కరివెన నిత్యాన్నదాన సత్రం షిర్డీ

సాయిబాబా షిర్డీలో జీవించినంత కాలం అన్నదానం చేస్తూనే ఉన్నారు. తానే స్వయంగా పెద్ద గుండిగల్లో అన్నం వండి అందరికీ వడ్డించే వారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానిని నువ్వు తిని, మరో నలుగురికి పెట్టడం కంటే పుణ్యం లేదని బాబా భక్తులకు బోధించే వారు. స్వయంగా వండి, దానిని గొప్ప ప్రేమతో, ఆదరంతో పెట్టాలని చెప్పే వారు. ఒంటరిగా కూర్చుని అన్నం తినరాదని, పక్కన మరో వ్యక్తిని, కనీసం పశుపక్ష్యాదులనైనా అతిథులుగా భావించి వాటికి కూడా కాస్త పెట్టిన తరువాత తాను తినాలని బాబా బోధించే వారు. అప్పటికీ ఎవరూ వెంట లేకపోతే తనను స్మరించుకుని రెండు మెతుకులు అర్పించి అనంతరం తినాలని అన్నారు.
బాబా రోజూ నిద్రలేచి, ముఖం కడుక్కుని ధునిలో కట్టెలు వేసి, భుజానికి జోలె, చేతిలో బిక్షాపాత్ర పట్టుకుని షిర్డీలోని ఐదిళ్లకు బిక్షకు వెళ్లేవారు. మధ్యాహ్నం మరోసారి వెళ్లేవారు. బిక్షలో దొరికిన పదార్థాలను మస్జీదులో రెండు పెద్ద పాత్రల్లో వేసేవారు. వాటిలోని ఆహార పదార్థాలను భక్తులు ఎవరికి కావాల్సింది వారు తీసుకునిపోయేవారు. రెండో పాత్రలోని పదార్థాలను పిల్లులూ, కాకులూ తినేవి. ఎవరు ఎంత తీసుకున్నా, తిన్నా బాబా
ఏమీ అనేవారు కాదు. తన కోసం భక్తులు రకరకాల ఆహార పదార్థాలు తెచ్చినా.. బాబా తన దేహాన్ని వీడే వరకు బిక్షాటన మానలేదు. ఎందుకంటే అన్నదాన ఫలితాన్ని భక్తులకు ఇచ్చేందుకే ఆయన అలా చేశారు.
‘మన గడపలోకి ఎవరు, ఎప్పుడొచ్చినా, వారిని అతిథులుగా భావించి అన్నం పెట్టాలి. గృహస్థులు చేయగల గొప్ప మనుష్య యాగం ఇదే’ అని బాబా చెప్పినట్టు శ్రీసాయి సచ్చరిత్ర 19వ అధ్యాయంలో ఉంది. ఇదే ధర్మాన్ని నమ్ముకుని ముందుకు సాగుతోంది షిర్డీలోని అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం. ఇక్కడి తన సత్రానికి ఎవరు, ఎప్పుడు వచ్చినా వారి ఆకలిని తీరుస్తోంది. ‘కడుపులో అన్నం పడకుండా నువ్వు దేవుడిని చూడలేవు. ఆయన మహిమను పొగడలేవు. ఆయన ఉపదేశాన్ని కూడా శ్రద్ధగా వినలేవు. కాబట్టి ముందు ఆకలిగొన్న వారి ఆకలి తీర్చడం ముఖ్యం’ అనే సాయి సందేశాన్నే సంకల్పంగా చేసుకుని ఈ సంస్థ షిర్డీలో తన అన్నదాన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

సబ్‍ కా మాలిక్‍ ఏక్‍.. అంటూ ఓ ఫకీరు లోకానికి ఆధ్యాత్మిక, సామాజిక సందేశాన్ని చాటిన చోటు షిర్డీ. భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ కొలువైన సాయిబాబా అన్ని మతాల భక్తుల పూజలనూ అందుకుంటున్నాడు. తమకు ఎటువంటి కష్టం, దు:ఖం కలిగినా సాయిని ఆశ్రయిస్తూ వేల మంది భక్తులు నిత్యం షిర్డీకి చేరుకుంటారు. బాబా దర్శనం అనంతరం తమ బాధలన్నీ అలా చేత్తో తీసినట్టు మాయమైపోతాయని భక్తుల నమ్మకం.
షిర్డీ సాయిబాబా తన జీవితమంతా ఫకీరుగానే గడిపారు. భక్తుల దు:ఖాలను, కష్టాలను తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు. నేడు బాబా భౌతికంగా లేకపోయినా ఆయన నిత్యం తన సమాధి నుంచే భక్తులను కాపాడుతున్నారని భక్తులు నమ్ముతారు.
సాయిబాబాను భక్తులు భగవంతుని స్వరూపంగా భావిస్తారు. కొందరు హిందువుగా, మరికొందరు ముస్లింగా భావించి పూజిస్తుంటారు. అయితే అన్ని మతాల వారికి సాయిబాబాపై విశ్వాసం ఉండటానికి కారణం ఆయన చాటిన మత సామరస్యమే.
మహారాష్ట్రలోని షిర్డీకి సమీపంలో గల పత్రి అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో సాయిబాబా జన్మించారని అంటారు. చిన్న వయసులోనే షిర్డీ వచ్చిన ఆయన అటు తరువాత మళ్లీ కొన్నాళ్లు ఎవరికీ కనిపించలేదు. చివరకు ఒక పెళ్లి బృందంతో కలిసి షిర్డీ వచ్చారు. ఆనాడు ఆయనను ‘ఆవో సాయీ…’ అని మహల్సాపతి అనే భక్తుడు ఆహ్వానించాడని, అప్పటి నుంచి ఆయనకు సాయి అనే పేరు స్థిరపడిందని చెబుతారు.
1858లో షిర్డీ వచ్చిన బాబా ఆ సమయంలో ఒక మస్జీదును ఆవాసంగా చేసుకున్నారు. దానిని ద్వారకామాయి అని పిలిచేవారు. అప్పటి నుంచి ఈనాటి దాకా అక్కడ ధుని నిత్యం వెలుగుతూనే ఉంది. భక్తులు బాబా దర్శనానతరం ధుని నుంచి విభూతిని తీసుకువెళ్తారు. ఎవరైనా ఇబ్బందులుంటే బాబా ధునిలో కర్పూరం, చందనం వంటి వాటిని వేయడం వల కష్టాలు తొలగిపో తాయని నమ్ముతారు.
షిర్డీలో మరో అద్భుతం- వేపచెట్టు. ఈ చెట్టు కిందనే బాబా కూర్చునే వారట. బాబా అద్భుతం వల్ల ఆ వేపాకుల్లోని చేదు మాయమై తీపిగా ఉండేవని అంటారు. షిర్డీ వెళ్లిన భక్తులు ఈ చెట్టు ఆకులను పొందడానికి ఉత్సాహం చూపుతారు.
అందరి దేవుడు ఒక్కడే అని లోకానికి

చాటిన సాయినాథుడు కొలువైన షిర్డీ క్షేత్రం ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు మనం చూసే బాబా విగ్రహం వద్దనే ఆయన మహా సమాధి ఉంది. దీనినే సమాధి మందిరం అని కూడా పిలుస్తారు. ఇక్కడే బాబా అక్టోబరు 15, 1918లో తన దేహాన్ని విడిచిపెట్టారని భక్తులు నమ్ముతారు. గురువారం జరిగే పల్లకీ ఊరేగింపు కనులపండువలా సాగుతుంది.
ఏ భక్తుడు ఏ కోరికతో షిర్డీ చేరుకుంటే వారి కోరికలు తీరుస్తానని, తన భక్తులైన వారిని షిర్డీకి పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టు లాగుతానని బాబా చెప్పారు. బాబా సన్నిధిలో నిత్యం రోజుకు ఐదుసార్లు హారతినిస్తారు. భూపాలి, కాకడ్‍, మధ్యాహ్న, సాయంత్ర, రాత్రి.. ఇలా ఐదు హారతులు ఇస్తారు.
హిందూ, ముస్లిం మతాల మధ్య సమైక్యతను పెంచేందుకు పాటుపడిన బాబా ‘అల్లా మాలిక్‍ (దేవుడే యజమాని)’ అని ప్రబోధించారు. ఆయన బోధనల్లోని ముఖ్యమైనది- శ్రద్ధ, సబూరి. బాబా రోజూ ధుని (పవిత్ర అగ్ని)ని వెలిగించే వారు. ఆ విభూతితో భక్తుల రోగాలను నయం చేసేవారు. రోజూ షిర్డీ వీధుల్లో బిక్షాటన చేస్తూ వచ్చిన ఆహారాన్ని ఇతరులకు పంచి మిగిలింది తాను భుజించే వారు. కులమత భేదాలు లేకుండా అందరిలో దేవుడిని దర్శించాలని బాబా బోధించారు. ఆయన ఆధ్యాత్మిక గురువుగా, యోగిగా, సూఫీ సాధువుగా భక్తుల పూజ లందుకున్నారు.

బాబా భక్తులకు
చేసిన 11 వాగ్దానాలు

1. షిర్డీలో అడుగుపెట్టిన వారి కష్టాలు తీరినట్టే.
2. మస్జీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
3. నేనీ భౌతికదేహాన్ని విడిచిన తరువాత కూడా సచేతనంగానే ఉంటాను.
4. నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
5. నా సమాధి నుంచే నేను మీకు దర్శనమిస్తాను.
6. నా సమాధి నుంచే నేను మాట్లాడతాను.
7. నా వద్దకు వచ్చిన శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.
8. మీరు నా వైపు చూస్తే నేను మీ వైపు చూస్తాను.
9. మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
10. నా సహాయం, బోధన కోరిన వారికి అవి తక్షణమే లభిస్తాయి.
11. నా భక్తుల ఇంట ‘లేమి’ అనే శబ్దమే వినిపించదు.

కరివెన నిత్యాన్నదాన సత్రం షిర్డీ చిరునామా:
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం
శాంతికమల్‍ హోటల్‍ ఎదురుగా, ఛత్రపతి నగర్‍,
మన్మాడ్‍ రోడ్డు, షిర్డీ, మహారాష్ట్ర- 423109
ముఖ్యమైన ఫోన్‍ నంబర్లు:
మేనేజర్‍: 83339 07800, హెల్ప్లైన్‍: 83339 07798
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్‍ ఖాతా:
యూనియన్‍ బ్యాంక్‍ ఆఫ్‍ ఇండియా
అకౌంట్‍ నంబర్‍: 111210011000039
ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్‍: యూబీఐఎన్‍0558770
(ఇక్కడ కరివెన నిత్యాన్నదాన సత్రం తరపున అత్యాధునిక సౌకర్యాలతో వసతి గృహం అందుబాటులో ఉంది. లిఫ్టు, డార్మిటరీ సదుపాయాలు కూడా ఉన్నాయి. సత్రంలో నిత్యం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ భక్తుల కోసం 45 వసతి గదులు అందుబాటులో ఉన్నాయి)

Review కరివెన నిత్యాన్నదాన సత్రం షిర్డీ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top