అంతూదరీ లేని కోరికలు

మహా భారంతలోని ఆదిపర్వంలో ఉటంకించిన యయాతి కథ మనిషిలోని కోరికలకు అంతం లేదని, దానిని మనిషి జయించగలగాలనే సత్యాన్ని తెలియచేస్తుంది.

శివుడి కుమార్తె అశోక సుందరి, నహుష చక్రవర్తుల కుమారుడు యయాతి మహారాజు. ఇతడు పాండవులకు పూర్వీకుడు. గొప్ప విష్ణు భక్తుడు. పరాజయం ఎరుగని పరాక్రమశాలి. ప్రతిష్ఠానపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని వివాహం చేసుకున్నాడు.

ఆ తరువాత వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ పట్ల కూడా మోహం కలిగి దేవయానికి చెప్పకుండా రహస్యంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం దేవయానికి ఈ సంగతి తెలిసి తన తండ్రి అయిన శుక్రాచార్యుడికి చెప్పి బోరుమంది. దీంతో శుక్రాచార్యుడికి అల్లుడి మీద పట్టరాని కోపం వచ్చింది.
తక్షణమే మంత్ర జలం చేతిలోకి తీసుకుని ‘నీకు తక్షణమే ముసలితనం వాటిల్లుగాక’ అని శుక్రాచార్యుడు అల్లుడు యయాతికి శాపం ఇచ్చాడు.

నడి వయసులో అకస్మాత్తుగా ముసలితనం రావడంతో యయాతి మహారాజు హడలిపోయాడు. జరిగినదంతా తెలుసుకుని గత్యంతరం లేని పరిస్థితుల్లో మామగారైన శుక్రాచార్యుల వద్దకు వెళ్లి ఆయన కాళ్లపై పడ్డాడు.
ఎంతైనా కూతురి భర్త.. అల్లుడు. అతని పరిస్థితి చూసి శుక్రాచార్యుడు జాలిపడ్డాడు.
‘రాజా! నా శాపాన్ని ఉపసంహరించలేను. అయితే, ఎవరైనా సమ్మతించే వారుంటే వారికి నీ ముసలితనం ఇచ్చి వారి పడుచుతనం నువ్వు తీసుకోవచ్చు’ అని శుక్రాచార్యుడు యయాతికి ఒక తరుణోపాయం చెప్పాడు.
యయాతికి ఐదుగురు కొడుకులు ఉన్నారు. అందరూ అందమైన వారే. అందరూ క్షత్రియోచితమైన విద్యలో ఆరితేరిన వాళ్లు. కొడుకులలో ఎవరికైనా తన వార్ధక్యాన్ని బదలాయించాలని యయాతి తలచాడు.
వెంటనే వారిని పిలిచి ఇలా చెప్పాడు-
‘నాయనలారా! మీ తాతగారిచ్చిన శాపం వల్ల నాకు అకాల వార్ధక్యం వచ్చిపడింది. చూశారుగా నా అవస్థ. మీలో ఎవరైనా సరే నా ముసలితనం తీసుకుని మీ యవ్వనం నాకు బదులు ఇస్తే మరికొంత కాలం నేను పడుచుదనం అనుభవించవచ్చు. జీవిత భోగాలు తృప్తి తీరా అనుభవిస్తాను. ఎవరైతే నా ముసలితనం స్వీకరిస్తారో వారికి నా రాజ్యం ఇస్తాను’.
పెద్ద కుమారుడు నా వల్ల కాదు అన్నాడు.
రెండో కుమారుడిని అడిగితే-

‘నాన్న గారూ! బలాన్నీ, రూపాన్నే కాకుండా తెలివిని కూడా నాశనం చేసే వృద్ధాప్యాన్ని తీసుకోమని మమ్మల్ని అడుగుతున్నారు. అంతటి నిబ్బరం నాకు లేదు. క్షమించండి’ అని మర్యాదగా తప్పుకున్నాడు.
మూడవ వాడు నిష్కర్షగా ముందే చేతులు అడ్డంగా తిప్పాడు.
రాజు గారికి చాలా కోపం వచ్చింది. నాలుగో కుమారుడిని పిలిచారు. అతడు-

‘నాన్నగారూ! నన్ను మన్నించండి. ముసలితనం అంటే నాకు అసహ్యం. వార్ధక్యంలో శరీరం ముడతలు పడి, చూపు ఆనక, మాట వినబడక, స్వతంత్య్రం కోల్పోయి దు:ఖపడాలి. మీ కోసం నేను అంత కష్టాన్ని భరించలేను’ అని స్పష్టంగా చెప్పి అతను కూడా తప్పించుకున్నాడు.
ఇలా నలుగురు కొడుకులూ ఒకరి తరువాత ఒకరు తన కోరికను కాదనేసరికి యయాతి పుట్టెడు దు:ఖంలో మునిగిపోయాడు. ఎంతోసేపు విచారించాడు. చివరకు తన మాటకు ఎన్నడూ ఎదురుచెప్పని వాడుగా పేరున్న కడగొట్టు కుమారుడిని పిలిపించాడు.

ఆ కుమారుడిని చూడగానే యయాతి కంటతడి పెట్టుకుని- ‘నాయనా! ఇక నువ్వే నన్ను కాపాడాలి. ఈ ముసలితనం, ఈ ముడతలు, ఈ తడబాటు, ఈ నెరసిన వెంట్రుకలు.. ఇవన్నీ మీ తాతగారైన శుక్రాచార్యుల వారి శాపం వల్ల నాకు అకారణంగా వచ్చి పడ్డాయి. ఈ దుస్థితిని నేను క్షణకాలం కూడా భరించలేకుండా ఉన్నాను. కొంతకాలం నా ముదిమిని నువ్వు పుచ్చుకుని నీ యవ్వనం నాకు ఇచ్చావంటే, సర్వసుఖాలూ అనుభవిస్తాను’ అని దీనంగా అర్థించాడు.

యయాతి ఆఖరి కుమారుడు పేరు పూరుడు. తండ్రి అంత దీనంగా ప్రాథేయపడేసరికి అతడికి తండ్రి పట్ల ఎనలేని జాలి కలిగింది. ఆపై ఇలా అన్నాడు-

‘నాన్నగారూ! మీ కోరిక ప్రకారం మీ వార్ధక్యాన్నీ, రాజ్యభారాన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తాను. మీరేమీ దిగులు పెట్టుకోకండి’ అన్నాడు పూరుడు.

యయాతికి పట్టరాని ఆనందం కలిగింది. కుమారుడిని కౌగిలించుకుని అభినందించాడు.
పూరుడి సమ్మతితో అతని యవ్వనాన్ని యయాతి తీసుకున్నాడు. తండ్రి ముసలితనాన్ని పూరుడు స్వీకరించాడు. చెప్పినట్టే రాజ్యాధికారాన్ని యయాతి పూరుడికి అప్పగించాడు. పూరుడు రాజ్యభారం వహించి చాలా కాలం జనరంజకంగా పరిపాలించాడు. గొప్ప కీర్తిని పొందాడు.

మరోపక్క కుమారుడు ఇచ్చిన యవ్వనంతో యయాతి వేల సంవత్సరాల పాటు స్వర్గ సుఖాలు అనుభవించాడు. కానీ అతనికి తృప్తి కలగలేదు. ఏది పొందినా ఇంకా ఏదో కావాలని అనిపిస్తోంది. ఇలా ఎంతకాలం అని అతడికి అనిపించింది. అప్పుడు యయాతి పూరుడి వద్దకు వెళ్లి-

‘నాయనా! కుమారా! కోరికలు ఎన్నటికీ తీరవు. విషయానుభవం వల్ల కాంక్షలు ఇంకా వృద్ధి పొందుతాయే కానీ అణగవు. కామినీ కాంచనాలూ, పాడిపంటలూ మనిషి కోరికలను ఎన్నటికీ తృప్తి పరచలేవు. ఈ సంగతి క్రమేపీ నాకు తెలిసి వచ్చింది. ఇష్టా అయిష్టాలకు అతీతమైన ప్రశాంత స్థితిని పొందాలని ఉంది. ఇక నీ యవ్వనం నువ్వు తీసుకో. చల్లగా రాజాన్ని పాలిస్తూ వర్ధిల్లు నాయనా!’ అని ఆశీర్వదించాడు.

తండ్రి కోరిన విధంగా పూరుడు తిరిగి తన యవ్వనం తను తీసుకుని తండ్రి ముసలితనం తండ్రికి ఇచ్చేశాడు. యయాతి అందరి దగ్గర సెలవు తీసుకుని తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్లాడు. అక్కడ చాలా సంవత్సరాల పాటు తపస్సు చేసి చివరకు స్వర్గం చేరుకున్నాడు.

మనిషి అరిషడ్వర్గాలకు లొంగిపోతే కోరికల కాంక్షలో పడి కొట్టుమిట్టాడుతాడే తప్ప వాటి నుంచి ఎన్నటికీ బయటపడలేడు. యయాతి వంటి అన్నీ తెలిసిన వాడే ఇలా భౌతిక విషయవాంఛల వలలో పడిపోతే ఇక మనలాంటి సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. అందుకే కోరికలను అదిమిపెట్టుకోవాలి. వాటిపై నియంత్రణ ఉండాలి. లేదంటే వాటి అదుపాజ్ఞల్లోకి మనిషి జారిపోతాడు. అప్పుడు ఎంత అనుభవించినా ఇంకా ఇంకా ఏదో కావాలని అనిపిస్తూ.. తీవ్ర నిరాశలోకి కూరుకుపోతాడు. అందుకు యయాతి మహారాజు కథే నిదర్శనం.

నిజమైన స్నేహితులు

ఒక తండ్రి తన కుమారుడి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. కుమారుడు తన స్నేహితులను పెళ్లికి పిలవడం కోసం ఒక జాబితా సిద్ధం చేశాడు. ఆ జాబితాను తండ్రి చేతిలో పెట్టి-

‘నాన్నా! ఈ జాబితాలో ఉన్న యాభై మందీ నా స్నేహితులు. వీళ్లను నా పెళ్లికి పిలుద్దామని అనుకుంటున్నాను’ అని చెప్పాడు.

అప్పుడు తండ్రి- ‘సరే! ఆ జాబితాలో ఉన్న వారందరినీ నేను పిలుస్తాను. నువ్వు మిగిలిన పనులు చూసుకో’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
పెళ్లి ముహూర్తం సమీపించింది. పెళ్లి మండపంలో చూస్తే తన స్నేహితులు పదిమంది మాత్రమే కనిపించారు.
వెంటనే కొడుకు తన తండ్రి వద్దకు వెళ్లాడు.

‘నాన్నా! నేను నీకు యాభై మంది జాబితా ఇచ్చాను కదా! మరి పదిమంది మాత్రమే వచ్చారు. మిగిలిన వారిని పిలవలేదా?’ అని ప్రశ్నించాడు.

అప్పుడు తండ్రి- ‘నేను నువ్వు ఇచ్చిన జాబితాలో ఉన్న వాళ్లనందరినీ పిలిచాను. కానీ, నీ పెళ్లి అని చెప్పలేదు. నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. దయచేసి మీరు ఎవరైనా అతనికి సహాయం చెయ్యదల్చుకుంటే ఈ సమయానికి ఇక్కడకు వచ్చి సహాయం చేయండి అని చెప్పాను. ఇప్పుడు వచ్చిన వాళ్లంతా నీ నిజమైన స్నేహితులు. మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు. అలా అని వాళ్లను తప్పు పట్టడం లేదు. కాకపోతే పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ స్నేహితులుగా మాత్రం భావించకు’ అని చెప్పాడు.

నీతి:

మనం ఆనందంలో ఉన్నప్పుడు మన పక్కన లేకపోయినా ఫర్వాలేదు కానీ మనం బాధలో ఉన్నప్పుడు మాత్రం నేనున్నానని భరోసా పక్కన నిల్చుని భరోసా కలిగించే వాడే నిజమైన స్నేహితుడు.

Review అంతూదరీ లేని కోరికలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top