అద్దం మీద ఆవగింజ నిలవదు

తెలుగునాట నోరు నోరు తెరిస్తే సామెత. పాట పాడినా, ఆట ఆడినా అది కూడా సామెత రూపంలో నిలవాల్సిందే. మనకంటే ఒక మేలిమి సంప్రదాయం, సంస్క •తి ఉన్నాయనే విషయాన్ని ఈ సామెతలు నిరంతరం గుర్తు చేస్తుంటాయి. ‘పొట్టకైనా బట్టకైనా భూదేవే’ అని పల్లెవాసుల నమ్మిక. ‘కళ్లమున్న నాల్గొ ద్దులు గంజి. అంగడున్న నాల్గొద్దులు ఉప్పు’ వంటి సామె తలు జానపదాల నుంచి పుట్టినవే. పల్లె జీవనంలో భేషజాలు, ఆడంబరాలు ఉండవు. అటువంటి హెచ్చులు చేసే వారిని ‘చేతికి గడియారం-ఇంట్లో పొడికారం’ అని మందలిస్తారు.
నలుగురితో లౌక్యంగా ఉండాలని ‘అడ్డ ‘జామీన్ల’కు పోతే తెడ్డు దెబ్బలొస్తయి’ అని హెచ్చరించడం మన సామెతలకే చెల్లు. జీవితంలో నిజాయతీ ముఖ్యమనే ద•ష్టితో, భక్తి విశ్వాసాలు కూడా మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పేందుకు ‘బొమ్మకు మొక్కినా నమ్మకం ఉండాలే’ అనే సామె తను వాడతారు. జీవితం అంటే అందరి ప్రేమను, ఆదరాన్ని పొందాలనీ, అదే గొప్ప సంపద అని భావించడం మన నైజం. అందుకే ‘పదిమందిలో సావు పెళ్లితో సమానం’ అని చెబుతారు. అలాగే, మనల్ని ఎవరైనా నిందిస్తే ‘పడ్డోని ప్రాప్తం చెడదు’ అనుకుంటూనే ‘రోసిందే రాశి కొస్తది’ అని ఓదార్చడానికి కూడా సామెతలనే వాడతారు.
మనిషి సంఘజీవి. అతని నడవడిక, ప్రవర్తన సరిగా ఉండాలి. నలుగురు నవ్వేలా మన వ్యవ హారం ఉండకూడదు. కొంతమంది అవసరం లేకున్నా లేనిపోని హడావుడి చేస్తుంటారు. అటువంటి వారిని ఉద్దేశించి ‘పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు’ అనే సామెతను వాడతారు. అలాగే, ఎవరైనా కాని పనులు చేసినపుడు, చేసే పనిలో అతి చూపినపుడు ‘పుట్టని పిల్లకు పూసలు కుచ్చినట్టు’ అనే సామెతతో దెప్పిపొడుస్తారు.
సాధారణంగా పల్లెల్లో సమష్టి జీవనం కనిపిస్తుంది. గొడవలు పడకుండా తమవంటూ సొంత కట్టుబాట్లు విధించుకుంటారు. కలిసి ఉంటే ఎంత సౌఖ్యమో.. ‘గుద్దులాడే ఇంట్లో గుప్పెడు గింజలు ఉండవు’ అనే సామెతను ఉద హరిస్తుంటారు. ఇక, దంపతుల మధ్య తగవులు తగవని చెప్పేందుకు ‘ఆలుమొగల పంచాయితీ, మంచమెక్కేటప్పటికే’ అనే సామెతను చెప్పి నవ్వి స్తారు. నమ్మలేని నిజాలను గురించి వ్యాఖ్యానించేం దుకు ‘అద్దం మీద ఆవగింజ’ అనే సామెత వాడ తారు. అద్దం మీద ఆవగింజ నిలువదనే విషయం తెలుసు కదా!.
భార్యాభర్తలన్నాక మనసులు కలిసి బతకాలి. లేదంటే సంసారం సాఫీగా సాగదు. ఈ విషయం చెప్పేందుకే- ‘గతి లేని సంసారం చెయ్యచ్చు కానీ శ్రుతి లేని సంసారం చెయ్యలేం’ అంటారు.
ఇల్లన్నాక ఒక పెద్ద ఉండి తీరాలి. ఉంటేనే ఆ ఇంటికి దిశా నిర్దేశం సరిగా జరుగుతుంది. ఈ క్రమంలో ఇంటి పెద్ద ప్రాధాన్యతను చెబుతూ పుట్టిందే- ‘ఇంటికి అవ్వ కొలతకు తవ్వ’ అనే సామెత. ‘తవ్వ’ అనేది ధాన్యం కొలిచే పాత్ర. అది ఉంటేనే ధాన్యం కొలవగలం. ఇక, అవ్వ అంటే ఇంటికి పెద్దదిక్కు. వీరిద్దరి ప్రాధాన్యాన్ని చాటేదే పై సామెత.
పల్లెల్లో తల్లి ప్రాధాన్యాన్ని చాటే సామెతలు ఎన్నో. వాటిలో కొన్ని- ‘తల్లి పోయిన నాడే తనువు కూడా పోయింది’, ‘ఏనుగంత తండ్రి పోయినా, ఏకుల గుల్లంత తల్లుండాలి’, ‘తల్లి లేని పిల్ల దయ్యాల పాలు’, ‘కంచె లేని చేను, తల్లి లేని పిల్ల’.
కుటుంబ పోషణకే కాదు, పిల్లల సంరక్షణ లోనూ పురుషులదే ప్రధాన పాత్ర. అందుకే ‘వాన ఉంటే కరువు, మొగుడుంటే పేదరికం లేదు’ అనే సామెత పుట్టింది. ఇక, పిల్లలుంటేనే కదా ఏ ఇంటికైనా అందం. అందుకే, ‘పిల్లలు లేని ఇల్లు పీరిల కొట్టం’ అని పోల్చారు.
ప్రతి ఇంటా మగ పిల్లాడు పుట్టాలని కోరు కోవడం సహజమే. ఆ క్రమంలోనే ‘మగాళ్లు ఉన్న ఇల్లు మోదుగుల వనం’ అనే సామెత పుట్టింది.
తోడికోడళ్లు, అత్తా కోడళ్ల మధ్య సఖ్యత కంటే కలహాలే ఎక్కువ. అందుకే ‘అత్త తొడ కోసుకుంటే, తాను మెడ కోసుకుందట’ అంటూ కోడలిని ఎద్దేవా చేస్తూ ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇటు వంటిదే- ‘ఆమె సరిగె పెట్టుకుంటే, తాను బరిగె పెట్టుకుందట’ అనే సామెత కూడా ఉంది. ఇక్కడ ‘సరిగె’ అంటే ఆభరణం. ‘బరిగె’ అంటే కట్టెపుల్ల.
బావా మరదళ్ల సరసాలు, చమత్కారాలకు తెలుగు నాట కొదవ లేదు. ఈ కోవలో పుట్టిందే ‘బావా అంటే, రావా అని కొంగు పట్టుకున్నాడట’ అనే సామెత. బావకు బావమరిది ఉంటేనే అందం. అందుకే, బావమరిది ప్రాధ్యాన్యాన్ని చెబుతూ ‘బండెడు ధనమిచ్చినా బామ్మర్ది లేని చుట్టరికం వద్దు’ అంటూ సామెతను ఉపయోగిస్తారు.
మనుషులన్నాక సంసారాలు, చుట్టరికాలు మామూలే కదా. అయితే అందరి చుట్టాల వల్ల ఉపయోగం ఉండదు. ఆ విషయాన్ని చెప్పడానికి ‘చూడబోతే చుట్టాలు అడగబోతే కోపాలు’ సామెత చెబుతారు. అంటే, ఏదైనా సాయం కోరితే కొందరు చుట్టాలు ముఖం చాటేస్తారనేది తెలిసిన నిజమే కదా!. పాత చింతకాయ తొక్కు చాలా విలువైనది. ఎంతకాలమైనా అది గుణాన్ని కోల్పోదు. కాబట్టి పాత చుట్టరికం కూడా అంతే విలువైనదని చాటే సామెత- ‘పాత చుట్టరికం, పాత చింతకాయ తొక్కు’.
తెలుగునాట ఒకటని కాదు, మతం, కులం, వ•త్తులు, వ్యవసాయం, విద్య, నమ్మకాలు, రాజ కీయ ఆర్థిక వ్యవహారాలు గురించి ఎన్నో సామెత లున్నాయి. అవన్నీ కూడా మనల్ని, మన జీవితాన్ని బాగు చేసేవే. బోలెడన్ని పాఠాలు నేర్పేవే.

Review అద్దం మీద ఆవగింజ నిలవదు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top