కుడితి పులుపే బర్రె బలుపు

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల
పరిచయం..

రైతులకు వ్యవసాయం తరువాత ప్రధాన జీవనాధారం పశుపోషణే. ఒకప్పుడు పాడి లేని ఇల్లు లే•దంటే అతిశయోక్తి కాదు. ఆ ప్రాముఖ్యతను బట్టే కొన్ని సామెతలు పుట్టాయి. ‘పాడి లేని ఇల్లు పేడలేని చేను’, ‘పాడితో పంట ఓపదు’ అనే సామెతలు ఈ విషయాన్నే తెలుపుతాయి.
‘అప్పు చేసి ఆవును కొనవచ్చు కానీ గేదెను కొనరాదు’ అనేది ఓ సామెత. ఆవు ఒక కోడె దూడను ఈనితే రైతు కరువు తీరిపోతుందని ఈ సామెత చెబుతుంది.

‘చూడి లేని పాడి దు:ఖపు పాడి’గా భావిస్తాడు రైతు. తొలిచూలు ఆవు పాలు తక్కువగా ఇస్తుందనే విషయాన్ని ‘దూడపాలు దుత్తకే ఆయె’ అనే సామెత విశదీకరిస్తుంది. ఇంకా పలుచని గొడ్డు పాలు ఎక్కువిస్తుందని, గడ్డి బాగా పడితేనే పాడి ఎక్కువ అని, దాయకట్టక పోతే ఆవు తంతుందని.. ఇలాంటి సూక్ష్మమైన విషయాలన్నీ ‘పలుచని గొడ్డుకు పాలెక్కువ. పిండని ఆవుకు పొదుగెక్కువ’, ‘పశువు పాలు కసవును బట్టే’, ‘దాయకట్టని ఆవు తన్నక మానదు’ అనే సామెతల ద్వారా మన పెద్దలు నాడే చెప్పారు.
ఎనుము (గేదె) ‘నన్ను చూస్తే నిన్ను కాస్తానంటుంద’ట రైతుతో. ఎనుమును సాకడం అంత సులభం కాదు. ‘ఏనుగుకు ఒక సీమ, గుర్రానికి ఒక ఊరు, బర్రెకొక బానిస’ ఉండాలనేది మరో సామెత. ఎనుమును కొనేటప్పుడు ఎన్ని పాలిస్తుందో చూడాలి. ‘పాడిని చూసి బర్రెను, తల్లిని చూసి పిల్లను తీసుకోవాలి’ అని సామెత.
ఎవరు పడితే వాళ్లు పిండితే పశువులు పాలివ్వవు. ‘పిండేవాడు పిండితే పిటుకురాయైనా పాలిస్తుంది’ అనేది పాలు నేర్పుగా పిండే విధానాన్ని తెలిపే సామెత. మలప గేదె, మక్కిన బర్రె పాలు ఎక్కువ ఇస్తాయి. ‘మలప గేదె మానెడు పాలు ఇచ్చును’, ‘మక్కిన బర్రెకు ముక్కున పాలు’ అనే సామెతలు ఈ విషయాన్ని చెప్పేవే.
ఎనుముకు కుడితి అంటే చాలా ప్రీతి. ‘కుడితి మరుగు బర్రె విడి నీరు తాగునా’, ‘కుడితి పులుపే బర్రె బలువు’ అనే సామెతలు అందుకు ఉదాహరణలు. ఎనుము చచ్చే దాకా ఈనుతూనే ఉంటుంది. అందుకే ‘ఎనుము ముసలి ఏనాది ముసలి లేవు’ అని సామెత రూపంలో చెప్పారు.
ఇక, ఎద్దు లేనిదే మాగాణి సేద్యం లేదు. ఇది బీదవాడి సేద్యపు పశువు. ‘ఎనుబోతు పేదల యశము గోరు’ అని సామెత. కొల్లేరులో ఒకప్పుడు సేద్యంలో ఎద్దులను విరివిగా వాడేవారట. ఇక్కడ పంటలు గణనీయంగా సాగయ్యేవి. అందుకే ‘కొల్లేటిలో పండే పంటకు లెక్కే కానీ, చచ్చే దున్నపోతులకు లెక్కే లేదు’ అని సామెత. ‘బుధవారం పుట్టిన దున్న భూమిని దున్నినా, తొక్కినా పొంగి పొంగి పండుతుంది’ అని రైతుల నమ్మకాన్ని తెలుపుతుందీ సామెత.
పాడి పశువుల తరువాత ప్రధాన జీవనాధారంలో గొర్రెలు, మేకలు కూడా ఒక భాగం. దీనిని ఆధారంగా చేసుకుని కూడా అనేక సామెతలు మన తెలుగునాట పుట్టాయి. ‘నేలను గొర్రె తొక్కినా చాలు’, ‘కర్రకు పెట్టినా, గొర్రెకు పెట్టినా చెడదు’ అనే సామెతలు అందుకు ఉదాహరణలు. అందువల్లే రైతులు గొర్రెలను, మేకలను కొని జీతగాణ్ణి పెట్టి మరీ మేపిస్తుంటారు. లేదా వాటిని మేపి లాభం చెరి సగం పంచుకునే ‘సరిబాలు’ పద్ధతిలో మరొకరికి తోలిస్తారు. గొర్రెల ఎద సమయం హస్త కార్తె కాలం. ‘హస్త కార్తెలో వాన వస్తే అడుగకనే గొర్రె కట్టు’ అనే సామెత దీని ఆధారంగానే పుట్టింది. ‘ప్రాకొన్న నూతి యుదకము, మేకల పాడియును రోత’ కాబట్టే వీటి పాడి అంతగా ఉపయోగించరని అంటారు. అయితే, చాలాచోట్ల వీటి వ్యర్థాలను పంటలకు ఎరువుగా వాడే ఆనవాయితీ కూడా ఉంది. గొర్రెలు, మేకల మందలను తోటల మధ్యలో కట్టి వాటి మలమూత్రాలను భూమి సారం పెంచేందుకు వాడుతుంటారు.

Review కుడితి పులుపే బర్రె బలుపు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top