పలుకు‘బడి’

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల
గురించి తెలుసుకుందాం.

కంచి గరుడసేవ
కంచి పుణ్యస్థలం. అది విష్ణుకంచి, శివకంచి అని రెండు భాగాలు. మొదటి దాంట్లో గరుత్మంతుడి విగ్రహం ఉంది. ఆయన విష్ణుమూర్తికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు కాబట్టి ఆయనకు సేవ చేస్తే దేవుడికి సిఫారసు చేసి ఉద్ధరిస్తాడనేది విశ్వాసం. ఆయనకు చేసే సేవలు చాలా కష్టమైనవి. ఒక పట్టాన తేలేవీ, తెమిలేవీ కావు. ఇంతా చేస్తే అదంతా వృధా ప్రయాస కావచ్చు. ఒక్కోసారి ఈ సేవలు విపరీత పరిణామాలను తెచ్చిపెట్టవచ్చు. తనకు చేయవలసిన సేవలను తన సేవకుడికి చేసినందుకు అసలు దేవుడికి కోపం వచ్చినా రావచ్చు. దుష్కరమైన ఈ సేవల్లో అనాచారం లాంటి అపచారాలు జరిగితే అందుకు గరుడాళ్వారు కోపించి బాధించనూవచ్చు. తేలని, తెమలని, ఎంత చేసినా తృప్తిలేని, ఫలితం లేని సేవలను కంచి గరుడసేవ అంటారు. నిష్ఫల ప్రయాసను ఈ పేరుతో పిలుస్తారు.

కంచి మేక
కంచి ప్రాంతాల మేకలకు పెద్ద పొదుగు ఉంటుంది. అంటే ఎక్కువ పాలిస్తాయి. అయితేనేం? ఆ పాలు పిండుకుని తాగేవాళ్లుండరు. అవన్నీ వృధాగా పోయేవే. మహా అయితే దాని పిల్లలకు మాత్రం ఉపయోగపడతాయి. అందువల్ల కావాల్సినంత డబ్బుండి, దానబుద్ధి లేక, తన పిల్లలకు మాత్రమే ఆస్తులిచ్చి పోయే వాళ్లను కంచి మేకలని అంటారు. వారికున్న సొమ్ము లేని వారికి ఏమాత్రం పనికిరాదు, దక్కదు. కానీ, వారి దగ్గర మూటలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఆ మూటలు దక్కే మార్గం లేదు.. వారసులకు తప్ప. ఈ కారణంగా త్యాగబుద్ధి లేని ధనవంతులను కంచి మేకలని అంటారు.

కట్టుబానిస
భారతదేశంలో బానిస విధానం పూర్వం లేదని కొందరి నమ్మకం. బానిస శబ్దం ‘బానసం’ అనే మాట నుంచి పుట్టింది. బాసనం అంటే వంట. పూర్వం ఒక తండా మీద మరొకటి విరుచుకుపడి జయించినపుడు ఓడిన వారి చేత గెలిచిన వాళ్లు వంటలు చేయించుకునే వారట. ‘అంట్లు తోమడం’ అని కోస్తా వారి వ్యవహారంలో ఉన్న మాటను ఇప్పటికీ తెలంగాణ వాడుకలో ‘బాసనలు కడగడం’ అంటారు. బాసన అనేది బానస శబ్దం వర్ణ వ్యత్యయం పొందినందున ఏర్పడ్డ రూపం. అందుకే బాసనం అనేది బానసంగా మారింది. తరతరాలుగా బానిస పనిలో ఉన్న వ్యక్తి కట్టు బానిస. కట్టు అంటే ఒప్పందం, ఏర్పాటు. తండ్రో, తాతో చేసిన ఈ చాకిరీని తాను కూడా ఒట్టు వేసుకున్నట్టు చేసే వాడన్న మాట. మూలార్థం మరుగున పడిపోయి వెట్టిచాకిరి అనే అర్థంలో నిలిచిన ఈ జాతీయం వ్యక్తుల దీన చరిత్రను గుర్తుకుతెస్తుంది.

కత్తి మీద సాము
నేల మీద సాము చేయాలంటేనే ఆరోగ్యం, బలం, నేర్పు కావాలి. కత్తి అంచున నిలిచి సాము చేయడం మాటలతో పనికాదు. అలా చేసిన
వాళ్లున్నారో లేదో తెలియదు. తాళ్ల మీద, తీగల మీద నడిచే వాళ్లున్నారు. కత్తుల్లాంటి మేకులున్న బల్ల మీద పడుకుని బరువులెత్తించుకుని బతికిన వాళ్లున్నారు. కానీ, విచ్చుకత్తి మొన మీద నిలిచి సాము చేసిన వాళ్లున్న దాఖలా లేదు. అయినా, అదో మహత్తర విద్య. అదెంత భయంకరమైనదో చెప్పలేం. కళ్లారా చూస్తే కానీ నమ్మవలసిన విషయం కాదని, అత్యంత ప్రమాదకరమూ, అసాధ్యమూ అని చెప్పడానికి ఫలానా పని కత్తి మీద సాములాంటిదని అంటారు.

కత్తుల బోను
సర్కసులాంటి ప్రదర్శనల్లో కత్తులు గుచ్చిన బోను చూస్తుంటాం. అన్ని వైపుల నుంచి చిక్కులూ, ప్రమాదాలూ వచ్చి పడుతుంటే ఎలాగో ప్రాణాలు దక్కించుకుంటూ చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ ఉండటాన్ని కత్తుల బోనులో ఉన్నట్టు చెబుతారు. కత్తులు అచ్చమైన కత్తులు కావు. బోను ఉండనక్కర్లేదు. విసిగిన గృహస్థుడు తన సంసారం కత్తుల బోనులా ఉందని వేదనపడుతుంటాడు.

కథల కామరాజు
యుగంధరుడి లాంటి వాళ్లు కథలో పాత్రలయితే, కథలే అల్లిన వాడు కథల కామరాజు. ఈ కామరాజు ఎవరో నిష్కర్షగా చెప్పలేం కానీ ‘మదన కామరాజు కథలు’ ఆయన చెప్పినవేనని అనే వాళ్లున్నారు. జానపద పద్ధతిలో రాకుమారుల కథలు చెప్పడం వల్ల కామరాజుకు మంచి కథకుడనే పేరొచ్చింది. ఎవరైనా అభూత కల్పనలతో మానవులనూ, దానవులనూ, దేవతలనూ పాత్రలుగా పెట్టి అవసరార్థం మరికొన్ని జంతువులను చేర్చి కథలు చెబితే- వారిని ‘కథల కామరాజు’ అంటారు. కాలక్రమాన నిజం కన్నా కల్పన, సాధ్యం కన్నా అసాధ్యం, విశ్వసనీయత కన్నా అభూతకల్పన ఎక్కువ పాళ్లలో ఉండేట్లు మాట్లాడే వాళ్లను కథల కామరాజు అనడం పరిపాటైంది.

కందవిత్తు
కంద దుంపకు విత్తనం ఏమిటనేది ప్రశ్న. దుంపను నాటితే మొక్క మొలుస్తుంది. మళ్లీ ఆ మొక్కే నేలలో దుంపలు పెడుతుంది. ఈ విధంగా ఒకే కుటుంబంలో సంతానవృద్ధి జరుగుతుంటే అది కందవిత్తులాంటి సంసారమని అంటారు. ఆర్భాటం, పరిశ్రమ లేకుండా అభివృద్ధి సాధించడాన్ని కూడా కందవిత్తుతో పోలుస్తారు.

కన్నాకు
కన్నాకు అంటే ‘మొదటి ఆకు’ అని అర్థం. చెట్టుకు కాని తీగకు కాని మొట్టమొదట పుట్టిన ఆకు. చెట్టో తీగో మొదటిసారిగా ‘కన్న’, చిగిర్చిన ఆకన్న మాట. అదే చెట్టు బతికిందనడానికి చిహ్నం. అందువల్ల ‘ముఖ్యమైన, శ్రేష్ఠమైన తలకట్టు’ వంటి అనే అర్థాలు వచ్చాయి దీనికి. ‘ ఊరికి ఆయన కన్నాకు లాంటివాడు’ అంటే ‘గ్రామపెద్ద, ముఖ్యుడు, గొప్పవాడు’ అని అర్థం. అయితే ఈ మాట అన్ని సందర్భాల్లోనూ పొసగదు. ‘పోరాని చుట్టాలు వచ్చారు.. వంగి వంగి తమలపాకులు తుంచ’మనే నానుడి ఒకటుంది. వంగి వంగి తమలపాకులు తుంచడం అంటే.. తీగ మొదట్లో ఉన్న ఆకులను కోయాలని భావం. తమలపాకుల విషయంలోనైతే తీగ మొదలు దగ్గరున్న ఆకులు ముదురువి. అవి తాంబూలానికి పనికిరానివి. ‘ఇప్పటికి చేసిన మర్యాదలు చాలు. ఇక బయటకు పంపడం మేలు’ అనే భావంతో పై వాక్యం పుట్టింది. తాంబూలానికి తమలపాకులు లేతవి కావాలి. ముదురాకుల తాంబూలం ‘ఇక దయచేయండి’ అని సూచించడానికి గుర్తు. మిగతా మొక్కలు, తీగలకు వేసిన మొదటి ఆకును మనుషుల ప్రాధాన్యానికి గుర్తుగా వాడితే, తమలపాకులకు చిగిర్చిన మొదటి ఆకును మాత్రం మనుషుల పట్ల చూపే నిరాదరణకు ప్రతీకగా వాడుకలోకి వచ్చింది.

కప్పగంతులు
దీపావళి సరంజామాలో చాలా చౌకగా, ఎక్కువ ఆనందకరంగా ఉండే వస్తువుల్లో కప్పగంతులొకటి. చాలా కాలం క్రితమే వీటి అమ్మకాలను నిషేధించారు. ఇవి పాతకాలపు దమ్మిడీ అంత పరిమాణంలో ఉండి అదే రూపంలో ఉండేవి.

వాటిని గోడపైనో, బండపైనో రాసి పడేస్తే చిటపటలాడుతూ ఎగిరిపడేవి. కొద్ది ఒరిపిడికే నిప్పురవ్వలు రాల్చేవి. వీటివల్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగేవి. పిల్లలకు విశేషానందం కలిగించిన ఈ కప్పగంతులు ఇప్పుడు కనిపించవు. కప్పల్లా గంతులు వేస్తాయి కాబట్టి వీటికి కప్పగంతులని పేరొచ్చింది.

నిజానికి ఎటువంటి కప్పా వీటిలాగా అన్నివైపులకు ఎగరలేవు. అలాగని ఇవి కుప్పిగంతులూ కావు. కుప్పించి- అంటే పైకి మాత్రం- ఎగిరితే అవి కుప్పిగంతులు. కానీ, కప్పగంతులకు ఒక దిశ లేదు. పెద్ద మంటలు రావు. వెలుగు లేదు. చిటపటలాడుతూ నానా దిక్కులకూ ఎగిసిపడేవి. అందువల్ల ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ, మాటలాడుతూ, తిట్టుకుంటూ, ఇతరులను తిడుతూ మండిపడే వాళ్లను కప్పగంతుల వాళ్లని పిలిచే వారు. అటువంటి వ్యక్తులు నేటికీ ఉన్నారు కానీ వారిని పోల్చి చెప్పే కప్పగంతులు ఇప్పుడు లేవు. వస్తువు లేకపోయినా మాట నిలిచింది.

Review పలుకు‘బడి’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top