కష్టాలొచ్చినా.. కష్టాలు తీరి సుఖాలు కలిగినా అందుకు పరిహారంగా దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కుకుంటాం కదా! వాటిని ఏదైనా కారణంతో సమయానికి తీర్చలేకపోయినా లేదా మరిచిపోయినా దేవుడికి కోపం వస్తుందా? అందుకు ప్రతిగా మరిన్ని కష్టాలు కలిగిస్తాడా?
భగవంతుడు ఎల్లప్పుడూ మన అంతరంగాన్ని, పరిస్థితిని గమనిస్తాడు తప్ప కఠినమైన నియమాలను పెట్టడు. తనకు మొక్కులు తీర్చలేదని కక్ష పెట్టుకోడు. మనల్ని మరింత కష్టపెట్టడు. ఒకవేళ ఏదైనా మొక్కుకుని అది తీర్చేందుకు తగిన సమయం లేనప్పుడు, వీలు కానప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితుల్లో పూజా మందిరంలోని దేవుడి ముందు నిలుచుని ఫలానా సమయంలో మొక్కును చెల్లించుకుంటానని మనస్ఫూర్తిగా విన్నవించుకోవచ్చు. అలాగే, దీనికి మరో పరిష్కారమూ ఉంది. ఉదాహరణకు ఫలానా పని అయితే తిరుపతికి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నారనుకోండి. కానీ, ఏదైనా కారణంతో తిరుపతికి వెళ్లలేకపోయారు. అప్పుడు మీకు సమీపంలోని అదే దేవుడి ఆలయాన్ని సందర్శించి సదరు మొక్కును తీర్చుకోవచ్చు. దైవశక్తి ఎక్కడైనా ఒకటే కనుక ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కరలేదు. ఒకవేళ ఆలయంలో అన్నదానం, వస్త్రదానం లాంటివి చేస్తానని మొక్కుకుంటే గనుక పేదలకు కడుపు నిండా అన్నం పెట్టొచ్చు. దుస్తులూ పంచవచ్చు. ఆర్తుల సేవలోనే భగవంతుడు కూడా ఉంటాడు. ఆ సేవ నేరుగా భగవంతుడిని చేరినట్టే అవుతుంది.
ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా నామజపం.. మంత్రజపం అనే మాటలు వినిపిస్తుంటాయి? భగవంతుని నామ జపం, మంత్ర జపం ఒకటేనా? వేర్వేరా? ఒకవేళ ఇవి రెండూ వేర్వేరు అయితే దేని ప్రాధాన్యత ఏమిటి? ఆచరించడానికి ఏది సులువైనది?
ఆధ్యాత్మిక సాధనలో కీలకమైన నామ జపం, మంత్రజపం.. రెండూ ఒకటి కావు. కానీ, రెండూ శక్తిమంతమైనవే. అయితే, రెండింటిలో ఏది ఉత్తమం అనేది మన లక్ష్యం, సాధన, స్థాయిపైన ఆధారపడి ఉంటుంది. సూటిగా చెప్పాలంటే కలియుగంలో భగవన్నామ జపాన్ని మించిన సాధన లేదు. అంటే రోజువారీ పనులు చేసుకుంటూనే రామ, కృష్ణ, గోవింద, మహాదేవ.. అంటూ భగవంతుని పేర్లను స్మరించుకోవడమే నామజపం. దీనికి కఠినమైన నియమాలు ఉండవు. పైగా నామజపంతో భగవంతుడిపైన ప్రేమతో పాటు ఏకాగ్రతా సులువుగా కలుగుతాయి. ఇక మంత్రజపం విషయానికి వస్తే.. దీనికి ప్రత్యేకమైన బీజాక్షరాలు, శబ్దాలూ ఉంటాయి. గురువు సమక్షంలో వాటిని నేర్చుకుని స్పష్టంగా, నియమనిష్టలతో పఠించాలి. ప్రత్యేకమైన లక్ష్యంతో కఠినమైన క్రమశిక్షణతో తప్పులు లేకుండా సాధన చేయాల్సి ఉంటుంది. కనుక ప్రస్తుత కాలంలో భగవంతుని నామ జపమే సులభమైనది, ఉత్తమమైనది. ఉదాహరణకు మన పనిలో మనం నిమగ్నమై ఉంటూనే ‘ఓం నమశ్శివాయ’, ‘ఓం నారాయణాయ’, ‘ఓం కాలభైరవాయ నమ:’ అంటూ ఇష్టమైన దైవం పేరును ఎలాంటి నియమం లేకుండానే నిరంతరం నాలుకపై పఠించవచ్చు. దీనికి మించిన భక్తిమార్గం లేదు. క్రమంగా దీనినే ఓ అభ్యాసంగా చేస్తే అది కూడా ఆధ్యాత్మిక సాధన కిందకే వస్తుంది. ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి నామజపమే శ్రేష్ఠమైనది.
మనం భగవంతుని గురించి పఠించే స్తోత్రాలన్నీ సంస్క•త పదాలతో పలకడానికి కూడా చాలా క్లిష్టంగా ఉంటాయి కదా! ఇవి పఠించేటప్పుడు తెలిసో తెలియకో తప్పులు దొర్లుతుంటాయి. ఇలా తప్పులు పలికితే పాపాలు చుట్టుకుంటాయా? అటువంటప్పుడు ఏం చేయాలి? పరిహారాలేమైనా ఉన్నాయా?
భగవంతుడి అనుగ్రహాన్ని పొందే సులభమైన మార్గాల్లో భాగంగా దైవనామాలూ, శ్లోకాలూ, స్తోత్రాలూ పఠిస్తుండటం సహజమే. అవన్నీ భగవంతుడి రూపాన్నీ, వైభవాన్నీ చాటేవే. అయితే, సమయాభావంతో చాలామంది మహా వేగంగా వాటిని చదువుతుంటారు. దాంతో అక్షరదోషాలు దొర్లడం, అక్షరాలు తారుమారు కావడం, కొత్త పదాలు/అక్షరాలు వచ్చి చేరడం వంటివి జరుగుతుంటాయి. ఫలితంగా ఆ స్తోత్రాల అర్థాలు మారిపోయి భగవంతుడిని నిందించే ఆస్కారమూ ఉంది. అందుకే స్తోత్రాలను గురువు దగ్గర నేర్చుకుని, వాటి అర్థాలను పూర్తిగా తెలుసుకుని వీలైనంత నిదానంగా చదవాలి. అక్షరదోషాలకు ఆస్కారం ఉందని అనిపించినప్పుడు స్తోత్రాలు ఉన్న పుస్తకాన్ని ముందు పెట్టుకుని జాగ్రత్తగా చదవడం అవసరం. అయినా కూడా అక్షరదోషాలు, శ•్ద ఉచ్ఛారణలో దోషాలు వస్తున్నాయని అనిపిస్తే, వాటిని చదవడం మానేయడమే ఉత్తమం. దీనికంటే భగవంతుని ఇష్టమైన నామాన్ని జపించడం ఎంతో మంచిది. ఇది కూడా స్తోత్ర పఠనం ఇచ్చే ఫలాన్నే ఇస్తుంది.
మహిళలు తలనీలాలు సమర్పించవచ్చా? మూడు కత్తెర సంప్రదాయం కూడా ఉంది కదా! పూర్తిగా తలనీలాలు సమర్పించడానికి మూడు కత్తెరలకు తేడా ఏమిటి?
భగవంతుడికి తలనీలాలు సమర్పించడం అనేది కూడా ఒక మొక్కు కిందకే వస్తుంది. నిజానికి ఏ భగవంతుడూ భక్తులను తలనీలాలు సమర్పించాలని అడగడు. అందానికి సంకేతం అయిన శిరోజాలను మొక్కు రూపంలో తొలగించుకోవడం వల్ల అహంకారం నశిస్తుందని చెప్పడమే తలనీలాల సమర్పణ వెనుక ఉన్న పరమార్థం. అయితే, చాలామంది మహిళలు తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటారు. ఇలా ఏదైనా మొక్కుకుని, ఆ కోరిక తీరాక పవిత్ర పుణ్యక్షేత్రంలో తలనీలాలు ఇచ్చేందుకూ ప్రయత్నిస్తుంటారు. అయితే, శాస్త్రాల ప్రకారం మహిళలు ఇలా పూర్తిగా తలనీలాలను సమర్పించడం దోషం కిందకే వస్తుంది. పరాశర స్మ•తి ప్రకారం సుమంగళిగా ఉన్న మహిళ తలనీలాలను పూర్తిగా సమర్పించకూడదు. అందుకు బదులుగా మూడు కత్తెరలు మాత్రమే ఇచ్చి.. ఆ మొక్కును చెల్లించుకోవచ్చు.
పంచాయతన పూజ అంటే ఏమిటి? వినాయక చవితికి గణేశ్ పంచాయతన పూజ చేసే సంప్రదాయం కూడా ఉందని అంటారు. అంటే ఎలా చేయాలి? కొంచెం వివరంగా చెప్పగలరా?
విఘ్నేశ్వర పూజల్లో అష్ట గణపతులు, షోడశ గణపతులు, 32 గణపతుల పూజలు ప్రాశస్త్యమైనవి. ఇవిగాక శ్రీ గణపతి పంచాయతన పూజ మరీ ప్రసిద్ధం. ఆదిశంకరాచార్యులు తంత్రశాస్త్రంలోని పంచపూజలను చక్కదిద్ది సామాన్యుల కోసం పంచాయతన పూజాతత్త్వాన్ని వాడుకలోకి తెచ్చారు. సృష్టికి మూల కారణాలైన పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రి యాలు, మనసుతో కలిపి మొత్తం ఇరవై ఒక్క (21) తత్త్వాలవుతాయి. ఈ తత్త్వాలకు సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, శివుడు పంచమూర్తులు. సృష్టికి అధి దేవతలైన ఈ ఐదుగురిని ఉపాసించడమే పంచాయతన పూజలోని అసలు ఉద్దేశం. దీనికి రూపకల్పన చేసిన ఘనత జగద్గురు ఆదిశంకరులదే.
పంచాయతన పూజలోని ఒక శ్లోకమిది..
దేవీ విష్ణుశ్చ సూర్యశ్చ గణేశశ్చ సదాశివి ।।
ఆరోగ్యాయచ భోగాయ నిర్విఘ్నాయ స్వకర్మాణామ్ ।।
తత్త్వజ్ఞానాయ మోక్షాయ పంచదేవాన్ ప్రపూజయేత్ ।।
కార్యములన్నీ నిర్విఘ్నంగా కొనసాగడానికి గణపతిని, ఆరోగ్యప్రాప్తికి సూర్యుడిని, సకలైశ్వర్య ప్రాప్తికి దేవిని, ఆత్మజ్ఞానానికి పరమశివుడిని, మోక్షం పొందడానికి విష్ణువును నిత్యం మానవులు పూజించాలని పై శ్లోకానికి అర్థం.
పంచాయతన పూజలోని పరమార్థం కూడా ఇదే. హైందవ ధర్మంలో పంచాయతన పూజ విశేష వ్యాప్తిలో ఉంది.

























































































































































































































































































































































































































Review ధర్మసందేహం.