ఎన్నో విశేషాలకు నెలవు పొత్తీశ్వరాలయం. ఈయననే పుట్టీశ్వరుడని కూడా పిలుస్తారు. ఈ శివలింగం దేవాలయం గర్భగుడిలో చాలా లోతులో ఉంటుంది. శివలింగాన్ని తాకితే పొట్ట భాగం (ఉదరం)లా మెత్తగా తగులుతుంది. సమీపంలోనే మహేంద్రతనయ నది ప్రభావమో.. ఏమో.. లింగం ఎప్పుడూ తేమగా, తడిగా ఉంటుంది. ఇక్కడ ఆవు గుండెకాయను పోలిన రాతి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. అర్జునుడు ఖడ్గమృగం వేటకు వెళ్లి గోవును చంపాడట. గోహత్యా పాతకానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడాట. మరి ఈ క్షేత్రం ఎక్కడుందో, దాని విశేషాలేమిటో తెలుసుకుందామా!
ఆంధప్రదేశ్‍లోని శ్రీకాకుళం జిల్లా, మందస మండలం పొత్తంగి (ఒరిస్సా రాష్ట్రంలో కూడా పొట్టంగి అనే పేరు గల వేరే చిన్న పట్టణం ఉంది). అనే కుగ్రామంలో వెలసిన అత్యంత మహిమాన్విత శైవ క్షేత్రం- పొట్టీశ్వర (పొత్తీ శ్వరుడు) ఆలయం. మహేంద్రగిరులకు, మహేంద్రతనయ నదికి ఆనుకుని ఉన్న ఈ క్షేత్రం అతి ప్రాచీనమైనది. పొత్తంగి గ్రామం సోంపేట పట్టణానికి పదహారు కిలోమీటర్లు, 5వ నంబరు జాతీయ రహదారి పక్కన గల కొర్లాం అనే గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ, మందస పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.
మరుగున పడిన చరిత్ర
క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నిర్మించినట్టు చెబుతున్న ఈ దేవాలయం, దీని ప్రాశస్త్యం గురించి ఇంతవరకు వెలుగులోకి రాలేదు. మహేంద్రతనయ నది తీరాన గల ఈ దేవాలయానికి పురాణ, చారిత్రక నేపథ్యాలు ఉన్నాయి. పొత్తంగి పొత్తీశ్వరాలయానికి, ప్రస్తుతం ఒరిస్సా గజపతి జిల్లా పర్లాకిమిడికి 75 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లోని ఎత్తయిన పర్వత శిఖరమైన మహేంద్రగిరులపై పాండవులచే నిర్మితమైనట్టు చెబుతున్న ప్రాచీన గుడులకు, శ్రీకాకుళం జిల్లా బారువాలోని కోటిలింగాల గుడులకు గల సంబంధాలను గురించి అనేక పౌరాణిక గాథలున్నాయి.
నదీజన్మస్థానం..
పొత్తంగి దేవాలయానికి ఆనుకుని ప్రవహిస్తున్న మహేంద్రతనయ నది మహేంద్రగిరిలో పుట్టి, మూడు పాయలుగా చీలి బారువా దగ్గరలో గల బంగాళాఖాతంలో కలుస్తుంది. పొత్తంగి ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో మహేంద్రగిరి పుట్టిన చోట ‘పరశురాంకుండ్’ ఉంది.
ఓఢ్ర నిర్మాణ శిల్పశైలి..
ఈ పొత్తీశ్వరాలయం క్రీస్తు శకం 11, 12 శతాబ్దాల మధ్య అనగా క్రీస్తుశకం 1144లో పూరీ మహారాజుచే నిర్మిత మైనట్టుగా తెలుస్తోంది. ఈ శైవ క్షేత్రం ఓఢ్ర శిల్పనిర్మాణ కౌశలంతో అలరారు తోంది. ఈ దేవాలయపు గర్భగుడి ద్వారం గోడలపై గల శాసనం దేవనాగరి లిపిలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ లిపి ఒడియా గాని, తెలుగు గాని కాదు. ఒకప్పుడు ఈ ప్రాంతం కళింగ గజ పతుల పాలనలో ఉండటం చేత వారే ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. అలాగే మహేంద్రగిరులపై ఉన్న పాండ వుల గుడులను కూడా ఆ కాలంలోనే నిర్మించి నట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.
గర్భాలయంలో లోతున శివలింగం
ఈ దేవాలయంలో ఉన్న శివలింగం పేరు- పుట్టీశ్వరుడు. పొత్తీశ్వరుడని కూడా స్థానికంగా పిలుస్తారు. ఈ శివలింగం దేవాలయం గర్భగుడిలో చాలా లోతున ఉంటుంది. మెట్లు దిగుతూ కిందకు వెళ్లాలి. ఈ శివలింగాన్ని చేతితో తాకితే పొట్ట (ఉదర) భాగాన్ని తాకిన భావన కలుగుతుంది. అంటే మెత్తని స్పర్శ తగులుతుంది. మహేంద్రతనయ నది ప్రభావం వల్ల కాబోలు శివలింగం తడిగా, తేమగా ఉంటుంది. ఈ లింగం దగ్గరలోనే గోవు గుండెకాయను పోలిన చిన్నపాటి రాతి విగ్రహాన్ని కూడా చూడవచ్చు.
దేశంలో రెండుచోట్ల ఆ చిహ్నం
ఈ దేవాలయం చుట్టూ జైన, బౌద్ధ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒక జైన రాతి విగ్రహంపైన ఉన్న చక్రాన్ని బట్టి ఇది జైన తీర్థంకులలో ఐదవ తీర్థంకుడైన సుమతినాథుడి కాలం నాటిదిగా చరిత్రకారులు చెబుతారు. ఇటువంటి చిహ్నాలు కలిగిన విగ్రహాలు దేశంలో అస్సాం రాష్ట్రంలోని సూర్యపహాడ్‍లోనూ, రెండవది పొత్తంగిలో మాత్రమే కనిపిస్తాయని పురావస్తు పరిశోధకులు చెబుతారు.
చుట్టూ ఎన్నో ఆలయాలు
ఈ దేవాలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడి విగ్రహంతో పాటు దుర్గాదేవి, ఒరిస్సా సంప్రదాయంలోని జగన్నాథస్వామి, బలభద్ర, సుభద్ర మూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. పొత్తంగి గ్రామానికి ఆనుకుని ఉన్న సిరిపురం, మహాదేవపురం అనే గ్రామాల్లో రాధాకృష్ణ మందిరం, గోపీనాథ ఆలయం, రఘునాథ మఠం, రామలక్ష్మణ సీతాసమేత మందిరాలు, మఠాలకు పరంపరగా మఠాధిపత్యం వహించిన మహంతుల సమాధులు (పన్నెండు తరాలకు చెందినవి), హనుమాన్ మందిరం, ఉత్తరేశ్వర స్వామి, గోకర్ణేశ్వరస్వామి వంటి ఆలయాలు ఉన్నాయి.
అర్జునుడి గోహత్యా పాతకం
పొత్తంగి పొత్తీశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన ఇతిహాస గాథ విషయానికి వస్తే.. ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు పితృశ్రాద్ధం కోసం •డ్గమృగం వేటకు వెళ్లాడు. ఈ సందర్భంలో కపిలేంద్ర అనే ఆవును గంగా (ఖడ్గమృగం)గా భావించి బాణంతో కొట్టగా ఆ ఆవు శరీర భాగాలు చెల్లాచెదురై నలువైపులా పడ్డాయట. ఆవు యొక్క శిరసు భాగం మహేంద్రగిరిపైన, పొట్ట (ఉదర భాగం) పొత్తంగి అనేచోట, పొదుగు భాగం బారువ అనే ప్రాంతంలోనూ పడ్డాయట. అర్జునుడికి గోహత్యా పాతకం చుట్టుకుంది. దీంతో ఆయన గోహత్యా పాతక నివారణకు తపస్సు చేసి కపిల ఆవు పడి ఉన్న భాగంలో శివలింగాన్ని స్థాపించాడట. అదియే ప్రసిద్ధమైన శైవాలయంగా మారిం దట. ఆవు యొక్క తల భాగం పడినచోట మహేంద్రగిరిపై వెలసిన పాండవుల గుడులుగా చెప్పబడుతున్న గోకర్ణేశ్వరుడు, శరీరం పడినచోట ఉత్తరేశ్వరుడు, పొట్ట భాగం పడినచోట పొత్తీశ్వరుడు (పొట్టీశ్వ రుడు), రక్తం, పొదుగు భాగాలు పడినచోట కోటిలింగేశ్వరుడు (బారువా గ్రామంలో) వెలిశారు. పొట్టీశ్వరస్వామిని దర్శించుకో కుండా మహేంద్ర దర్శనం వృథా అని విభిన్న పురాణాల్లో ఉంది.
శివరాత్రి యాత్ర..
పొత్తంగి గ్రామంలోని పొత్తీశ్వరాలయంలో ప్రతి సోమవారం భక్తుల తాకిడి ఉంటుంది. కార్తీక మాసంలోనూ, శివరాత్రి పర్వదిన సందర్భాల్లోనూ భక్తులు ఈ ఆలయాన్ని వేలసంఖ్యలో దర్శించుకుంటారు. శివరాత్రి రోజున మహేంద్రగిరులపై ఉన్న పాండవుల గుడులను దర్శించుకున్న భక్తులు అనంతరం పొత్తంగి చేరుకుని మహేంద్రతనయ నదిలో స్నానాలు చేసి పొత్తీశ్వరుడిని దర్శించుకుని అటు నుంచి బారువా గ్రామానికి చేరుకుని కోటిలింగేశ్వర ఆలయాన్ని దర్శించడంతో భక్తుల శివరాత్రి యాత్ర పూర్తవుతుంది.
ఎక్కువ మంది పేర్లు పొట్టెమ్మ, పొట్టెయ్య
పొత్తంగి ఊరికి తగినట్టే ఈ ప్రాంతంలోని చాలామంది వ్యక్తులకు పొట్టెయ్య, పొట్టెమ్మ అనే పేర్లు ఉంటాయి. ఇంత ప్రాశస్త్యం ఉన్న ఈ శైవాలయం ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధికీ నోచుకోలేదు. మారుమూల ప్రాంతంలో ఈ ఆలయం ఉండటం వల్ల, ఒరిస్సా రాష్ట్రానికి సరి హద్దు ప్రాంతంలో ఉండటం వల్ల కూడా ఆలయం మరుగున పడిపోవడానికి కారణంగా చెప్పవచ్చు.
అభివృద్ధికి నోచక..
ప్రస్తుతం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుస్తున్న ఈ దేవాలయానికి ఆదాయం కూడా అంతంత మాత్రమే. సుమారు పది ఎకరాల భూమి దేవుడి పేరు మీద ఉన్నప్ప టికీ దాని మీద కూడా పెద్దగా వచ్చే ఆదాయ మేదీ లేదు. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి వెలుగులోకి తీసుకువస్తే మరింత పురోభివృద్ధి సాధించడంతో పాటు చారిత్రక నిర్మాణాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది.

























































































































































































































































































































































































































Review పుణ్యభూమి.