కరివెన నిత్యాన్నదాన సత్రం

పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిత్యం తనకున్న దాంట్లో అన్నదానం చేసేవాడు. ఆయన తాను రోజూ అన్నదానం చేస్తున్నాను కదా.. దాని మహిమ ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడట. కాశీకి వెళ్తే దానికి సరైన సమాధానం దొరుకుతుందని పండితులు చెప్పారు. దాంతో ఆ బ్రాహ్మణుడు కాశీకి పయనమయ్యాడు. రవాణా సౌకర్యం లేని రోజులు కదా.. కాలినడకన ఆయన వెళ్తుండగా అడవి మధ్యలోకి వచ్చే సరికి చీకటి పడింది. ఆయనకు ఒక బోయవాడు తారసపడ్డాడు. అతడు బ్రాహ్మణుడికి బస ఏర్పాటు చేశాడు. చారపప్పు, తేనెతో అతిథికి విందు చేశాడు. ఆ రాత్రి విశ్రమించడానికి మంచె ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణుడు మంచెపై హాయిగా నిద్రించగా, బోయవాడు మంచె కింద తిరుగుతూ వన్యమృగాలు రాకుండా కాపలా కాచాడు. ఇంక తెల్లవారబోతోందనగా, వన్యమృగాలు వచ్చే అవకాశం లేదని భావించి బోయవాడు కునుకు తీశాడు. అప్పుడే అటుగా ఒక చిరుతపులి వచ్చి ఆ బోయవాడిని చంపి తినేసింది. బ్రాహ్మణుడు నిద్ర లేచి చూస్తే బోయవాడు మరణించి ఉన్నాడు. తనకింత అతిథి మర్యాదలు చేసిన మనిషి అలా చనిపోవడంతో అతని మనసు కకావికలమైంది. చేసేదేమీ లేక అక్కడి నుంచి మళ్లీ కాశీకి పయనమయ్యాడు. కాశీ విశాలాక్షిని దర్శించుకున్నాడు. అన్నదాన మహిమేమిటో తెలపాలని అమ్మవారిని మనసులోనే వేడుకున్నాడు.

అమ్మవారు ప్రత్యక్షమై ‘అన్నదాన మహిమ గురించి తెలుసుకోవా లంటే కాశీ క్షేత్రాన్ని పాలిస్తున్న రాజుగారి కోటకు వెళ్లు. రాణి గారు ప్రసవ వేదనతో ఉన్నారు. ఆమె ప్రసవించిన తరువాత ఆ పుట్టిన బిడ్డ అన్నదాన మహిమ గురించి చెబుతాడు’ అని చెప్పారు. అప్పుడా బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో రాణి గారి అంత:పురానికి వెళ్లాడు. ఆ సమయంలో రాణి పండంటి మగబిడ్డను ప్రసవించింది. బ్రాహ్మణుడు ఆ శిశువు వద్దకు వెళ్లి, అన్నదాన మహిమ గురించి అడిగాడు. ‘మీకు చారపప్పు, తేనె ఇచ్చినందుకు, రాత్రికి విశ్రమించేందుకు మంచె ఏర్పాటు చేసినందుకు పుణ్యం లభించి రాజు గారి బిడ్డగా జన్మించాను. మీరు నిత్యం అన్నదానం చేస్తున్నారు. ఇక మీకెంతటి భాగ్యం కలుగుతుందో చూడండి’ అన్నాడు ఆ శిశువు. అంటే బోయవాడే బ్రాహ్మణుడికి చేసిన అతిథి మర్యాదల ఫుణ్యఫలంగా రాజు కుమారుడిగా పుట్టాడన్న మాట. అన్నదానం చేసిన వారికైనా, అన్నదానం చేసే కరివెన నిత్యాన్నదాన సత్రం వంటి సంస్థలకు విరాళాలు, వస్తుసామగ్రి రూపేణా సాయం చేసిన వారికైనా ఇలాంటి పుణ్యమే లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహానందిలో కపిల గోవు శివుడి ఆకలి తీర్చిందట. మరి మీరు భక్తుల ఆకలి తీరుస్తారా?

పరమేశ్వరుడు సాక్షాత్తూ ఆవు రూపంలో వెలసిన మహా క్షేత్రం మహానంది. నల్లమల పర్వతాల అడవుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడు స్వయంభువుగా గోవు (ఆవు) ఆపద ముద్ర రూపంలో వెలిశాడు. ఇక్కడి శివలింగం కింద నుంచి ఏడాది పొడవునా ఒకేస్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాల్లేకుండా తేటగా.. సూది సైతం స్పష్టంగా కనబడే స్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం.
స్థల పురాణం
పూర్వీకులు తెలిపిన కథానుసారం.. ఒక రుషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షుడై ఎల్లప్పుడూ తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ మేరకు ఆయనను అంతా శిలాదుడని (శిలాద మహర్షి) పిలిచే వారు. భార్య తమకు దైవప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా, ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని గురించి అత్యంత నిష్టతో తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతడి భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతడి చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై కావాల్సిన వరాలు కోరుకొమ్మన్నాడు. దేవాధిదేవుడిని చూసిన పారవశ్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరికను మరిచిపోయాడు.
‘మహాదేవా! నీ దర్శన భాగ్యం లభించింది. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి? నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రీ’ అని వేడుకున్నాడు. అయితే దయాళువైన పరమశివుడు మహర్షి మరిచిన భార్య ఆకాంక్షనూ గుర్తుంచుకుని, మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్లిపోయాడు. ఆ మేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది. మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు అంటూ ఆ బాలుడిని ఆమెకు అప్పగించాడు. వారు ఆ బిడ్డకు ‘మహానందుడు’ అని పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుడి గురించి తపస్సు చేశాడు. అతని కఠోరదీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై, ‘వత్సా! వరం కోరుకో’ అనగా, మహానందుడు ‘దేవాధిదేవా! నన్ను నీ వాహనంగా చేసుకో’ అని కోరాడు. అలాగే అని వరమిచ్చిన శివుడు, ‘మహానందా! నువ్వు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ధార కొలనుగా మారి అహర్నిశలూ ప్రవహిస్తూ, సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ వున్న ప్రదేశమంతా మహానందిగా ప్రఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది – నేను ఇక్కడి నవనందుల్లో లింగరూపుడిగా ఉంటాను’ అని వరం అనుగ్రహించాడు.
శివుడి ఆకలి తీర్చిన కపిల గోవు
చరిత్ర ప్రకారం చూస్తే మరో కథ ప్రచారంలో ఉంది. పూర్వం నందుడు అనే రాజు పాలనలో గోపితవరం (నేటి గోపవరం) గ్రామంలో ఓ గొల్లవాడికి పెద్ద ఆవుల మంద ఉండేది. అందులోని కపిల అనే విశిష్టమైన ఆవు ఈ నల్లమల అడవిలో పచ్చిగడ్డి మేస్తూ ఇక్కడ పుట్టలో ఉన్న శివుడిని గుర్తించి, రోజూ పాలు ఇస్తూ ఆయన ఆకలి తీర్చేది. గోమాత రోజూ అడవిలోని ఒక పుట్టలో పాలు విడుస్తోందన్న విషయం నంద మహారాజుకు గూఢచారుల ద్వారా తెలిసి.. ఆయన ఆ వింతను కళ్లారా చూడాలని అక్కడకు వస్తాడు. కపిల గోవు పొదల్లోకి వెళ్లి పుట్ట వద్ద నిలిచి పాలధారను స్రవిస్తుండగా చూసి, రాజు మరింత స్పష్టంగా ఈ దృశ్యాన్ని చూసేందుకని ముందుకు కదలగా, ఆ అలికిడికి బెదిరిన ఆవు కుడిపాదంతో పుట్టను తొక్కేస్తుంది. ఆపై పుట్టలోని బాలరూప శివుడు.. ఆ గోమాత కూడా మాయమైపోగా, రాజు ఎందుకలా అయిందో అర్థంగాక అయోమయంగా తిరిగి తన నగరానికి చేరుకుంటాడు. ఆ రాత్రి అతడికి పరమశివుడు కలలో కనిపించి, ‘నువ్వు చూసిన పుట్ట నుంచి పాలు తాగింది నేనే. అక్కడ దేవాలయాన్ని నిర్మించు. నేనక్కడ లింగరూపినై కొలువుంటా. నీ కీర్తి శాశ్వతం అవుతుంది’ అని చెప్పాడు. ఆ మేరకు నందరాజు అక్కడ ఆలయాన్ని నిర్మించాడు. దీన్ని రససిద్ధుడు అనే దేవలోక శిల్పి రూపొందించినట్టుగా పురాణగాథ. అన్నిచోట్లా పానవట్టంపై శివలింగం ఉంటుంది. కానీ, ఇక్కడ పానవట్టమే శివలింగానికి అమర్చి నట్టుగా కనిపించడం మహానంది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
రాజుల ఈశ్వరసేవ
నందరాజు ఈ ప్రాంతాలను (నందవరం, నంద్యాల, నందికొట్కూరు, మహానంది) పాలించాడు. క్రీస్తు పూర్వం 323లో మౌర్య చంద్రగుప్తుడు వీరిని ఓడించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. పాండవ వంశీయుడైన ఉత్తుంగ భోజుని కుమారుడైన నందన చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఇతడే కథాకాలం నాటి నంద మహారాజు. వెలనాటి చోళుల్లో విక్రమభోజుడు క్రీస్తు శకం 1118 నుంచి 1135 వరకు మహేంద్రగిరి (గంజాం) – శ్రీశైలం మధ్య గల పర్వత ప్రాంతాలన్నింటినీ పరిపాలించాడు. అతడు కూడా ఈ క్షేత్రానికి వచ్చి పరమశివుడిని పూజించి ఆలయ గోపురాలు, కొన్ని కట్టడాలు, మండపాలు నిర్మించి క్షేత్రాభివృద్ధికి దోహదం చేశాడు. ఆ తరువాత విజయనగర రాజులు సైతం కొన్ని కట్టడాలు, భక్తులకు వసతులు, రహదారులను ఏర్పాటు చేసి శివుడిని ఆరాధించారు. ఈ క్షేత్రానికి కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల భక్తులు వస్తుంటారు.
నీటి కొలనుల మహత్యం
మహానందిలో బ్రహ్మగుండం, రుద్రగుండం, విష్ణుగుండం ఉన్నాయి. ఇందులో రుద్రగుండం నుంచి రెండు ధారలు బయటకు ప్రవహిస్తుం టాయి. ఈ నీటి ద్వారా పరిసర ప్రాంతాల్లోని సుమారు రెండు వేల ఎకరాల్లో అరటి తోటలు సాగవుతున్నాయి. రుద్రగుండంలో పంచలింగాల మండపం ఉంది. ఇందులో పృథ్వీ (భూ) లింగం, జలలింగం, తేజో (అగ్ని) లింగం, వాయులింగం, ఆకాశలింగం ప్రతిష్ఠించారు. రుద్రగుండం పుష్కరిణిలో ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, మళ్లీ సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పుణ్యస్నానాలకు అనుమతి ఉంటుంది. వీటి మధ్యకాలంలో బయట ఉన్న రెండు చిన్న కోనేర్లలో నిరంతరం పుణ్యస్నానాలు చేయవచ్చు.
నవనందులు
నంద్యాల పట్టణంలో ప్రమధ నంది, ఆంజనేయ స్వామి ఆలయంలో అంతర్భాగంగా నాగనంది, సోమనంది ఉన్నాయి. అలాగే బండి ఆత్మకూరు మండలం పరిధి సోమయాజులపల్లె సమీపంలో శివనంది, నల్లమల అడవిలో కృష్ణ నంది (విష్ణు నంది), మహానంది క్షేత్రం ఆవరణలో మహా నందితో పాటు వినాయక నంది, గరుడనంది, సుమారు పది కిలోమీటర్ల దూరంలోని తమడపల్లెకి రెండు కిలోమీటర్ల దూరంలో సూర్యనంది క్షేత్రం ఉన్నాయి. ఈ నందులన్నింటినీ ఒకేరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.
ఈ పండుగలు ఇక్కడ ప్రత్యేకం
మహా శివరాత్రి, ఉగాది, దసరా, సంక్రాంతి పండుగలకు ఇక్కడ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ పండుగలు ఇక్కడ విశేషంగా జరుగుతాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు జరుగుతాయి. ఈ సమయాల్లో రుద్ర గుండం పుష్కరిణిలో పుణ్య స్నానాలకు అనుమతించరు.
ప్రధాన విగ్రహానికి కాక వినా యక నందీశ్వరాలయంలో ఉన్న శివలింగానికి భక్తులతో అభిషేకాలు చేయిస్తారు.
ఉగాది పర్వదినోత్సవం సందర్భంగా రాత్రి నుంచే శ్రీశైలం నుంచి మరునాడు ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చే వేలాది మంది భక్తులకు నిరంతర దర్శనాలను కర్ణాటక, మహారాష్ట్ర భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఏర్పాట్లు చేపడుతుంది.
దసరా, దేవీశరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని పది రోజుల పాటు దాతల సహాయంతో ప్రత్యేక హోమాలు, పూజలు చేయించడానికి ప్రతి జంట నుంచి రూ.10,116 వసూలు చేస్తారు.
దర్శన వేళలు
మహానందిలో దర్శనవేళలు ప్రతి రోజూ వేకువజామున ఆలయశుద్ధి, 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు బిందెసేవ, 5.30 గంటల నుంచి సుప్రభాత సేవ, 6 గంటల నుంచి 6.30 గంటల వరకు అష్టవిధ మహా మంగళ హారతుల పూజలు (ఈ సమయంలోనే భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనం) ఉంటాయి. ఇదే రీతిలో సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు పైవిధంగా తెలిపినట్టుగా అష్టవిధ మహా మంగళహారతులు, నిజరూప దర్శనం ఉంటుంది. అంతేకాక భక్తులకు ప్రతిరోజూ ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దైవదర్శనం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో మాత్రం కేవలం 15 నిమిషాలు నివేదన సమయంలో దర్శనం నిలుపుచేస్తారు. ఆ తరువాత మళ్లీ దర్శనాలకు అనుమతిస్తారు.

కరివెన నిత్యాన్నదాన సత్రం
మహానంది చిరునామా:

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం
పోలీస్‍స్టేషన్‍ సమీపంలో, మహానంది,
కర్నూలు జిల్లా, ఆంధప్రదేశ్‍- 518502
ముఖ్యమైన ఫోన్‍ నంబర్లు:
మేనేజర్‍: 83339 07803
హెల్ప్లైన్‍: 83339 07802
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్‍ ఖాతా:
యూనియన్‍ బ్యాంక్‍ ఆఫ్‍ ఇండియా:
అకౌంట్‍ నంబర్‍: 221310100013108
ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్‍: యూబీఐఎన్‍0822132
(ఇక్కడి కరివెన నిత్యాన్నదాన సత్రంలో భోజన వసతి అందుబాటులో ఉంది. అలాగే సత్రం తరపున నిర్వహిస్తున్న భవనంలో ఇరవై రెండు (22) వసతి గదులు అందుబాటులో ఉన్నాయి. తన సేవల విస్తరణకు కరివెన నిత్యాన్నదాన సత్రం దాతల నుంచి విరాళాలను కోరుతోంది. వివరాలకు
పై ఫోన్‍ నంబర్లలో సంప్రదించవచ్చు)

Review కరివెన నిత్యాన్నదాన సత్రం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top