పురాణ పాత్రలు

సత్యవ్రతుని కథ మిక్కిలి ఆసక్తికరమైనది.
ఒకనాడు జమదగ్ని తదితర మునులందరూ ఒకచోట సమావేశమై ఏ దేవతా పూజ శీఘ్రంగా ఫలించగలదని చర్చించుకోసాగారు. మునిజన సమావేశంలో ఉన్న లోమశ మహర్షి ‘దేవీ పూజ శీఘ్ర ఫలదాయకం. అంతకు మించినది లేదు. అందుకు సత్యవ్రతుని కథే ఉదాహరణగా చెప్పుకోవచ్చు’ అన్నాడు.
‘ఎవరా సత్యవ్రతుడు? ఏమా కథ?’ అని మిగిలిన మునులందరూ ముక్తకంఠంతో అడిగారు. అప్పుడు లోమశ మహర్షి సత్యవ్రతుని కథను ఇలా చెప్పాడు-

పూర్వం దేవదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పరమ నిష్ఠాగరిష్టుడు. సంసారాశ్రమం ప్రారంభించి ఎన్నాళ్లయినా సంతానం కలగకపోవడంతో ఎలాగైనా పుత్ర సంతానం పొందాలనే సంకల్పంతో ఒక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగానికి గోబిలుడు అనే పురోహితుడిని ఉద్గాతగా నియమించుకున్నాడు. యాగం కొనసాగుతుండగా ఒకచోట గోబిలుడికి మంత్రోచ్ఛారణలో స్వర భంగమైంది. దీంతో దేవదత్తుడు ఆగ్రహించి, గోబిలుడిని నిందించాడు. దేవదత్తుడి నిందతో గోబిలుడికి కూడా ఆగ్రహం కలిగింది. ‘ఆ కోపంలో ‘నీకు పుట్టబోయే కుమారుడు మూర్ఖుడవుతాడు’ అని శపించాడు.
దేవదత్తుడు తన తొందరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. శాపోపశమనం చెప్పాలని గోబిలుడిని ప్రార్థించాడు. శాంతించిన గోబిలుడు కరుణార్ధ్ర హృదయుడై ‘చింతించకు. దేవి అనుగ్రహం వల్ల నీ కొడుకు ప్రాజ్ఞుడవుతాడు’ అని పలికాడు. అనంతరం యాగాన్ని యథావిధిగా నిర్వహించి, ముగించి గోబిలుడు వెళ్లిపోయాడు.
యాగఫలంగా కొన్నాళ్లకు దేవదత్తుడికి ఒక కుమారుడు పుట్టాడు. అతడు మూర్ఖుడై తిరగసాగాడు. కొద్ది వయసు వచ్చే సరికి అతడికి ఉపనయనం చేయాలని దేవదత్తుడు తలచాడు. అయితే కుమారుడి నోట అక్షరం ముక్కయినా పలకదాయె. దేవదత్తుడు, అతడి భార్య కుమారుడి భవిష్యత్తుపై ఆశలు వదులుకున్నారు. అతడి మానాన అతడిని విడిచి పెట్టేశారు. తల్లిదండ్రుల నిరాదరణకు గురైన ఆ కుమారుడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఇల్లు విడిచి అడవుల్లోకి వెళ్లిపోయాడు.
కారడవిలో ఒక నది ఒడ్డుకు చేరుకుని అతడు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ఉండసాగాడు. ప్రతి రోజూ నదిలో స్నానం చేస్తూ, అడవిలో ఆ సమయానికి ఏది దొరికితే దాంతో కడుపు నింపుకుంటూ, కందమూలాలను భుజిస్తూ గడపసాగాడు. తీరిక వేళల్లో నది ఒడ్డున కూర్చుని ఏవో ఆలోచనల్లో నిమగ్నమై ఉండేవాడు. అయితే, అతడు ఎల్లప్పుడూ సత్యాన్ని మాత్రమే పలికేవాడు. అందువల్ల అతడికి సత్యవ్రతుడనే పేరు వచ్చింది.
ఒకనాడు యథా ప్రకారం అతడు నది ఒడ్డున కూర్చుని ఉన్నాడు. అప్పుడొక అనుకోని సంఘటన జరిగింది.

భీతావహ స్థితిలో ఉన్న అడవి పంది ఒకటి పరుగు పరుగున వచ్చి సమీపంలోని పొదల్లోకి చేరి నక్కింది.

ఆ అడవి పందిని తరుముతూ ఒక బోయవాడు విల్లంబులు చేతబట్టుకుని అక్కడకు పరుగు పరుగున వచ్చాడు.

ఆ ప్రాంతంలో ఆ సమయంలో నది ఒడ్డున సత్యవ్రతుడు తప్ప మరెవరూ లేరు. మరో జంతువు అలికిడి కూడా లేదు.

బోయవాడు సత్యవ్రతుడిని సమీపించి, ‘అయ్యా! నేనొక అడవిపందిని తరముకుంటూ ఇటు వచ్చాను. ఆ పంది కానీ ఇటువైపుగా వచ్చిందా? అది ఎటువైపు వెళ్లిందో మీరు చూశారా?’ అని అడిగాడు.

పక్కనే ఉన్న పొదల్లో దాగి ఉందని చెబితే అనవసరంగా ఆ మూగజీవి ప్రాణాలు పోతాయని భావించిన సత్యవ్రతుడు ఏం చేయాలా? ఏం చెప్పాలా? అని ఆలోచనలో పడ్డాడు. అసలే అబద్ధం ఆడని మనిషి. కానీ, ఈ విషయాన్ని ఎలా అధిగమించాలి? అని తీవ్రంగా ఆలోచించి చివరకు బోయవాడితో ఇలా అన్నాడు-
‘మాట్లాడే నోరు చూడలేదు. చూడగల కళ్లు మాట్లాడలేవు. కాబట్టి నేనేమి చెప్పగలను?’.

బోయవాడు సత్యవ్రతుడి వైపు తేరిపార చూశాడు. అతడు చెప్పిందేమీ అర్థంగాక, వీడెవడో పిచ్చివాడిలా ఉన్నాడని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

బోయవాడు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాక బతుకుజీవుడా అనుకుంటూ పొదల్లో నక్కిన అడవిపంది బయటకు వచ్చింది. ఆ ఆనందంలో గట్టిగా అరిచింది. ఆ వరాహ నాదంలో సత్యవ్రతుడికి ఐంకార, క్లీంకార, హ్రీంకార స్వరాలు వినిపించాయి. దాని అరుపులు అతడికి ఎంతో మధురంగా తోచాయి. అప్పటి నుంచి ఆ స్వరాలనే జపిస్తుండే వాడు. అవి జగన్మాత బీజాక్షర స్వరాలు. ఏళ్ల తరబడి అతడు అదే జపాన్ని విడిచిపెట్టకుండా కొనసాగిస్తుం డటంతో కొన్నాళ్లకు అతడి జపశక్తికి మెచ్చి దేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమైంది.
సత్యవ్రతుడు ఆమెకు నమస్కరించి, ‘తల్లీ! నువ్వే నన్ను కాపాడవచ్చిన జగన్మాతవు. నిన్నెలా స్తుతించాలో నాకు తెలియదు. నాకు వేరే మంత్రాలు రావు. అక్షరం ఎరుగని అజ్ఞానిని. ఎంత ప్రయత్నించినా అక్షరం ముక్క ఒంటబట్టడం లేదని విసిగిపోయి నా కన్న తల్లిదండ్రులే నన్ను వదిలేశారు. నన్ను పట్టించుకోవడం మానేశారు. వారి నిరాదరణ వల్లనే నేనీ అడవిలోకి చేరుకున్నాను. నా మీద దయతలచి నీకు తోచిన విధంగా నన్ను కాపాడు’ అంటూ సత్యవ్రతుడు ఆమె పాదాలపై పడి కన్నీళ్లతో ప్రార్థించాడు.
జగన్మాత అతడిని కరుణించి, ‘సత్యవ్రతా! పైకి లే నాయనా! నీ సత్యమే నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది. ఇన్నాళ్లూ నువ్వు జపించినది నా మంత్రమే. విడువక జపించడాన్ని ఇకముందు కూడా కొనసాగించు. త్వరలోనే నువ్వు మహా పండితుడవై, కవివై లోక ప్రఖ్యాతి పొందగలవు’ అని ఆశీర్వదించి దేవి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
జగన్మాత మహిమ వల్ల సత్యవ్రతుడు తరువాత కాలంలో గొప్ప కవి, పండితుడు, మహాజ్ఞాని అయ్యాడు. కొన్నాళ్లకు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. జ్ఞానిగా మారి ఇంటికి చేరుకున్న పుత్రుడిని చూసి దేవదత్త దంపతులు మురిసిపోయారు.

Review పురాణ పాత్రలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top