అనేకానేక పూర్వజన్మలు కలిగిన బోధిసత్త్వుడు (బుద్ధుడు) ఒకానొక పూర్వ జన్మలో వందల బండ్లతో వర్తకం చేసే సార్థవాహక వంశంలో జన్మించాడు.
ఒకసారి అతడి బిడారు అరవై యోజనాల నిడివి ఉన్న ఎడారి ప్రాంతానికి చేరింది. పగలంతా భగభగ మండే కుంపటిలా ఎండ ఉండటంతో రాత్రి వేళల్లోనే ప్రయాణించే వారు.
నక్షత్రాల సాయంతో దారి గమనిస్తూ ముందుకు సాగేవారు. మరో యోజనం మాత్రమే ప్రయాణం మిగిలి ఉందనగా, బరువు తగ్గించుకుంటే ప్రయాణం మరింత చురుగ్గా సాగుతుందని వర్తక బృందానికి నాయకత్వం వహిస్తున్న బోధిసత్త్వుడు భావించాడు. దీంతో వంట చెరుకు, నీరూ పారబోయించాడు.
అయితే, దారి నిర్ణయించే వ్యక్తి బడలికతో నిద్రలోకి జారుకోవడంతో ఎడ్లు అదుపుతప్పి, తిరిగి వచ్చిన దారే పట్టాయి. సూర్యోదయం అవుతుండగా అతడు నిద్రలేచాడు. బండ్లు వచ్చిన దిక్కుకే వెనక్కి పోతున్నట్టు గ్రహించాడు. వెంటనే బండ్లను వెనక్కి తిప్పాలని గట్టిగా కేక పెట్టాడు. అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. కిందటి సాయంకాలం బయలుదేరిన చోటుకే బిడారు చేరుకుంది. నీరు మాత్రం లేదు. అందరూ నిరాశతో కూలబడ్డారు. తను కూడా వాళ్లలాగా అధైర్యపడితే అందరూ చచ్చిపోతారని భావించిన బోధిసత్త్వుడు..
అటుఇటూ తిరుగుతూ ఒకచోట గుబురుగా పెరిగిన దర్భల దుబ్బును చూశాడు. కింద ఎక్కడో నీళ్లు లేకపోతే అక్కడ ఆ దుబ్బు మొలవదు కదా.. వెంటనే పలుగు తెప్పించి అక్కడ తవ్వించాడు. అరవై మూరల లోతు తవ్వాక కంగుమని రాయి తగిలింది. అందరూ మళ్లీ నిరాశపడ్డారు. కానీ, బోధిసత్త్వుడు రాతికి చెవి ఆనించి ఆలకించాడు. రాతికి దిగువగా పారుతున్న నీటి చప్పుడు వినిపించింది. వెంటనే రాతిని పగులగొట్టగానే తాటిచెట్టు ఎత్తు ప్రమాణంలో ఉవ్వెత్తుగా నీళ్లు ఎగజిమ్మాయి. అందరికీ ప్రాణాలు లేచి వచ్చినట్టయింది.
ఆ నీటితో అందరూ దాహం తీర్చుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి మళ్లీ క్షేమంగా గమ్యం చేరుకున్నారు.
Review తెలివితేటలు.