
మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం..
ఇంటి కోడలికి అత్తా ఆడపడుచూ బద్ధ శత్రువులు. పెళ్లి కాని ఆడపడుచు లేదా తలమాసి వచ్చిన ఆడపడుచు అమ్మకు వంతపాడుతూ, అన్నకు ఫిర్యాదులు చేస్తూ, వదినె మీద కారాలు మిరియాలు నూరడానికి వెనుదీయదు. చీరలు, నగలు తనకు తెచ్చివ్వగలిగినా అన్నకు అడ్డు పడుతుంటుందని కోడలిపై ఆడపడుచుకు తెగ కోపం.
ఆడబిడ్డ అహంకారాన్ని, ఆ ఇంటి కోడలిపై ఆమె చూపే అధికారాన్ని ‘పిండిబొమ్మను చేసి పీట మీద కూర్చుండబెడితే ఆడబిడ్డ తనాన అదిరదిరి పడ్డదట’, ఆడబిడ్డ అర్ధ మొగుడు, అత్త పోరు కంటే ఆడబిడ్డ పోరు ఎక్కువ అనే సామెతలు చక్కగా తెలుపుతాయి.
కోడలు అత్తను ద్వేషించినట్టే ఆడబిడ్డను కూడా ఒక దెయ్యంగా భావించి ద్వేషిస్తుంది. ఆడబిడ్డమ్మా! అంత్ర పిశాచమ్మా! వంట ఇంటిలోనికి తీసుకెళ్లి మండే కొరకంచు పెట్టు అనే సామెత కోడలి కసిని వెల్లగక్కుతుంది. ఎడపిల్ల అయినా ఏరాలితో సమానం కోడలుకు ఆడపడుచు.
ఆడపడుచుకు అమ్మగారిల్లు స్వర్గం. తనకెంత ఉన్నా పుట్టింటి నుంచి చీరెలు, సారెలు కావాలని కోరుకుంటుంది. అమ్మగారు పెట్టిన చీరసారెలను, నగలను ఇరుగుపొరుగుకు చూపించి మురిసిపోతుంది.
ఆడపడుచు పుంటికూర తిన్నా పుట్టిన ఇల్లు, పాశము తిన్నా పరాయి ఇల్లుగా భావిస్తుంది.
ఆడబిడ్డ పుట్టింటి నుంచి ప్రతీదీ ఆశిస్తుందని ఆడబిడ్డ ఆశ మూలవాసం గుంజుకుపోయే వరకు తీరదు అనే సామెత చెబుతుంది.
ఆడబిడ్డ ఉసూరుమంటే ఆరు తరాలు అరిష్టం అని ప్రజల నమ్మకం.
తలచెడిన ఆడబిడ్డ పుట్టింటికి చేరక తప్పదు. ఇంట్లో అల్లకల్లోలాలు చెలరేగక తప్పదు అనే విషయాన్ని ఆడబిడ్డ చెడితే పుట్టినిల్లు చేరాల. బంగారం చెడితే కంసలిల్లు చేరాల, ఆడపడుచు చేరిన ఇల్లు అడవిలో కట్టిన ఇల్లు ఒకటే అనే సామెతలు చెబుతాయి.
తనకన్నా పెద్దదైన ఆడపడుచును కోడలు వదినా అని పిలుస్తుంది. తల్లి చనిపోతే ఆడపడుచుకు పుట్టింట్లో స్వతంత్రం తగ్గిపోతుంది. అమ్మ ఉన్నప్పుడు నెలల తరబడి ఉండగలిగేది, అమ్మలేకపోతే కొన్ని దినాలు కూడా ఉండలేదు. పుట్టింట్లోనే పరాయిగా భావించుకుంటుంది. ఈ నిజాల్ని చక్కగా చెప్పేవే తల్లి లేని పుట్టిల్లు ఉల్లి లేని కూర, అండ లేని ఊళ్లో ఉండ దోషం, ఆశ లేని పుట్టింట అడుగ దోషం అనే సామెతలు.
తల్లి లేని పుట్టింట ఆడపడుచుకు అన్నం, చీరసారెల సంగతి తరువాత.. కనీసం ఒక్కోసారి భోజనం పెట్టి పంపేందుకు కూడా మరదలికి మనస్కరించదు.
అయ్యో! వదిన! అంతకుముందు వచ్చిన అన్న బంతిన తిందువు. ఇంతకుముందు వచ్చిన ఏరాలి బంతిన తిందువు. ఇప్పుడేలాగు? ఎలుక పొయ్యి ఎత్తుకుపోయిందే అని వెనకటికి ఓ కోడలు వాపోయిందట.
ఇలా తల్లిని కోల్పోయిన పుట్టింట ఆడపడుచులకు కోడళ్లు మాటలతోనే మామిడిపండ్లు రాలుస్తారు.
వంగతోట దగ్గర వదినా అంటే వంకాయలు కోసివ్వబడుతుందని, ఎక్కడైనా వదినా అనుగాని వంగతోటలో వదిన అనకు అనిందట ఓ కోడలు ఆడపడుచుతో.
అమ్మ ఉన్నప్పుడు ఆ ఇంటి కోడలిపై అధికారం చెలాయించిన ఆడపడుచు అమ్మను కోల్పోయిన తరువాత అమ్మగారిల్లంటే అంటీముట్టకుండా, ఏమీ ఆశించకుండా తటస్థురాలవుతుంది.
ఇవీ కోడలు, ఆడపడుచులకు సంబంధించి తెలుగు నాట ప్రధానంగా ప్రాచుర్యంలో ఉన్న సామెతలు.
వచ్చే నెల బావ – మరదలు – బావమరిది మధ్య అల్లుకుని ఉన్న తెలుగు సామెతల గురించి తెలుసుకుందాం.
Review ఎక్కడైనా వదిన గాని వంగతోట కాడ కాదు...