కనుమ పిలుస్తోంది.. కలిసుందాం రమ్మని

మూడు రోజుల సంక్రాంతి సంబరాల్లో చివరిది- కనుమ. ఇది పశుపక్ష్యాదులకు ప్రత్యేకించిన పండుగ.
అరక కట్టి పొలాన్ని దున్నడం మొదలుకుని, చేతికందిన పంటను ఇంటికి తీసుకురావడం వరకు కర్షకులకు సేద్యంలో చేదోడువాదోడుగా ఉండేవి పశువులే. వీటికి కనుమ రోజు పూర్తిగా ఆటవిడుపు. ఈనాడు పశువులు ఉన్న ఇంట చేసే హడావుడి అంతా ఇంతా కాదు. కనుమ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడుగుతారు. అందంగా అలంకరిస్తారు. మెడలో గంటలు కడతారు. కొమ్ములకు రంగులు పూస్తారు. ఇత్తడి తొడుగులు తొడుగుతారు. అందమైన వస్త్రాలు కడతారు. నుదుటిపై బొట్లు తీర్చిదిద్దుతారు. ఈ అలంకరణ విషయంలో పోటీలు కూడా జరుగుతాయి. సాయంత్రం వేళ పశువుల పందేలు నిర్వహిస్తారు. తమిళనాడులో అయితే కనుమ నాడు జరిగే పశువుల సందడిని ‘మట్టు పొంగల్‍’ అంటారు. ‘మట్టు’ అంటే ఎద్దు.
ఒకసారి శివుడు తన నంది వాహనాన్ని పిలిచి, భూలోకంలో ఉన్న ప్రజలకు ఒక సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడట. ‘రోజూ చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలనీ, నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవాలన్న’దే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారులో శివుడి సందేశాన్ని సరిగా వినలేదు.
‘రోజూ చక్కగా తిని ఉండాలి. నెలకు ఒకసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని భూలోకంలో చెప్పాడట. నంది గారి నిర్వాకానికి నివ్వెరపోయిన శివుడు- ‘మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి. అందుకని ఆ ఆహారాన్ని పండిచడంలో నువ్వే వెళ్లి సాయం చెయ్యి’ అని నందిని శపించాడు.
అప్పటి నుంచి రైతులు ఆహార పంటలను పండించడంలో, వ్యవసాయ పనుల్లో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయట. తమిళనాట ప్రాచుర్యంలో ఉన్న కథ ఇది.
ఇక, కనుమ నాడు వరికంకుల్ని ఇంటి చూరుకు వేలాడ కడతారు. పిచ్చుకలు, పావురాలు ఇతర పక్షులు వచ్చి వీటిని తింటాయట. ఈ సమయంలో అవి చేసే శబ్దాలు పిల్లలను మురిపిస్తాయి. ఆ సమయంలో ఆ ఇంటి వాతావరణంలో ఒకింత ఆహ్లాదం నిండి ఉంటుంది. మనిషికి కొన్ని పశువులు, పక్షులతో ఉన్న అనుబంధాన్ని చాటుతుంది కనుమ పండుగ. తనతో పాటు ఉన్న మూగజీవాల ఆకలి తీర్చినపుడే మనిషి జీవితానికి సార్థకత అని చాటే పండుగ సంక్రాంతి

Review కనుమ పిలుస్తోంది.. కలిసుందాం రమ్మని.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top