అనగనగా.. కథ

పూర్వం రెడ్డిసీమలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎక్కువగా రెడ్లు ఉం డేవారు. ఆ ఊరి రెడ్లలో లక్షాధికారి మొదలు భిక్షాధికారి వరకూ కష్టపడి పనిచేయవలసిందే కానీ ఒక్క క్షణమైనా వృథా కాలక్షేపం చేసేవారు కాదు. వాళ్లకు ఉదయం లేచింది మొదలు సాయంకాలం నడుం వాల్చే వరకూ పనులే పనులు. పొలం పని చూడటం, పాలు పితకడం, పశువులకు గ్రాసం సమకూర్చడం.. ఇలా సవాలక్ష పనులతోనే వారికి సరిపోయేది. ఆయా పనులన్నీ చూసుకుని ఇంటికి చేరుకునే సరికి రాత్రి చాలా పొద్దుపోతుండేది., అప్పుడు స్నానం, భోజనం చేసుకుని ఊళ్లోని రామాలయం దగ్గరికో, మునసబు గారి పెద్ద గచ్చు అరుగు మీదికో చేరుకుని కాలక్షేపం కబుర్లు కొద్దిసేపు చెప్పుకుంటుండే వారు.

ప్రాపంచిక విషయాల నుంచి ప్రపంచ విషయాల వరకు, వ్యవసాయ భోగట్టాలు, ఊళ్లోని మంచిచెడ్డలు మాట్లాడుకుని, ముచ్చటించుకునే సరికి రాత్రి ఏ పదిన్నరో పదకొండో అయ్యేది. ఇదంతా అయిన తరువాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయి నిశ్చింతగా నిద్రపోయే వారు. మళ్లీ కోడి కూసిందంటే లేచి పొలాల్లోకి పరుగులు తీయాల్సిందే. ఇలా ఐక్యమత్యంతో, అన్నా దమ్ములలా మెలగుతూ ఆ గ్రామంలోని రెడ్లం దరూ ఏకత్రాటిపైన నడుస్తూ ఉండేవారు. పండుగ, పబ్బమూ వచ్చిందంటే హరికథలు, కాలక్షేపాలూ జరిపించి ఊరి మొత్తం మీద చందాలు వేసుకుని విద్వాంసులను సన్మానించే వారు.
ఇలాగే ఒక ఏడాది సంక్రాంతికి గ్రామ పెద్దలు నలుగురూ కూడి ‘ఈ ఏడాది వినోదాలూ, వేడుకలూ ఏమి జరిపిద్దాం?’ అని చర్చించారు. అందరూ కూడబలుక్కుని తోలుబొమ్మలాటలు ఏర్పాటు చేశారు. ఆనాటి రాత్రి ఏడు గంటలు మొదలుకుని రాముని కోవెల వద్ద పందిరిలోకి వచ్చిన జనం ఇసుక వేస్తే రాలకుండా ఉంది. ఎనిమిది, తొమ్మిది గంటలకల్లా పిన్నాపెద్దా ఇంచుమించు ఊరందరూ వచ్చేసే వారు. అదిగో ఇదిగో అంటూ ఆట మొదలెట్టేసరికి పది అయ్యేది. ఎలాగైతేనేం తెర మీదకు బంగారక్క, జుట్టు పోలిగాడూ ఎక్కారు. వాళ్ల సంభాషణలు వింటూ ఉంటే జనానికి పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వొచ్చింది. మీసాలు మెలితిప్పుతూ కూర్చున్న రెడ్డి పెద్దలు కూడా చాలా ఆనందించి, ‘అయితే ఇక కథలోకి దిగుదాం’ అన్నారు. బొమ్మల విద్వాంసుడు సరేనంటూ భారతంలో నుంచి శశిరేఖా పరిణయం కథ వేయబోతున్నామని చెప్పి రాగాలాపన మొదలెట్టాడు.
తీరా కథ ప్రారంభించే సరికి రత్నాల రామిరెడి గారు చక్కా వచ్చారు. రామిరెడ్డి గారంటే సామాన్యులా ఏం? గ్రామం అంతా ఆయన డబ్బు మీద బతుకుతున్నదాయె. ఆయన అప్పిస్తేనే పొయ్యిలో పిల్లి లేస్తుంది ఆ ఊళ్లో నూటికి తొంభై మందికి. రామిరెడ్డి గారు వస్తూనే, ‘కొద్దిగా లావాదేవీలు ఉండటం చేత ఆలస్యమైంది’ అంటూ సభలో ప్రవేశించారు.
‘ఆ.. దానికేం లెండి. రండి.. రండి రామిరెడ్డి గారూ!’ అంటూ ఆయనను ఆహ్వానించి ముందువరుసలో కూర్చోబెట్టారు.
‘అందరూ వచ్చేసినట్టే. ఇంక కానీయండి’ అని సభ పెద్ద చెప్పేసరికి బొమ్మల విద్వాంసుడు మళ్లీ విఘ్నేశ్వర ప్రార్థనతో బంగారక్కను, జుట్టు పోలిగాడిని తెరమీదికి ఎక్కించాడు.
విద్వాంసుడు రాగాలాపన చేసి, మళ్లీ కథ ప్రారంభించేంతలో వైద్యులు వెంకటరెడ్డి గారు వచ్చారు. గ్రామం మొత్తం మీద ఎవరు కాస్తంత జిర్రుమన్నా వెంకటరెడ్డి గారి చేయి తగిలితే కానీ బతుకే లేదు. అటువంటప్పుడు ఆయనకు ప్రత్యేకించి తగిన మర్యాద జరగకపోయిందంటే మరేమన్నా ఉందా? కొంప మునిగినట్టే.
‘ఊళ్లో కేసులు చూసుకుని వచ్చేటప్పటికి ఈ వేళైంది. ఎంత పెందరాళే తెములుదామని అనుకున్నా తీరిక దొరకడమే కష్టమైపోతోంది. ఎవళ్లను కాదనగలం?’ అని ఆయన సంజాయిషీగా అన్నారు.
‘ఆ.. దానికేం లెండి. దయ చేయండి డాక్టరు గారూ’ అంటూ ఆయనను గౌరవించి తీసుకుపోయి, ముందు వరుసలో కూర్చోబెట్టారు.
‘ఇక రావలసిన వారెవరూ లేరు. కానీయండి’ అని కార్యక్రమం నిర్వాహకులు చెప్పేసరికి, మళ్లీ గణపతి పూజ జరిగింది. బంగారక్క, జుట్టు పోలిగాడి బొమ్మలు తెరమీదికి ఎక్కాయి. అందరూ విరగబడి నవ్వారు. విద్వాంసుడు మళ్లీ ఒకసారి రాగాలాపన చేసి సరాసరి శశిరేఖా పరిణయం కథ ఎత్తుకున్నాడు.
ఇంతలో పులమర పుల్లారెడ్డి గారు బయల్దేరి వస్తున్నట్టు సభలో గుసగుసలు బయల్దేరాయి.
పుల్లారెడ్డి గారంటే గ్రామానికంతటికీ భీష్ముని లాంటి వారు. నూట పాతికేళ్లు నిండిన వయో వృద్ధుడు. జ్ఞానవృద్ధుడు కూడా. ఆయన మాటంటే ఆబాలగోపాలమూ భక్తితో శిరసావహిస్తారు. అందుచేత కొంతమంది పెద్దలు ఎదురువెళ్లి ఆయనను తోడ్కొని వచ్చారు. సభలో, ‘అదిగో ఆయన వస్తున్నారు రెడ్డిగారు.. పుల్లారెడ్డి గారు..’ అని కోలాహలం బయల్దేరింది.
తన రాక ఆలస్యమైనందుకు ఆయన నొచ్చు కుంటే, ‘అయ్యో! ఆట మొదలెట్టారు కాబోలు. ఎంతవరకూ అయిందేమిటి?’ అన్నారు పుల్లారెడ్డి గారు.
‘అబ్బే! మరేం పర్వాలేదు లెండి. ఎంతవరకు అయితేనేమిటి?’ అని సర్దిచెబుతూ వృద్ధుడైన పులా్ల రెడ్డి గారిని నిర్వాహకులు గౌరవించి తీసుకువెళ్లి ముందువరుసలో కూర్చోబెట్టారు.
మళ్లీ సభ పెద్ద, ‘రావలసిన వారందరూ వచ్చేసినట్టే. ఇంక ఈసారి మొదలెట్టవచ్చు’ అన్నాడు.
బొమ్మల విద్వాంసుడు మళ్లీ ఒకసారి పూజ చేసి బంగారక్క, జుట్టు పోలిగాడి బొమ్మలను తెర మీదకు ఎక్కించాడు. మళ్లీ రాగాలాపన చేసి శశిరేఖా పరిణయం కథను ఈసారి జోరుగా ప్రారంభించాడు.
కానీ, విచిత్రమేమిటంటే, విద్వాంసుడు కథ ప్రారంభించేసరికల్లా మళ్లీ ఇంకో ఊరి పెద్ద అయిన రెడ్డి గారు రావడం, వారిని ఉచిత మర్యాదలతో సత్కరించి ముందువరుసలో కూర్చోబెడుతూ ఉండటం.. ఇలా మరికొంతసేపు కాలక్షేపం జరుగుతూ వచ్చింది.
అప్పటికి వేగుచుక్క పొడిచింది. తొలి కూడి కూసింది. వేళ అయిందంటూ రెడ్లు అందరూ లేచి ఎవరి మానాన వారు పొలం పనులకు వెళ్లిపోయారు.
తోలు బొమ్మలాట కథ కథగానే నిలిచి పోయింది. నిలిచిపోక మరేం జరుగుతుంది? కాస్తో కూస్తో కథ జరిగేటప్పటికల్లా ఏ రెడ్డి గారో చక్కా రావడం, ‘అదిగో రెడ్డిగారు వచ్చారు. మళ్లీ మొదలెట్టండి’ అనడం, అలా చుక్క పొడిచే వరకూ ఒక్కొక్కరే వస్తూ ఉండి ఎప్పటికప్పుడు కథ మళ్లీ కొత్తగా ప్రారంభించేసరికి తెల్లవారిపోయి ఎవరి పనులకు వారు పోవలసి వచ్చింది.
అప్పటి నుంచీ ఎవరైనా ఒక పని ప్రారంభించి మధ్యలో ఆపివేసి మళ్లీ మొదలుపెడుతూ ఉంటే, ‘రెడ్డొచ్చె మొదలాడరా’ అని అనడం పరిపా టయింది. ఈ మాటే తెనుగు నాట సామెతగా పరిణమించి శాశ్వతంగా నిలిచిపోయింది.
(‘రెడ్డొచ్చె మొదలాడరా’ అనేది తెలుగులో ప్రసిద్ధ సామెత. ఏదైనా పని ఎవరి వల్లనయినా ఆగి.. మళ్లీ మళ్లీ ప్రారంభం అవుతూ ఉన్నప్పుడు ఈ సామెతను ఉపయోగి స్తుంటారు. ఈ సామెత ఆధారంగా దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం ‘చందమామ’లో వచ్చిన కథ ఇది. దీని రచయిత ఏరిశెట్టి సుబ్బారావు, పుల్లేటికుర్రు)

వడివడిగా వెంకన్న దర్శనం
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి మామూలు రోజుల్లోనే విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక వేసవి సెలవులు కొనసాగే మే, జూన్‍ నెలల్లో వేరే చెప్పాలా? భక్తులు పిల్లలతో పెద్దసంఖ్యలో ఆలయానికి పోటెత్తుతుంటారు. ఈ రద్దీని తిరుమల తిరుపతి దేవస్థానం సమర్థంగా ఎదుర్కొంటోంది. శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లలో పడిగాపులు కాస్తున్న సామాన్య భక్తులు ఇప్పుడు ఏడెనిమిది గంటల్లోపే స్వామిని దర్శించుకుంటున్నారు. వీఐపీ బ్రేక్‍ సిఫార్సు లేఖల రద్దు, కమాండ్‍ కంట్రోల్‍ సెంటర్‍ ద్వారా క్యూలైన్ల నిరంతర పర్యవేక్షణతో టీటీడీ వేసవి ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. సర్వ దర్శనానికి వచ్చే భక్తుల నిరీక్షణ సమయం 8 గంటలు దాటకుండా అధికారులు చర్యలు చేపడు తున్నారు. ఒక దర్శనం కోసం మరో స్లాట్‍ దర్శనాన్ని ఆపకుండా.. ఏఐ ఆధారతి ఇంటిగ్రేటెడ్‍ కమాండ్‍ కంట్రోల్‍ సెంటర్‍, సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మాడవీధులు, క్యూ కాంప్లెక్స్లను పర్యవేక్షిస్తున్నారు. స్లాటెడ్‍ సర్వ దర్శనం రెండు నుంచి మూడు గంటల్లోపు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండున్నర గంటల్లోపు పూర్తవుతుంది. ప్రతి శనివారం తిరుమలకు లక్ష మందికి పైగా భక్తులు వస్తున్నప్పటికీ దర్శన సమయం 13 గంటలకు మించకుండా అదుపు చేయగలుగుతున్నారు. సెలవుల అనంతరం కూడా ఇలాగే చర్యలు తీసుకోనున్నారు.

Review అనగనగా.. కథ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top