పలుకు‘బడి’

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల
గురించి తెలుసుకుందాం.

ఏటావలి గిలిగింతలు
ఏరు అంటే ప్రవాహం. వాగు. దానికి ఆవల అంటే- అవతలి ఒడ్డున దొరికే గిలిగింతలంటే సంతోషాలు. అవి ప్రేమ కావచ్చు. స్నేహం కావచ్చు. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో ఒక నదికి ఇవతలి ఒడ్డున ఉన్నవాళ్లు అవతలి ఒడ్డున ఉన్న వాళ్లతో స్నేహం చేయడం, ప్రేమలో పడటం కష్టసాధ్యంగా ఉండేవి. అలా దూరతీరాల్లో ఉన్న మిత్రులు సమయానికి సాయపడగలరని అనుకోవడం భ్రమ. అన్ని రుతువుల్లో నదులు దాటడం సాధ్యపడదు. ఏ పుట్టి మీదనో నదిని దాటడం ప్రమాదకరం కూడా. ఆవలి ఒడ్డున ఉన్న వ్యక్తి ఎంత కావలసిన స్నేహితుడైనా ఆకస్మికంగా వచ్చిపడే కష్టాలు పంచుకోలేడు. ఆ దృష్టితో పాతకాలంలో ఏటావలి స్నేహం నిరర్ధకమని, నిష్ప్రయోజనకరమనీ భావించే వాళ్లు. ఆ మైత్రి వల్ల, ఆ ప్రేమ వల్ల ఎంత ఆనందం కలిగినా అది అందుబాటులో లేనిది. గంటల్లో ఖండాంతరాలకు చేరుకోగల ఈ కాలంలో కూడా ఉన్న ఊళ్లో వ్యక్తికి చేసిన ఫోను, రాసిన ఉత్తరం అందడం లేదన్నది అనుభవంలోని విషయం. అందువల్ల పూర్వం దూర స్నేహాలు నిష్ప్రయోజనకరమనీ, పొరుగూరి సేద్యం లాగా బాధాకరమనీ అనుకున్నారంటే ఆశ్చర్యపడనక్కరలేదు.

ఏడుకట్ల సవారీ
సవారీ అనే మాట హిందీ/ఉర్దూల నుంచి వచ్చింది. అల్లసాని పెద్దన ‘అసివారు’ అనే రూపంలో వాడుక చేస్తే, నిత్య వ్యవహారంలో స్వారీ అనే రూపభేదంతో నిలిచింది. ఈ మాటకు ‘వాహనం, వాహ్యాళికి పోవడం’ మొదలైన అర్థాలున్నాయి. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ప్రహసనాల్లో ఈ మాటకు అనేక పర్యాయాల వాడుక కనిపిస్తుంది. ఏడుకట్లు అనేది ‘పాడె’కు మాత్రమే. చనిపోయిన వ్యక్తి ఏడు ఊర్ధ్వ (పై) లోకాలకు దాటిపోవాలన్న నమ్మకానికి చిహ్నంగా ఏడుకట్లు కడుతుంటారనేది కొందరి వివరణ. సప్త వ్యసనాలున్న వ్యక్తి అనే సూచన కోసం కూడా

ఏడుకట్లు కడతారనీ, బతికి ఉండగా ఈ ఏడు దుర్లక్షణాలున్నా వాటికి అతీతంగా ఉండే లోకాలకు వెళ్తున్నందున అలా అన్ని కట్లు కడతారని మరికొందరి విశదీకరణ. ఎవరి వ్యాఖ్యానం ఎలా ఉన్నా ఇన్ని కట్లు కట్టి పాడె మీద పడుకోవాలనుకోవడం ఆచారమే కాని శాస్త్రం కాదంటారు. ఎంత పరమ నిర్భాగ్యుడికైనా దరిద్రుడికైనా బతికి ఉండగా దొరక్కపోయినా చచ్చినప్పుడయినా లభించే వాహనయోగం ఇదే. ‘మరణాంతాని వైరాణి’ అనే నమ్మకం ఉన్న మన దేశంలో పరమ శత్రువులకు కూడా ఈ వాహనయోగం కల్పించి శ్మశానానికి తీసుకుపోతారు. వ్యక్తితో పాటు అతడి మీది శత్రుత్వం కూడా నశిస్తుందన్న మాట. జీవించి ఉండగా దొరకని భోగం- పాడె అనే వాహనమెక్కడం- మరణించిన తరువాత లభ్యపడుతుంది. బంధుమిత్రులు ఊరేగింపుగా రుద్రభూమికి తీసుకుపోతారు. తన దరిద్రాన్ని, అభాగ్యాన్నీ ప్రస్తావించి విసుక్కునే సమయంలోనూ, ఇతరుల భోగాలను ఈసడించి మాట్లాడే వేళల్లోనూ ‘ఏడుకట్ల సవారీ’ తప్పదని వ్యాఖ్యానిస్తుంటారు. పుట్టిన వారు గిట్టక తప్పదు. కాబట్టి ఇదొక్కటే అందరికీ దొరికే వైభవమన్న ఆక్షేపణ ఈ మాటలో ఉంది.

ఏనుగు పాడి
సామాన్య సంసారులెవరూ ఏనుగులను పెంచుకోలేరు. పెంచుకున్న మారాజులు కూడా దాని పాలు పితికి తాగలేరు. అయినా, ఏనుగు పాడి అనే మాట పుట్టింది. ఏనుగు పెద్ద జంతువు కాబట్టి దాన్ని పెంచి, పాడి పశువుగా ఉపయో గించగలగడం మహదైశ్వర్యానికి చిహ్నమని ఊహించారన్న మాట! సమృద్ధి, సంపద అనే అర్థంలో ఈ మాటను వాడుతుంటారు. ‘ఆయనకేమండీ? ఏనుగు పాడి’ అంటే.. ఆ వ్యక్తి మహాభోగి, సంపన్నుడు అని మాత్రమే అర్థం.

ఏనుగు దాహం
ఏనుగు పెద్ద శరీరం కలది. కాబట్టి దాని దప్పిక కూడా గొప్పదేనన్న నమ్మకంతో పుట్టిందీ మాట. ఏనుగంత మనిషి, ఏనుగు బలం వగైరాల్లోలాగానే ఈ పదానికి కూడా విపరీత దాహం, అత్యాశ అనే భావాలను సూచించడానికి ఏనుగుతో లంకె వేశారు గాని, ఒంటె దాహంతో పోలిస్తే ఏనుగు తాగే నీళ్లు ఎక్కువేమీ కాదు. దురాశ అనే అర్థంలోనే ఈ మాటకు వాడుక. మంచి అర్థంలో ఈ జాతీయంతో ప్రయోగాలు కనిపించవు.

ఏలేశ్వరోపాధ్యాయుడు
ఈయన యథార్థ వ్యక్తి. ఎవరైనా వాదులాడుకుంటుంటే కల్పించుకుని అయినా సరే తీర్పు చెప్పేవాళ్లుంటారు కొందరు. అందుకు ఉభయ పక్షాల చేతా చీవాట్లు తినే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. ఉభయులూ గౌరవించి ఆ తీర్పును అంగీకరించేట్లు చేయగల వాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. తనకు వివాద విషయంలో స్వప్రయోజనం లేకపోయినా ఎవరూ తప్పుబట్టలేని విధంగా ధర్మం చెప్పడం, చెప్పగలగడం కోటికొక్కరికైనా సాధ్యం కాదు. అలాంటి అసాధ్యమైన ప్రతిష్ట సంపాదించిన వారిలో ఏలేశ్వరోపాధ్యాయులొకరు. ఈయనను గురించి అర్థ శతాబ్దం కింద కూడా కథలు కథలుగా చెప్పుకునే వారు. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు తమ ‘కథలు – గాథలు’ అనే గ్రంథంలో ఈ ఉపాధ్యాయుల వారిని గురించి ఎన్నోసార్లు స్మరించారు.
ఇంతకూ ఆయన ఎవరు? ఏనాటివాడు? ఏం చదివాడు? ఏం చేశాడు? అనేవి పరిశోధకులకు కావాల్సిన విషయాలు. ‘నా మాటకు తిరుగులేదు’ అని ఎవరైనా బుకాయిస్తే, ‘ఏం? నువ్వు ఏలేశ్వరోపాధ్యాయుడివా?’ అని అడిగించుకున్న వాళ్లు చాలామంది ఉండవచ్చు. ఎవరితో పోల్చి ఈ మాట అన్నారో అది ముఖ్యం. అనేక శాస్త్ర విషయాల్లో ఆయన నిర్ణయానికి తిరుగులేదనే పేరు వచ్చింది. అది ప్రధానం. ఏలేశ్వరోపాధ్యాయుడి తీర్పు తిరుగులేని ధర్మమనే ప్రఖ్యాతి వచ్చింది. ఆయనది తుది నిర్ణయం. తిరుగులేని నిర్ణయం. అంతటివాడు తప్ప మరెవరూ ప్రశ్నించడానికి వీలులేని నిర్ణయం. ఈ భావం కోస్తా జిల్లాల్లోని పండితులూ, కవులూ సగౌరవంగా అంగీకరించిన వాస్తవం.

ఒజ్జల పుచ్చకాయ
ఇది కొంచెం పాతకాలపు మాట. ఒజ్జ అంటే గురువు, ఉపాధ్యా యుడు. ఒక గురువు గారు శిష్యులకు పుచ్చకాయ తినడం పాపమని ఒకనాడు పాఠంలో చెప్పారట. ఆ సంగతి మరిచిపోయిన ఆయన కొంతకాలం తరువాత ఒక పుచ్చకాయ పట్టుకురమ్మని ఒక శిష్యుడికి పురమాయించారట. తీరా గురువు గారి ఆజ్ఞతో ఆశ్చర్యపోయిన ఆ శిష్యుడు, ‘ఇదేమండీ గురువు గారూ! మీరే కదా పుచ్చకాయ తినడం పాపమని వెనకటికి ఏనాడో చెప్పారు కదా!’ అని అడిగాడట. దీంతో ఆ గురువు గారు కస్సున లేచారు. ‘మీరు తినకూడదని అన్నాను కానీ నేను తినకూడదని చెప్పలేదే’ అని కసురుకున్నాడని కథ. తనకు వర్తించని, తాను ఆచరించని ధర్మాలను ఇతరులు పాటించాలని చెప్పే మన ప్రస్తుత రాజకీయవాది వంటి వాడన్నమాట ఆ గురువు గారు. అందువల్లనే తమకు మాత్రమే కావలసిన వాటిని, ఇతరులకు నిషిద్ధమయిన వాటిని ‘ఒజ్జల పుచ్చకాయ’ అనేవాళ్లు.

Review పలుకు‘బడి’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top