బ్రహ్మ ముఖం నుంచి పుట్టిన వాడు అంగిరస మహర్షి. బ్రహ్మ మానసపుత్రులని అంటూంటారు కదా! అలాంటి మానస పుత్రులలో మూడవ వాడు అంగిరస మహర్షి.
అంగిరస మహర్షి వేదమంత్రాలు నేర్చుకుని తపస్సు చేసి గొప్ప విజ్ఞానాన్ని, వివేకాన్ని పొంది గొప్ప తేజస్సుతో వెలుగొందుతున్నాడు.
కర్దమ ప్రజాపతి అనే ఆయన పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసి తొమ్మిది మంది కుమార్తెలను పొందాడు. అందులో శ్రద్ధ అనే పేరు గల అమ్మాయిని అంగిరస మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు.
బ్రహ్మదేవుడు అంగిరస మహర్షిని సృష్టి చేయడంలో సాయం చేయాలని ఒకసారి అడిగాడు. ఈ క్రమంలోనే బ్రహ్మదేవుడు అంగిరసుడికి, శ్రద్ధాదేవికి ఏడుగురు కుమార్తెలను, ఏడుగురు కుమారులను అనుగ్రహించాడు.
వాళ్లకి మళ్లీ పిల్లలు, ఆ పిల్లలకు మళ్లీ పిల్లలు.. అలా వంశం వృద్ధి పొందింది. ఇలా అంగిరసుడు ఒక పెద్ద వంశానికి మూల పురుషుడు అయ్యాడు.
ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చి ఎక్కడికో వెళ్లిపోయి తపస్సు చేసుకోసాగాడు. అగ్ని లేకపోతే లోకం స్తంభించిపోతుంది. మరీ ప్రధానంగా యజ్ఞాల సమయంలో ఆయా యజ్ఞాల ఫలాన్ని స్వీకరించాల్సింది, ఆయా యజ్ఞాలు నిర్విఘ్నంగా జరిపించాల్సింది అగ్నిదేవుడే కదా! కానీ, ఆయన అందుబాటులో లేకపోవడంతో దేవతలు, రుషులు యజ్ఞాలు చేయడం ఆపేశారు. అగ్నిదేవుడు లేడు కదా.. ఏం చేయాలని ఆలోచనలో పడ్డారు. ఆ మీదట బ్రహ్మదేవుడు కల్పించుకుని, అగ్ని కంటే గొప్పవాడు అంగిరసుడు ఉన్నాడు కదా! ఆయననే అగ్నిదేవుడిగా భావించి మీ మీ యజ్ఞాలు పూర్తి చేసుకోండి అని చెప్పాడు దేవతలు, రుషులతో.
అగ్నిదేవుడికి ఈ విషయం తెలిసింది. తన పదవి, హోదా, గౌరవం అంగిరసుడికి వెళ్లిపోతాయనే భయంతో తన కోపాన్ని చాలించుకుని పరుగెత్తుకుని వచ్చేశాడు. అప్పటి నుంచి అంగిరసుడు రెండో అగ్నిదేవుడు అయ్యాడు.
శూరసేన దేశాన్ని చిత్రకేతుడు అనే రాజు పరిపాలిస్తుండే వాడు. అతడికి చాలా సంపద, కోటి మంది అందమయిన భార్యలు ఉండేవారు. కానీ, సంతానం మాత్రం కలగలేదు. దీంతో ఆ రాజు అంగిరస మహర్షిని ప్రార్థించాడు. కృతద్యుతి అనే పేరు గల భార్య యందు చిత్రకేతుడికి ఒక కుమారుడు పుట్టాడు. మిగిలిన భార్యలు తమకు సంతానం కలగలేదన్న అక్కసుతో ఆ బిడ్డకు విషం పెట్టి చంపేశారు. మహారాజు దు:ఖంతో మూర్ఛపోయాడు.
అంగిరస మహర్షికి ఈ విషయం తెలిసింది. వెంటనే చిత్రకేతుడి వద్దకు వెళ్లి ‘లోకంలో చావుపుట్టుకలు అనేవి ఎవరికైనా తప్పవు. ఇప్పుడు నీకు కొడుకైనా పూర్వజన్మలో వాడు ఎవరో నీకు తెలుసా? తెలియదు కదా! కాబట్టి పుట్టిన ప్రతి జీవి చావక తప్పదు’ అని ఓదార్చాడు.
చివరకు నారద మహర్షి సాయంతో చచ్చిపోయిన కుమారుడిని అంగిరసుడు బతికించాడు.
‘నువ్వు తెలుసేమో నీ కొడుకును అడుగు’ అని చిత్రకేతుడితో అన్నాడు అంగిరసుడు.
చిత్రకేతుడు, ‘నాయనా!’ అని పిలవగా, ఆ బిడ్డ నువ్వెవరో నాకు తెలియదు అని అన్నాడు.
ఈ విధంగా అంగిరసుడు చిత్రకేతుడికి భార్యపిల్లలు, సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ రుణంతో కూడుకున్నవేనని, కానీ, భగవంతుడు ఒక్కడే సత్యమని ఉపదేశం చేశాడు.
అనంతరం అంగిరస మహర్షి తీర్థయాత్రలకని బయలుదేరి ఎక్కడెక్కడ ఎన్నెన్ని పుణ్యనదులు ఉన్నాయో అన్నింటిలోనూ స్నానం చేసి తిరిగి తన ఆశ్రమానికి చేరుకున్నాడు.
ఒకసారి గౌతమ మహర్షి అంగిరసుడిని, ‘ఇన్ని తీర్థాల్లో మీరు స్నానం చేశారు కదా! వాటి గురించి కొంచెం చెప్పండి’ అని కోరాడు.
అప్పుడు అంగిరసుడు గౌతమ మహర్షికి తను ఎక్కడెక్కడ పుణ్యస్నానాలు చేశాడో ఆ తీర్థాల విశిష్టతను ఇలా వివరించాడు.
‘చంద్రభాగ అనే నదీ తీర్థంలో వరుసగా ఏడు రోజులు స్నానం చేస్తే చాలా సంపదలు లభిస్తాయి. ముక్తి, మోక్షం కలుగుతాయి.
పుష్కర తీర్థం, ప్రభాస, నైమిష, దేవిక, ఇంద్రమార్గ, స్వర్ణబిందు అనే తీర్థాల్లో స్నానం చేసిన వారు నేరుగా స్వర్గానికి చేరుకుంటారు.
కుశేశయ, దేవాంతము, ఇంద్రతోయ, కరతోయ, కన్యాకూప సుందరికాహ్రద, వైమానిక, విపాశ, కాళికాశ్రమం, కృత్తికాశ్రమం, దేవదారువనం, ద్రోణశర్మపదము ఇలా ఎన్నెన్నో తీర్థాలు, పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి.
అలాగే, గంగా యమునల సంగమం, ప్రయాగ మొదలైన వాటిలో స్నానం చేస్తే అమేయమైన పుణ్యాలు కలుగుతాయి. అనంతమైన ఫలాలు లభిస్తాయి’ అంటూ వివిధ పుణ్యతీర్థాల గురించి వివరించాడు అంగిరసుడు.
ఒకసారి అగ్నిదేవుడు రుషుల భార్యలను చూసి మోహించి, ఒక్కొక్క రోజు ఒక్కో ముని వేషం వేసుకుని వారి భార్యలతో గడపడం మొదలుపెట్టాడు. అంగిరస మహర్షి తన దివ్యజ్ఞానంతో ఈ విషయం గ్రహించాడు. దీంతో ఆయనకు కోపం వచ్చి పతి ఎవరో, పరుడెవరో తెలుసుకోలేని మీరు భూలోకంలో పుట్టండి అని రుషిపత్నులను శపించాడు. పాపం! వాళ్లు తమ వద్దకు వచ్చింది తమ భర్తలే అనుకున్నారు కానీ, అగ్నిదేవుడే ఇలా చేశాడని తెలియదు కదా!. ఏమైతేనేం అంగిరసుడి కోపాగ్నికి గురైన రుషుల భార్యలు ఆయన శాపం మేరకు భూలోకంలో బ్రాహ్మణులకు భార్యలుగా పుట్టి, శ్రీకృష్ణుడి సేవలో గడిపారు.
ఒకసారి శౌనక మహర్షి అంగిరస మహర్షి వద్దకు వచ్చి బ్రహ్మవిద్యను బోధించాలని, దాని గురించి వివరాలు చెప్పాలని కోరాడు.
అప్పుడు అంగిరస మహర్షి ఆయనకు ఇలా చెప్పాడు-
‘విద్య రెండు రకాలు. ఒకటి పరవిద్య. రెండవది అపరవిద్య. పరవిద్య అంటే వేదాలు, శిక్ష, వ్యాకరణము, కల్పము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు మొదలైనవి. అపరవిద్య అంటే భగవంతుడి గురించిన జ్ఞానము.
ముక్తి పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కర్మ మార్గం. రెండవది జ్ఞాన మార్గం.
యజ్ఞాలు, యాగాలు చేయడం, మనసు మంచిగా ఉంచుకోవడం, భగవంతుడి కోసం పూజలు, వ్రతాలు చేయడం వంటివి కర్మ మార్గం.
తపస్సు చేయడం, గురువు ద్వారా జ్ఞానం పొందడం, గురువు చెప్పిన విధంగా నడుచుకుని భగవంతుడిని దర్శించడం జ్ఞాన మార్గం.
భగవంతుడు ఎక్కడయినా ఉంటాడు. భగవంతుడికి తల అగ్ని. కళ్లు సూర్యచంద్రులు. చెవులు దిక్కులు. మాట వేదము. ప్రాణము వాయువు. హృదయం ప్రపంచం. భూమి పాదాలు. ఇంక ఆయన లేనిదెక్కడ? అందుకే భగవంతుడు సర్వవ్యాపి’ అని శౌనకుడికి అంగిరసుడు వివరించాడు.
అంగిరస మహర్షి మహా తపశ్శాలి. మహా భక్తుడు. మహా విజ్ఞాని. బ్రహ్మనిష్టా గరిష్టుడు. ఆయన అంగిరస స్మ•తి అనే ధర్మశాస్త్రాన్ని కూడా రచించాడు.
ఈ మహా గ్రంథంలో, పరిషత్తు అంటే ఉత్తములయిన నూట ఇరవై ఒక్కమంది వేదవిదులు ఉండాలనీ, మనిషి శాస్త్ర ప్రకారమే కర్మలు చేయాలనీ, పశుపక్షి సంతతిని చంపకూడదనీ, మాంసాహారం మానాలనీ, బ్రాహ్మణుడైనా మహా దోషాలు చేస్తే క్షమించడకూడదనీ, తప్పులు చేసినపుడు దానికి తగిన ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలనీ.. తదితర ఎన్నో విషయాలు ఉన్నాయి.
అంగిరస మహర్షి వంశంలో పుట్టిన వాళ్లందరూ బ్రహ్మదేవుడి సృష్టిలో మొట్టమొదటి వాళ్లన్న మాట. అశ్వమేథ యాగం చేసేటప్పుడు చదివే అధర్వణ వేదాన్ని అంగిరసులు (అంగిరస మహర్షి వారసులు/వంశస్థులు) చదివే వారు. అందుకే దానికి అంగిరో వేదం అనే పేరు కూడా వచ్చింది. మహారాజులకు అంగిరసులు పురోహితులుగా, బ్రహ్మవిద్యను బోధించే వారిగా కూడా ఉండేవారు.
అంగిరసుడికి అంగిరో మహర్షి అనే పేరు కూడా ఉంది.
అలాగే, గౌతమ బుద్ధుడికి అంగిరసుడనే పేరుంది.
అంగిరస మహర్షి తన తండ్రి బ్రహ్మదేవుడి సృష్టి కార్యంలో సహాయపడి గొప్ప జ్ఞానులను, తపస్సంపన్నులను, విద్యాధికులను తయారు చేశాడు.





































































































































































































































































































































































Review అంగిరస మహర్షి.