ఆధ్యాత్మి‘కథ’

అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులు ఉండే వారు. అందులో ఒకడు ధనికుడు. రెండో వాడు విద్వాంసుడు. మూడవ వాడు యుక్తిపరుడు.

ఈ ముగ్గురి మధ్య ఒకసారి ‘నేనే గొప్ప అంటే నేనే గొప్ప’ అని వాదోపవాదాలు మొదలయ్యాయి.

వారిలో ఒకడు- ‘ఈ నగరపు రాజకుమారి ‘నేను పురుషుల ముఖం చూడను’ అని శపథం చేసి, పురుషుల కంటపడకుండా ప్రత్యేకంగా ఒక మేడ కట్టించుకుని అందులో ఉంటున్నది. ఆ రాజకుమారితో మాట్లాడి, ఆమెను పెళ్లాడిన వాడే మనలో సమర్థుడు. ఈ ఒప్పందానికి సరేనా?’ అన్నాడు. తక్కిన ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు.
వెంటనే ముగ్గురిలో ఒకడైన ధనికుడు రాజకుమారికి తెలిసేలాగా, ఆమె చెవిన పడేలా తన దగ్గర ఉన్న డబ్బుతో విరివిగా దానధర్మాలు, వితరణలు, సమారాధనలు, శుభకార్యాలు, పేదలకు సహాయం వంటి కార్యక్రమాలు చేయసాగాడు. తన ఖజానాలో ఉండే విలువైన వజ్రాలూ, వైడూర్యాలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలూ ప్రదర్శించడం ప్రారంభించాడు. రాజకుమారి తనను మెచ్చి పలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకుని ఉన్నాడు.
ఒకసారి ఈ ధనికుడి ఐశ్వర్యాన్ని గురించి, దాతృత్వ పనుల గురించి దాసీలు రాజకుమారితో చెప్పగా, ‘ఆ మనిషి స్త్రీయా? పురుషుడా?’ అని అడిగింది.
‘పురుషుడే’ అని చెప్పారు దాసీలు.

‘అయితే పురుషుల విషయాలు నా వద్ద చెప్పకండి’ అని రాజకుమారి చీదరించుకుంది. ఇది తెలిసి ధనికుడు తన ప్రయత్నాలన్నీ ఆపేశాడు.
తరువాత విద్వాంసుడి వంతు వచ్చింది. అతడు రాజవీధిలో మకాం వేసి పరకాయ ప్రవేశం, అదృశ్యకరణి మొదలైన తనకు తెలిసిన విద్యలన్నీ అతి చమత్కారంగా ప్రదర్శించసాగాడు. ఈ విద్వాంసుడి ప్రజ్ఞ గురించి కూడా దాసీలు రాజకుమారి చెవిన వేశారు. ‘ఇన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి స్త్రీయా? పురుషుడా?’ అని అడిగింది.
‘పురుషుడే’ అని బదులిచ్చారు దాసీలు.

‘ఛ..ఛ! పురుషుల విషయం నా ముందు చెప్పకండి. మళ్లీ ఎన్నడైనా ఇలాంటి సంగతి నా చెవిన వేశారంటే తలకొట్టించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను’ అని రాజకుమారి దాసీలను హెచ్చరించింది.
ఈ విషయం తెలుసుకున్న విద్వాంసుడు కూడా నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

చివరకు యుక్తిపరుడి వంతు వచ్చింది. అతడు నేరుగా వెళ్లి వెళ్లి రాజకుమారికి రోజూ వాడుక కోసం పువ్వుల మాలలు అల్లి ఇస్తుండే ఒక ముసలమ్మ ప్రాపకం సంపాదించి, ఎలాగో ఆమె ఇంటిలో బస చేశాడు.
ఒకరోజున యుక్తిపరుడు ఎక్కడివో చిత్రమైన రకరకాల పువ్వులు పట్టుకుని వచ్చి, దండగుచ్చి ముసలిదానికి ఇచ్చాడు.

‘అవ్వా! ఇవాళ పూలమాల నేను కట్టాను. ఈ పూలమాల తీసుకుని వెళ్లి రాజకుమారికి ఇవ్వు.

ఆమె అది చూసి సంతోషించి, ‘దీనిని ఎవరు కట్టారు?’ అని నిన్ను అడుగుతుంది. అందుకు బదులుగా ‘నిన్నటి రోజున మా అక్క కూతురు ఊరి నుంచి వచ్చిందండి. ఈ దండ ఆమెనే కట్టింది’ అని చెప్పు. తరువాత మళ్లీ రాజకుమారి ఏమి అంటుందో వచ్చి నాతో చెప్పు’ అని చెప్పాడు.
అవ్వ అతడు చెప్పినట్టే చేయగా, రాజకుమారి చాలా సంతోషించి, ‘అవ్వా! నీ అక్క కూతురును నేను చూడాలి. రేపు నీతో వెంటబెట్టుకుని రా’ అంది.

ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరుడితో జరిగిన విషయాన్ని చెప్పింది. మరునాడు యుక్తపరుడు స్త్రీ వేషం ధరించి అవ్వ వెంబడి రాజకుమారి భవనానికి వెళ్లాడు.

స్త్రీ రూపంలో ఉన్నది పురుషుడేననే విషయాన్ని రాజకుమారి ఎంతమాత్రం గుర్తుపట్టలేకపోయింది. ఆ స్త్రీని తన చెలికత్తెగా చూసుకుంటూ రాజకుమారి తన మనసులోని రహస్యాలెన్నో దాపరికం లేకుండా ఆమెతో చెప్పివేసింది.
కొంతసేపైన తరువాత యుక్తిపరుడు ‘రాజకుమారీ! నిన్నొక ప్రశ్న వేస్తాను. నిజం చెబుతావా?’ అని అడిగాడు.

‘తప్పక చెబుతాను’ అన్నది రాజకుమారి.
‘అయితే పురుషుని ముఖం చూడనని నువ్వు శపథం చేశావట కదా! పురుషులంటే నీకెందుకంత కోపం’ అని అడిగాడు.

అప్పుడు రాజకుమారి ‘చెలీ! ఇది నా జీవితంలో చాలా రహస్య విషయం. కానీ, ప్రాణ సమానురాలివి కాబట్టి నీకు చెబుతున్నాను. ఎవరికీ ఈ విషయాన్ని వెల్లడించకూడదు సుమా!’ అంటూ అసలు విషయాన్ని ఇలా చెప్పింది.
‘వెనకటి జన్మలో నేనూ, నా భర్తా మృగాలుగా ఉండేవాళ్లం. ఒకనాడు ఇద్దరమూ వేటగాడి వలలో చిక్కుకోగా, గర్భిణి అయి ఉన్న నేను తప్పించుకోలేకపోయాను. కానీ, నా భర్త నా విషయాన్ని పట్టించుకోనైనా పట్టించుకోకుండా వల నుంచి తప్పించుకుని తన దారిన తాను వెళ్లిపోయాడు. ఇక గత్యంతరమేముంది? వేటగాడు నన్ను పట్టి చంపేశాడు. అప్పటి నుంచి స్వార్థపరులైన మగవాళ్లంటే నాకు పరమ అసహ్యం. కనుకనే మగవాడి ముఖం చూడకూడదని ఆ క్షణంలోనే నేను ఒట్టు పెట్టుకున్నాను. నేను పూర్వజన్మ స్మ•తి కలదానను. అందుచేత ఈ విషయం ఈ జన్మలోనూ జ్ఞాపకముంచుకుని నీకు చెప్పగలిగాను’ అని రాజకుమారి చెప్పడం పూర్తిచేసింది.
ఇది విని, ఇంకా ఉంటే తన వేషం కాస్తా బయల్పడుతుందనే భయంతో యుక్తిపరుడు మరి ఒక్క క్షణమైనా అక్కడ ఉండకుండా మెల్లగా ఇంటిదారి పట్టాడు.

తరువాత కొన్నాళ్లకు యుక్తిపరుడు ఒక యతీశ్వరుడి వేషం వేసుకుని రాజుగారి కోట పక్కన తోటలో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఉండే తోట మాలితో స్నేహం చేసి మచ్చిక చేసుకున్నాడు.

ఒకనాడు తోటమాలితో- ‘నా కోసం మగవాళ్లు ఎంతమంది వచ్చినా రానీ. కానీ స్త్రీలను మాత్రం రానీయకు. జాగ్రత్త. స్త్రీలు వచ్చినట్టయితే శపిస్తాను’ అని చెప్పాడు. దీంతో ఆడపురుగైనా ఆ యతీశ్వరుడి వద్దకు వెళ్లకుండా తోటమాలి అప్పటి నుంచి కాపలా కాస్తుండే వాడు.
ప్రతిరోజూ పట్టణంలో మగవాళ్లంతా ఆయన వద్దకు వచ్చి, దీవెనలు అందుకుని వెళ్తుండేవారు.

యతీశ్వరుడి ప్రఖ్యాతి క్రమంగా రాజుగారి చెవిన కూడా పడింది. ఒకరోజున రాజు స్వయంగా ఆయన వద్దకు వచ్చి, ‘మహానుభావా! తమరు మా కోటకు దయచేసి, మా గృహం పావనం చేయండి. మమ్మల్ని ధన్యులను చేయండి’ అని కోరాడు.
అందుకు బదులుగా స్త్రీల ముఖం తాను చూడననే తన శపథం గురించి ఆయనకు యతీశ్వరుడు వెల్లడించాడు.

అప్పుడు రాజు, ‘స్వామీ! మీ వ్రతానికి భంగం కలగకుండా చూస్తాను’ అని చెప్పి కోటలోకి వెళ్లి ఆడవాళ్లెవరూ రాకుండా కట్టుబాటు చేసి యతీశ్వరుడిని అతి వైభవంతో తన భవనానికి ఆహ్వానించాడు.

ఆ యతీశ్వరుడి గురించి, అతడి శపథం గురించి ఎలాగో రాజకుమారి చెవిన పడింది.

‘ఇదేమిటీ వింత? నా ప్రతిజ్ఞకు సరిగా ఎదురు ప్రతిజ్ఞ అయి ఉన్నదే. ఈ మునీశ్వరుడి విశేషాలేమిటో తెలుసుకోవాలి’ అని అనుకున్నది.

ఇటువంటి చిత్రమైన మనిషిని చూసి తీరాలనే పట్టుదల ఆమెలో పెరిగింది.

రాజకుమారి తన అంత:పురపు కిటికీకి తెర కట్టించుకుని, యతీశ్వరుడిని రహస్యంగా చూస్తూ, ఆయన చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేది.

రాజు ఆ యతీశ్వరుడిని గొప్పగా పూజించి, చివరగా, ‘స్వామీ! నాకున్న సంశయాలన్నీ తీర్చారు. తాము ఎందువల్ల స్త్రీ ముఖం చూడరో కారణం చెప్పాలి’ అని ప్రార్థించాడు.

‘రాజా! నువ్వు ప్రాథేయపడుతున్నావు కాబట్టి చెబుతున్నా. విను. వెనకటి జన్మలో నేనూ, నా భార్య మృగాలుగా పుట్టాము. ఒకరోజు మేం వేటగాడి ఉచ్చులో చిక్కాము. అప్పుడు గర్భిణిగా ఉన్న నా భార్య ఎలాగో వల నుంచి తప్పించుకుని నన్ను వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి స్త్రీ జాతి ముఖం చూడకూడదని ఒట్టు పెట్టుకున్నాను. నాకు పూర్వజన్మ స్మ•తి ఉండటం వల్ల ఈ కథ జ్ఞాపకం ఉం చుకుని నీకు చెప్పగలిగాను’ అని యతీశ్వరుడు చెప్పాడు.
ఈ మాటలను కిటికీలో నుంచి విన్న రాజకుమారి గబగబా కిందికి దిగివచ్చి, యతీశ్వరుడి ఎదుట నిల్చుని, ‘అయ్యా! నువ్వు అబద్ధం చెబుతున్నావు. వలలో నుంచి తప్పించుకునిపోయింది ఆడ మృగమా? మగ మృగమా? నిజం చెప్పు. వెనుకటి జన్మలో ఆడ మృగంగా పుట్టింది నేను. వలలో చిక్కి వేటగాడి చేతిలో చచ్చింది కూడా నేనే. నిజం కప్పిపుచ్చి, ఈ సంగతి ఎవరికీ తెలియదు కదా అని నాపైన అబద్ధాలు చెబుతున్నావు. నిజానికి ఈ వృత్తాంతం నాకూ, నా భర్తకూ తప్ప మరెవరికీ తెలియదు. కనుక నువ్వే నా భర్తవు’ అంటూ యతీశ్వరుడి చేయి పట్టుకున్నది.
ఆమె కోరికతో రాజు వారిద్దరికీ వైభవంగా వివాహం జరిపించాడు. యుక్తిపరుడే తమ కంటే అధికుడూ, సమర్థుడూ అని తక్కిన ఇద్దరూ ఒప్పుకున్నారు.

Review ఆధ్యాత్మి‘కథ’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top