కాశీలో అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదం. మోక్షదాయకం

ఇక్కడ చేసే అన్నదానం కానీ లేదా అన్నదాన నిమిత్తం విరాళాలు ఇవ్వడం, వస్తు సామగ్రి తదితర రూపాల్లో సహాయం అందివ్వడం పదింతల ఫలాన్నిస్తుంది. జన్మజన్మల పాపాలను పోగొట్టి శివసాయుజ్యాన్ని (మోక్షం) ప్రసాదిస్తుంది. అన్నపూర్ణాదేవి కొలువైన క్షేత్రం కావడంతో ఇక్కడ అన్నదానం, అన్నదానానికి అవసరమైన విరాళాలు అందించడం విశేషమైన ఆధ్యాత్మిక ఫలితాలను అందిస్తుంది. పరమేశ్వరుడు బిక్షువై కాశీ పురవీధుల్లో తిరుగుతుంటాడనీ, ముక్కోటి దేవతలు, దేవగణాలు, రుషులు మధ్యాహ్నం కాశీ క్షేత్రంలో బిక్షకొస్తారని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి చోట్ల అన్నదానం చేసినా, అన్నదాన సత్రాలకు విరాళం అందించినా ఆ ఫలితం పదింతలై మనకు తిరిగి చేరుతుందని పెద్దలు చెబుతారు. కాశీకి వచ్చే భక్తులు ఉత్తమమైన మనసుతో వస్తారు. మోక్షగాములై ఉంటారు. అటువంటి వారికి అన్నదానం చేస్తే ఎంత ఫలమధికమో..అలాంటి అన్నదానానికి విరాళాలిచ్చే వారికి కూడా అంతే ఫలం లభిస్తుంది. అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ఇక్కడ ఏళ్లుగా యాత్రికులకు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తోంది. ఈ సంస్థ అందిస్తున్న సేవలకు సైదోడుగా నిలవడం అంటే స్వయంగా ఆ కాశీ విశాలాక్షి, కాశీ విశ్వనాథుల అనుగ్రహాన్ని నేరుగా పొందడమే.

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఆ కాశీ విశ్వనాథుని దర్శనాన్ని సకల పాపహరణంగా భావిస్తారు భక్తులు. అందుకే ఏడాది పొడవునా భక్తులతో కళకళలాడుతుంటుందా పవిత్రధామం. ఇక శివరాత్రి, కార్తీక•మాస పర్వదిన వేళల్లోనైతే ఆ ముక్తి క్షేత్రం ‘హర హర మహాదేవ.. శంభో శంకర’ అనే శివనామస్మరణతోనూ గంగా హారతులతోనూ కైలాసాన్నే తలపిస్తుంది.
పరమశివుడు నివసించిన మహిమాన్విత క్షేత్రమే కాశీ. ఆయన కొలువైన ఆలయమే విశ్వేశ్వరాలయం. విశ్వమంతా నిండినది కాశీ విశ్వేశ్వరుడేననీ, ఇక్కడి జ్యోతిర్లింగ దర్శనం సకల లింగ దర్శనమనీ ప్రతీతి.
‘కాశ్యాన్తు మరణాన్‍ ముక్తి:’
అంటే- కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని అర్థం. అందుకే అక్కడ మరణించాలనే కోరికతోనే కాశీకి వెళ్లేవారు ఒకప్పుడు. బౌద్ధులకూ, జైనులకూ కూడా ఇది పుణ్యక్షేత్రమే. ఆదిశంకరులు తన బ్రహ్మసూత్ర భాష్యాన్నీ, భజగోవింద స్తోత్రాన్నీ ఇక్కడే రచించారని అంటారు. ‘ఈ నగరం చరిత్ర కన్నా ప్రాచీనమైనది. సంప్రదాయం కన్నా పురాతనమైనది’ అని ప్రముఖ రచయిత మార్క్ట్వెయిన్‍ పేర్కొన్నాడు. చైనా యాత్రికుడు హుయాన్‍త్సాంగ్‍ సైతం కాశీని గొప్ప ఆధ్యాత్మిక, విద్య, కళా కేంద్రంగా వర్ణించాడు.
కాశీకే వారణాసి అని మరో పేరు. వరుణ, అసి అనే రెండు నదుల మధ్య నిర్మించిన నగరం కావడం వల్లే ఇది వారణాసి అయింది. ఆ పేరును పాళీ భాషలో బారనాసి అని రాసేవారని, అదే కాలక్రమంలో బెనారస్‍గా మారిందనీ అంటారు. ఈ నగరాన్ని ఇతిహాసాల్లో అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, రమ్య, సుదర్శన.. ఇలా ఎన్నో పేర్లతో వర్ణించారు. అయితే కాశీ నగర పుట్టుకే అంతబట్టని రహస్యం అంటుంటారు.
క్షేత్ర ప్రాశస్త్యం
కల్పం మొదట్లో ప్రకృతి మొత్తం జలమయమై ఉందట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి సాగించే సామర్థ్యం కోసం తపస్సు చేసుకోవడానికి శివుడు త్రిశూలాగ్రం మీద సృష్టించిన భూ ఖండమే కాశీ. దీని మీద కూర్చుని బ్రహ్మదేవుడు సమస్త లోకాలనూ అందులో భాగంగా భూమినీ సృష్టించాడట. దేవతలు, రుషుల విన్నపం మేరకు శివుడు త్రిశూలం మీద ఉన్న భూ ఖండాన్ని అలాగే దించి నేల మీద నిలబెట్టాడనీ, అదే కాశీ పట్టణమని శివపురాణం పేర్కొంటోంది. అందుకే బ్రహ్మదేవుడి సృష్టి ప్రళయకాలంలో నశించినా కాశీ పట్టణం మాత్రం చెక్కుచెదరదట. అంతేకాదు, దీన్ని మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరంగానూ చెబుతారు. అందుకే ఇక్కడికి వెళ్లిన వాళ్లకు తిరిగి రావాలని అనిపించదట.
కైలాసంలో సన్యాస జీవితాన్ని గడిపే ఈశ్వరుడు పార్వతితో వివాహమయ్యాక కాశీని నివాసంగా చేసుకున్నాడట. కొంతకాలానికి అక్కడ ఉన్న దేవతలంతా ఈ నగరాన్ని చక్కగా తీర్చిదిద్దేందుకు దివోదాసును రాజుగా ఉండాలని కోరారట.
‘శివుడు ఇక్కడ ఉంటే దేవగణం ఆయన చుట్టూనే ఉంటారు కాబట్టి అటువంటి నగరాన్ని నేను పాలించలేను’ అన్నాడట దివోదాసు. అప్పుడు ఈశ్వరుడు పార్వతితో సహా మందర పర్వతానికి తరలివెళ్లాడు. కానీ, అక్కడ నచ్చక కాశీకి తిరిగి రావాలనుకుని దూతలను పంపితే, వాళ్లకి ఆ పట్టణం నచ్చి అక్కడే ఉండిపోయారట. సూర్యుదేవుడినీ, గణేశుడినీ, బ్రహ్మనీ.. ఇలా ఒకరి తరువాత ఒకరిని పంపగా వాళ్లూ వెనక్కి రాలేదట. చివరకు తన గణాలను పంపగా వాళ్లూ ద్వారపాలకులుగా స్థిరపడిపోయారు. అప్పుడు శివుడే స్వయంగా వచ్చి దివోదాసుకు ముక్తిని ప్రసాదించి కాశీలో కొలువయ్యాడనేది ఓ పౌరాణిక కథనం. వీళ్లంతా కాశీ పట్టణంలో ఉండాలనుకున్నది సౌఖ్యం కోసం కాదనీ, అన్ని బంధాలనీ దాటి విశ్వంలో కలిసే అనుబంధం కోసం తపించే పక్రియలో భాగమని చెప్పడమే ఈ కథ వెనకున్న పరమార్థం.
పురాతన నగరం
ఐదు వేల సంవత్సరాల క్రితమే కాశీ నగరం ఉందని, అందుకే వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనూ కాశీ నగరం ప్రస్తావన ఉందనేది పండితుల అభిప్రాయం. ఈ నగరం మూడు వేల సంవత్సరాల నాటిదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పురాతత్త్వ అవశేషాలు వారణాసి వేదకాలం నాటి ప్రజల ఆవాసమని అంటున్నాయి. తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ సుమారు పదిహేను వేల సంవత్సరాల వ్యక్తిగా చెప్పే సునీరుడు దేనినో వెతుకుతూ ఇక్కడకు వచ్చినట్టు చెబుతారు. అప్పటికే ఇది కిటకిటలాడుతున్న నగరమట. పూర్వం ఇక్కడ 72 వేల ఆలయాలు ఉండేవనీ, యోగశాస్త్రం ప్రకారం ఇది మనిషి శరీరంలోని నాడుల సంఖ్యతో సమానమనీ అంటారు. దేశవిదేశీ శాస్త్రవేత్తలు కాశీకి వచ్చి పరిశోధనలు చేయగా, శక్తి చలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించినట్టు తెలిసిందట.
గద్దలు ఎగరవు.. శవాలు వాసన పట్టవు..
సప్త మోక్ష ద్వారాల్లో ఒకటైన కాశీలో మరణించిన వాళ్లని అక్కడ ఉన్న దుండి గణపతి, కాలభైరవులు యముడి కన్నా 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తారని భక్తులు నమ్ముతారు. అందుకే కాలభైరవ దర్శనానంతరం పూజారులు వీపు మీద కర్రతో కొట్టి కాశీ దాటి వెళ్లినా పాపాలు అంటకుండా నల్లని కాశీదారం కడతారట. కాశీలో ఉన్న వాళ్లకు సమస్త యాగాలు చేసిన పుణ్యంతో పాటు శరీరంలోని చక్రాలన్నీ ఉత్తేజితం అవుతాయట. కాశీలో గద్దలు ఎగరవు. గోవులు పొడవవు. బల్లులు అరవవు. శవాలు వాసన పట్టవనీ అంటారు. కాశీలో మరణించిన ఏ జీవికైనా కుడి చెవి పైకి లేచి ఉంటుందట. అంతేనా.. హిమాలయాల్లోని గోముఖం నుంచి బయలుదేరిన గంగమ్మ దారి మళ్లి కాశీ నగరాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. చిత్రంగా ఎంత కరువు వచ్చినా గంగమ్మ ఇప్పటి వరకూ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదట.
విశ్వనాథ లింగం
చారిత్రకంగా చూసినా ఈ ప్రాంతాన్ని పాలించిన చక్రవర్తులూ, ప్రజలూ కలిసి నిర్మించిన గుడులు కాశీలో 26 వేలకుపైనే ఉండేవట. ప్రస్తుతం వీటి సంఖ్య రెండున్న వేలకు మించదు. కాశీ నగరం ముస్లిం దండయాత్రల్లో మూడుసార్లు ధ్వంసమైనట్టూ, అక్బరు కాలంలో కొన్ని ఆలయాలను పునరుద్ధరించినట్టూ తెలుస్తోంది. అందుకే ఇప్పటికీ కాశీలోని ప్రతి వీధిలోనూ ఓ గుడి ఉంటుంది. అన్నింటిలోనూ నిత్యం పూజలూ, హోమాలూ జరుగుతూనే ఉంటాయి. వాటన్నింటిలోకీ ప్రత్యేకమైనది విశ్వనాథ మందిరం. పూర్వం ఇది ఎంతో వైభవంగా ఉండేదట. ఆ తరువాత దాడులకు భయపడి బయటకు కనిపించకుండా ఆలయం చుట్టూ చిన్నా పెద్దా భవనాలు కట్టడంతో ఇరుకు సందుల మధ్య ఉండిపోయిందట. అందుకే దాన్ని మళ్లీ అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతో కాశీ విశ్వనాథ థామ్‍ ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేసింది. దీంతో విశ్వనాథ మందిరం పూర్వ వైభవాన్ని సంతరించు కుంది.
సువర్ణ దేవాలయం
విశ్వనాథుడి ఆలయానికి వెళ్లే దారిలోనే సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. అక్కడ ఆగి పేరు, గోత్రం చెప్పుకుంటారు భక్తులు. కలంతో ఉన్న వినాయకుడు కాశీకి వచ్చిన వాళ్ల వివరాలు రాసుకుంటాడట. ఆ తరువాత సెక్యూరిటీ చెకింగ్‍ దగ్గర దుండి గణపతి కొలువుదీరి ఉంటాడు. ఈయన యాభై ఆరు స్వరూపాలతో కాశీ పట్టణాన్ని కాపాడుతుంటాడనీ, ఈయనను దర్శించుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయనీ అంటారు. అది దాటి విశ్వనాథుడి ఆలయంలోకి వెళితే గర్భగుడిలో ఓ మూలగా ఉంటుంది లింగం. ప్రస్తుత మందిరాన్ని 1780ల్లో ఇండోర్‍ రాణి అహల్యాబాయి హోల్కర్‍ కట్టించిందట. మహారాజా రంజిత్‍సింగ్‍ ఈ ఆలయ గోపురాలకు బంగారు పూత పూయించడానికి వెయ్యి కిలోలకు పైగా బంగారాన్ని సమర్పించాడట. అందుకే దీన్ని సువర్ణ దేవాలయం అంటారు భక్తులు. అంతకుముందున్న మందిరం ఔరంగజేబు కాలంలో విధ్వంసానికి గురైనపుడు ఆలయ అర్చకులు లింగాన్ని బావిలో దాచారట. ఆ తరువాత సమీపంలో మరో ఆలయాన్ని కట్టించి లింగం కోసం బావిలో వెతికితే కనబడలేదు. అప్పుడు అహల్యాబాయి కలలో స్వామి కనిపించి, ‘అది లుప్తం అయింది. మరో లింగాన్ని ప్రతిష్ఠించాల’ని చెప్పడంతో లింగాన్ని తెచ్చి ఓ పక్కగా పెట్టి అందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. కానీ ఆ స్థలం నుంచి స్వామి కదలకపోవడంతో అక్కడే దాన్ని ప్రతిష్ఠించారట. అదే నేటి విశ్వనాథ లింగం.
శవ భస్మలేపనంతో పూజ
విశ్వనాథుడి గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉంటాయి. రెండు లోపలికి వెళ్లడానికీ, మరో రెండు బయటకు రావడానికీనూ. గుడిలో నలువైపులా ఉన్న పాలరాతి ఫలకాల మీద సీతారామ లక్ష్మణులు, దశభుజ వినాయకుడు, కాలభైరవుడు, పార్వతీ పరమేశ్వరులు, మహా శ్వేత రూపాలు దర్శనమిస్తాయి. కాశీ విశ్వేశ్వరుడికి శవ భస్మ లేపనంతోనే పూజ ప్రారంభిస్తారు. మహా శివరాత్రి నాడు మృత్యుంజయ ఆలయం నుంచి విశ్వనాథ ఆలయం వరకూ ఊరేగింపు జరుగుతుంది. విశ్వ నాథుడి కన్నా ముందు తారకేశ్వర లింగాన్ని దర్శించుకుంటారు భక్తులు. ఈ లింగమే కాశీలో మరణించే వారి చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తుందట. దర్శనానంతరం బయటకు రాగానే అవిముక్తేశ్వర లింగం కనిపిస్తుంది. ఈయన పరమశివుడి గురువైన ముక్తేశ్వరుడనీ, శివుడిచే పూజలందుకునే పవిత్ర లింగమనీ చెబుతారు. విశ్వనాథ మందిరంతో పాటు అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, వారాహిదేవి, ఆశా వినాయకుడు ఇలా వేల కొద్దీ మందిరాలూ, దశాశ్వమేధ, ప్రయాగ్‍, సోమేశ్వర్‍, హరిశ్చంద్ర, మణికర్ణికాఘాట్‍.. వంటి 80కి పైగా ఘాట్‍లతో అలరారే ఈ ముక్తి క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా చూసి తరించాలని కోరుకుంటారు భక్తజనం.
కాలభైరవ దర్శనం
కాశీ (వారణాసి) క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. శివాజ్ఞ మేరకు ఇక్కడ కొలువయ్యాడీయన. శివుడి ఉగ్రమూర్తి రూపమైన భైరవుడు కాశీకి వచ్చే భక్తుల పాపాలను తొలగిస్తూ, క్షేత్రాన్ని రక్షిస్తుంటాడని ప్రతీతి. కాశీ విశ్వనాథుడి దర్శనానికి ముందు కాలభైరవుడిని దర్శించుకోవాలని అంటారు. శివాజ్ఞతో బ్రహ్మదేవుడి అహంకారాన్ని అణచి వేసేందుకు తన చిటికెన వేలితో బ్రహ్మ ఐదో తలను ఖండించాడు కాలభైరవుడు. దీంతో అప్పటి నుంచి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకున్న కాలభైరవుడిని ఆ పాప విముక్తి కోసం కాశీలో స్థిరపడాలని, తన క్షేత్రానికి పాలకుడిగా ఉండాలని శివుడు ఆదేశించాడు. కాలభైరవుడిని కాశీ విశ్వనాథుని నగర రక్షకుడిగా పిలుస్తారు.

కాశీలో అన్నదాన ఫలం
ఙ కాశీలో అన్నదానం చేయడం వలన సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది.
ఙ ఇక్కడ చేసే అన్నదానం వల్ల పుణ్యం పదింతలు పెరిగి అక్షయమైన (తరిగిపోని) సంపదలను, యశస్సును కలిగిస్తుంది.
ఙ ఇది అన్నపూర్ణాదేవి క్షేత్రం కావడంతో ఇక్కడ ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం సాక్షాత్తూ ఆ తల్లికి చేసిన సేవగానే భావిస్తారు.
ఙ కాశీలో గంగాస్నానం, విశ్వనాథుని దర్శనానంతరం అన్నదానం చేయడం వల్ల మనిషి జన్మ తరిస్తుందని నమ్మకం.
ఙ అందుకే కాశీకి వెళ్లిన భక్తులు తప్పకుండా అన్నదానం చేయడం లేదా అన్నదాన సత్రాలకు విరాళాలు ఇవ్వడం ద్వారా ఆ పుణ్యఫలాన్ని పొందవచ్చు.
ఙ ఇక్కడ నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తోన్న అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన సత్రం.. భక్తులకు అందిస్తున్న అన్నదాన కార్యక్రమానికి దాతల తోడ్పాటును కోరుతోంది. ఈ సత్రానికి సాయం అందించడం ద్వారా.. భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని అందించడం ద్వారా సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరులకు సేవ చేసిన ఫలితం కలుగుతుంది.

అన్నపూర్ణే.. సదాపూర్ణే!
అమ్మ బిడ్డల ఆకలిని గమనించి మరీ కడుపు నిండ అన్నం పెట్టి ఆనందిస్తుంది. పిల్లల అవసరాలకు తగినట్టు అడిగినవన్నీ సమకూరుస్తుంది. కాశీలో కొలువైన అన్నపూర్ణాదేవి కూడా చేతిలో గరిటెతో కనిపిస్తూ.. బిక్షాందేహి అంటూ తనను దర్శించుకునే భక్తుల ఆకలిని తీర్చడంతో పాటు వారి సకల అవసరాలనూ తీర్చే తల్లిగా పూజలందుకుంటోంది.
ఆహారం లేదా ధాన్యాన్ని పూర్తిగా లేదా పరిపూర్ణంగా అందిస్తుంది కాబట్టే ఈ శక్తిస్వరూపిణికి అన్నపూర్ణ అనే పేరు వచ్చింది. కాశీ అన్నపూర్ణ మందిరంలో జగన్మాత ఒక చేతిలో పాత్రనూ, మరో చేతిలో గరిటెనూ పట్టుకు కూర్చుని తనని దర్శించుకునే వారి ఆకలిని తీర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రసన్న వదనంతో కలిపిస్తుంది. నిత్యాన్నదానేశ్వరిగా అమ్మవారు ఇక్కడ కొలువుదీరడం వెనుక ఆసక్తికర కథ ఉంది.
లింగ పురాణం ప్రకారం.. ఒకరోజు శివపార్వతుల మధ్య భౌతిక ప్రపంచం గురించి వాగ్వాదం మొదలైంది. మనుషులు తినే ఆహారంతో సహా భౌతికమైనదంతా కేవలం మాయేనని శివుడు అనడంతో పార్వతీదేవి ఆగ్రహించి, ప్రపంచానికి తన ప్రాముఖ్యతను చూపించేందుకు అదృశ్యమైపోయిందట. పార్వతీదేవి అంతర్థానంతో లోకంలో ఆహారం కరువైంది. దేవతలతో పాటు సామాన్యులు అలమటించిపోయారు. అది చూసి కరిగిపోయిన జగన్మాత కాశీకి చేరుకుని అన్నపూర్ణగా అవతరించి అందరి ఆకలినీ తీర్చిందట. అలా ఆహారం ప్రాధాన్యాన్ని గుర్తించిన పరమేశ్వరుడు తన మాటలను వెనక్కి తీసుకుని బిక్ష పాత్రను చేతబట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని స్వీకరించాడని ప్రతీతి. అప్పటి నుంచి పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణగా కొలువుదీరి నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని కథ.
వారణాసికి దేవతగా, వారణాసి రాణిగా పిలిచే అన్నపూర్ణాదేవి ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దంలో మరాఠా మొదటి పేష్వా బాజీరావు నిర్మించాడు. కాశీ విశ్వనాథుడి ఆలయానికి దగ్గరగా ఉండే అన్నపూర్ణ మందిరంలో అమ్మవారి విగ్రహాలు రెండు ఉంటాయి. అమ్మవారి ముందు బిక్ష పాత్రను పట్టుకుని పరమేశ్వరుడినీ చూడవచ్చు. ఇత్తడి విగ్రహాన్ని రోజువారీ దర్శనార్థం అందుబాటులో ఉంచుతారు. బంగారు రూపాన్ని ఏడాదికోసారి దీపావళి మరుసటి రోజున నిర్వహించే అన్నకూట్‍ ఉత్సవం నాడు బయటికి తీస్తారు. ఆ రోజున రకరకాల పదార్థాలను అమ్మవారికి నివేదిస్తారు. ఈ వేడుకను తిలకించేందుకు పెద్దసంఖ్యలో కాశీకి తరలివచ్చే భక్తులకు ఆ ప్రసాదాలను పంచుతారు.
విశ్వనాథుడి నగరంగా పిలిచే కాశీలో ఏ ఒక్క భక్తుడూ పస్తులతో నిద్రపోడని ఓ నమ్మకం. ఇక్కడున్న వారి ఆకలిని తీర్చేందుకే అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్టు ఏర్పాటైంది. ఈ భోజనశాల ఉదయం ఏడున్నర గంటల నుంచి రాత్రి పదిన్నర వరకూ తెరిచే ఉంటుంది. ఉదయం టిఫిన్‍, మధ్యాహ్నం భోజనం, మళ్లీ సాయంత్రం టిఫిన్‍ అందిస్తారిక్కడ. భక్తుల తాకిడిని గమనిస్తూ నిరంతరం వండటంలో నిమగ్నమయ్యే సేవకులు.. ఇక్కడకు వచ్చే వారికి లేదనకుండా కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తారు.
అలాగే, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం కూడా కొన్నేళ్లుగా ఇక్కడకు వచ్చే యాత్రికుల కోసం ఉచిత భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తోంది. ఈ సత్రానికి వచ్చిన భక్తులెవరూ ఖాళీ కడుపుతో తిరిగి వెళ్లరని ప్రతీతి. మరింత మందికి తన అన్నదాన, వసతి సేవలను అందించేందుకు దాతల నుంచి విరాళాలు కోరుతోంది.

కరివెన నిత్యాన్నదాన సత్రం
కాశీ చిరునామా:

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం
డోర్‍ నంబర్‍: బీ-14/52, మానస సరోవరం,
వారణాసి- 221001, ఉత్తరప్రదేశ్‍
ముఖ్యమైన ఫోన్‍ నంబర్లు:
మేనేజర్‍: 83339 07790, హెల్ప్లైన్‍: 83339 07791
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్‍ ఖాతా:
యూనియన్‍ బ్యాంక్‍ ఆఫ్‍ ఇండియా, అకౌంట్‍ నంబర్‍: 062010011004739, ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్‍: యూబీఐఎన్‍ 0806200
సెంట్రల్‍ బ్యాంక్‍ ఆఫ్‍ ఇండియా
అకౌంట్‍ నంబర్‍: 3307473515
ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్‍: సీబీఐఎన్‍0281370
(కాశీ యాత్రకు వచ్చే భక్తులకు కరివెన నిత్యాన్నదాన సత్రం
ఉచిత భోజన సదుపాయం కల్పిస్తోంది. ఇక్కడి
ఈ సత్రంలో 60 వసతి గదులు
అందుబాటులో ఉన్నాయి)

Review కాశీలో అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదం. మోక్షదాయకం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top