ఉంటే ఉగాది.. లేకపోతే తగాది..

ఆనందానికి ఆది.. ఉగాది. ఇది అందరి జీవితాల్లోనూ ఆనందోత్సాహాలను నింపే పర్వం. ఎందుకంటే, మనకు కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యేది ఉగాది నుంచే. ఈ ఉగాదిని ఆధారంగా చేసుకుని పలు సామెతలు వాడుకలో ఉన్నాయి. అవి పండుగ విశిష్టతను తెలపడంతో పాటు పండుగ ఆధారంగా ఉన్న విశ్వాసాలను ప్రతిబింబిస్తాయి. అటువంటి కొన్ని ఉగాది సామెతల పరిచయం.
ఉంటే ఉగాది.. లేకుంటే శివరాత్రి
ఎవరి జీవితంలోనైనా ఏదో సందర్భంలో కలిమిలేములు తప్పవు. అటువంటి సందర్భాలను సరదాగా పండుగలు, పర్వాలతో పోల్చి చెప్పే సామెత- ‘ఉంటే ఉగాది.. లేకుంటే శివరాత్రి’. ఉగాది అనేది షడ్రుచుల పండుగ. మంచి విందు వినోదాలకు, ఆనందానికి ఈ పర్వం పెట్టింది పేరు. అంటే ఇది ఆనందదాయకమైన పండుగ.
అలాగే, శివరాత్రి, ఉపవాసం, జాగరణ ప్రధానమైన పర్వం. అంటే తినడానికి అన్నీ ఉన్నా.. పండుగ ధర్మాన్ని బట్టి శివరాత్రి నాడు కఠిన ఉపవాసం చేయాలి. అంటే ఒక విధంగా కడుపు మాడ్చుకోవాలి.
ఎవరినైనా ‘ఎలా ఉన్నారు? జీవితం ఎలా ఉంది?’ అని అడిగినపుడు, అవతలి వారు తమ కెదురైన కష్టాలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ‘ఆ ఏముందిలే.. ఉంటే ఉగాది.. లేదంటే శివరాత్రిలా జీవితం గడిచిపోతోంది’ అంటారన్న మాట. అంటూ కొంత బాగా, మరి కొంత ఉండీ అనుభవించడానికి లేకుండా జీవితం గడిచిపోతుందని అర్థం. అటువంటి సందర్భాలలో వాడే సామెత ఇది.
ఉంటే ఉగాది.. లేకపోతే తగాది
దాదాపుగా పై సామెతకు సరిపోయే సామెత ఇది. పండుగ అంటేనే సాధారణంగా కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. డబ్బులు ఖర్చయినా ఆనందం కలుగుతుంది. అయితే అసలు లేని వారు పండుగొచ్చినా, పబ్బమొచ్చినా పాపం ఏం ఖర్చు చేయలేరు.. ఆనందాన్ని పొందలేరు. అంటే, ఉన్న వాడు మాత్రమే పండుగను జరుపుకుంటాడని, లేనివాడు అందుకు భిన్నంగా గడుపుతాడనే అర్థంలో పై సామెతను వాడతారు.
చింతకాయలు అమ్మే దానికి సిరిమాన్యం వస్తే.. ఇవేం కాయలే వంకరటింకరగా ఉన్నాయి అందట..
అకస్మాత్తుగా జీవితంలో కలిసి వస్తే కొందరి మాట, నడవడిక కూడా మారిపోతాయి. తమ జీవితానికి మూలమైన పాత జీవితాన్ని మరిచి పోయి వగలుపోతారు. వెనకటికి చింతకాయలు అమ్ముకునే అమ్మి.. అకస్మాత్తుగా ఐశ్వర్యవంతు రాలయ్యే సరికి.. చింతకాయలేంటి.. వంకరగా ఉన్నాయేంటి అందిట. అటువంటి వారిని ఉద్దేశించి పై సామెతను వాడతారు (ఉగాది పచ్చడికి గల ఆరు రుచుల్లో పులుపు ఒకటి. దీనిని చింత పండు నుంచి సంగ్రహిస్తారు. కాబట్టి చింతకాయల సామెతను ఇక్కడ ఉదహరించడం జరిగింది).
చింతచెట్టు పుట్టింటికి పోయినట్టు..
అవ్వను పట్టుకుని వసంతాలాడినట్టు..
ఉగాది పర్వం వచ్చే ఛైత్ర మాసాన్ని వసంత మాసం అని కూడా అంటారు. వసంతం అంటే ఒక విధమైన సంతోషకాలం. రంగులు చల్లు కోవడం, ఆనందాలను పంచుకోవడం వంటివి ఈ కాలపు ధర్మాలు. ఇటువంటి ఆనందాలు, సరదాలను వృద్ధులు శారీరక బలహీనత, వార్ధక్యం వల్ల అనుభవించలేరు. కానీ, పిల్లలకు ఇవేమీ తెలియవు కదా! తమ ఆనందాన్ని వాళ్లతో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తారు. తమ ఆకతాయి పనులతో ఆటపట్టించడానికి ప్రయత్నిస్తారు. వసంతకాలంలో పిల్లల ఆకతాయి ఆటలకు నిదర్శనంగా ఈ సామెతను ఉపయోగిస్తారు.
రేవతి వర్షం.. రమణీయ వర్షం
రేవతి కార్తె చైత్ర మాసం మొదటి భాగంలో వస్తుంది. ఒకవేళ ఈ కార్తె సమయంలో వర్షం పడితే అది వసంత కాలానికి మరింత శోభాయ మానం తెస్తుందనే అర్థంలో ఈ సామెతను వాడు తుంటారు.
శివరాత్రికి జీడికాయ.. ఉగాదికి ఊరగాయ
ఆయా కాలాల్లో పండే పండ్లను గురించి చెబుతుందీ సామెత.. శివరాత్రి మాఘ మాసం (ఫిబ్రవరి)లో వస్తుంది. ఈ కాలంలో జీడికాయలు పుష్క లంగా లభిస్తాయి. ఇక ఉగాది చైత్ర మాసంలో వస్తుంది. అంటే, మార్చి లేదా ఏప్రిల్లో ఈ పర్వం ఉంటుంది. ఉగాది సమయానికి మామిడిచెట్లు పచ్చగా పూస్తాయి. ఊరగాయకు అవసరమైన మామిడి కాయలు పిందెలు వేసేది ఈ సమయంలోనే.

Review ఉంటే ఉగాది.. లేకపోతే తగాది...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top