తెలుగు ‘పాట’వం

జగములేలే వాడవు జనార్దనుడవు
తగ నీవారమై నేము ధర నెట్టుండినాను
।।పల్లవి।।
గతి నీవు మతి నీవు కాణాచి చోటు నీవు
సతమై యన్నిటికిని సాక్షివి నీవు
చతురవత వలసితే జరతుము కొలుతుము
తతి నేము సేసిన తప్పులు లోగొనవే
।।జగము।।
తల్లియు దండ్రియు నీవు దాత దైవము నీవు
యెల్లవారికి బరము నిహము నీవు
మల్లడి నొక్కొకవేళ యరతుము తలతుము
చల్లగా మానేరములు సైరించుకొనవే
।।జగము।।
దరి నీవు దాపు నీవు దయామూర్తివి నీవు
పరగ శ్రీవేంకటేశ పతివి నీవు
విరివిగా నేమైనా వేడుదుము నుతింతుము
శరణుచొచ్చితి మిక క్షమియించుకొనవే
।।జగము।।

అవతారిక:
జనుల అర్ధన (వేడుకోలు) వినేవాడు జనార్దనుడు. ‘దేవా! నీవు జనార్దనుడవై జగము లేలుతుంటే మేము నీవారమై, నీ దాసులమై ఈ లోకంలో పూనికతో ఉంటామయ్యా!’ అని కీర్తిస్తున్నారు ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు. మా తల్లియు, తండ్రియు దాతయునూ నీవే ప్రభూ! అంటూ ‘అన్యధా శరణం నాస్తి’ అని నిన్ను ఆశ్రయించినారు. మాకు నీవే దిక్కు అని ప్రార్థిస్తున్నారు. అసలు సంగతి ఏమిటంటే అవతారికలో కనిపించినంత తేలిక కాదు ఈ కీర్తనలోని భావాన్ని పట్టుకోవడం. అంతుచిక్కని చిక్కుముళ్లలాంటి పదాలు చాలా ఉన్నాయి. ‘కాణాచి’ అంటే ఏమిటో భావార్థంలో చదవండి.

భావ వివరణ:
ఓ జనార్దనా! నీవు జగములు (పదునాలుగు భువనములు) పరిపాలించే బ్రహ్మాండ నాయకుడవు. నేము (మేము) ఈ ధరన్‍ (భూమిపై) తగన్‍ (తగినట్టు) నీవారమై (నీ పరివార భృత్యులమై) నెట్టుండినాము (పూనికతో ఉన్నాము).
ప్రభూ! నీవే మాకు గతివి దిక్కైన ఆధారానివి). నీవే మాకు మతివి (మంచీ చెడు విచక్షణ కలిగించే మేధస్సువి). నీవే మాకు కాణాచి అయిన చోటువు (చిరకాలవాస స్థానమైన వాడవు. అందుచేతనే మన ఆత్మలన్నింటికీ ఆ పరమాత్మ చిరంతనుడు). అన్నిటికీ నీవే సతమైన (శాశ్వతమైన) సాక్షివి (ఆయన నిష్పక్షపాతమైన సాక్షీభూతుడు). మాకు అప్పుడప్పుడు చతురత వలసితే (తెలివితేటలు అతి అయిపోయి) నిన్ను జరతుము (నిందించెదము). తరువాత నీవే దిక్కు అని కొలుతుము (కాళ్లు పట్టుకుంటాం). తతి (అసాధారణంగా) మేము చేయుచున్న తప్పులను మన్నించుము తండ్రీ!.
ఓ దేవా! నీవే మాకు తల్లివి, తండ్రివి నీవే. మా ప్రాణదాతవు, పరమాత్మవూ నీవే. నీవు ఆత్మరూపుడవైననూ అందరికీ నివాస స్థానమైన వాడవు. మాకు ఇహమున కోర్కెలు దీర్చి, పరమున మోక్షమునిచ్చే వాడవు నీవే. మల్లడి (నీతో పోట్లాడి) ఒక్కొక్క వేళ నిన్ను మరచిపోయి తలుచుకోను కూడా తలుచుకోము. మా నేరములను చల్లగా (నెమ్మదిగా) సైరించి కొనవే (క్షమించి మమ్మల్ని కాపాడవయ్యా).
ఓ జగన్నాథా! నీవు దరిదాపు (సమీపం)లోనే ఉన్న గమ్యానివి. అంతులేని దయాస్వరూపుడవు. నీవు విలసిల్లిన శ్రీవేంకటపతివి. ఏదియేమైనా మేము నిన్ను విరివిగా (విస్త•తముగా) వేడుకుని నుతించెదము. నిన్ను శరణుజొచ్చితిమి. ఇక క్షమించుకొనవే (మమ్మల్ని క్షమించి అను•్ర హించుము తండ్రీ).
అన్నమాచార్యుల వారు ఈ కీర్తనను ముఖారి రాగంలో ఆలపించారు. ఇందులోని చాలా పదాలకు తెలుసున్న అర్థాలే అనిపిస్తాయి కానీ, వాటి భావం చాలా లోతుగా ఉంటుంది.

Review తెలుగు ‘పాట’వం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top