మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.
అలంకృత శిరచ్ఛేదం
పూర్వం నేరాలు ఘోరాలు చేసిన వారి తల నరికేసే వారు. అయితే నరకడానికి ముందు నేరస్తుడి కోరిక ఏదైనా ఉండే తీర్చేవారు. అంతేకాదు.. అతడి తలను అందంగా అలంకరించే వారు. ఆ తరువాతే ఆ తలను నరికే వారు. దాని ఆధారంగానే ఈ జాతీయం పుట్టింది.
కొందరు తమ పని పూర్తయ్యే వరకు చాలా మర్యాదగా, గౌరవంగా వ్యవహరిస్తారు. ఎప్పుడైతే వారి పని పూర్తయ్యిందో అప్పటి నుంచి వారి స్వభావంలో అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. వారిలోని దుర్మార్గం బట్టబయలై భయపెడుతుంది. ఇలాంటి వారి విషయంలో ‘అలంకృత శిరచ్ఛేదం’ అనే జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
మర్కట ముష్టి
ఈ జాతీయం చాలా విధాలుగా వాడుకలో ఉంది.
‘చాలా మొండి మనిషి. పట్టిందే పట్టు. మర్కట ముష్టి’
‘నువ్వు ఆయనకు దానధర్మాల గొప్పదనం గురించి ఎంత చెప్పినా వృథానే. ఆయన మనసు మారదు. అది మర్కట ముష్టి. గింజ కూడా రాలదు’..
ఒక విషయంపై చాలా పట్టుదలగా, మొండిగా వ్యవహరించే మనుషుల విషయంలోనూ, ‘నేను సంపాదించిన దాంట్లో పైసా కూడా ఇవ్వను’ అనుకునే పరమ పిసినారుల విషయంలోనూ ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
మర్కటం అంటే కోతి. ముష్టి అంటే పిడికిలి. కోతి తన పిడికిట్లో ఏదైనా పట్టుకుంటే పొరపాటున కూడా వదలదు. స్థూలంగా చెప్పాలంటే, కోతి పిడికిలి బిగించిందంటే, ఆ పిడికిలిని తెరిపించడం చాలా కష్టమైన పని. అందుకే పట్టుదలకు, పిసినారితనానికి ఈ మాట స్థిరపడిపోయింది.
ఇప్పటిదా అప్పటిదా.. ఇక్ష్వాకుల కాలం నాటిది
చాలా పాత విషయం, చాలా పాత వస్తువు, చాలా వయసు పైబడిన వ్యక్తులు వంటి విషయాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
‘ఇది నిన్న మొన్నటి వస్తువు కాదు.. ఇక్ష్వాకుల కాలం నాటిది’..
‘అదేదో నిన్నగాక మొన్న జరిగిన విషయం అన్నట్టు చెబుతావేం? ఎప్పుడో ఇక్ష్వాకుల కాలం నాటిది’..
ఇలాంటి మాటలు తరచుగా వింటుంటాం. అసలు ఈ మాటెలా వచ్చిందంటే..
వైవశ్వతుడు, శ్రద్ధాదేవి దంపతులకు కలిగిన తొమ్మిది మంది సంతానంలో ఇక్ష్వాకుడు పెద్దవాడు. శ్రీరాముడి వంశానికి ఇతడే మూల పురుషుడు. అంటే ఇక్ష్వాక రాజు ఎప్పటి కాలం నాటి వ్యక్తో కాబట్టి.. ‘చాలా పాత’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.
చీకటిని నెత్తినేసుకుని..
సూర్యుడు ఇంకా ఉదయించకముందే చాలా పొద్దునే బయటికి వెళ్లినపుడు ఉపయోగించే జాతీయం ఇది.
‘ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీకటిని నెత్తినేసుకుని వెళ్లాడు’ అంటారు.
తెల్లవారుజామున చీకటి చీకటిగానే ఉంటుంది. బయటకు వెళ్లేటపుడు తలకు రుమాలు కట్టుకుంటారు. అలా చీకటిని తల మీద వేసుకుని బయటకు
వెళ్తున్నాడనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
నాథుడు
‘ఈ రోడ్డును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు’
‘నగరంలో ఎటుచూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. పట్టించుకునే నాథుడే లేడు’ అనే మాటలను తరచూ వింటుంటాం.
నాథుడు అనే పదానికి ‘భర్త’, ‘రాజు’ అనే అర్థాలు ఉన్నాయి.
అయితే వ్యవహారికంలో మాత్రం వేరే అర్థాలు ఏర్పడ్డాయి.
‘ఆధారం’, ‘పెద్దదిక్కు’, ‘బాగోగులు చూసేవాడు’ మొదలైన అర్థాలతో ఇప్పుడు ‘నాథుడు’ అనే పదాన్ని వాడుతున్నారు. దాంతోనే వివిధ జాతీయాలు ఏర్పడ్డాయి.
Review ఓ.. అదెప్పుడో ఇక్ష్వాకుల కాలం నాటిది!.