ఏమో… ఏది ఎవరికెరుక

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.

సర్వం కర్మాధీనం
మంచి కావచ్చు.. చెడు కావచ్చు.. అదృష్టం కావచ్చు.. దురదృష్టం కావచ్చు..
‘మన చేతుల్లో ఏమీ లేదు’ అనే భావనను వ్యక్తీకరించడానికి ఉపయోగించే జాతీయం ఇది. ఒక విధంగా చెప్పాలంటే, కర్మ సిద్ధాంతం నుంచి పుట్టిన మాట ‘సర్వం కర్మాధీనం’. దీనికి సంబంధించి ఒక కథ కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది.
ఒకానొక కాలంలో గౌతమి అనే ఆమె కొడుకును పాము కరవడంతో చనిపోతాడు. ఆ తల్లి శోకానికి అంతు ఉండదు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక బోయవాడు విషయం తెలుసుకుని ఆగ్రహానికి గురవుతాడు. గౌతమి కొడుకును కాటేసి అతని చావుకు కారణమైన పామును ఎలాగైనా చంపాలని ఆరాటపడతాడు. అప్పుడు ఆ బోయవానితో గౌతమి ఇలా అంటుంది.
‘పామును చంపితే చనిపోయిన కొడుకు బతుకుతాడా? అంతా నా కర్మ’.
ఆమె మా•లు సరే. నీ విషయం ఏమిటో చెప్పు. పాపం పుణ్యం తెలియని పసిబాలుడిని ఎందుకు చంపావు?’ అని పామును గద్దిస్తాడు బోయవాడు.
‘ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఇదంతా మృత్యువు చేసింది. తప్పు నాది కాదు. మృత్యువుదే’ అంటుంది పాము. ఈలోపు అక్కడికి మృత్యుదేవత వచ్చి..
‘ఇందులో నాదేమీ లేదు. కాలుడు పంపాడు. వచ్చాను’ అని వివరణ ఇస్తుంది.
అప్పుడు కాలుడు ఏమంటాడంటే..
‘తప్పు పాముదో, మృత్యుదేవతదో, నాదో కాదు. కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది’.
ఏదీ మన చేతుల్లో లేదు అనేది తాత్వికంగా ధ్వనించడానికి ‘సర్వం కర్మాధీనం’ అనే మాటను వాడుతుంటారు.

సింహావలోకనాం
వెనక్కి తిరిగి ఒకసారి సింహావలోకనం చేసుకుందాం’ అనే మాటను వింటుంటాం.ఏమిటీ సింహావలోకనం?ఈ మాటకు సింహానికి ఏమైనా సంబంధం ఉందా? సింహానికి తాను నడిచొచ్చిన దూరాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునే అల వాటు ఉంటుందట. అలాగే, ఏదైనా జంతువును చంపినప్పుడు ఆ పరిసరాల్లో శత్రువులు ఎవరైనా ఉన్నారమోనని ముందుకూ వెనక్కీ చూస్తుందట. ఇలా సింహం అలవాట్ల నుంచి పుట్టిన జాతీ యమే సింహావలోకనం.

నిట్టాడి కూలినట్టు
గుడిసెకు మధ్యలో నిలువునా ఒక బలమైన కర్ర ఉంటుంది. దీన్ని నిట్టాడి అంటారు. కొన్నిచోట్ల నిట్రాడు అని కూడా అంటారు. గుడిసె నిలవడానికి ఇది ప్రధాన ఆధారం. నిట్టాడి కూలితే గుడిసె కూడా కూలిపోతుంది. ఒక కుటుంబంలో ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి చనిపోతే..
‘నిట్టాడి కూలిపోయినట్టయింది..’ అంటుంటారు.అలాగే, దీన్ని చాలా సందర్భాల్లో చలనం లేని మనుషుల గురించి కూడా వాడుతుంటారు.‘అలా నిట్రాడులా నిల్చోకపోతే, కాస్త ఆ పని అందుకోవచ్చుగా..’ తరహా సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం.

Review ఏమో… ఏది ఎవరికెరుక.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top