మీకొక కథ చెప్తాను. ఈ కథను మీరు ఇది వరకు విని ఉండరు. చదివి ఉండరు. జాగ్రత్తగా చదివి జీవితంలో అవసరమైనపుడు మీకు అను గుణంగా అన్వయించుకోండి. జీవితంలో అడుగడుగునా ‘మాయ’ మనల్ని ఏమార్చు తుంటుంది. అది పెట్టే బాధ•ను, కలిగించే వేదనను భరించలేనపుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవ టానికి ఈ కథలోని నీతిని వాడుకోవచ్చు.
ఒక యాత్రికుడు ఒక మహానగరంలోని అందమైన వీధుల గుండా ఒక వేసవి మధ్యాహ్న సమయంలో అడుగులు వేస్తూ నడుస్తుంటాడు. అతనికి బాగా దాహమవుతుంది. అందుకని ఏదైనా బిల్డింగ్ తలుపు తెరచి ఉంటే వెళ్లి నీళ్లు అడుగుదామని అలాంటి ఇంటి కోసం వెతుకుతూ ఉంటాడు. ఒకచోట ఒక ఇంటి తలుపు తెరచి ఉంటుంది. ఇల్లు చాలా అందంగా ఉంటుంది. ఆ ఇంటి యజమాని కళాత్మక హృదయాన్ని ప్రశంసించుకుంటూ ఆ యాత్రికుడు ఆ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. ముందు రూంలో ఒక సర్వెంట్ ఉంటుంది. దాహం వేస్తుందని చెప్పి ఆమెను నీళ్లు అడుగుతాడు. వాటిని తేవటానికి ఆమె ఇంట్లోకి వెళ్తుంది. ఆ గది ఎంతో శోభాయమానంగా ఉంది. ఆ యాత్రికుడు గది గోడకు వేలాడతీసిన అద్భుత కళాఖండాలైన పెయిం టింగ్స్ను తన్మయత్వంతో పరిశీలిస్తూ ఉంటాడు. ఆ ఇంటి యజమాని యొక్క కళాతృష్ణ ఆ యాత్రి కుణ్ణి ఆశ్చర్యచకితుడిని చేస్తుంది. కళ్లకు మత్తును జల్లే ఎన్నో అందమైన చిత్రాలు అక్కడున్నాయి. ఆ చిత్రాలు కలిగించే ఆహ్లాదం ఆయన మనస్సును అక్కడ నుంచి కదలనీయటం లేదు. మెల్లగా ఆ యజమాని అదృష్టానికి ఈర్ష్య పడటం మొద లెడతాడు. తన దురదృష్టాన్ని చూసుకుని జాలి చెందుతాడు. ఈలోగా సర్వెంట్ గ్లాసులో నీళ్లు తీసుకుని వస్తుంది. ఆమె – యాత్రికుడు పెయిం టింగ్స్ చూస్తూ ఆనందించటం గమనించి – ‘‘లోపలి గదిలోకి రండి. అక్కడ ఇంకా మంచి, అందమైన చిత్తరువులు ఉన్నాయి’’ అని చెబు తుంది. అందుకు ఆ యాత్రికుడు తన దాహాన్ని కూడా మరచి గ్లాసును అలాగే చేతితో పట్టుకుని లోపలి గదిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అతని ఆశ్చర్యానికి అంతులేదు. కలలో కూడా ఊహించని అందమైన పెయింటింగ్స్ గోడలపై వేలాడు తున్నాయి. అతడు అనుకుంటాడు. ‘‘ఒక్క నిముషం ఇలా నిలబడి చూస్తేనే నాకింత ఆనందం కలుగు తోంది కదా! ఇంత ఆనందాన్ని రోజూ అనుభవించే ఆ యజమాని ఇంకెంత అదృష్టవంతుడో! భగవంతుడు ఒకరికి అంత అదృష్టాన్ని ప్రసా దించి, ఇంకొక నాలాంటి వాడికి అంత దుర దృష్టాన్ని ఎందుకు పంచుతాడో!’’ ఇలా తనలో తాను అనుకొంటూ గోడపైని పెయింటింగ్స్ను పరిశీలిస్తూ, ఆనందిస్తూ ఉంటాడు. ఇలా చూస్తూ ఉండగా – అంత కళా హృదయం కలిగిన ఆ యజమానిని ఎందుకో అతనికి చూడాలని పిస్తుంది.
‘‘మీ యజమానిని చూడొచ్చా. ఆయన ఇంట్లో ఉన్నారా?’’ అని అతను సర్వెంట్‍ను అడుగుతాడు.
‘‘ఉన్నారు! స్నానం చేస్తున్నారు! వెయిట్ చేయండి! వస్తారు’’ అని ఆమె చెబుతుంది. ఆ యాత్రికుడు – అన్ని అద్భుతమైన చిత్రాల అందాలను రోజూ అనుభవించే ఆ యజమాని కళ్ల అదృష్టానికి పొంగిపోతూ – తిరిగి చిత్రాలను పరిశీలిస్తూ యజమాని రాకకై వేచి చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ యజమానిని సర్వెంట్ తీసుకొస్తుంది. పక్కనే ఉన్న కుర్చీలో అతను కూర్చుంటాడు. యాత్రికుడు ‘నమస్కారమండీ’ అని విష్ చేస్తాడు. అతను కూడా తిరిగి చేతులు జోడించి ప్రతి నమస్కారం చేస్తాడు. యజమానిది మంచి ఆరోగ్యవంతమైన అందమైన శరీరం. చక్కని దుస్తులు ధరించి హుందాగా ఉన్నాడు. అతని కళ్లకు బ్లూ గ్లాసెస్ ఉన్నాయి. బహుశా ఎండలో నడిచేపుడు కలిగే కళ్ల శ్రమను నివారించటానికి లేదా అందంగా కనిపించడానికి వాటిని పెట్టుకున్నాడనుకున్నాడు. పైగా ఎండాకాలం. మధ్యాహ్న సమయం. కళ్లు చెదిరే ఎండలు. అలాంటి బ్లూ గ్లాసెస్ కొనగలిగే స్థోమత తనకు లేనందుకు ఆ యాత్రికుడు కాస్త మనసులో బాధపడతాడు. అతను యజమానితో – అతన్ని ప్రశంసిస్తూ పెయింటింగ్‍ను పొగడుతూ ఉంటాడు. అతను కూడా తిరిగి సమాధానాలనిస్తూ – ‘నేను కూడా ఇలాంటి అదమైన పెయింటింగ్స్ ఉండే ఇంట్లో నివసింగలగటం నా అదృష్టంగా భావిస్తు న్నాను’ అని చెబుతాడు. ఆ యాత్రికునిది కూడా కళా హృదయమే కాబట్టి తన టేస్ట్, యజమాని టేస్ట్ ఒకటో కాదో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో – అక్కడ ఉన్న అన్ని పెయింటింగ్స్లో అతనికి బాగా నచ్చిన పెయింటింగ్ ఏదని యాత్రికుడు యజమానిని అడుగుతాడు.
యజమాని ఒక్క నిమిషం ఏమీ మాట్లాడడు. అతను తిరిగి అదే ప్రశ్నను అడిగే సరికి యజమాని ‘‘నేను ఇంతవరకు ఆ పెయింటింగ్స్లో ఏ ఒక్క పెయింటింగ్‍ను చూడలేదు’’ అని సమాధానమిస్తాడు. యజమాని ముఖమంతా ఏదో తెలియని విషాదమేఘాలు ఆవరిస్తాయి. యాత్రికుడికి యజమాని సమాధానం ఏమీ అర్థం కాదు.
అతను కాస్త బాధపడుతూ ‘‘మీ సమాధానం నాకు అర్థం కాలేదండీ’’ అంటాడు.
ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ ఇంటి యజమాని తన కళ్లకు ఉన్న బ్లూ -గ్లాసెస్ తీసి, చేతిలో పట్టుకుంటాడు. యాత్రికుడు నమ్మలేనట్లుగా ఆశ్చర్యంగా యజమాని కళ్లవైపు చూస్తాడు. తన కళ్లను తానే నమ్మలేకపోతాడు. యజమాని పూర్తిగా గుడ్డివాడు. కళ్లలో కనుగుడ్లు కూడా లేవు. అప్రయత్నంగా యాత్రికుని కళ్లు చెమ్మగిల్లుతాయి. అయిదు నిమిషాలు వారిద్దరి మధ్య మౌనమే సంభాషణగా మారుతుంది.
కొద్దిసేపటి తర్వాత యాత్రికుడు తేరుకుని, ‘‘దయ చేసి, మీరు ఏమీ అనుకోకపోతే – మీ కళ్లు ఎలా పోయాయో, మీకు కళ్లు లేకపోయినా ఇళ్ల్లంతా పెయింటింగ్స్తో ఎందుకు అలంకరించు కున్నారో చెబుతారా ?’’ అని యజమానిని అడుగుతాడు.
అందుకు యజమాని ఇలా సమాధానమిస్తాడు.
‘‘నేను ఇదివరకు విదేశాల్లో చదువుతుండే వాడిని. మా తల్లిదండ్రులు ఇక్కడ భారతదేశంలో ఉండేవారు. మా తల్లిదండ్రులు చాలా గొప్ప చిత్రకారులు. ఆ కళ నాకు అబ్బకపోయినా వాళ్ల కళా హృదయాన్ని నేను సంతరించుకున్నాను. నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఆ విషయం మా తల్లిదండ్రులకు తెలుసు. నేను చదువు పూర్తి చేసుకొని గత సంవత్సరం ఇక్కడికి రావలసి ఉంది. నాపై నా తల్లిదండ్రులకు ఎంతో ప్రేమో!. అటువంటి ప్రేమ నేనెక్కడా రుచి చూడలేదు. నేను ఇక్కడికి వచ్చేలోగా నా కోసం ఈ అందమైన భవంతిని కట్టించారు. ఈ పెయింటింగ్స్ అన్నీ, నా కోసం, నేను చూసి ఆనందిస్తానని, నేను వచ్చేలోగా పగలూ రాత్రీ కష్టపడి, అన్ని పనులూ వదలి నా తల్లిదండ్రులు పెయింట్ చేసినవి. వాటిని వాళ్లే అందంగా ఈ గోడలపై అమర్చారు. నేను చివరి సంవత్సరం ఇక్కడికి రావటానికి బయలుదేరేసరికి యాక్సిడెంట్‍లో నా రెండు కళ్లూ పోయాయి. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు షాక్‍తో నేను భారతదేశానికి వచ్చేలోగా మరణించారు. వాళ్ల జ్ఞాపకార్థం ఈ పెయింటింగ్స్ను గోడపై అలాగే ఉంచాను. నేను బ్లూ-గ్లాసెస్ వాడటం వల్ల నా గురించి తెలియని వాళ్లంతా, నేను ఈ పెయింటింగ్స్ అందాలను ఆస్వాదిస్తున్నాననే భావిస్తారు. ఇన్ని పెయింటింగ్స్ నా కోసం ఉన్నా – వాటిని అనుభవించే కళ్లను నా అజాగ్రత్త వల్లే, నా పనిలో నేను మైమరిచి యాక్సిడెంట్‍కు గురై పోగొట్టుకున్నాను. ఈలోగా నా తల్లిదండ్రులు నన్ను వదిలి వెళ్లారు. వాళ్ల శ్రమనంతా నిరుపయోగపరుస్తున్నాను. చుట్టూ అందమైన చిత్రాలు. వాటిని అనుభవించలేని గుడ్డితనం. బయటచూస్తే నేను వాటిని అనుభవిస్తున్నానన్న భ్రమ కలిగించే ఈ బ్లూ-గ్లాసెస్. ఇదీ నా ప్రస్తుత పరిస్థితి’’ అని ఆ యజమాని దీర్ఘంగా నిట్టూరుస్తూ యాత్రికునికి జరిగిన విషయాలన్నీ చెబుతున్నాడు.
కాస్త ఇంచుమించుగా అందరి ప్రస్తుత పరిస్థితి ఇదే. ఈ ప్రపంచంలో ఉండే అందరి పరిస్థితి ఇదే, ఒక్క జ్ఞానిది తప్ప. మనల్ని ఎంతో ప్రేమించే మన తల్లీతండ్రీ అయిన భగవంతుడు అందమైన భవంతిలాంటి ఈ ప్రపంచాన్ని మనకు ఇచ్చాడు. అందులో మన కోసం ఎన్నో అందాలను, ఆనందాలను అందమైన చిత్తరువుల్లా వేలాడదీశాడు. తల్లితండ్రులను వదలి విదేశాలకు వెళ్లిన యజమానిలా మనం మన జీవితంలోకి భగవంతుణ్ణి వదలి ఎక్కడెక్కడికో పరుగెత్తాం. అయినా ఆయన మన కోసం అందమైన చిత్రాలను పెయింటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇంతలో జీవన సంగ్రామంలో మనల్ని అనుక్షణం ఏమార్చే ‘మాయ’.. దాని ప్రభావానికి లోనై కళ్లెదుట ఎన్న అందాలను చూడలేని, ఆస్వాదించలేని దుస్థితి.. చుట్టూ అన్ని అందాలున్నా.. దేన్నీ అనుభవించలేని పరిస్థితి. కాని పైకి చూడటానికి అన్నీ అనుభ విస్తున్నట్లు భ్రమగొల్పుతూ, కళ్లకు బ్లూ-గ్లాసెస్ ధరించిన యజమానిలా – ముఖానికి లేని నవ్వును పులుముకొని ఇతరులను భ్రమల్లో ముంచుతూ నటిస్తాం. అసలు నిజం ప్రతి ఒక్కరి అంతరంగానికి తెలుసు. యాక్సిడెంట్ తర్వాత షాక్‍తో చనిపోయిన యజమాని తల్లిదండ్రుల్లా – ‘మాయ’ను మనం ఢీకొని – అందులో మునిగిన తర్వాత – భగ వంతుడూ మనకు దూరమయ్యాడు. మన పెయిం టింగ్ మన బ్లూ-గ్లాసెస్ యొక్క అసలు అంతరార్థం తెలియక, మనం నిజంగానే ఈ సుఖాలన్నింటినీ అనుభవిస్తున్నామని భ్రమపడి, బాధపడి, ఈర్ష్యపడే యాత్రికునిలాంటి వాళ్లు ఎంతమందో ఈ ప్రపంచంలో ! మిగతా వాళ్ల విషయం పక్కన పెడితే -నాకు మాత్రం నా జీవనయాత్రలో యాత్రికుడు, యజమానీ ఇద్దరూ ఎన్నోసార్లు ఎదురవుతారు.బహుషా మీకూ జీవి తంలో ఏదో సందర్భంలో ఇటువంటి అనుభవం ఎదురుకావచ్చు.
(శ్రీరామ్ సర్ వివిధ సందర్భాలలో రాసిన లేఖలనుంచి సేకరించిన అంశాలు ఇవి)
Review అద్దాల మాటున అసలు ప్రపంచం.