కాలచక్రంలో ఎన్నో మార్పులు..సుల్తానులు అంతరించారు..
విదేశీయులు స్థావరాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు.
రాజ్యాలూ, సంస్థానాలూ కూలిపోయాయి..
శ్రీవేంకటేశ్వరుడి వైభవం మాత్రం నిత్యమై, సత్యమై విరజిల్లుతూనే ఉంది..
శ్రీవారి ‘సాలకట్ల’ వైభవం
ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మికానందాన్ని పంచనున్నాయి. మొదటిది నవాహ్నిక
సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవం. ఇవి 2026, సెప్టెంబరు 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. అక్టోబరు 12 నుంచి 20 వరకు జరిగేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.
వార్షిక బ్రహ్మోత్సవాలు..
వాహనసేవల తేదీలు:
(బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టెంబరు 15 నుంచి 23 వరకు.. రోజూ ఉదయం 8 నుంచి 10 గం. వరకు, సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గం. వరకు వాహనసేవలు)
సెప్టెంబరు 14:
వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
15.9.2026:
సాయంత్రం ధ్వజారోహణం
రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ
16.9.2026:
ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపనం
రాత్రి 7 గంటలకు హంస వాహనం
17.9.2026:
ఉదయం 8 గంటలకు సింహ వాహనం
రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం
18.9.2026:
ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం
రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం
19.9.2026:
ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం
సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11.30 వరకు గరుడ వాహనం
20.9.2026:
ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం
సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం
రాత్రి 7 గంటలకు గజ వాహనం
21.9.2026:
ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపనం
రాత్రి 7 గంటలకు చందప్రభ వాహనం
22.9.2026:
ఉదయం 7 గంటలకు రథోత్సవం
రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం
23.9.2026:
ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం
రాత్రి ధ్వజావరోహణం
వెండివాకిలి.. బంగారు గోపురాలు.. నవరత్న హారాలు.. వజ్ర కిరీటాలు.. సకల సంపదలకు పుట్టినిల్లు.. కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని తలుచుకోగానే మనసులో కలిగే ఆధ్యాత్మిక వైభవమిది. అయితే ఈ నిత్య వైభోగాల నడుమ నానా దిక్కుల నుంచి నరుల మొరలన్నీ ఆలకిస్తూనే ఉంటాడు ఆ బ్రహ్మాండ నాయకుడు. శ్రీవారు కొలువైన తిరుమల వెనుక చరిత్ర, ఐతిహ్యం, విశ్వాసాలూ కలగలసిన ఎన్నో విజయగాథలూ ఉన్నాయి. కొత్త అవతారం దాల్చలేదు. గరుడ వాహనం ఎక్కలేదు. చక్రాయుధం పట్టలేదు. అయితేనేం.. ప్రకృతిని పురమాయించో, భక్తులకు ప్రేరణనిచ్చో ముష్కరమూకల నుంచి తిరుమల ఆలయాన్నీ, అనంత సంపదలనూ రక్షించుకున్నాడు శ్రీనివాసుడు. కలియుగంలో.. దుష్టశిక్షణకు పరమాత్మ ఎంచుకున్న పరోక్ష వ్యూహమిది. మరి, తన వైభవ సంరక్షణకు ఆ పరమాత్ముడు ఎంచుకున్న మార్గాలేమిటో.. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల (2026, సెప్టెంబరు 15 నుంచి 23 వరకు) సందర్భంగా మననం చేసుకుందాం..
పోర్చుగీసు గవర్నర్ దుస్సాహసం
దేశమంతా ముస్లిం పాలకుల ప్రాబల్యం పెరిగింది. ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్, బ్రిటిష్ వ్యాపారులు వాణిజ్యం పేరుతో దేశంలోని కీలక స్థావరాల్లో గుడారాలు వేసుకున్నారు. అటువంటి వారిలో మార్టిం అఫోన్సో డిసౌజా ఒకడు. పోర్చుగీసు గవర్నర్. నిలువెత్తు అహంకారి. అప్పటికే ఏడుకొండల వాడి సంపదల గురించి కథలు కథలుగా విన్నాడు. మూల విరాట్టుకు అలంకరించే వజ్ర కిరీటం, నవరత్నఖచిత శంఖచక్రాలు, స్వర్ణకర్ణపత్రాలు, మకర కుండలాలు, సూర్యకఠారి, నాగాభరణం.. ఇంకా మాళిగల్లోని రాశుల కొద్దీ వెండి, బంగారం.. వీటి గురించి తెలియగానే అతడి మనసులో దోపిడీ ప్రణాళిక రూపుదిద్దుకుంది. విజయనగర అళియ రామరాయలు అంతర్గత కుమ్ములాటలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రోజులవి. అదే సరైన సమయమని భావించాడు మార్టిం. నౌకాదళానికి తోడుగా రెండున్నర వేల కాల్బలం, రెండొందల అశ్వబలం సిద్ధం చేసుకున్నాడు. గోవా నుంచి పులికాట్ వరకూ సముద్ర మార్గంలో వచ్చి, అక్కడి నుంచి కాల్బలంతో తిరుమలకు చేరుకోవాలనేది పన్నాగం. అంతలోనే మార్టింను అనారోగ్యాలు చుట్టుముట్టాయి. మనసులో ఏదో తెలియని అలజడి. నిద్రలో పీడకలలు. ఈ పరిస్థితుల్లో తిరుమల వెళ్లడం శ్రేయస్కరం కాదని సన్నిహితులు చెప్పి చూశారు. అతడు వినలేదు. 1543 ఆగస్టు చివరి వారంలో దాడికి బయల్దేరాడు. నౌకలు నడిసంద్రానికి చేరగానే తుఫాను మొదలైంది. బలగాలన్నీ ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యాయి. ‘తిరిగి వెళ్లిపోదాం’ అన్నారు అనుచరులు. మార్టిం వెనుదిరగక తప్పలేదు. ఏడుకొండలను ఏమీ చేయలేకపోయామనే ఉక్రోషంతో మార్టిం బలగాలు చుట్టుపక్కల ఆలయాలను దోచుకున్నాయి. ఆ తరువాత ఇంకెప్పుడూ తిరుమల మీదికి దండెత్తే సాహసం చేయలేదు మార్టిం. కరుణాసింధు, పాలసంద్రపు పరమాత్ముడు, సముద్రరాజ తనయ ప్రియవల్లభుడైన శ్రీనివాసుడు.. అలా అంబుధిని పురమాయించి మార్టిం వంటి అధర్మవర్తనుల ఆట కట్టించాడేమో!.
వేంకటేశ్వరుడి రుణం తీర్చుకున్న గజేంద్రుడు
కర్ణాటక యుద్ధాల్లో ఆర్కాట్ నవాబు చందాసాహెబ్ తనయుడు రాజా సాహెబ్ ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయాడు. దీంతో అతడి సైన్యంలోని ఉన్నతాధికారులు ముఠాలుగా చీలిపోయారు. అలాంటి ఓ గుంపునకు నాయకుడే మహమ్మద్ కమల్. అంతకుముందే అతడు నెల్లూరు సీమను ఆక్రమించాడు. అక్కడితో ఆగక తిరుమల శ్రీవారి సంపదపై కన్నేశాడు. అప్పటికే తిరుమల రెవెన్యూ వసూలు హక్కులను ఆర్కాట్ నవాబు నుంచి అధికారికంగా పొంది ఉన్నారు ఆంగ్లేయులు. కమల్ మూక తిరుమలకు బయల్దేరిన సంగతి తెలిసి, అతడిని నిలువ రించేందుకు రెండు కంపెనీల సిపాయిలను, 40 మంది యూరోపియన్ సైనికులనూ, మూడు ఫిరంగులనూ పంపారు ఆంగ్లేయులు. కమల్ రాక్షసబలం ముందు ఆంగ్లేయుల శక్తి సరిపోలేదు. మర్నాడు.. ఆర్కాట్ నవాబు సోదరుల్లో ఒకడైన నజీబ్, కెప్టెన్ హాట్ అనే బ్రిటిష్ అధికారి కమల్‌ను అడ్డుకోవడానికి తిరుపతి పొలిమేరల దగ్గర కాపు కాశారు. శ్రీనివాసుడి భక్తుడైన శ్రీకాళహస్తి ప్రభువు దామర్ల వెంకటప్ప వారికి తనవంతు సాయం చేశాడు. అయినా కమల్ ముష్కర మూకదే పైచేయి అయింది. దీంతో కుప్పకూలిపోయిన వెంకటప్ప.. ‘గజేంద్ర వరదా! ఇంత జరుగుతున్నా చూస్తూ ఉన్నావా?’ అంటూ నిస్సహాయంగా రోదించాడు. స్వామి కటాక్షమో.. ఏమో.. ఎక్కడి నుంచో దూసుకొచ్చిన ఓ తూటా కమల్ అధిరోహించిన రాచ ఏనుగును తీవ్రంగా గాయపరిచింది. ఆ మదగజం నొప్పితో హాహాకారాలు చేస్తూ కుంభస్థలంపై కూర్చున్న కమల్‌ను తొండంతో కిందికి లాగి పడేసింది. మిగిలిన ఏనుగులూ బెదిరిపోయాయి. కమల్ సైన్యాన్ని కాళ్లతో తొక్కి పడేశాయి. అంతలో వెంకటప్ప అక్కడికి చేరుకున్నాడు. సగం చచ్చి పడి ఉన్న కమల్‌ను గొలుసులతో బంధించాడు. ఆ దైవద్రోహికి 1753, అక్టోబరు 2న శిరచ్ఛేదన శిక్ష విధించారు. అలనాడు మొసలి బారిన పడిన తనను విష్ణువు ర•క్షించినందుకు కాబోలు.. గజేంద్రుడు ఆ రుణాన్ని ఇలా తీర్చుకుని ఉంటాడు. ఇదీ ఆ పరమాత్మ లీలే!.
అతడే శ్రీవారి సైన్యమై..
1758.. మరాఠా పాలకుడు పీష్వా పన్నుల వసూలుకు తన అనుచరులైన రాఘవ, బాలకృష్ణను రాయలసీమకు పంపాడు. ఏమైందో కానీ వెనక్కి వచ్చేయాలంటూ ఇద్దరికీ ఆదేశాలు అందాయి. కానీ ఏడుకొండల వాడి సంపదను దోచుకోవాలనే దుర్బుద్ధితో వారిద్దరూ వెనక్కి వెళ్లలేదు. కడపలో మకాం వేసి సొంతంగా సైన్యాన్ని సమకూర్చుకున్నారు. అపార బలగాలతో తోడేళ్ల గుంపులా తిరుమల వైపు దూసుకుపోయారు. విషయం తెలిసి ఆలయ అధికారులు దేవుడిపైనే భారం వేశారు. అంతలో, ‘మీరు అనుమతిస్తే యుద్ధానికి వెళ్తాను. స్వామి కటాక్షంతో శత్రువుల్ని తరిమి కొడతాను’ అంటూ శ్రీవారి ఆలయంలో పన్నుల సేకర్తగా పనిచేసే శ్రీనివాసాచారి అనే యువకుడు ముందుకొచ్చాడు. ఇదంతా శ్రీవారి ప్రేరణే కావచ్చని భావించిన అధికారులు సరేనన్నారు.
‘వేంకటేశ్వరా! రామావతారంలో హనుమంతు డికి సముద్రాన్ని లంఘించే బలాన్నిచ్చావు. కృష్ణావతారంలో అర్జునుడికి కౌరవసేనను ఓడించే ధైర్యాన్ని ప్రసాదించావు. నాకు అంత గొప్ప వరాలేం వద్దు. నీ దివ్యాస్త్రాలతో పనిలేదు. ‘ఓం నమో వేంకటేశాయ:’ అన్న నామబలం చాలు. అదే పదివేల సైన్యం’ అంటూ మూలమూర్తి ఎదుట చేతులు జోడించాడు శ్రీనివాసాచారి. ‘విజయోస్తు.. దిగ్విజయోస్తు’ అని ఆశీర్వదించి ఫల మంత్రాక్షితలు ప్రసాదించారు అర్చక స్వాములు. యుద్ధవిద్యలో ఏమాత్రం అనుభవం లేని శ్రీనివాసాచారి వేంకటేశ్వరుడి అనుగ్రహ బలమో.. ఏమో.. ఏదో దివ్యశక్తి పూనినట్టు ముందుకు ఉరికాడు. చేయి తిరిగిన యోధుడిలా దళాన్ని ముందుకు నడిపించాడు. రోజంతా జరిగిన పోరులో ఇద్దరు ద్రోహులనూ హతమార్చాడు. శ్రీవారి సంపదను దోచుకోవాలనే కు•ల్రో మరో భాగస్వామి అయిన బల్వంత్‌రావు బేషరతుగా లొంగిపోయాడు. ‘నాకు చావు తప్పదని తెలుసు. కానీ, చనిపోయే ముందు ఒక్కసారి స్వామిని కళ్లారా దర్శించుకోవాలని ఉంది’ అని బల్వంతరావు సజల నేత్రాలతో వేడుకున్నాడు. శ్రీనివాసాచారి సరేనన్నాడు. బల్వంత్‌రావు ఏడుకొండల వాడి దివ్యమోహన రూపాన్ని కళ్లలో నింపుకుని, ‘నా జన్మ ధన్యం. ఇక ముక్తిని ప్రసాదించండి’ అంటూ చావుకు సిద్ధపడ్డాడు. అతనిలోని పరివర్తనను గుర్తించి క్షమించి వదిలేశారు. స్వామి వారి సేవలో చరితార్థుడైన శ్రీనివాసాచారి తరువాత కాలంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగాడు.
శత్రువులను విభజించి..పాలించి..
మోహినీ అవతారమెత్తి భస్మాసురుడిపై వలపు వల విసిరిన జగన్నాటక సూత్రధారి.. తిరుమల పట్ల ద్వేషం పెంచుకున్న దోపిడీ ముఠాలకు కాసుల ఎర చూపించి కట్టడి చేసిన లీల ఇది. ఒకేసారి ఆలయ సంపదలను దోచుకోవడం కంటే ఏ గుత్తేదారులకో నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే.. ఏటా లక్షల వరహాలు పిండుకోవచ్చనే ఆశను రేకెత్తించాడు. అలా శత్రువులను విభజించి పాలించాడు. సొత్తుల మాయలో పడిపోయి వారంతా ఒకరి గొయ్యి మరొకరు తవ్వుకున్నారు. ఓ దశలో ఆలయాల నిర్వహణలో బ్రిటిష్ వారి జోక్యం పట్ల చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. అది కాస్తా తిరుగుబాటుగా మారుతుందనే భయంతో మొత్తంగా భారతీయుల ఆధ్యాత్మిక వ్యవహారాల్లో వేలు పెట్టకూడదని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తిరుమల పాలన పగ్గాలు మహంతుల చేతికి వెళ్లాయి. ఆ తరువాత 1933లో మద్రాసు సర్కారు తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలిని నియమించింది.
‘అలి’పిలిలో అడ్డుకట్ట..
కుతుబ్‌షాహీల కాలంలో అలీ అనే గోల్కొండ సైన్యాధికారి తిరుమల కొండపై షాహీల జెండా పాతాలనుకున్నాడు. అనుకున్నట్టే ఏడుకొండల కిందికి చేరుకున్నాడు. తిరుమల వెళ్లేందుకు ఏ దారి ఎంచుకోవాలా అని పటాన్ని చూస్తుండగా వృషభాద్రి, వెంకటాద్రి, అంజనాద్రి, నారాయ ణాద్రి.. ఇలా కొండలన్నీ చూస్తూ ఒకచోట వరాహస్వామికి సంకేతంగా గీసిన రేఖా చిత్రం దగ్గరే అతని కళ్లు ఆగిపోయాయి. ‘ఇదేమిటి?’ అని అనుచరుడిని అడిగితే, ‘తిరుమల ఆదివరాహ క్షేత్రం నవాబ్’ అని బదులొచ్చింది. చూస్తూ, చూస్తూ ‘పంది’ని దాటుకుని వెళ్లడానికి అలీ మనసు అంగీకరించలేదు. అసహనంగా వెనుదిరిగాడు. ఇది జరిగిన ఆ చోటునే నేడు ‘అలిపిరి’గా పిలుస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆ జగన్నాటక సూత్రధారి లీలలెన్నెన్నో!.

























































































































































































































































































































































































































Review ఆధ్యాత్మిక వికాసం.