యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం వారి నిత్యాన్నదాన కేంద్రం అందుబాటులో ఉంది. త్వరలో ఇక్కడ భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన భవనం నిర్మాణం కోసం స్థల సేకరణ జరుగుతోంది. ప్రస్తుతానికి నిరతాన్నదానం నిర్విఘ్నంగా సాగుతోంది. ఇక్కడకు నిత్యం ఎంతమంది భక్తులు వచ్చినా ఉచితంగా భోజన సదుపాయం కల్పించడానికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భోజనశాలను కరివెన సత్రం నిర్వహిస్తోంది.
అన్నదానమనే పవిత్ర కార్యాన్ని కరివెన నిత్యాన్నదాన సత్రం దాదాపు వందేళ్లుగా నిస్వార్థంగా కొనసాగిస్తోంది.
‘ఒక్కో మెతుకు ఒక్కో బతుకును కోరుతుంది’ అని ప్రతీతి. అంటే అన్నం ప్రాణాన్ని నిలుపుతుంది. అన్నదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే. ఒకరికి జీవితాన్నివ్వడమే. ఇలా అనేకానేక జీవితాలను, ప్రాణాలను నిలుపుతూ నిరంతర యజ్ఞంలా యాదగిరిగుట్టలో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది కరివెన సత్రం. ఇక్కడ 2021లో కరివెన నిత్యాన్నదాన సత్రం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే ఏ ఒక్క భక్తుడు ఆకలితో తిరిగి వెళ్లకూడదనే సంకల్పంతో ఈ సత్రాన్ని నిర్వహిస్తున్నారు.
యాదగిరిగుట్టలో అన్నదానం చేయడం వల్ల లేదా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే కరివెన సత్రం వంటి సంస్థలకు విరాళాలు అందించినా
శ్రీలక్ష్మీనృసింహుని కృపాకటాక్షాలు సమృద్ధిగా లభిస్తాయి. జ్ఞానం, శ్రేయస్సు, సంపదలు, కీర్తిప్రతిష్టలు లభిస్తాయి.

పరమభ్తుడూ, పసివాడూ అయిన ప్రహ్లాదుడిని కాపాడటానికి ఉగ్రనారసింహ అవతారమెత్తిన స్వామి.. మరో భక్తుడి కోరిక మేరకు ప్రసన్న రూపంతో లక్ష్మీసమేతంగా కొలువుదీరిన క్షేత్రమే యాదగిరిగుట్ట. తెలంగాణ తిరుపతిగా ప్రాశస్త్యం పొందిన ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్టపై వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి ప్రశస్తికి సంబంధించి పురాణాల్లో ఎన్నో ఐతిహ్యాలున్నాయి. రామాయణ, మహభారతాల్లోనూ ఆ ప్రస్తావనలున్నాయి.
పంచ నారసింహ క్షేత్రం
మహా జ్ఞాని విబాంఢకుడి కొడుకు రుష్యశృంగుడు. ఆయన పుత్రుడు యాద రుషి. ఈయన చిన్నప్పటి నుంచీ విష్ణు భక్తుడు. అందులోనూ నృసింహ అవతారం పట్ల ఎనలేని మక్కువతో ఉండేవాడు. ఆ స్వామి సాక్షాత్కారం పొందేందుకు దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతి వారికి చిక్కాడు. వాళ్లు యాదుడిని క్షుద్రదేవతకు బలివ్వబోయారు. అప్పుడు రామబంటుగా హనుమంతుడు ప్రత్యక్షమై యాదర్షిని రక్షించి, కీకారణ్యంలో సింహాకార గుట్టలున్నాయని, అక్కడికెళ్లి సాధన చేస్తే స్వామి సాక్షాత్కరిస్తాడని చెప్పాడు. యాదర్షి దీర్ఘకాల తపస్సు ఫలించి నృసింహ స్వామి ప్రత్యక్షమయ్యాడట. అయితే ఆ ఉగ్ర నరసింహ రూపాన్ని దర్శించలేకపోయాడు యాదర్షి. శాంత స్వరూపంలో దర్శనమివ్వాలని యాదర్షి కోరగా, అతడి ప్రార్థన మేరకు స్వామి శాంత స్వరూపంలో శ్రీలక్ష్మీ సమేత నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. అనంతరం యాద రుషి స్వామిని వేర్వేరు రూపాల్లో చూడాలని ఉందని వరం కోరుకున్నాడు. దాంతో జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్రసింహ, శ్రీలక్ష్మీనృసింహ స్వామిగా ప్రత్యక్షమయ్యాడు మహా విష్ణువు. అందుకే, ఈ ఆలయాన్ని పంచ నారసింహ క్షేత్రంగా పిలుస్తారు.
క్షేత్రం చుట్టూ సుదర్శన రక్షా కవచం
యాదరుషి కోరిక ఫలితంగా వెలసింది కాబట్టి ఈ ప్రాంతం యాదగిరిగుట్టగానూ ప్రసిద్ధి పొందింది. యాదర్షి కోరిక మీదట ఆంజనేయస్వామి యాదగిరిగుట్టకు క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. ఒకసారి ఓ రాక్షసుడు తపోముద్రలో ఉన్న యాద మహర్షిని మింగేయాలని ప్రయత్నించడంతో విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పంపి ఆ దైత్యుడిని అంతమొందించాడట. ఇప్పటికీ గుట్ట చుట్టూ సుదర్శనం రక్షా కవచంలా నిలిచి ఉంటుందనేది ఓ విశ్వాసం.
ప్రాచీన క్షేత్రం
ఎంతో పురాతనమైన యాదగిరీశుడిని 1148వ సంవత్సరంలో పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్లుడు, అనంతరం శ్రీకృష్ణదేవరాయలూ దర్శించుకున్నట్టు శాసనాలున్నాయి. అయితే, చాలాకాలం పాటు మరుగున పడిపోయిన క్షేత్ర మహత్యాన్ని స్థానిక గ్రామాధికారి గుర్తించాడు. స్వామి అతడికి కలలో కనిపించి తన అవతార రహస్యాన్ని చెప్పాడట. హైదరాబాద్‍ వాస్తవ్యుడు రాజా మోతీలాల్‍ ఆలయాన్ని నిర్మించి పూజాధికాలు పునరుద్ధరించాడని చరిత్ర చెబుతోంది.
మరో అన్నవరం..
యాదాద్రిలో గుట్ట మీదే కాకుండా కింద కూడా మరో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. నిజానికి స్వామి వారు ముందు ఈ పాత ఆలయంలోనే వెలశాడనీ, తరువాత కొత్త నరసింహ స్వామి వారి ఆలయానికి గుర్రం మీద వెళ్లే వారనేది మరో కథనం. కింది ఆలయం నుంచి పై ఆలయం వరకూ మెట్ల మీద ఇప్పటికీ కనిపించే గుర్రపు పాదముద్రలు అవేనని అంటారు. ఇక, మహిమాన్వితమైన యాదాద్రిలో నిత్యం శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు జరగడం వల్ల ఈ క్షేత్రం మరో అన్నవరంగా విలసిల్లుతోంది.
బ్రహ్మోత్సవ వైభవం
యాదాద్రి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవ సంప్రదాయాన్ని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే స్వహస్తాలతో ప్రారంభించాడని చెబుతారు. అందుకే వీటికి బ్రహ్మోత్సవాలనే పేరొచ్చింది. ఉత్సవాలు జరిగిన పదకొండు రోజులూ యాదగిరి ముక్కోటి దేవతల విడిదిల్లుగా మారుతుంది. ఆ సందర్భంగా సకల దేవతలనూ శాస్త్రోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం సంప్రదాయం. దానివల్ల క్షేత్ర మహత్యం రెట్టింపు అవుతుందట. యాదగిరిగుట్టలోని విష్ణు పుష్కరిణి సాక్షాత్తూ బ్రహ్మ కడిగిన పాదాల నుంచే ఉద్భవించిందని అంటారు. అనారోగ్యం, ఇతర గృహ సమస్యలు ఉన్న వారు ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తే బాధల నుంచి విముక్తులవుతారనేది భక్తుల నమ్మకం. గుట్ట మీది ఆలయానికి మెట్ల మార్గంలో వెళ్లేటపుడు దారిలో శివాలయం కనిపిస్తుంది. ఇక్కడి శివుడు నరసింహస్వామి కన్నా ముందే స్వయంభూగా వెలిశాడట. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారికి కీళ్లనొప్పులు తగ్గుతాయనేది మరో విశ్వాసం.
తెలంగాణ తిరుపతి..
ఎంతో మహిమాన్వితమైన యాదగిరిగుట్టను తెలంగాణ తిరుపతిగా, మహా దివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు. దాదాపు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనాలూ, పార్కులూ, కాటేజీలూ, కల్యాణ మండపాలనూ నిర్మించి ఈ క్షేత్రాన్ని దివ్యధామంగా రూపుదిద్దారు. గతంలో అర ఎకరం స్థలంలో ఉన్న ప్రధాన ఆలయాన్ని ఇప్పుడు 2.33 ఎకరాల విస్తీర్ణానికి విస్తరించారు.
హైదరాబాద్‍ ప్రధాన బస్టాండ్ల నుంచి ప్రతి అరగంటకూ యాదాద్రికి బస్సులున్నాయి.

కరివెన నిత్యాన్నదాన సత్రం
యాదగిరిగుట్టచిరునామా:

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం
ఇంటి నంబర్‍: 2-128/5
హెచ్‍పీ పెట్రోల్‍ బంకు ఎదురుగా,
యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ- 508115
ముఖ్యమైన ఫోన్‍ నంబర్లు:
మేనేజర్‍: 83339 07815
హెల్ప్లైన్‍: 83339 07813
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్‍ ఖాతా:
ఇండియన్‍ బ్యాంక్‍
అకౌంట్‍ నంబర్‍: 7081466078
ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్‍: ఐడీఐబీఓ00వై011
(యాదగిరిగుట్టలోని కరివెన నిత్యాన్నదాన సత్రంలో ప్రస్తుతం వసతి సౌకర్యం అందుబాటులో లేదు. భవన నిర్మాణం కోసం స్థల సేకరణ జరుగుతోంది. ఈ మహత్కార్యంలో పాలుపంచుకోవాలనే దాతలు నేరుగా విరాళాలు అందించవచ్చు. భక్తులకు భోజన సౌకర్యం మాత్రమే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు)

Review యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top