మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.
ఆషాఢభూతి
నిజం చెప్పడం ఎంత బాధాకరమో హరిశ్చంద్రుడి కథ చెప్పి వివరించే వారు. అబద్ధాన్ని ఎంత పకడ్బందీగా చెప్పి ఎంతగా నమ్మించి ఇతరులను ముంచవచ్చో నిరూపించడానికి ‘ఆషాఢభూతి’ గురించి చెబుతారు. ఆషాఢభూతి అనేది చిన్నయసూరి పంచతంత్రం కథల్లోని ఒక పాత్ర పేరు. అతడు తనను విద్యార్థిగా చేర్చుకున్న గురువుకు తనపై పూర్తి విశ్వాసం కల్పిస్తాడు. చివరకు ముంజూరు తాటాకు ముక్కలు తలకు తగులుకుంటే తిరిగిచ్చాడు. సమయం వచ్చేదాకా వేచి ఉండి గురువు గారి మూటాముల్లే సంగ్రహించి పారిపోతాడు. అతడొక గజదొంగ, అచ్చపుదొంగ, కేపుమారి, మాయలమారి, మోసగాడు, వంచకుడు. ఆషాఢమంటే మోదుగుకర్ర బ్రహ్మచారి. కర్రను పట్టుకుని తిరగడం అతడి లక్షణాల్లో ఒకటి. ఎందుకంటే అదొక్కటే అతడికున్న ‘భూతి’ (ఆస్తి). అంత దరిద్రుడు. అతడు తనకన్నా మెరుగ్గా ఉన్న గురువును ఆశ్రయించాడు. అదను వచ్చే దాకా నిజం తప్ప మరొకటి చెప్పలేదు. నమ్మించి మోసగించాడు. తడిగుడ్డలతో గొంతు కోశాడు. చివరకు గురువుకు పంగనామాలు పెట్టాడు. అలా ప్రవర్తించే వాళ్లను ఆషాఢభూతులని అంటారు.
నయవంచన చేసే మోసగాడిని ఆషాఢభూతి అని పిలుస్తారు. రాజకీయాల్లో ఈ రకం మనుషుల సంఖ్య ఎక్కువ. ఇతర వృత్తుల్లో ఇలాంటి వారు ఉండరని కాదు. లేరనీ కాదు. పరద్రవ్యం మీద ఆశ లేదని చెబుతూ ధన సంపాదన చేసే మోసగాడు ఆషాఢభూతి అయితే, అతడు చేసేసదీ, చేయగలదీ చిల్లర దొంగతనం మాత్రమే.
ఆషామాషీ (కబుర్లు)
సరదాగా, వినోదం కోసం, కాలక్షేపం కోసం మాట్లాడుకునే మాటలను ఆషామాషీ కబుర్లని అంటారు. ‘ఆషామాషీ’గా మాట్లాడారంటే పెద్ద పట్టించుకోకుండా, తేలికగా, మాటవరుసకు మాట్లాడారని అర్థం. ఈ మాట మన భాషలోకి ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో కచ్చితంగా చెప్పడం కష్టం. పోలికను బట్టి హిందీ/ఉర్దూ నుంచి దిగుమతి అయిందనిస్తుంది. కానీ, ఆ భాషా నిఘంటువుల్లో ఈ మాట కనిపించదు. ఆశ్/ఆష్ అనే పర్షియన్ పదానికి ‘మాంసం, తినుబండారాలు, కిరాణా వస్తువులు, పులుసు, కూరలు, వంటకాలు’ అనే అర్థాలున్నాయి. మాషఖ్ అనే అరబిక్ పదానికి ‘నచ్చిన వస్తువు, ప్రియురాలు’ వంటి వగైరా అర్థాలున్నాయి. తిండి, నిద్రలకు సంబంధించిన చిల్లర విషయాలే కానీ తీవ్రమైనవీ, ప్రధానమైనవీ కావనే భావంతో ఈ జంట మాటల కలయికతో ఈ జాతీయం ఏర్పడిందేమో అనేది భావనే కానీ నిష్కర్ష కాదు. అసమ్/అషమ్ అనే హిందీ శబ్దానికి వ్యక్తి అని అర్థం. మౌసమ్ అనే దానికి కాలం, వాతావరణమని అర్థం. ఈ రెంటినీ మన అలవాట్ల ప్రకారం కలిసి కొందరు తెలిసిన వ్యక్తుల గురించి, స్థల కాలాల గురించి
ఇక్ష్వాకుల బారసాల
చాలా పాతకాలంలో జరిగిన విషయమని చెప్పడానికి ఇక్ష్వాకుల బారసాల అనే జాతీయాన్ని వాడుతుంటారు. బిడ్డ పుట్టిన తరువాత పేరు పెట్టడానికి చేసే వేడుకను బారసాల అంటారు. ఇక్కడ ‘ఇక్ష్వాకుల బారసాల’ అని బహువచనంలో వ్యవహరించడం ఒక విశేషమైతే, ఎవరి బారసాలో స్పష్టంగా చెప్పకపోవడం మరో లక్షణం. మన సంస్క •తిలో రెండు ఇక్ష్వాకు వంశాలున్నాయి. ఒకటేమో శ్రీరామచంద్రుడి వంశం. రెండోది క్రీస్తు శకం రెండో శతాబ్దం తరువాత దక్షిణ భారతంలో శాతవాహన సామ్రాజ్యం అంతరించినపుడు కొంత రాజ్యభాగాన్ని పాలించిన రాజవంశం. వీటిలో ఏ వంశంలో ఎవరి బారసాలను గురించి ఈ జాతీయం ద్వారా ప్రస్తావిస్తున్నామో కానీ.. ఏదైనా చాలాకాలం కిందట జరిగిన వేడుక కింద చెప్పడానికి దీన్ని వాడతారు.
ఇంగువ కట్టిన గుడ్డ
ప్రపంచంలో ఎన్నో సువాసన ద్రవ్యాలుండగా, ఇంగువను ఎంపిక చేసి గుడ్డలో కట్టి భద్రపరచడం మీద ఓ జాతీయం పుట్టడం విచిత్రం. గుడ్డలో ఇంగువ లేకపోయినా దాని వాసన మాత్రం చాలాకాలం అంటిపెట్టుకుని ఉంటుంది. అందులో ప్రత్యేకత ఏమీ లేదు. కాకపోతే ఘాటైన వాసన గల వస్తువు కాబట్టి దాని ప్రభావం చాలా కాలముంటుంది. చాలా దూరం వ్యాప్తిస్తుంది. అందువల్ల ఎక్కువ కాలం ఎక్కువ పేరు ప్రఖ్యాతులు నిలుపుకొన్న వ్యక్తిని గురించి ప్రస్తావించేటపుడు ‘ఆయనకేమండి.. ఇంగువకట్టిన గుడ్డ కదూ!’ అంటారు. అంటే సుప్రసిద్ధుడని అర్థం. పేరుమోసిన వాడని భావం. మూటగట్టిన గుడ్డలో తరువాత ఇంగువ లేకపోయినా వాసన మిగిలి ఉన్నట్టు పూర్వౌన్నత్యం, ఆస్తిపాస్తులు, అధికార దర్పాలూ లేకపోయినా ఉన్న వాడన్న ప్రతీతి మాత్రం మిగలవచ్చు. అందువల్ల సుఖం లేకపోయినా పేరుంటుంది. ఆదాయం లేకపోయినా పరపతి మిగులుతుంది. అలాంటి స్థితిలో ఉండి, పైపై మెరుగులతో పదిమందిలో తలెత్తుకుని తిరిగే వ్యక్తులను ఇంగువ కట్టిన గుడ్డ అని వ్యవహరిస్తారు. ‘కట్టిన’ అనే క్రియా పదానికి ఇప్పుడు కట్టిన అనే అర్థమే ఉండనక్కరలేదు. ఎప్పుడో కట్టినా సరిపోతుంది.
ఇత్యపులు
పూర్వం వీధిబడిలోనే అమరకోశం కంఠస్థం చేయించే వాళ్లు. వాటికి అర్థాలు చెప్పేవారు కాదు. అందువల్ల ‘పిక: కోకి లేత్యపి’ అనే పర్యాయపద పట్టిక చదివి కోకిల శబ్దానికి ‘ఇత్యపి’ అనే పర్యాయపదం ఉందనుకున్నాడట ఒకడు. ‘ఇత్యపుల్ కూయంగ హేరంబు డాడంగ’ అని పద్యం రాశాడట. అర్థంలేని చదువు చదివిన వాడనటానికి వెక్కిరింతగా ‘ఇత్యపులు అంటే ఏమిటోయ్?’ అని ప్రశ్నించడం పరిపాటైంది.





































































































































































































































































































































































Review ఆషాఢభూతి.. ఆషామాషీ.