మామిడిపువ్వు:
ఈ పువ్వు వగరు, తీపి రుచులు కలిగి, సువాసన వెదజల్లుతుంది. పైత్యశాంతి, మేహశాంతిని కలిగిస్తుంది. వీటిని పచ్చడి చేసుకున్నా, పప్పు చేసుకున్నా ఇవే గుణాలను అందజేస్తాయి. వీటి కషాయాన్ని పుక్కిలిస్తే పంటినొప్పులు, చిగుళ్ల వాపులు పోతాయి. దీన్ని తాగితే నీళ్ల విరేచనాలు కలుగుతాయి.
మారేడుచెట్టు:
దీని వేరు లేదంటే ఆకు రసం, కషాయం చలువ, మేహశాంతి, పైత్యశాంతిని కలుగజేస్తుంది. జఠరదీప్తినిస్తుంది. విచారాన్ని, అజీర్ణాన్ని పోగొడుతుంది. తాపం, జ్వరాలు కూడా పోతాయి. వేరు కషాయం గుండె దడను పోగొడుతుంది. ఆకు కషాయం ఉబ్బసాన్ని, వాంతుల్ని పోగొడుతుంది. ఆకు కళ్లకు కట్టుకుంటే నేత్రరోగాలు దూరమవుతాయి.
మారేడుపండు:
దోరపండు శ్రేష్ఠమైనది. గుజ్జును పంచదారతో కలిపి తీసుకుంటే మంచిది. బలాన్నిస్తుంది. వాత, శ్లేష్మాలు పోతాయి. అగ్నిమాంద్యం, శూల అణగిపోతాయి. పండురసం లేదా కషాయంతో పుండ్లను, వ్రణాలను కడిగితే శుభ్రపడి మానుతాయి.
మాలతి తీగె పువ్వులు:
ఈ తీగె ఆకుల రసం లేదా కషాయం కఫ, పైత్యాలను హరిస్తుంది. దీని పువ్వుల రసం లేదా కషాయం కఫ పైత్యాలను, వ్రణాలను పోగొడుతుంది. కళ్లకు చలువ చేస్తుంది. సువాసన కలిగిన ఈ పువ్వులను ధరించడం వలన మనసుకు హాయిగా, ఉత్సాహంగా ఉంటుంది.
మినప్పప్పు:
చలువ చేస్తుంది. బలాన్నిస్తుంది. మేహశాంతి, వీర్యవృద్ధిని కలుగచేస్తుంది. కఫ, పైత్యాలను పెంచుతుంది. మూత్రపిండాలకు బలాన్నిస్తుంది. మన సంప్రదాయంలో కొన్ని రుతువుల కాలంలో తప్పక మినుములతో చేసిన సున్నుండలు వంటి వంటకాలను తప్పక తీసుకోవాలని నియమం విధించారు. నిర్దేశించిన కాలాల్లో వీటిని తీసుకోవడం వల్ల దేహపుష్టి కలుగుతుంది.
మినుములు:
వీటితో చేసిన గారెలు, కుడుములు, రొట్టె.. వీటి సామాన్య గుణాలు సాధారణంగా వేడి చేస్తాయి. శరీరానికి, మూత్రపిండాలకు బలాన్ని కలిగిస్తాయి. వాతాన్ని పోగొడతాయి. వీర్యవృద్ధిని కలుగచేసి దానికి వేడిని పుట్టిస్తాయి. విరేచనకారి. ఆలస్యంగా జీర్ణం అవుతాయి.
మినప పిండివంటలు:
వీటితో చేసిన వంటలు మృదువుగా, తేలికగా ఉంటాయి. వీర్యవృద్ధిని కలుగచేస్తాయి. బలాన్నిచ్చి మేహవాతాలను హరిస్తాయి.
మిరపకాయలు (ఎండువి):
వేడి చేస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. తిన్న ఆహారాన్ని తేలికపరుస్తాయి. మంచి విరేచనకారి. నరాలకు బలాన్నిస్తాయి. పొట్టకు కూడా బలాన్ని కలిగిస్తాయి. మితిమీరి తింటే వీర్యనష్టం జరుగుతుంది. నిత్యం వండుకునే కూరల్లో వీటిని తగిన మోతాదులో వినియోగించాలి.
మిరియాలు:
నల్ల మిరియాలు, నానబెట్టి పొట్టు తీసినవి తెల్ల మిరియాలు అని ఇవి రెండు రకాలు. శ్లేష్మాన్ని, కఫాన్ని కలిగిస్తాయి. శరీరంలోని నీటిని ఆర్చివేస్తాయి. రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. వీర్యవృద్ధిని కలిగించి, దానికి వేడిని కలిగిస్తాయి. మలమూత్రాలను సులువుగా జారీ చేస్తాయి. జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తాయి. నరాలకు సత్తువను కలుగజేస్తాయి. పొట్టకు వేడిని కలిగించి, బలాన్నిచ్చి, జీర్ణశక్తిని పెంచు తాయి. పాలు, చక్కెరతో కలిపి వీటిని తీసుకుంటే ధాతుపుష్టినిస్తాయి. వీటి చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు, గొంతుకలో నస తగ్గుతాయి.
మిరియాల చారు:
మిరియాలు వేసి కాచిన చారు రుచిగా ఉంటుంది. జఠరదీప్తిని కలిగిస్తుంది. త్రిదోషాలను తగ్గిస్తుంది. విరేచనకారి. పథ్యంగా మంచిది. ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
మీగడ:
చలువ చేస్తుంది. పొడిదగ్గును, వెక్కిళ్లను అణచివేస్తుంది. గుండెకు, శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. పైత్య వాతాలను అణచి వీర్యవృద్ధిని కలిగిస్తుంది. కొంచెం ఆలస్యంగా జీర్ణమవుతుంది.
ముఖ ప్రక్షాళనం:
చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే రక్తపైత్యం, శోష, మొటిమలు పోతాయి. కళ్లకు, మెదడుకు మేలు చేస్తుంది. మనసుకు హాయిగా ఉంటుంది. గోరువెచ్చని నీరయితే ఇంకా మంచిది. పళ్లపోటు, కుదుళ్ల వాపు, పచ్చి పుళ్లున్న వారికి ఈ గోరు వెచ్చని నీరు అనుకూలంగా ఉంటుంది.
ముత్యాలు:
ముత్యాలను ధరించడం వలన దేహకాంతి, ఆరోగ్యం, సంతోషం, బుద్ధిబలం కలుగుతాయి. గ్రహదోషాలు శాంతిస్తాయి. దృష్టిని పెంచుతాయి. గుండె అదురును తగ్గిస్తాయి. నరాల బలహీనతను పోగొడతాయి.

























































































































































































































































































































































































































Review వస్తుగుణ దీపిక.