చెరుపు కూర చెడేవు

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి కూడా ఎంతో ఉంటుంది. అటువంటి కొన్ని కథల పరిచయం.
పూర్వం ఒక నగరంలో ధర్మబుద్ధి, దుష్టబుద్ధి అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వీరిద్దరు అత్యంత ప్రియమిత్రులు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు. ఇద్దరూ కలిసి వివిధ వ్యాపారాలు చేశారు. వెలకట్టలేనంత సంపదను సంపాదించారు. వచ్చిన లాభాల నుంచి ఇద్దరూ సరి సమానంగా సంపదను పంచుకున్నారు. మరికొంత మొత్తాన్ని భవిష్యత్తులో వచ్చే అవసరాల నిమిత్తం వాడుకోవడానికి వీలుగా నగరం వెలుపల గల ఒక మర్రిచెట్టు కింద నిక్షిప్తం చేశారు.
ధర్మబుద్ధి తన వాటా కింద వచ్చిన సొమ్ముతో తృప్తితో, సంతోషంగా జీవించసాగాడు. ఉన్నదాంట్లో నుంచే కొంత పేదసాదలకు దాన ధర్మాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు.
దుష్టబుద్ధి మాత్రం పేరుకు తగినట్టే డబ్బు మదంతో దుర్వ్యసనాల పాలయ్యాడు. తన వద్దనున్న డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడు. చివరకు చేతిలో పైసా కూడా లేనంత స్థితికి చేరుకున్నాడు. ధర్మబుద్ధి హితవు చెప్పినా అతను వినిపించుకోలేదు. ఇక, తన వద్ద ఉన్న ధనమంతా హారతికర్పూరంలా కరిగిపోవడంతో దుష్టబుద్ధికి ఏం చేయాలో తోచలేదు. వెంటనే అతనికి మర్రి చెట్టు కింద దాచిన డబ్బు విషయం గుర్తుకు వచ్చింది. ధర్మబుద్ధికి తెలియకుండా ఆ డబ్బునంతా కాజేయాలని పథకం పన్నాడు. అనుకున్నదే తడవుగా ఒకరోజు రాత్రి, ఎవరికీ తెలియకుండా మర్రిచెట్టు వద్దకు వెళ్లాడు. గతంలో దాచిన డబ్బును వెలికితీసి మూట్టకట్టుకుని గుట్టుగా ఇంటికి వచ్చేశాడు. ఆ తరువాత ఏం తెలియనట్టే ఉండసాగాడు.
ఒక నెల రోజుల తరువాత దుష్టబుద్ధి ఏం తెలియనట్టుగా, అమాయకంగా ధర్మబుద్ధి వద్దకు వచ్చాడు.
‘అన్నా.. నాకు డబ్బు చాలా అవసరం ఉంది. మనం మర్రి చెట్టు కింద దాచిన డబ్బును కూడా తెచ్చుకుని ఇద్దరం పంచుకుందామా?’ అని అడిగాడు.
ధర్మబుద్ధి అందుకు సరేనన్నాడు.
ఇద్దరూ కలిసి మర్రి చెట్టు వద్దకు వెళ్లారు. గతంలో నిక్షిప్తం చేసిన చోట తవ్వడం మొదలు పెట్టారు. ఎంత తవ్వినా డబ్బు మాత్రం కనిపించ లేదు.
దుష్టబుద్ధి వెంటనే తెచ్చిపెట్టుకున్న కోపంతో- ‘నువ్వు నాకు తెలియకుండా ఈ సొమ్మును ఎప్పుడో అపహరించావు. ఏం తెలియనట్టు ఇప్పుడు నటిస్తున్నావు. నిన్ను నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తావా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పాపం, ధర్మబుద్ధి విస్తుపోయాడు. తనకేమీ తెలియదని, అటువంటి పాడు పనులు తాను ఎన్నటికీ చేయనని నిజం చెప్పాడు. కానీ, దుష్టబుద్ధి వినిపించుకోలేదు. ‘విషయం న్యాయస్థానంలోనే తేల్చుకుందామంటూ’ అక్కడి నుంచి విసవిసా వెళ్లిపోయాడు.
ఇద్దరూ న్యాయాధికారి వద్దకు వెళ్లారు. తామిద్దరం కలిసి దాచిన డబ్బును ధర్మబుద్ధి తనకు తెలియకుండా కాజేశాడని దుష్టబుద్ధి ఫిర్యాదు చేశాడు. ధర్మబుద్ధి తాను తీసుకోలేదని, తనకు ఏమీ తెలియదని వాదించాడు. ఇద్దరూ ‘నువ్వే తీశావంటే, నువ్వే తీశావంటూ’ వాదించుకోసాగారు.
న్యాయాధికారి ‘దొంగతనం ధర్మబుద్ధే చేశాడనడానికి నీ వద్ద ఏదైనా ఆధారం ఉందా?’ అని దుష్టబుద్ధిని ప్రశ్నించారు.
అందుకు దుష్టబుద్ధి- ‘మేం ఏ చెట్టు కింద అయితే డబ్బు దాచామో ఆ చెట్టే సాక్ష్యం’ అన్నాడు.
చెట్టు సాక్ష్యం చెప్పడం ఏమిటంటూ అందరూ ఆశ్చర్యపడ్డారు. న్యాయాధికారి- ‘సరే రేపు ఉదయం చెట్టు సాక్ష్యం విన్న తరువాత తీర్పు చెబుతా’ అని చెప్పి ఇద్దరినీ పంపించి వేశాడు.
దుష్టబుద్ధి ఇంటికి వెళ్లి తన తండ్రితో రహస్యంగా మంతనాలు ఆడాడు. ‘నువ్వు ఎలాగైనా చెట్టు తొర్రలో దాక్కుని, రేపు నాకు అనుకూలంగా సాక్ష్యం ఇవ్వాలి’ అని తండ్రిని ఒప్పించాడు. ఆ రాత్రే తండ్రిని తీసుకుని వెళ్లి చెట్టు తొర్రలో దాచాడు.
మర్నాడు ఉదయం న్యాయాధికారితో సహా నగరవాసులు చెట్టు సాక్ష్యం వినడానికి అక్కడ గుమికూడారు.
న్యాయాధికారి- ‘వృక్షరాజమా! నీ చెట్టు కింద పాతిన ధనం ఎవరు తీశారు?’ అని ప్రశ్నించాడు.
‘ధర్మబుద్ధే తీసుకున్నాడు’ అని వినిపించింది.
చెట్టు తొర్రలో నుంచి ఎవరో మాట్లాడినట్టు న్యాయాధికారికి అనుమానం వచ్చింది. తక్షణమే తొర్రలో గడ్డి పెట్టి, నిప్పు అంటించాలని సేవకులను ఆజ్ఞాపించాడు. ఒక్క క్షణంలో చెట్టు చుట్టూ మంటలు లేచాయి. ఆ పొగకు, మంటలకు ఊపిరాడక, తొర్రలో ఉన్న దుష్టబుద్ధి తండ్రి బయటకు దూకి ప్రాణాలు విడిచాడు.
దుష్టబుద్ధి తన మోసాన్ని ఒప్పుకున్నాడు. న్యాయాధికారి, ధర్మబుద్ధి భాగాన్ని అతనికి ఇప్పించడమే కాక, దుష్టబుద్ధికి అపరాధాన్ని విధించాడు.

Review చెరుపు కూర చెడేవు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top