పిల్లలకు కథలు చెప్పడం వారిని ‘దారి’లో పెట్టడానికే. ఊ కొట్టించి, కేవలం నిద్రపుచ్చడానికి మాత్రమే కాదు.. వారిని వాళ్లదైన ఊహాలోకంలోకి తీసుకెళ్లి వాళ్లలో నిద్రాణంగా ఉండే సృజనాత్మక శక్తిని పెంచడానికి కూడా!. అందుకే కథలంటే చిన్నారులు చెవికోసుకుంటారు. వాళ్లని వికాస సంపన్నులను చేయడానికి తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు కథలనే చెప్పాలి. కథలనే చదివించాలి. చిన్నారుల్లో క్రమంగా ఆలోచనా పరిధిని పెంచడానికి కథలే మార్గం. పైగా వారిని తేలికపరచడానికి ఉపకరించేవి కూడా కథలే.
కథ చెప్పడం ఒక కళ. అందులోనూ చిన్న పిల్లలకు చెప్పడం మహా కళ. ఓర్పు, నేర్పు, ఆసక్తి, అనురక్తి, ఉహాశక్తి మిళితమై ఉన్న వారు మాత్రమే ఈ కళలో రాణించగలరు. లేకుంటే కథ చెప్పేవారు పిల్లల ముందు డీలా పడిపోతారు. అందుకే ఈ తరం వాళ్లు మాకు ‘కథలే రావు’ అని తప్పించుకుంటూ ఉంటారు. కొందరికి కథలు తెలిసినా చెప్పే తీరు తెలియక చెప్పరు. మరికొందరు కథల పుస్తకాల్లోని వాటిని చదువుతూ వివరించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, కథకుడు ఎప్పుడూ పిల్లలకు ఆసక్తికరమైన శైలిలోనే వినిపించాలి. అప్పుడే చిన్నారుల మనసు ఉత్తేజితమవుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో పిల్లల్ని సముదాయించడానికో, మనోల్లాసం కలిగించడానికో, వాళ్ల మధ్య పోట్లాటలు లేకుండా చూడటానికో- ఏదో ఒక సదుద్దేశంతో తాతలు, అవ్వలు, మామలు, అక్కలు, అన్నలు కథలు చెప్పడానికి ఉపక్రమించే వారు. పిల్లలు కూడా కథలంటే చాలా ఇష్టపడే వాళ్లు. అందులోనూ ఓ వ్యక్తి ‘కథలు చెప్పడంలో దిట్ట’ అని తెలిస్తే చాలు.. పిల్లలు వాళ్లను వదిలిపెట్టే వారు కాదు. ఈ స్థాయిని సంపాదించుకోవడానికి కథకుడు కొంత కృషి చేయాలి.
ప్రస్తుతం పిల్లలకు కథలు చెప్పడం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. ఎప్పుడూ పాఠ్యపుస్తకాలతో యుద్ధం చేయించడమే. మరి మన సాహిత్యం, చరిత్ర, ఇతిహాసాలు, పురాణాలు కానీ, తెలుగు ప్రాంతంలో జరిగిన వాస్తవ గాథలు కానీ మన చిన్నారులకు ఎలా తెలుస్తాయి?. కేవలం బడిలో చెప్పే పాఠాలకు మాత్రమే పరిమితం అయ్యే పిల్లల్లో సహజమైన ఆలోచనలు, సృజన శక్తులు, మనోల్లాస చురుకుదనాలు పూర్తి స్థాయిలో వికసిస్తాయా? అందుకే మనం వీలు కలిగించుకుని మరీ పిల్లలకు ఇంట్లోనే మంచి కథలు చెప్పాలి. అంతకుముందు మనం మంచి కథకులుగా మారాలి.
కథలు చెప్పాలనుకునే పెద్దలు ముందు కొన్ని మంచి కథలు చదవాలి. తాము చిన్నప్పుడు విన్న కథలనైనా జ్ఞప్తికి తెచ్చుకుని సంక్షిప్తంగా రాసిపెట్టుకోవాలి. పిల్లలకు చెప్పబోయే కథ ఆ సందర్భానికి అనువైనదిగా ఉండాలి. అప్పుడే పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది. పూర్వం హరిదాసు, కథ మధ్యలో కొన్ని పిట్టకథలు చెప్పేవాడు. అవి సందర్భోచితంగానే ఉంటూ నవ్వు పుట్టించడమే కాక, కథలోని విషయంతో సమన్వయం అయ్యేవి. అలాగే, మనమూ సందర్బోచితంగా ఉండే కథలనే చెప్పాలి.
ఉదాహరణకు, ఓ పిల్లాడు తన టోపీలో పెట్టుకున్న జామపండ్లను ఓ కోతి టోపీతో సహా ఎత్తుకెళ్లిందనుకోండి. వాడిని సమాధానపరచడానికి ‘కోతి-టోపీల వర్తకుడు’ కథ చెబితే సరి. అది వాడికెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. టోపీల వర్తకుడికి ఆ పిల్లాడి పేరే పెడితే మరింత రసవత్తరంగా ఉంటుంది. ఈ కథకు మరికొన్ని దినుసులను చేరిస్తే.. ఫలితం ఇంకా గొప్పగా ఉంటుంది. ఎలాగంటే.. చెట్టుదిగిన కోతి. బుట్టలో లడ్లు ఉన్నాయో, జిలేబీలు ఉన్నాయో, అరటిపండ్లు ఉన్నాయో, మామిడి పండ్లు ఉన్నాయో.. అంటూ వివిధ పదార్థాల పేర్లతో సాగదీస్తూ పోవాలి. దాంతో పిల్లలు కూడా మరికొన్ని కొత్త పేర్లు జోడించి గంగా ప్రవాహంలా చెప్పుకుంటూపోతారు. ఇలా వారిని కథలో నిమగ్నం చేయగలిగితే వారి నోటి నుంచి ఎన్నో విషయాలు వెలికి వస్తాయి. అప్పుడా కథ కంచికి పోదు. పిల్లల నోటి నుంచి కొత్త పదాలను, వాక్యాలను, సంభాషణలను ఆశువుగా చెప్పించాలంటే ఇదే ఉత్తమ మార్గం. తెలుగు భాషపై పట్టు పెంచడానికి, నవతరానికి తెలుగును దగ్గర చేయడానికి కథలే ఆయువుపట్టులు.
ఊహాశక్తితో.
ఒక్కోసారి కథ మొదలు
పెట్టి ఒకటో రెండో వాక్యాలు
చెప్పగానే.. కొందరు కుర్రాళ్లు గొంతెత్తుతారు. ‘మాకీ కథ తెలుసు. ఇదొద్దు. ఇంకొకటి చెప్పు’ అంటూ ఏదో పెద్ద తెలిసిన వాళ్లలా మూతులు తిప్పుతారు. అప్పుడేం చేయాలి? మొదలుపెట్టిన కథలోని రెండు వాక్యాలతోనే మరో కొత్త కథను అల్లుకోవాలి. అదీ అప్పటికప్పుడే. ఆ ఊహాశక్తి కథకుడికి చాలా అవసరం. ఉదాహరణకు ‘కాకి-నక్క’ కథే అనుకోండి. ప్రారంభంలోనే దీన్ని పిల్లలు వద్దంటారు. అది సహజం. అప్పుడు కథకుడు దాన్ని ‘తెలివైన కాకి’ కథగా మార్చాలి. కాకి వల్ల ఆ నక్క ఎలా మోసపోతుందో చమత్కారపూరితంగా చెప్పాలి. దాంతో కొత్త కథ విన్నట్టుగా సంబరపడి పోతారు పిల్లలు. కథ చెప్పే సమయంలో పిల్లలందరినీ బాగా గమనిస్తుండాలి. కొంటె పిల్లలు కథ వినకుండా చిలిపి పనులు చేస్తుంటారు. కథలో భాగంగానే వారికి చురకలంటించాలి. అలా వారిని కథలోకి లాక్కోవాలి. లేకుంటే కథ ‘హుష్కాకి’ అయిపోతుంది. ‘పిల్లలూ మీకు తెలియని కథలు ఎన్నో ఉన్నాయి సుమా’ అంటూ గంభీరమైన స్వరంతో కథను ప్రారంభిస్తే అది ఇంకెంత కొత్తదోనని పిల్లలు చెవులు రిక్కించి వింటారు. వారిలో ఆ ఆసక్తి అలా కొనసాగు తుండగానే, మనం కథను కొనసాగించాలి. .
ధారావాహిక కథలు
కొన్ని రోజుల పాటు వరుసగా చెప్పే కథలే ధారావాహికలు. అల్లావుద్దీన్ అద్భుత దీపం, అలీబాబా నలభై దొంగలు, కీలుగుర్రం, మాయా దర్పణం, బాలరాజు కథ, బాలనాగమ్మ కథ లాంటి జానపద, చారిత్రాత్మక కథలు ఈ కోవలోకి వస్తాయి. ఆ కథలను చెప్పేటప్పుడు మంచి ఉత్కంఠ కలిగించే సన్నివేశాల్లో చెప్పడం ఆపేసి, ‘.. ఏమైందో తర్వాత తెలుసు కుందాం’ అనాలి. అప్పుడు పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది. వారు ఎంత చెప్పమని బతిమాలినా ఆ రోజు ఇక ఆ కథను చెప్పకూడదు. ఇలా కథల విషయంలో కాలాన్ని పొడిగించుకుంటూ పోవడం వల్ల పిల్లలో ఆసక్తి, శ్రవణ, గ్రహణ, జ్ఞాపకశక్తులు వృద్ధి చెందుతాయి. అయితే, కథను మళ్లీ ప్రారంభించేటప్పుడు ‘జరిగిన కథ’ను పిల్లల చేతే చిన్న చిన్న వాక్యాల్లో చెప్పించడం మరిచిపోకూడదు.
పాఠ్యాంశ కథలు
అప్పుడప్పుడు పిల్లల పాఠ్య పుస్తకాలను గమనించాలి. వాటిలోని కథలను కూడా ఆసక్తికరంగా మార్చి చెప్పాలి. అప్పుడు పిల్లలు ‘ఈ కథ మా తెలుగు పుస్తకంలో ఉంది’ అని గంతులేస్తారు. కొందరైతే పుస్తకాన్నే తెచ్చి చూపించి ముచ్చట పడతారు. దాంతో వాళ్లకు ఆ కథ చదవాలనే ఉత్సాహం రేకెత్తుతుంది. దీంతో పుణ్యమూ పురుషార్థమూ సిద్ధించినట్టే కదా!
మరెన్నో చిట్కాలు..
••మ్మల ద్వారా కథలను చెప్పవచ్చు. వీటి ద్వారా కథల్లోని నీతితో పాటు ఆ ••మ్మల్లోని అంశాన్నీ గ్రహించగలుగుతారు. ఇంకా కథా చిత్రాల ద్వారా కూడా కథ చెప్పవచ్చు. ఈ విధానంలో ఒక చార్టుపై ••మ్మలు ఉంటాయి. వాటిని చూపిస్తూ కథను చెప్పమనాలి. గొలుసు కథలను అల్లాలి. ఒక్కొక్కరి చేత కథను కొనసాగించాలి. ఎవరి ఊహాశక్తి మేరకు వారిని సొంతంగా కథను అల్లమనాలి. ఒకరు ఆపేసిన దగ్గర నుంచి మరొకరు ప్రారంభించాలి. కథను ఎంతసేపు చెప్పాలనేది పిల్లల ఉద్వేగాన్ని బట్టి కొనసాగించాలి. అదేపనిగా సాగదీస్తే ఆసక్తి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వారిలోని ఉత్సాహాన్ని గమనిస్తూ కథా గమనాన్ని కొనసాగించాలి. తెలుగు భాష, పదాలు సజీవంగా మనగలగాలంటే ఇప్పుడే పిల్లలకు కథలు చెప్పడం ప్రారంభించండి. •
Review ‘ఊ’.. కొడతారా?.