దత్తాత్రేయుడికి ప్రియమైన మేడిచెట్టు ప్రత్యేకతలేమిటి?

దత్తాత్రేయుడు మేడిచెట్టు కిందే ఎందుకు ఉంటాడు? మేడిచెట్టు ప్రత్యేకతలేమిటి?. ఔదుంబర వృక్షమంటే మేడిచెట్టేనా?
ఔదుంబర వృక్షమంటే మేడిచెట్టుకు గల మరో పేరు. దీనినే అత్తి చెట్టు అని కూడా అంటారు. ఈ వృక్షం మొదట్లో కొలువుండటానికి దత్తాత్రేయుడు ఇష్టపడతాడని అంటారు. ఆయన ఉండే చిత్రాలలో ఆవుతో పాటు నాలుగు శునకాలు ఉంటాయి. ఆయన వెనుక ఉండే వృక్షం మేడిచెట్టే. దత్తాత్రేయుడు ఈ చెట్టు కింద ఉంటాడు కాబట్టే ఈ చెట్టును హిందువులు అత్యంత పూజ్యభావంతో పూజిస్తారు. ఈ చెట్టు కింద కూర్చుని దత్తాత్రేయ మంత్రం పఠిస్తే అమోఘంగా మనసుకు పడుతుందని అంటారు.
దత్తాత్రేయుడికి ప్రియమైనదని చెప్పే మేడిచెట్టులో రెండు రకాలు ఉన్నాయి.
ఒకటి- బుడ్డ మేడి.
రెండు- పాలమేడి.
బుడ్డమేడి సర్వసాధారణమైనది.
పాల మేడి అంత విరళం కాదు.
రెండింటికి కాయలు కాండం నుంచి, కొమ్మల నుంచి బయల్దేరుతాయి.
పాలమేడి కాయలు సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో పలకబారుతాయి. పళ్లు మంచి పరిమళంగా ఉంటాయి.
‘మేడి పండు చూడ మేలిమై ఉండును. పొట్టవిప్పి చూడ పురుగులుండు’ అని వేమన మాట. ఈ మాట పాలమేడికి మరీ ఎక్కువగా వర్తిస్తుంది.
మేడిపండుకు జంతుఫలి అనే మరో పేరు కూడా ఉంది. పాలమేడి పండ్లలో మంచి వాటిని ఎంచుకుని పానకం తదితర వంటకాలు తయారు చేసుకుని పూర్వీకులు బాగా వాడుకునే వారని వివిధ గ్రంథాలలో ఉంది.
దత్తాత్రేయుని రూప విశేషాలు తెలియజేస్తారా?. ఆయన జన్మ వృత్తాంతం ఏమిటి?
దత్తాత్రేయుడికి ఆరు చేతులు, మూడు తలలు ఉంటాయి. నడిమి శిరస్సు విష్ణువుది.
దానికి కుడిది శివునిది.
దానికి ఎడమది బ్రహ్మ శిరము. దత్తాత్రేయుడు అత్రి, అనసూయ దంపతులకు జన్మించాడని అంటారు. ఒకసారి త్రిమూర్తుల భార్యలు అనసూయ ప్రాతివత్యాన్ని పరీక్షించాలంటూ తమ భర్తలను ఆమె వద్దకు పంపిస్తారు. బ్రహ్మ, విష్ణు, శివుడు.. బ్రాహ్మణ రూపాలు ధరించి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి తమకు ఆకలిగా ఉందని, విగత వస్త్రధారియై భిక్ష పెట్టాలని కోరారు. ఈ వింత కోరికతో అనసూయ ఆశ్చర్యపోయింది. తన భర్తతో కలిసి ఏం చేయాలా? అని ఆలోచించింది. అత్రి గొప్ప ఆత్మజ్ఞాని. యోగి. వచ్చిన బ్రాహ్మణులు త్రిమూర్తులనే విషయాన్ని కనిపెట్టేశాడు. అప్పుడు ఆయన భార్యకు మంత్రోదకం ఇచ్చాడు. ఆ ఉదకాన్ని వచ్చిన వారి మీద చల్లి వారికి అన్నం వడ్డించమన్నాడు. మగని ఆజ్ఞ ప్రకారం అనసూయ వారిపై మంత్రోదకం చల్లింది. వెంటనే ఆ ముగ్గురు బ్రాహ్మణులు పసిపిల్లలై పోయారు. అప్పుడు అనసూయ వారికి తన స్తన్యం ఇచ్చి వారి ఆకలి తీర్చింది.
అంతలో హఠాత్తుగా నారదుడు అక్కడికి వచ్చాడు.
త్రిమూర్తులు చిన్నారి శిశువులై అక్కడ ఆడుతూ ఉండగా చూసి ఆనందించాడు. ఆ ఆనందంలో మూడు లోకాలకు వెళ్లి త్రిమూర్తులు చిన్నపిల్లలుగా మారిపోయిన విషయాన్ని వారి భార్యలకు చెప్పాడు.
వెంటనే అత్రి ఆశ్రమానికి తమను తీసుకెళ్లి వారిని చూపించాలని లక్ష్మి, పార్వతి, సరస్వతి నారదుడిని కోరారు.
నారదుడు వారిని వెంటబెట్టుకుని వచ్చి అల్లంత దూరాన తాను దాగి అత్రి ఆశ్రమాన్ని వారికి చూపించాడు.
అక్కడ తమ భర్తలు శిశువులై ఆడుతూ ఉండటం చూశారు. దీంతో వారికి గర్వభంగమైపోయింది.
వారు అనసూయ పాదాలపై పడి సాష్టాంగపడి శిశువులై ఆడుతూ ఉన్న ముగ్గురూ తమ భర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులనీ, దయతలచి తమ పతుల్ని తమకు అనుగ్రహించాలని ప్రార్థించారు.
అప్పుడు అనసూయ భర్త ఆజ్ఞతో ఆ శిశువుల మీద మంత్రోదకాన్ని చల్లింది. తిరిగి ఆ శిశువులు విధి, నీలకంఠ, నీలవర్ణ రూపాలు ధరించారు. నిజరూపధారులైన త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఏదైనా వరం కోరుకొమ్మన్నారు.
దీంతో ఆమె, ఆమె భర్త అత్రి- ‘త్రిమూర్తులు కలిసి తమకు పుత్రుడిగా పుట్టాల’ని కోరారు.
వెంటనే త్రిమూర్తుల కళలతో ఆ ముని దంపతులకు కుమారుడు పుట్టాడు. అతడే దత్తాత్రేయుడు.
స్థలాంతరంలో దత్తాత్రేయుని ఉత్పత్తి వృత్తాంతం మరోలా ఉంది.
శిశువులు తిరిగి త్రిమూర్తులుగా మారే తరుణంలో నారదుడు హఠాత్తుగా అక్కడికి వచ్చి త్రిమూర్తుల్ని దర్శించి ‘మీరు ముగ్గురూ ఒక్కచోట ఉన్నారు. కాబట్టి మీ సత్వరూపం నాకు చూపాల’ని కోరాడు.
నారదుడి కోరిక మేరకు త్రిమూర్తులు ముగ్గురూ కలిపి దత్తాత్రేయ రూపాన్ని పొందారని కథనం.
దత్తాత్రేయుడు గొప్ప సన్యాసి.
ఆయన పుట్టిన వారం బుధవారం.
తిథి మార్గశిర శుక్ల చతుర్దశి. నక్షత్రం కృత్తిక.
దత్త జయంతి నాడు దత్తాత్రేయ ఆలయాల్లో కీర్తనలు సాగుతాయి. ఈ దేవత పట్ల మహారాష్ట్రులు అతిశయమైన భక్తి కలిగి ఉంటారు. దత్తాత్రేయుడు ఉగ్రదేవత అని గర్గ సంహితలో ఉంది. ఈ దేవతకు గురువారం ప్రియమైనదని చెబుతారు. యమదంష్ట్రలనే కష్ట దినాలు తుదముట్టినందుకు సంతోష సూచకంగా ఉగ్ర దైవమైన దత్తాత్రేయునికి ఈనాడు పూజలు ఆచారంలో వచ్చి ఉంటాయి.

పకృతిని మించిన గురువు లేడని దత్తాత్రేయుడు చెప్పినట్టు గురుగీతలో ఉంది. ప్రకృతిలోని ఆయా గురువుల నుంచి ఆయన ఏం నేర్చుకున్నారు? తన భక్తులకు ఏం చెప్పారు?
ప్రకృతిలోని 24 గురువుల నుంచి తాను ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుసుకున్నానని దత్తాత్రేయుడు లోకానికి చాటారు. అవేమిటంటే- భూమి నుంచి క్షమ, పరోపకారత్వం, వాయువు నుంచి నిస్సంగత్వం, నిర్లేపత్వం, ఆకాశం నుంచి సర్వవ్యాపకత్వం, జలం నుంచి నిర్మలత్వం, మాధుర్య స్నిగ్ధత్వం, అగ్ని నుంచి తేజస్సు, ఈశ్వరతత్త్వం, సూర్యుడి నుంచి జలగ్రాహి, జలత్యాగి, లోకబాంధవుడు, సర్వలోకాలకు అతనొక్కడే వెలుగని నేర్చుకున్నానని దత్తాత్రేయుడు ప్రకటించారు. చంద్రుడి నుంచి వృద్ధి క్షయాలనేవి దేహానికే కాని ఆత్మకు కాదని, పావురాల జంట నుంచి కామక్రోధాలకు వశమైపోతే ఆత్మానురాగం కోల్పోతారని, దైవికంగా లభించిన దానికి తృప్తి చెంది, లభించని దానికి పాకులాడకూడదని కొండచిలువ నుంచి, తనలో ఉన్న మనోభావాలను బయటపెట్టరాదనే నీతిని సముద్రం నుంచి అభ్యసించానని దతాత్రేయుడు చెప్పారు. సుఖమని భ్రమించి, మోహమనే జ్వాలాగ్నికి బలై మృత్యువుకు చేరువవుతుందనే విషయాన్ని మిడత నుంచి, ప్రతీ పుష్పాన్ని వదలకుండా తేనెను సేకరించినట్టే ఏ గ్రంథాన్నీ, ఏ ఒక్క విషయాన్నీ వదలకుండా శాస్త్రాధ్యయనం చేయాలనే సత్యాన్ని తేనెటీగ నుంచి, తనకున్న స్త్రీలోలత్వం వల్ల ఎంత బలమైనదైనా ఇతరులకు వశమవుతుందని ఏనుగు నుంచి, ఇతరుల వస్తువులను న్యాయాన్యాయాలు ఆలోచించకుండా అపహరించే వాడు నీచుడవుతాడని మధుహారీ ద్వారా, అమాయకత్వంతో వేటగాని వలలో చిక్కకూడదని లేడి నుంచి, జిహ్వ చాపల్యం ఎంత చేటు తెస్తుందో చేప నుంచి, భౌతికవాంఛలు, ధనాశకు లొంగి కాలాన్ని దుర్వినియోగం చేసుకోకూడదని వేశ్య నుంచి, తనకు, ఇతరులకు మధ్య తేడాలు గ్రహించలేని వారితో పోటీపడటం మంచిది కాదని లకుముకి పిట్ట నుంచి, పాపపుణ్యాలు ఎరుగక యోగితో సమానంగా ఉండాలని పసిబాలుడి ద్వారా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబ గౌరవాన్ని కాపాడాలని కన్య ద్వారా, విలుకాడి నుంచి ఏకాగ్రత, తనకంటూ స్థిరనివాసం ఏర్పర్చుకోరాదని పాము ద్వారా, ఎన్నిసార్లు విఫలమైనా మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయాలని సాలీడు నుంచి, భ్రమర కీటక న్యాయంలా మనసంతా భగవంతుడి మీదే లగ్నం చేయాలని పురుగు నుంచి నేర్చుకోవాలని ఆయన ప్రకటించారు.

Review దత్తాత్రేయుడికి ప్రియమైన మేడిచెట్టు ప్రత్యేకతలేమిటి?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top