పాట్లూ అవసరం. అప్పుడే శ్రీనివాసుని దర్శనభాగ్యం సులభతరం అవుతుంది. కలియుగ దైవాన్ని కనులారా దర్శించి తరించేందుకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో దర్శన మార్గాలను అందుబాటులో ఉంచుతోంది. వాటిని అనుసరిస్తే కలియుగ దైవమైన వేంకటేశ్వరుని దర్శనం, తిరుమల క్షేత్ర యాత్ర మంచి అనుభూతిని కలిగిస్తాయి. అందుకే వివిధ దర్శన మార్గాల గురించి టీటీడీ ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తోంది. ఒకవేళ ముందుగా టికెట్లు బుక్‍ చేసుకోకపోయినా, గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూడాల్సిన పని లేకుండా దర్శనాన్ని సులభతరం చేసే మార్గాలివిగో..!.

తిరుపతి వెళ్లాలనుకుంటే అందుకు ముందస్తు ప్రణాళిక వేసుకునే చాలామంది బయల్దేరుతారు. నిత్యం లక్షమంది భక్తులతో కిటకిటలాడే తిరుమలకు ఎటువంటి దర్శన టోకెన్లూ లేకుండా వెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని దర్శన మార్గాలను అందుబాటులో ఉంచింది. సర్వదర్శనం, దివ్య దర్శనం, టీటీటీ వెబ్‍సైట్‍ ద్వారా జారీ చేసే ఎస్‍ఈడీ, ఆర్జిత సేవల టికెట్ల గురించి చాలామందికి తెలుసు. ఇవిగాక ఇంకా పలు రకాల దర్శన సేవలు ఉన్నాయి. వాటి వివరాలివే…
ట మీరు అప్పటికప్పుడు తిరుపతి వెళ్లాలని అనుకున్నారు. ఆన్‍లైన్‍లో ప్రయత్నిస్తే టికెట్లు దొరకలేదు. ఏం చేయాలి?.

ఇటువంటి సందర్భాల్లో శ్రీవారి దర్శనానికి సమయాన్ని నిర్దేశిస్తూ జారీచేసే ఉచిత దర్శన టోకెన్లను ప్రయత్నించవచ్చు. రోజూ తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ల్లో వీటిని జారీ చేస్తారు. భక్తులు క్యూలైనులో నిలుచుని, తమ ఆధార్‍ కార్డును చూపించి ఈ టోకెన్లను పొందవచ్చు.

చిన్నపిల్లలు ఉన్న వారికి ప్రత్యేక కోటా ఉంది.
ఏడాదిలోపు వయసున్న పిల్లలున్న తల్లిదండ్రులకు సుపథం మార్గంలో ఉచిత దర్శనాన్ని కల్పిస్తారు.

వృద్ధులూ, దివ్యాంగుల కోసం ఆన్‍లైన్‍లో రోజుకు 750 టికెట్లు ఇస్తారు.

అనారోగ్యంతో ఉన్న వారిని బయోమెట్రిక్‍ ద్వారం నుంచి లోపలికి పంపిస్తారు. ఈ విషయాన్ని ముందుగా వైకుంఠం-1 దగ్గరున్న టికెట్‍ తనిఖీ సిబ్బందికి తెలియజేయాలి.
– భారత సైన్యంలో పనిచేసే వారికి (ఫీల్డ్స్టాఫ్‍) రూ. 300 టికెట్‍ నేరుగా ఇస్తారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి సుపథం మార్గంలో ప్రవేశం కల్పిస్తారు. రోజుకు ఐదుగురికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

తిరుపతిలోని అలిపిరికి దగ్గర ఉన్న సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారు. దీనికి వెయ్యి రూపాయలు చెల్లించి టికెట్‍ తీసుకోవాలి. హోమం తరువాత అక్కడి అధికారి స్టాంప్‍ వేసి ఇస్తే ఇద్దరికి రూ.300 టికెట్లు ఇస్తారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీయులకూ, ప్రవాస భారతీయులకూ ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. భారత్‍ నుంచి తిరుగు ప్రయాణం నెలలోపు ఉంటే పాస్‍పోర్టులో ఆ తేదీనీ, ఇమిగ్రేషన్‍ స్టాంపునీ చూపిస్తే రూ.300 టికెట్‍ ఇస్తారు.

ఆంధప్రదేశ్‍ నాన్‍రెసిడెంట్‍ తెలుగు సొసైటీ (ఏపీఎన్‍ఆర్‍టీఎస్‍) ద్వారా వీఐపీ బ్రేక్‍ దర్శనాలను అనుమతిస్తారు. రోజూ వందమందికి ప్రవేశం ఉంటుంది. ప్రవాసాంధ్రులు దీనికి అర్హులు.

తిరుమలలో కల్యాణం చేసుకున్న వధూవరులకూ, వారి కుటుంబ సభ్యులకూ కల్యాణోత్సవం టికెట్లను ఇస్తారు. ఇందుకు వివాహ ధ్రువీకరణ పత్రాన్నీ, ఫొటోలనూ చూపించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో పెళ్లి చేసుకున్న నవదంపతులైనా కూడా ఈ ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు పదివేల రూపాయలు విరాళం ఇచ్చి, రూ.500 చెల్లించి టికెట్‍ తీసుకునే భక్తులకు శ్రీవాణి దర్శన టికెట్లను ఇస్తారు. శ్రీవాణి టికెట్లను ఆన్‍లైన్‍లో 500, తిరుపతి విమానాశ్రయంలో 200, తిరుమల జేఈవో కార్యాలయం వెనుక ఉన్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో 800 చొప్పున.. మొత్తం 1500 టికెట్లను జారీ చేస్తారు.

ఆంధప్రదేశ్‍, తెలంగాణ శాసనసభ, శాసనమండలి సభ్యులూ, లోక్‍సభ, రాజ్యసభ సభ్యులూ ఇచ్చే సిఫారసు లేఖలతో వీఐపీ బ్రేక్‍ దర్శనంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తారు.

ఐఏఎస్‍, ఐపీఎస్‍ అధికారుల సిఫారసు లేఖలతోనూ శ్రీవారి దర్శన భాగ్యాన్ని పొందవచ్చు. రోజుకు దాదాపు నాలుగు వేల (4,000) వరకు ఈ సిఫారసు టికెట్లను జారీ చేస్తారు. ఇది విచక్షణ కోటా. కాబట్టి ము్య•మైన ఉత్సవాలూ, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ సిఫారసు టికెట్లను రద్దు చేసే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది.

శ్రీవారికి విరాళాలు అందించే దాతలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనాలకు అనుమతిస్తుంది. ఇందులో లక్ష రూపాయల నుంచి కోటిన్నర రూపాయల వరకు విరాళాలను అందించిన వారికి డోనర్‍ పుస్తకాన్ని ఇస్తారు. కుటుంబంలోని ఐదుగురు ఈ విధానంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు.

యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపైన అనురక్తినీ కల్పించడమే లక్ష్యంగా గోవిందనామ కోటిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టింది. గోవిందనామ కోటి రాసిన యువతకు వీఐపీ దర్శనం చేసుకునే అవకాశాన్నిస్తోంది. 25 లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు ఇందుకు అర్హులు.

దసరా అక్టోబరు మాసంలోనైనా.. దేవీ శరన్నవరాత్రులు ఆరంభమయ్యేది మాత్రం సెప్టెంబరు నెలలోనే. కాబట్టి ప్రతి ఇంటా పూజలతో పాటు పిండివంటల హడావుడి మొదలైనట్టే. శరన్నవరాత్రులంటే.. పది రోజుల వేడుక. ఈ రోజుల్లో అమ్మవారికి ఏమేం నివేదించాలా?, ఏవి తయారుచేయాలా? అని అతివలు హైరానా పడటం సాధారణమే. మరి, అమ్మవారికి ఇష్టమైన ‘అన్న’ప్రసాదాల వెరైటీలు ప్రయత్నించండి.

జీరా అన్నం

కావాల్సినవి:
అన్నం: రెండు కప్పులు, నెయ్యి: టేబుల్‍ స్పూన్‍, నూనె: చెంచా, ఆవాలు: అరచెంచా, మినప్పప్పు: టేబుల్‍స్పూన్‍, జీడిపప్పు: పావుకప్పు, ఉప్పు: తగినంత, కరివేపాకు రెబ్బలు: రెండు.
పొడి కోసం:
మిరియాలు: అరటేబుల్‍ స్పూన్‍, జీలకర్ర: పెద్ద చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు.
తయారు చేసే విధానం:
• స్టవ్‍ మీద కడాయిని పెట్టి పొడి కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలను దోరగా వేయించుకుని ఆ తరువాత మిక్సీలో పొడి చేసుకోవాలి. • ఇప్పుడు కడాయిని స్టవ్‍ మీద పెట్టి నెయ్యి, నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, జీడిపప్పు, కరివేపాకు వేయించుకుని స్టవ్‍ను కట్టేయాలి. • ఈ తాలింపులో అన్నం, తగినంత ఉప్పు, అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న పొడిని వేసి బాగా కలిపితే చాలు. వేడి వేడి జీరా అన్నం సిద్ధం

హరియాలీ సాబూదానా
(ఉపవాస ఫలహారం)
నవరాత్రుల సమయంలో ఉత్తరాదిలో ఎక్కువ మంది తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటూ సగ్గు బియ్యం కిచిడీని ఫలహారంగా తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఆ కిచిడీనే కాస్త మార్చి ఇలా కూడా ప్రయత్నించవచ్చు.
తయారీ విధానం ఇలా..
• సగ్గుబియ్యంలో అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి.
• ఇది నానేలోగానే అరకప్పు చొప్పున కొత్తిమీర, పుదీనా, రెండు పచ్చిమిర్చి, చిన్న అల్లంముక్క, అరచెంచా జీలకర్ర, టేబుల్‍స్పూన్‍ నిమ్మరసాన్ని మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. • ఇప్పుడు స్టవ్‍ మీద కడాయిని పెట్టి మూడు టేబుల్‍స్పూన్ల నూనె వేసి.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయించాలి. • ఇందులో కప్పు బంగాళాదుంపల ముక్కలు వేసి బాగా వేయించి మూతపెట్టాలి.
• ఈ ముక్కలు వేగుతున్నప్పుడు స్టవ్‍ను సిమ్‍లో పట్టి.. తగినత ఉప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, పుదీనా మిశ్రమం వేసి అన్నింటినీ కలిపి మూత పెట్టాలి. • సగ్గుబియ్యం మెత్తబడ్డాక అరకప్పు వేయించిన పల్లీల పొడి వేసి మరోసారి కలిపి అయిదు నిమిషాలు అయ్యాక దింపేస్తే హరియాలీ సాబుదానా కిచిడీ సిద్ధం. • ఇది ఉత్తరాది ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందిన వంటకం. ఉపవాసం తీసుకునే ఆహారం కావడంతో పై దినుసులను ఉపయోగించి బలవర్ధకంగా తయారు చేసుకుంటారు. దీంతో పూజలు, ఉపవాస వేళల్లో నీరసం, నిస్సత్తువ రాకుండా ఉంటాయి.

బెల్లం అన్నం
కావాల్సినవి:
బియ్యం: కప్పు, నెయ్యి: పావుకప్పు, బెల్లం పొడి: కప్పు, మిరియాలు: అరచెంచా, లవంగాలు: రెండు, దాల్చిన చెక్క: చిన్నముక్క, సోంపు: చెంచా, బాదం: పావుకప్పు, జీడిపప్పు: పావుకప్పు, కిస్‍మిస్‍: రెండు టేబుల్‍స్పూన్లు, ఎండుకొబ్బరి ముక్కలు: పావుకప్పు, యాలకుల పొడి: అరచెంచా.
తయారు చేసే విధానం: స్టవ్‍ మీద కుక్కర్‍ను పెట్టి ముప్పావు వంతు నెయ్యి వేసి మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క, సోంపు, బాదం, జీడిపప్పు, కిస్‍మిస్‍, ఎండుకొబ్బరి ముక్కలు వేయించుకోవాలి.
• ఇందులో కడిగిన బియ్యం వేసి రెండు నిమిషాలు వేయించి, బెల్లంపొడి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి, యాలకుల పొడి వేసి మూత పెట్టి రెండు కూతలు వచ్చే వరకూ ఉడికించి దింపేయాలి.
• ఆవిరిపోయాక మూత తీసి మిగిలిన నెయ్యి వేసి మరోసారి కలిపితే బెల్లం అన్నం తయారైనట్టే.

మెల్కోటే పులిహోర
కావాల్సినవి: పొడిపొడిగా వండిన అన్నం: రెండు కప్పులు, చింతపండు: పెద్ద నిమ్మకాయంత, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, బెల్లం తరుగు: టేబుల్‍స్పూన్‍, నువ్వుల నూనె: పావుకప్పు, ఆవాలు: చెంచా, ఇంగువ: పావుచెంచా, పల్లీలు: పావుకప్పు, ఎండుమిర్చి: మూడు, కరివేపాకు రెబ్బలు: రెండు, ఎండు కొబ్బరితురుము: టేబుల్‍స్పూన్‍.
పొడి కోసం: జీలకర్ర: చెంచా, ధనియాలు: టేబుల్‍స్పూన్‍, మినప్పప్పు: టేబుల్‍స్పూన్‍, మిరియాలు: చెంచా, ఎండుమిర్చి: అయిదు, నువ్వులు: టేబుల్‍స్పూన్‍, పుట్నాల పప్పు: టేబుల్‍స్పూన్‍.
తయారు చేసే విధానం:
• చింతపండును ముందుగా నానబెట్టుకుని చిక్కగా రసం తీసి పెట్టుకోవాలి. అదే విధంగా పొడి కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలను కడాయిలో దోరగా వేయించుకుని వేడి చల్లారాక పొడిగా చేసుకోవాలి.
• కడాయిని స్టవ్‍ మీద పెట్టి నూనె వేసి ఆవాలు, ఇంగువ, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. ఇందులో పసుపు, చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు, బెల్లం తరుగు, కొబ్బరి తురుము, సిద్ధం చేసి పెట్టుకున్న పొడి రెండు టేబుల్‍స్పూన్లు వేసి కలిపి స్టవ్‍ను సిమ్‍లో పెట్టాలి. పులుపు ఉడికి చిక్కగా అయ్యాక దింపేయాలి.
• అన్నంపైన ఈ మిశ్రమం వేసి బాగా కలిపితే చాలు.. కమ్మని మెల్కోటే పులిహోర సిద్ధం.
దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ మెల్కోటే అయ్యంగార్‍ పులిహోర చాలా ప్రసిద్ధం. అక్కడి ఆలయాల్లో దీనినే ప్రధాన ప్రసాదంగా భక్తులకు పంచుతారు. దేవునికి నైవేద్యంగానే కాక, పండుగలు, పర్వదినాలు, ప్రత్యేక సందర్భాలలో, విందులలో పుల్లగా, కారం కారంగా ఉండే దీనినే వడ్డిస్తారు.

అమ్మవారు మెచ్చే
నవ నైవేద్యాలివీ..

దసరా వచ్చేస్తోంది. సెప్టెంబరు 22 నుంచి దేవీ శరన్నవరాత్రులు ఆరంభమవుతున్నాయి. మరి ఈ ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుపుకోవడమే కాదు.. ఈ తొమ్మిది రోజులూ దుర్గామాతకు నవ నైవేద్యాలను నివేదిస్తారు. ఆ ప్రసాదాలేమిటంటే..
చిట్టిగారెలు: తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మ మహిషాసురుడితో యుద్ధం చేస్తుంది. అలసట రాకుండా ‘మాష చక్రములు’ అంటే చిట్టిగారెలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అమ్మవారికి ఇష్టమైన మినుములతో వీటిని తయారు చేస్తారు.
కట్టెపొంగలి: పెసరపప్పు, బియ్యం, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి తయారుచేసే కట్టెపొంగలిని భవానీ మాత ఎంతో ఇష్టంగా ఆరగిస్తుందట.
దద్యోజనం: శాంతి రూపాన్ని కోరుకుంటూ, అందరికీ చల్లని దీవెనలు అందించాలంటూ అన్నపూర్ణాదేవికి పెరుగుతో చేసిన దద్యోజనం ప్రసాదంగా నివేదిస్తారు.
నువ్వుల అన్నం: నువ్వులు, కొబ్బరి, ఉప్పు, కారం వేసి ఈ అన్నాన్ని వండుతారు. అసురులతో పోరాడే కాళికకు నువ్వుల్లో ఉండే విష్ణుశక్తి తోడవ్వాలని ఈ వంటకాన్ని నివేదిస్తారు.
చిత్రాన్నం/హరిద్రాన్నం: దుర్గమ్మ మెచ్చే ప్రసాదాల్లో నిమ్మకాయ పులిహోర కూడా ఒకటి. పోపు సామగ్రి వేసి రుచికరంగా చేసే దీన్ని అమ్మవారు ఇష్టంగా ఆరగిస్తారనేది నమ్మకం.
గుడాన్నం: లలితా సహస్ర నామాల్లో ‘గూడాన్న:ప్రీత మానస’ అంటూ చదువుకుంటాం. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. పెసరపప్పు, బియ్యం ఉడకబెట్టి బెల్లం, సుగంధ ద్రవాల్య పొడి, నెయ్యి, ఎండుఫలాలను వేసి తయారుచేస్తారు. ఈ ప్రసాదాన్ని నివేదిస్తూ సకల శుభాలనూ అందించాలని కోరతారు.
కదంబం ప్రసాదం: దశమి నాడు పదకొండు రకాల కూరగాయలు, పప్పు, బియ్యంతో చేసిన కదంబాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
అప్పాలు: అమ్మవారి క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. ఆయన మెచ్చే అప్పాలనే అమ్మవారికీ నివేదిస్తారు. గోధుమపిండి, బియ్యప్పిండి, బెల్లం, సుగంధ ద్రవ్యాల పొడి వాడి వీటిని తయారు చేస్తారు.
శాకాన్నం: తొమ్మిది రకాల కూరగాయలు, తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాల పొడి వేసి నవశక్తికి నైవేద్యంగా పెడతారు. సస్యవృద్ధిని కోరుకుంటూ ఈ వంటకాన్ని అమ్మవారికి నివేదిస్తారు.

Review శ్రీవారి దర్శనానికి దారిదే!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top