అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం సేవలు శ్రీకారం చుట్టుకున్నది శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలోనే! మొదట కర్నూలు జిల్లాలోని ప్రశాంతమైన కరివెన గ్రామంలో ఒకరిద్దరితో మొదలైన అన్నదాన మహత్కార్యం నేడు శాఖోపశాఖలుగా దేశవ్యాప్తంగా విస్తరించడానికి బీజం పడింది ఇక్కడే. నాడు రవాణా సదుపాయాలు లేని రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో భక్తులు అడవి మార్గాన శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకునే వారు. ఆకలిదప్పులతో అలసిసొలసిన భక్తులకు ఇన్ని నీళ్లిచ్చి.. ఇంత కడుపు నింపి.. సత్తువ కోసం ఔషధాలు అందించి కరివెన బ్రాహ్మణులు తమ ఉదారతను చాటుకునే వారు. పరమ శివుని అనుగ్రహంతో ఆ ఉదారత ఊరు దాటి.. పుణ్యక్షేత్రాలకు చేరింది. నేడు దాదాపు పదహారు పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఈ కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదానం భక్తులకు మహా ప్రసాదమై అందుతోంది. శ్రీశైలం కేంద్రంగానే మొదట ఈ సేవలు మొదలయ్యాయి.
శ్రీశైల మల్లికార్జునస్వామి సన్నిధిలో అన్నదానం చేసినా.. నిత్యాన్నదాన యజ్ఞంలో నిమగ్నమై ఉన్న బ్రాహ్మణ కరివెన సత్రానికి అన్నదాన నిమిత్తం విరాళమందించినా వెయ్యి ఏనుగులు, కోటి గోవులు, బంగారం, సముద్రం వరకు భూమిని దానం చేసిన దానితో సమానమైన ఫలితాన్ని పొందుతారని పండిత ఉవాచ. ఇక్కడ చేసే అన్నదానం మరణాంతరం మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. మరి ఆ మోక్షాన్ని పొందే ముందు ఆ శ్రీశైల, భ్రమరాంబల దర్శనం చేసుకుందాం..
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో, అష్టాదశ శక్తిపీఠాల్లో, దశ భాస్కర క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైల దర్శనాన్ని సకల పాపహరణంగా భావిస్తారు భక్తులు. అందుకే కార్తీక• మాసంలోనే కాదు.. ఏడాది పొడవునా భక్తులతో కళకళలాడుతుంటుందీ పవిత్రధామం.
మైనాకం మంధరం మేరుం
శ్రీశైలం గంధమాదనమ్
పంచశైలా పఠేన్నిత్యం
మహాపాతక నాశనమ్
మైనాక, మంధర, మేరు, శ్రీశైలం, గంధమాదనం అనే ఐదు మహిమాన్వితమైన పర్వతాల్లో శ్రీశైలం ఒకటి అని పై శ్లోకానికి అర్థం.
శైలద మహర్షి కుమారుడైన పర్వతుడు తన తపస్సుతో శివుడిని మెప్పించి, ఆయన తన మీదే కొలువై ఉండాలనీ, సకల తీర్థాలూ శాశ్వతంగా అక్కడే నిలిచి ఉండేలా వరం పొందాడనీ, అందుకే ఇది శ్రీశైలంగా ప్రాచుర్యం పొందిందనేది పురాణ కథనం.
శ్రీశైల ప్రస్థావన రామాయణ, మహాభారత, భాగవతాల్లోనూ ఉంది. సీతారాములిద్దరూ వేర్వేరుగా సహస్ర లింగాలను ప్రతిష్ఠించిన క్షేత్రమిది. నర రూపంలో వచ్చిన రాముడు లింగ ప్రతిష్ఠ ఎంత గొప్పదో తెలియచెప్పడానికే అలా చేశాడట.
తెలుగు రాష్ట్రాల్లో ఏకైక జ్యోతిర్లింగ క్షేత్రం..
తెలుగు రాష్ట్రాల్లోని ఏకైక జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలమే. మన దేశంలో మూడు క్షేత్రాల్లో మాత్రమే జ్యోతిర్లింగమూ, శక్తిపీఠమూ కలిసి ఉన్నాయి. అందులో మొదటిది- కాశీ, రెండోది- ఉజ్జయిని, మూడోది- శ్రీశైలం. కేదార క్షేత్రంలో నీటిని తాగినా, కాశీలో మరణించినా, శ్రీశైల శిఖరాన్ని దర్శించినా పునర్జన్మ ఉండదని పురాణ ప్రవచనం.
శ్రీశైల మహాక్షేత్రం భూమండలానికి నాభి స్థానమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రపంచంలో ఏ ప్రాంతంలో పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా ‘శ్రీశైల ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్యే ఉత్తర దిగ్భాగే’ అంటూ శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నదీ సంకల్పంలో చెప్పుకుంటారు.
పూర్వం రోడ్డు సౌకర్యం లేకున్నా కాలినడకనే శ్రీశైలానికి చేరుకుని, శిఖరేశ్వరం అనే కొండ ఎక్కి, దూరంగా కనిపించే శ్రీశైల శిఖరాన్ని చూసే వారట. అది కనిపిస్తే పునర్జన్మ నుంచి విముక్తులయినట్టేనని భావించేవారు. శ్రీరామచంద్రుడు కూడా అక్కడ నుంచే శిఖరాన్ని దర్శించుకున్నాడని చెబుతారు.
వేల సంవత్సరాల నాటి శ్రీశైల మల్లికార్జునుడు శాతవాహనుల కాలం నుంచీ పూజలు అందుకుంటున్నాడనీ, అయితే కాకతీయులు, విజయనగర చక్రవర్తులు ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో కృషి చేశారని శాసనాల ద్వారా తెలుస్తోంది.
నల్లమల అడవుల్లో.. పర్వతాల మధ్య..
ఆంధప్రదేశ్‌లోని పూర్వ కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని నల్లమల అడవుల్లోని పర్వతశ్రేణుల మధ్యలో పాతాళగంగ పేరుతో ఉత్తరముఖంగా ప్రవహించే కృష్ణానదికి కుడివైపున ఉందీ క్షేత్రం.
ఎనిమిది శృంగాలూ, నలభై నాలుగు నదులూ, అరవై కోట్ల తీర్థాలతోనూ పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవనాలతోనూ, చంద్రగుండం, సూర్యగుండం మొదలైన పుష్కరిణులతోనూ అనంతమైన ఓషధీ మొక్కలతోనూ ఈ క్షేత్రం అలరారుతుంటుంది. ఈ మహా క్షేత్రానికి తూర్పున త్రిపురాంతకం, పశ్చిమాన అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, దక్షిణంలో సిద్ధవటం అనే నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.
మొదట కుమారుడు.. తరువాతే అయ్య దర్శనం..
చుట్టూ ఎత్తయిన ప్రాకార గోడలతో విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది మల్లికార్జునుడు కొలువైన ప్రధానాలయం. ఇక్కడి జ్యోతిర్లింగం చాలా చిన్నది. స్వామికి కుడివైపున ఉన్న రత్నగర్భ గణపతిని సేవించుకున్నాకే ఆ మల్లికార్జున లింగాన్ని దర్శించుకోవాలని చెబుతారు. దేశంలో మరెక్కడా ఇలాంటి గణపతి కనిపించడు. ఉత్సవ సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ లింగాన్ని చేతులతో స్ప•శించి, తలను కూడా తాకించి నమస్కారం చేసుకోవచ్చు. స్వామిని దర్శించుకున్నాక లింగానికి ఎడమ వైపున ఉన్న భద్రకాళీ సమేత వీరభద్రస్వామికి నమస్కరించుకుని బయటకు వస్తారు.
ఇక్కడి భ్రమరాంబికా దేవి ఆలయంలో అమ్మవారు అష్టభుజాలతో ఆయుధాలు ధరించి, మహిషంపై కాలుంచి నిలుచుని ఉంటారు. కానీ పూజారులు చేసే అలంకరణల వల్ల కూర్చున్నట్టుగానూ, రెండు చేతులే ఉన్నట్టు కనిపిస్తుంది. అమ్మవారి గర్భాలయం వెనక భాగంలోని గోడకు చెవి ఆనించి వింటే ఝుమ్మనే భ్రమరనాదం వినిపిస్తుందట. ఒకప్పుడు ఆ కొండ ప్రాంతాన్ని పాలించిన అరుణాసురుడనే రాక్షసుడిని అమ్మవారు భ్రమర (తుమ్మెద) రూపంలో వధించి, భ్రమరాంబికగా వెలిసిందనీ, అందుకే ఆ ఝుంకారం వినిపిస్తుందని అంటారు. దక్ష యజ్ఞంలో మరణించిన సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశం కావడంతో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగానూ ఇది పేరొందింది.
శ్రీశైల క్షేత్రం శిల్పకళ ఉట్టిపడుతూ ఎంతో అందంగా ఉంటుంది. ఈ ఆలయం దగ్గరే సీతాదేవి ప్రతిష్ఠించిన సహస్రలింగం కనిపిస్తుంది.
అణువణువూ పుణ్యధామమే..
శ్రీశైలంలో ఉన్నన్ని ఆలయాలూ ఉపాలయాలూ మరే క్షేత్రంలోనూ కనిపించవు. సాక్షి గణపతి, హటకేశ్వరస్వామి, శ్రీశైల శిఖరం, పాలధార, పంచధార.. ఇలా అక్కడ అణువణువూ పుణ్యధామమే. మల్లికార్జునస్వామి గర్భాలయానికి ఆనుకుని బ్రహ్మగుండం, సప్తమాతృకలకి ఆనుకుని విష్ణుగుండం ఉంటాయి. ప్రధాన దేవాలయం వెనక భాగంలో పాండవుల పేర్ల మీద శివలింగాలు ప్రతిష్ఠించిన ఐదు దేవాలయాలు ఉంటాయి. మరోపక్క ముడతలు పడిన ముఖంగా ఉన్న వృద్ధ మల్లికార్జున లింగం ఉంటుంది.
శ్రీశైల దర్శనానికి సాక్షి.. గణపతి
మల్లికార్జునుడి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. శ్రీశైలాన్ని దర్శించినట్టు సాక్ష్యం చెప్పేది ఈ గణపతే అనేది ఓ నమ్మకం. ఆ కారణంతోనే ఆయనను ‘సాక్షి గణపతి’ అని పిలుస్తారు.
శ్రీశైల ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హటకేశ్వరస్వామి ఆలయం. ఇక్కడ స్వామి అటిక (ఉట్టి)లో వెలిశాడట. అందుకే ఆ పేరొచ్చింది.
దీనికి సమీపంలోని లోయలోనే ఆదిశంకరాచార్యుల వారు శివానందలహరి రచించారట. అక్కడి కొండ పగుళ్ల నుంచి పాలధార, పంచధారలు వస్తుంటాయి. పాలధార శివుడి ఫాల భాగం నుంచి వచ్చిందనీ, పంచధార పరమేశ్వరుడి అయిదు ముఖాల నుంచి ఉద్భవించిన ధార అనీ చెబుతారు. పాలధార తెల్లగానూ, పంచధార తియ్యగానూ ఉంటాయి. ఈ నీరు కొంత దూరం ప్రవహించి భోగవతి పేరుతో పాతాళగంగలో కలుస్తుందట.
విజయవాడకు 270 కిలోమీటర్లు, హైదరాబాద్‌కు సుమారు 232 కిలోమీటర్ల దూరంలో ఉందీ మహిమాన్విత శ్రీశైల క్షేత్రం.
కరివెన నిత్యాన్నదాన సత్రం
శ్రీశైలం చిరునామా:
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన
నిత్యాన్నదాన సత్రం, నంది సర్కిల్ వద్ద, పాతాళగంగ రోడ్డు, శ్రీశైలం, కర్నూలు జిల్లా, ఆంధప్రదేశ్- 518101
ముఖ్యమైన ఫోన్ నంబర్లు:
మేనేజర్: 83339 07784
హెల్ప్‌లైన్: 83339 0779187
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్ ఖాతా:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అకౌంట్ నంబర్: 52140654832
ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0020919
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అకౌంట్ నంబర్: 051510011000909
ఐఎఫ్ఎస్సీ కోడ్: యూబీఐఎన్0805157
(శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు కరివెన నిత్యాన్నదాన సత్రం భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తోంది. ఇక్కడి ఈ సత్రంలో 120 వసతి గదులు అందుబాటులో ఉన్నాయి)
























































































































































































































































































































































































































Review అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం సేవలు శ్రీకారం చుట్టుకున్నది శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలోనే!.