సామెత కథ

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి.
అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం..

‘సజాతీయ సమూహం కులం’ అని అమరకోశంలో నిర్వచించారు. మన సమాజంలో కులాలు జన్మ ప్రాతిపదికన ఏర్పడిన సామాజిక విభాగాలని చెప్పవచ్చు. ఇతరులతో కలవక, తమ సమూహంలోనే భోజన వివాహాదులను జరుపుకుంటూ సంప్రదాయసిద్ధంగా వచ్చే వృత్తినే అవలంబిస్తూ, ఇతర సమూహాలతో భిన్నమైన సామాజిక, గౌరవ ప్రవృత్తులు కలిగిన ఒక సవర్ణ ప్రజా సముదాయాన్ని కులం అనవచ్చని ‘ఆంధప్రదేశ్‍ దర్శిని’ అనే పుస్తకంలో వర్ణించారు.
మన సమాజంలో అనాదిగా పాతుకుపోయిన కులవ్యవస్థ ఆధారంగా కూడా పలు సామెతలు పుట్టుకొచ్చాయి.
పూర్వం కులవృత్తిని ఎంతో గౌరవించే వారని, ఆయా కులాల భోజనం అలవాట్లను ఇతరులు ఏవగించుకున్నా ఆ కులం వారు ఏవగించుకునే వారు కారని ‘ఎన్ని విద్యలైనా కులవిద్యకు సాటిరావు’, ‘అమృతమైనను చవుల జాత్యన్నసమమె’ అనే సామెతలు చెబుతాయి.
అగ్రకులం వాడు బీదవాడైనా ఇతర వర్ణాల వారు గౌరవించగా, అదే కులం వారు మాత్రం ఈసడించుకుంటారు. ఈ విషయాన్నే ‘కూటికి పేదైతేనే కులానికి పేదా?’, ‘కలిమి కులాల మిండడు’, ‘కలిమి గలవాడే కులము గలవాడు’ అనే సామెతలు తెలుపుతాయి.
ధనవంతులవుతూనే తగ్గు కులం వారు కులం మరిచి విర్రవీగుతారని భావించే అగ్రవర్ణాల వారి అసూయ ‘కూడు కలిగిన వాడు కులము మరిచినట్టు’ అనే సామెతలో ప్రతిబింబిస్తున్నది.

అభ్యున్నతికైనా, అధోగతికైనా ఏ కులానికి ఆ కులమే కారణమని ‘జాతికి జాతి తెగులు నీటికి నాచు తెగులు’ అనే సామెత చెబుతుంది.

సహజంగానే కులాల మధ్య వైరం కద్దు. ఈ కోవలో పుట్టుకొచ్చినవే.. ‘కులం కొద్దీ గుణం’, ‘పుట్టుకతోనే బుద్ధులు కులంతోనే గుణాలు’, ‘తక్కువ జాతికి నిక్కెక్కువ తవ్వెడు బియ్యానికి పొంగెక్కువ’, ‘కులము తక్కువ వానితోటి, కుర్రవానితోటి పరిహాసము కూడదు’ అనే సామెతలు. ఇవి ఒకరినొకరు ఎత్తిపొడుచుకోవడానికి వాడే సామెతలు.
తక్కువ కులం వారు కడుపు నిండా తినడం కూడా సహించని అగ్రవర్ణాల వారు ‘తక్కువ జాతికి ఎక్కువ కూడైతే తిక్క తెగులు’, ‘కులము తక్కువ వాడు కూటికి ముందు’, ‘తప్పతాగి కులము మరిచినట్టు’ అనే సామెతల ద్వారా ఎదుటి కులాన్ని కించపరుస్తుంటారు.
ఒక కులాన్ని తిడితే అది ఆ కులంలోని వ్యక్తులందరికీ వర్తిస్తుందని ‘కులానికి నా సాడు అంటే తలా గంటెడు అన్నాడట’ అనే సామెత తెలుపుతుంది.

కొన్ని కులాల్లో వెలివేయడాలు ఉంటాయి. కులం నుంచి వెలివేయబడిన వాడు ఒడ్డున పడిన చేపలా గిలగిల్లాడతాడనే విషయాన్ని ‘కూడు ఉడికిన వెనుక పొయ్యి మండుతుంది కులం చెడ్డ వెనుక బుద్ధి వస్తున్నది’ అనే సామెత చెబుతుంది. వెలివేయబడిన వారిలో తెగించిన వారైతే ‘కులం చెడ్డా సుఖం దక్కవలె’ అనుకుంటారు కూడా!.
‘కులం కన్నా గుణం ప్రధానం’ అనుకునే వారు ఈ రోజుల్లో నూటికో కోటికో ఒకరు.

కులాల్లోనే ఒక్కో ఇంటిపేరుకు ఒక్కో గోత్రం ఉంటుంది. కొందరు సగోత్రీకుల్లో వివాహా లుండవు. అంటే ఒకే గోత్రం వారు అదే గోత్రం వారితో వియ్యం అందుకోరు. ఈ కట్టుబాటు నుంచి పుట్టినవే- ‘పాత్ర మెరిగి దానం.. గోత్రమెరిగి పెండ్లి’, ‘కులం చెడినా గోత్రం చెడకూడదు’ అనే సామెతలు.
కులం కట్టుబాటులో ప్రధానమైనది తమ కులం వారితోనే వియ్యమందడం. దీనికి ఉదాహరణలు.. ‘కులమింటి కోతి అయినా మేలు’, ‘కోరి పిల్లనిస్తామంటే కులం తక్కువ అన్నట్టు’ అనే సామెతలు.
‘కులహీనమైనా గుణ హీనము కారాదు’ అనుకునే వారు అరుదు.

Review సామెత కథ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top