విజయనగర రాజుల కాలానికంటే ముందు నుంచే వైభవ కాంతులీనుతోంది నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయం. నారాయణపురం నుంచి తెచ్చిన వేంకటేశ్వరుడు కావడం.. నారాపురయ్య ప్రతిష్ఠించిన దేవుడు కావడం వల్ల స్వామి వారికి నారాపుర వేంకటేశ్వరస్వామి అనే పేరు స్థిరపడింది. ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగులో కొలువుదీరిన నారాపుర వేంకటేశ్వరుడి గురించి తెలుసుకుందాం..
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి శ్రీనారాపుర వేంకటేశ్వరస్వామి పేరుతో జమ్మలమడుగులో కొలువుదీరి భక్తజనుల విశేష ఆరాధనలు అందుకుంటున్నాడు.
ఉమ్మడి కడప జిల్లాలో కడప నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో గల జమ్మలమడుగులో ఈ ఆలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతంలోనే నీటిమడుగులో జంబుగడ్డి అధికంగా పెరుగుతూ ఉండటం వల్ల ఈ పట్టణానికి జంబులమడుగు అనే పేరు ఏర్పడింది. కాలక్రమంలో వ్యావహారికంలో జమ్మలమడుగు అనే పేరు స్థిరపడినట్టు స్థానిక చరిత్రను బట్టి తెలుస్తోంది.
జమ్మలమడుగులోని ఆలయంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారు కొలువుదీరడానికి సంబంధించిన, స్వామి వారికి శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి అనే పేరు స్థిరపడటానికి వెనుక ఆసక్తికరమైన స్థలపురాణ కథ ప్రచారంలో ఉంది.
ఇదీ స్థల పురాణం
ప్రస్తుతం ఉన్న ఆలయానికి ఉత్తరదిశలో పూర్వం ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు నారాయణపురం. ఆ గ్రామం అగ్రహారంగా ప్రసిద్ధి పొందింది. ఆ గ్రామంలో ఒక వేంకటేశ్వరస్వామి ఆలయం, దాని పక్కనే కోనేరు ఉండేది. గ్రామంలోని ప్రజలు స్వామిని సేవిస్తూ, దైవభక్తి పరాయణులై జీవనం సాగిస్తుండే వారు. అయితే, ఊళ్లో ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నాయి. గ్రామంలో గాలులు విపరీతంగా వీస్తుండేవి. ఈ గాలుల ఫలితంగా ఊరంతా ఇసుక మేటలు వేసింది. క్రమంగా గ్రామంలో నివాసాలు ఉండటానికి వీల్లేకుండా పోయింది. దీంతో ప్రజలు ఒక్కొక్కరుగా ఊరు విడిచి వెళ్లిపోసాగారు. నారాయణపురంలో గల వేంకటేశ్వరస్వామి ఆలయం కూడా ఇసుక తిన్నెల్లో కూరుకుపోయి క్రమంగా శిథిలమైపోయింది. దీంతో కాలక్రమంలో ఈ ఆలయం గురించి అందరూ దాదాపుగా మరిచిపోయారు.
నారాపురయ్యకు స్వప్న దర్శనం
ఇలా ఊరు ఖాళీ చేసిన వారిలో నారాయణపురం వాసి నారాపురయ్య ఒకరు. ఆయన ఈ ఊరు విడిచి జమ్మలమడుగులో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన దైవభక్తి పరాయణుడు. నిత్యం దైవచింతనలో కాలం గడుపుతుండే వాడు. అటువంటి నారాపురయ్యకు ఒకసారి రాత్రి స్వప్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షాత్కరించి- ‘నేను నారాయణపురంలో ఇసుక తిన్నెలలో పూడుకుపోయి ఉన్నాను. నన్ను బయటకు తీసి ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించి నన్ను తెచ్చి ప్రతిష్ఠించు. నీకు మంచి జరుగుతుంది’ అని పలికాడట.
మర్నాడు నారాపురయ్య తనకు వచ్చిన స్వప్నం గురించి చుట్టుపక్కల వారికి చెప్పాడు. వెంటనే నారాయణపురం చేరుకుని, ఇసుకను తొలగించి ఆలయంలో గల శ్రీవేంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని తీసుకుని వచ్చి ప్రస్తుతం జమ్మలమడుగులో ఆలయం ఉన్న ప్రాంతంలో కోవెల నిర్మించి స్వామి వారిని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. నారాయణపురం నుంచి తెచ్చిన వేంకటేశ్వరుడు కావడం వల్లా, అలాగే నారాపురయ్య చేతుల మీదుగా ప్రతిష్ఠించిన దేవుడు కావడం వల్ల స్వామి వారికి నారాపుర వేంకటేశ్వరస్వామి అనే పేరు స్థిరపడింది.
విజయనగర రాజుల కంటే ముందే ఆలయం
చారిత్రకంగా పరిశీలిస్తే ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందే నిర్మితమైనట్టు తెలుస్తోంది. అయితే ఆలయ అభివృద్ధి మాత్రం విజయనగర చక్రవర్తుల పాలనలోనే జరిగింది. విజయనగర రాజుల సామంతులైన పెమ్మసాని వంశస్తులు గండికోటను రాజధానిగా చేసుకుని పరిపాలించే వారు. వారే ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్టు ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే కాలక్రమంలో ఈ ఆలయం కూడా శిథిలం కావడంతో 1918 ప్రాంతంలో పూర్వవైభవాన్ని కల్పించారు. ప్రస్తుతం ఈ ఆలయం 2008 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆలయ సంప్రదాయాలు, పూజల విషయంలో తిరుమల సంప్రదాయాలనే పాటిస్తారు.
విశాల ప్రాంగణం.. విశేషాల ఆలయం
జమ్మలమడుగు పట్టణంలోని శ్రీనారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయం విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఉత్తరాభిముఖంగా ఉండే ఈ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారంపై మూడు అంతస్తుల గాలిగోపురం నిర్మించారు.
ఈ గోపుర ద్వారం ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తూనే విశాలమైన ప్రాంగణంలో ప్రధాన ఆలయం దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయానికి ముందు బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ మండపం ఉన్నాయి. ధ్వజస్తంభానికి ఇరువైపులా గరుత్మంతుడు, ఆంజనేయస్వామి వార్ల భారీ విగ్రహాలు నమస్కార భంగిమలో కొలువుదీరి దర్శనమిస్తాయి.
ఇక ప్రధానాలయం- రంగ మండపం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయాలను కలిగి ఉంది. ప్రధాన గర్భాలయంలో శ్రీనారాపుర వేంకటేశ్వరస్వామి కొలువుదీరి ఉన్నారు. స్వామివారు రూపురేఖా విలాసాలలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని పోలి ఉంటారు.
శంఖు, చక్ర, వరద, కటి హస్తాలతో విశేషమైన అలంకారాలతో శ్రీవారు దర్శనమిస్తారు.
దేవేరుల దివ్యరూపాలు
ఆలయ ముఖ మండపంలో ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉన్న రెండు గర్భాలయాలలో స్వామి వారి దేవేరులు శ్రీమహాలక్ష్మి, శ్రీఆండాళ్ అమ్మవార్లు కొలువుదీరారు.
శ్రీమహాలక్ష్మీదేవి ఆశీనురాలై, చతుర్భుజాలతో, రెండు చేతులలో పద్మాలు ధరించి, మరో రెండు చేతులలో అభయ వరముద్రలను ధరించి దర్శనమిస్తారు.
శ్రీఆండాళ్ అమ్మవారు ద్విభుజాలను కలిగి ఒక చేతిలో పద్మాన్ని ధరించి, మరో చేతిని కిందికి వదిలిన భంగిమలో ఉండి దర్శించుకున్నంతనే మనోహర రూపంతో నేత్రపర్వం చేస్తారు.
ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి, ఆళ్వారులు, కల్యాణ మండపం, శ్రీవేంకటేశ్వర కోటి లేఖన మండపం వంటి వాటిని భక్తులు దర్శించుకోవచ్చు.
నిత్యపూజలు..
జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామికి నిత్య పూజలు విశేషంగా జరుగుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్టే ఇక్కడా నిత్య ఆచారాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలుకుని వైశాఖ బహుళ షష్ఠి వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో వివిధ వాహనసేవలు, స్వామి వారి కల్యాణం, రథోత్సవం చూసి తరించాల్సిందే.
ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి, వివిధ పర్వదినాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఎలా వెళ్లాలి?
జమ్మలమడుగు చేరడానికి వివిధ ప్రాంతాల నుంచి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ పట్టణంలో భక్తులకు అన్ని విధాలుగా వసతి సౌకర్యాల సౌలభ్యం ఉంది. కడప నుంచి 75 కిలోమీటర్లు, ప్రొద్దుటూరు నుంచి 21 కిలోమీటర్ల దూరంలో గల జమ్మలమడుగుకు కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, హైదరాబాద్, కర్నూలు, నంద్యాల, తిరుపతి, విజయవాడ, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. యర్రగుంట్ల – నంద్యాల రైలు మార్గంలో గల జమ్మలమడుగులో అన్ని రైళ్లు ఆగుతాయి
తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుడి విగ్రహాన్ని పోలి ఉండే నారాపుర వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్న పుణ్యమే లభిస్తుంది.





































































































































































































































































































































































Review తిరుమల కంటే మిన్న.. నారాపుర వెంకన్న.