మన పూర్వీకులు ఏడాదిని రెండు ఆయనాలుగా, పన్నెండు మాసాలుగా విభజించారు. ప్రతి మాసంలో రెండు పక్షాలు వస్తాయి. అంటే ప్రతి నెలలో రెండుసార్లు ఏకాదశి తిథి వస్తుంది. ఇలా ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు.. ఒక్కో దానికి ఒక్కో విశిష్టత. ఇరవై నాలుగు ఏకాదశులు ఏదో ఒక విశిష్టతను కలిగి ఉన్నాయి. అటువంటి వాటిలో పుష్య శుద్ధ ఏకాదశి ఒకటి. దీనినే పుత్రదైకాదశి అని, రైవత మన్వాది దినమని కూడా వ్యవహరిస్తారు.
పుష్య శుద్ధ ఏకాదశి
పుత్రదైకాదశి/రైవతమన్వాది
పుష్య శుద్ధ ఏకాదశిని రైవత మన్వాది దినమని వ్యవహరిస్తారు. రైవతుడు ఐదవ మనువు. రైవతుని కథ రమణీయమైనది.
రుతువాక్కు అనే ఒక ముని ఉండేవాడు. రేవతి నక్షత్రం నాలుగో పాదంలో ఆయనకు ఒక కుమా రుడు జన్మించాడు. అతను పెరిగి పెద్దవాడైన కొద్దీ మిక్కిలి దుర్మార్గంగా వ్యవహ రించసాగాడు. అతనిలోని ఈ దుష్టత్వానికి కారణం అతని రేవతీ నక్షత్ర చతుర్థ పాద జాతక ఫలితమే అని తెలుసుకుని అతని తండ్రి రుతు వాక్కు.. రేవతీ నక్షత్రాన్ని కిందపడిపోవాలని శపించాడు.
ఆ శాపం చేత రేవతి నక్షత్రం ద్వారకకు దగ్గ రలో ఉన్న కుముదం అనే కొండ మీద పడింది. రేవతి నక్షత్రం అక్కడ పడటం చేత ఆ కొండకు అప్పటి నుంచి రైవతకము అనే పేరు వచ్చింది. రేవతి నక్షత్రం పడిన తాకిడికి ఆ కొండ మీద ఒక కొలను కూడా ఏర్పడింది. ఆ రైవత పర్వతం మీద ఆ తామర కొలను నుంచి ఒక కన్యక పుట్టింది.
ఆమెను ఆ కొలను చెంత ఉండిన ప్రముచుడు అనే ముని పెంచి పోషించాడు. ఆమెకు ఆయన రేవతి అనే పేరు పెట్టాడు.
రేవతి పెళ్లీడుకు వచ్చింది. ప్రముచుడు ఆమెకు యోగ్యుడైన వరుడి కోసం వెతికి, దుర్ద ముడు అనే రాజునకు ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. పెళ్లి పనులు చేయసాగాడు.
అప్పుడు రేవతి, తన వివాహం రేవతీ నక్షత్ర యుక్త లగ్నంలో చేయాలని ప్రముచుడిని కోరింది.
అప్పుడు ప్రముచుడు- ‘ఇప్పుడు నక్షత్ర మండలంలో రేవతీ నక్షత్రమే లేదు. అది కిందపడిపోయింది. నక్షత్రమే లేనపుడు దానికి చంద్ర సంయోగం ఎలా కలుగుతుంది? చంద్ర సంయోగం లేని నక్షత్రం వివాహానికి యోగ్యం కాదు. కాబట్టి వివాహానికి అర్హమైన శుభ నక్షత్రములు చాలా ఉన్నాయి. వాటిలో ఒక శుభ నక్షత్ర యుక్త సమయంలో నీకు వివాహం చేస్తాను’ అని బదులిచ్చాడు.
అప్పుడు రేవతి ప్రముచునితో- ‘నేనే రేవతి నక్షత్రాన్ని. నీ తపో మహిమ చేత రేవతీ నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలపండి. ఆ నక్షత్రమే నా వివాహానికి అనుకూలమైనది. మరొక నక్షత్రంలో చేసే వివాహం నాకు అవసరం లేదు’ అంది.
దీంతో ప్రముచుడు తన తపోధనాన్ని ధార పోసి రేవతి నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలిపాడు. దానికి చంద్ర సంయోగం కలిగించాడు. ఆ మీదట రేవతి నక్షత్రయుక్తమైన ఒక లగ్నంలో ఆమెను దుర్దముడికి ఇచ్చి వివాహం చేశాడు.
రేవతీ దుర్దముల కుమారుడు రైవతుడు. అతడు కాలక్రమాన సకల ధర్మవేది అయి మనువుగా ఆవిర్భవించాడు. మనువుల్లో అతను ఐదవవాడు.
రైవతుని మన్వంతరంలో విభుడు అనే వాడు ఇంద్రుడు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ద్వబాహుడు, వశిష్ఠుడు మున్నగు వారు సప్త రుషులు.
పుష్య శుద్ధ ఏకాదశి రైవత మన్వాది దినమే కాక పుత్రదైకాదశిగా కూడా ప్రసిద్ధమై ఉంది.
సుకేతుడనే రాజు ఈ ఏకాదశి నాడు విద్యుక్తంగా వ్రతాన్ని ఆచరించి పుత్రుడిని పొందాడు. అందు చేత ఈ ఏకాదశికి పుత్ర దైకాదశి అనే పేరు వచ్చింది.
పుష్య కృష్ణ (బహుళ) ఏకాదశి
షట్తిలైకాదశి
ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో పుష్య కృష్ణ ఏకాదశిని షట్తిలైకాదశిగా వర్ణించారు. చతుర్వర్గ చింతామణిలో ఈ తిథి నాడు తిలాదాహీ వ్రతం ఆచరించాలని ఉంది. షట్ తిలైకాదశి అంటే, ఆరు విధాలుగా తిలల (నువ్వులు)ను ఉపయోగించే ఏకాదశి అని అర్థం. ఈనాడు- 1. స్నానం చేసే నీటిలో నువ్వులను వేయాలి, 2. నువ్వులు నూరిన ముద్దను శరీరమంతా రాసుకోవాలి, 3. ఆరు నువ్వుల గింజలను తినాలి, 4, తాగే నీటిలో కొద్దిగా నువ్వులను వేసుకోవాలి, 5. గురువులకు తిలలను దానం చేయాలి, 6. తిల తర్పణం విడిచి పెట్టడం ద్వారా దేవతలకు నువ్వులు సమ ర్పించాలి. నువ్వులతో ఈ ఆరు విధాయ కృత్యాలు చేయాల్సిన తిథి కాబట్టి దీనిని షట్తిలైకాదశి అని అన్నారు.
Review ఏకాదశి...