కార్తీకానికి స్వాగతం

కార్తీక మాసం.. దీపాల ఉత్సవం.. ఈ నెల పొడవునా హిందూ లోగిళ్లు దీపాల కాంతులీనుతూనే ఉంటాయి. దీపావళి మొదలుకుని కార్తిక మాసం పూర్తయ్యే వరకు భక్తిశ్రద్ధలతో చేసే దీపారాధనలు, ఉపవాస దీక్షలు, లక్ష్మీదేవి పూజలు, హరిహరుల నామస్మరణలు.. ఇలా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. మరి వీటన్నిటి వెనుకా ఉన్న అంతరార్థం ఏమిటంటే..?!

వెలుగులు విరజిమ్ముతూ కనిపించే దీపకాంతులు ఒకవైపు, సిరిసంపదలు ప్రసాదించాలంటూ లక్ష్మీదేవికి చేసే పూజలు మరోవైపు.. ఇలా దీపావళి అంటేనే ఓ సంబరం. నిజానికి ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్యకు కొనసాగింపుగా కార్తిక మాసంలో వచ్చే తొలి రెండు రోజుల పర్వాలైన బలి పాడ్యమి, యమ ద్వితీయతో కలిపి దీపావళిని అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు.
లక్ష్మీదేవిని దీపం రూపంలో పూజించడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు దూర్వాస మహర్షి దేవేంద్రుడికి ఒక అరుదైన హారాన్ని కానుకగా ఇస్తే ఇంద్రుడు దానిని తన ఐరావతం మెడలో హారంగా వేశాడట. ఐరావతం ఆ హారాన్ని తీసి కిందపడవేసి తొక్కడంతో ఆగ్రహించిన దూర్వాసుడు ఇంద్రుడిని శపించాడు. దీంతో దేవేంద్రుడు తన సంపదలన్నీ కోల్పోయి శ్రీహరిని ప్రార్థించాడట. అప్పుడు మహా విష్ణువు ఓ జ్యోతిని వెలిగించి మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించాలని ఇంద్రుడికి సలహానిచ్చాడట. ఇంద్రుడు అలాగే చేయగా, ఆ పూజలకు సంతృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహించడంతో ఇంద్రుడు తన పూర్వవైభవాన్ని, సర్వసంపదలనూ తిరిగి పొందాడనేది కథ. అందుకే దీపావళి రోజున దీపాలను వెలిగించి లక్ష్మీదేవి స్వరూపంగా పూజించే సంప్రదాయం వచ్చింది.
అలాగే, సీతారాములు అయోధ్యా నగరానికి తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే కాబట్టి.. అయోధ్యవాసులు వారిని స్వాగతించేందుకు దీపాలను వెలిగించారనీ అంటారు.
నరకాసుర సంహారం అనంతరం భూలోకవాసులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యను కలిపి పండుగగా చేసుకోవడమూ విన్నదే.
దీపావళి అమావాస్య తరువాతి నుంచి మొదలయ్యే కార్తీక మాసాన్ని శివకేశవులకూ, కార్తికేయుడికీ ప్రీతికరమైన మాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో చేసే స్నానాలూ, దీపారాధనలూ, ఉపవాస దీక్షలకూ విశేషమైన ఫలితం ఉంటుంది. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత తులసికోట వద్ద దీపాలను వెలిగిస్తూ ఈశ్వరుడిని పూజిస్తారు. విష్ణు సహస్ర నామాలనూ పఠిస్తారు. కార్తీక సోమవారాల్లో పరమేశ్వరుడికి చేసే అర్చనలూ, అభిషేకాలూ చూసి తరించాల్సిందే.
నాగేంద్రుడిని నాగుల చవితి నాడు ఆరాధిస్తారు.
ద్వాదశి నాడు తులసికి, విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి మొక్కకూ కలిపి తులసీ కల్యాణం జరిపిస్తారు. దీనినే చిలుక ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అనీ పిలుస్తారు.
కార్తీక పూర్ణిమ నాడు పరమేశ్వరుడిని ధ్యానించి, ఉపవాసం ఉండి, 365 వత్తులను వెలిగిస్తే సకల
శుభాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఇతర మాసాలతో పోలిస్తే కార్తీకంలో రాత్రుల వ్యవధి ఎక్కువ.

అతిగా తింటే అజీర్ణంతో పాటు ఇతర సమస్యలూ ఎదురుకావచ్చనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఈ కాలంలో ఉపవాస దీక్షను ఆచరణలోకి తెచ్చారు. అయితే, గర్భిణులు, విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడే వారు ఉపవాసం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కుదిరితే రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రాలు సూర్యాస్తమయం తరువాత నక్షత్ర దర్శనం చేసుకుని దీపాలను వెలిగించి భుజింవచ్చు. దీనినే నక్తాలని అంటారు. అలాగే ఈ సమయంలో తెల్లవారుజామున తులసికోట వద్ద దీపాలను వెలిగించాలని చెబుతారు. చలి పెరిగే సమయం కూడా ఇదే కాబట్టి ప్రతి ఒక్కరిలో చురుకుదనం తగ్గుతుంది. ఇలాంటప్పుడు ముడుచుకుని పడుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించి దీపాలు వెలిగించడం వల్ల శరీరం ఉత్తేజితం అవుతుంది. మానసిక ఆరోగ్యమూ సొంతమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

‘కార్తీక’ మాస విధులు
కార్తీక సోమవారం: కార్తీక సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. ఈ నెలలో సోమవారం వ్రతం చేసే వారు పరమశివుని అనుగ్రహానికి పాత్రులై, శివ సాయుజ్యాన్ని పొందుతారు. సోమవారం తెల్లవారుజామునే స్నానం చేసి దీపం పెడతారు. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి కార్తీక సోమవారం నాడు పొద్దుటి నుంచి అభిషేకాలు చేసి, సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు. పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలు వచ్చాక బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తరువాత తింటారు.
కార్తీకంలో నదీ స్నానం: కార్తీక మాసంలో వాతావరణ మార్పు వల్ల సంభవించే చిన్న చిన్న రుగ్మతలను నాశనం చేసే గుణం మనకు గల ఏడు ప్రధాన నదుల్లోని నీటిలో ఉంది. అందుకే ఈ నదుల్లో కృత్తిక నక్షత్రం వెళ్లిపోకుండా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఈ నెలలో తెల్లవారుజామున మెడ వరకు నీటిలో మునిగి కొంత సమయం ఉండి స్నానం చేస్తే ఉదర సంబంధ వ్యాధులు నయం అవుతాయని శాస్త్రం చెబుతోంది.
33 పున్నముల నోము: కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు. ఈ కారణంగానే ఈ మాసానికి కార్తీకమనే పేరొచ్చింది. ఈ రోజు పుణ్య నదుల్లో స్నానం చేసి జపాలు, పూజలు చేస్తారు. స్త్రీలు 33 పున్నముల నోము ఆచరిస్తారు. సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటారు. అన్న సంతర్పణలు చేస్తారు. పౌర్ణమి నాడు సాయంత్రం పూర్ణ చంద్రుడు వచ్చాక ఎవరైతే పూజలు చేస్తారో వారింట్లో శ్రీ మహా విష్ణువు లక్ష్మీసమేతుడై కొలువు ఉంటాడని ప్రతీతి. ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుంది.
ద్వాదశి.. దీప ఫలం: కార్తిక మాసంలో ఉసిరిక చెట్టును భక్తితో పూజిస్తారు. ద్వాదశి రోజున తులసి చెట్టు, ఉసిరిక (ధాత్రి)లోనూ విష్ణువు ఉంటాడు. అందుకే తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణుడిని ఈ రోజు పూజిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. తులసి కోట దగ్గర ఆవు నేతిలో దీపాలు వెలిగిస్తారు. ద్వాదశి నాడు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం. పూజానంతరం దక్షిణ తాంబూలాలు పంచితే విశేష ఫలం లభిస్తుంది. పండ్లు, కొబ్బరికాయ నైవేద్యం పెడతారు. ఉసిరితో తినే పదార్థాలను తయారు చేస్తారు.

Review కార్తీకానికి స్వాగతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top