నిర్మోహత్వం.. నిస్సంగత్యం

కథలు.. పిల్లలూ, పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతిని బోధిస్తాయి. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ మనలో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. నేర్చుకోవాలే కానీ, ప్రతి కథా ఎంతోకొంత నేర్పుతుంది. వాటిని తాదాత్యంతో చదివితే ఆధ్యాత్మికంగా తగిన ఫలితాలు కనిపిస్తాయి. అటువంటి ఆధ్యాత్మిక కథలను ఈ శీర్షికలో చదవచ్చు.

పూర్వకాలంలో మగధ దేశం రాజుగారు తన రాజకుమారుడిని మంచి విద్యావంతుడిని చేశారు. సర్వ శాస్త్రాలు నేర్పించారు. అన్ని విషయాల్లోనూ సర్వ సంపన్నంగా అతడిని తీర్చిదిద్దారు.

రాజ్యపాలనకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ తర్ఫీదు ఇప్పించారు. యవ్వనవంతుడైన ఆ రాజకుమారుడికి రాజు గారు ఒక మంచి ముహూర్తం చూసి యువరాజ పట్టాభిషేకం చేయించారు. రాజ్య పాలనలో యువరాజు తండ్రి గారి సలహాలు తీసుకునే వాడు.

ఒకరోజు రాజ్యంలోని కొందరు ప్రజలు రాజు దగ్గరకు వచ్చారు. అడవికి దగ్గరగా ఉన్న తమ గ్రామాలలోకి క్రూర మృగాలు వస్తున్నాయని, వాటి నుంచి తమకు రక్షణ కల్పించాలని వారంతా ముక్తకంఠంతో రాజుగారికి విన్నవించుకున్నారు. వెంటనే రాజు తన పక్కనే కూర్చున్న యువరాజు వైపు చూశాడు.

ఆ చూపునకు అర్థం గ్రహించిన యువరాజు అక్కడకు వచ్చిన ప్రజలతో కలిసి అడవికి బయలుదేరాడు. క్రూర మృగాలను వేటాడుతూ యువరాజు అలా చాలా దూరం అడవిలోకి వెళ్లిపోయాడు.

క్రూర మృగాలను చాలా వరకు వధించాడు. వేటాడి వేటాడి అలసిపోయిన యువరాజుకు దాహం వేసింది. నీటి కోసం చుట్టూ చూశాడు.
ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. దగ్గరగా ఉన్న ఒక చెట్టు ఎక్కి చూడగా, కొద్ది దూరంలో ఒక ఆశ్రమం కనిపించింది. చెట్టు దిగి యువరాజు ఆ ఆశ్రమం వైపు అడుగులు వేశాడు. అక్కడ ఒక స్వామి ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు.
యువరాజు వచ్చిన అలికిడికి కళ్లు తెరిచిన ఆయన యువరాజును లోనికి ఆహ్వానించాడు.

అతిథి మర్యాదలన్నీ చేశాడు.
సేదదీరిన యువరాజును ఆ స్వామి ‘మీరెవరు?, మీ పేరేమిటి?’ అని ప్రశ్నించాడు.
అందుకు యువరాజు- ‘స్వామీ! మాది ఈ అడవికి సమీపంలో ఉన్న ఒక రాజ్యం. నేను ఆ దేశపు యువరాజును. నా పేరు మోహదీప్తుడు. అయినా అందరూ నన్ను నిస్సంగుడు అని పిలుస్తారు’ అని బదులిచ్చాడు.
అప్పుడా స్వామి- ‘నాయనా! నీ పేరు విచిత్రంగా ఉందే’ అన్నాడు.
‘స్వామీ! నా ఒక్క పేరేమిటి? మా రాజ్యంలోని పేర్లన్నీ ఇలాగే ఉంటాయి’ అని యువరాజు బదులిచ్చాడు.

అతడలా చెప్పగానే స్వామికి ఏదో తోచింది.
‘యువరాజా! మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. ఆపైనున్న మీ ఉత్తరీయం నాకు ఇవ్వండి. నేను రాజ్యంలోకి వెళ్లి మళ్లీ వస్తాను’ అని ఉత్తరీయాన్ని తీసుకున్నాడు.
కొంతదూరం వెళ్లాక ఆ ఉత్తరీయానికి అక్కడక్కడా కొన్ని రక్తపు మరకలు పులిమి స్వామి రాజ్యం చేరుకున్నాడు.
రాజ అంతపురం ద్వారం వద్ద ఒక దాసి ఎదురైంది స్వామికి. అప్పుడా స్వామి దాసితో- ‘అమ్మా! అడవిలో మీ యువరాజును పులి చంపేసింది. ఇదిగో రక్తంతో తడిచిన ఆయన ఉత్తరీయం’ అన్నాడు.
అప్పుడా దాసి- ‘దానిదేముంది స్వామీ?’ అంటూ భగవద్గీత రెండో అధ్యాయంలోని శ్లోకాలను గుర్తుకు తెచ్చుకోండని చెప్పి వెళ్లిపోయింది.

ఆశ్చర్యపోయిన స్వామి.. అంతపురంలోని రాజు వద్దకు వెళ్లి యువరాజు మరణం గురించి చెప్పాడు. అందుకా రాజు స్వామితో- ‘రుణగ్రస్తుడు. రుణం తీరింది వెళ్లిపోయాడు’ అన్నాడు.
స్వామికి మరింత ఆశ్చర్యం వేసింది. సరేనని రాణి వద్దకు వెళ్లి యువరాజు మరణవార్త చెప్పాడు.

అందుకామె బాధపడలేదు. పైగా- ‘స్వామీ చెట్టుపై సాయంత్రం చేరిన పక్షులు ఉదయమే వెళ్లిపోతాయి. మళ్లీ సాయంత్రం ఆ చెట్టుపైకి ఎన్ని పక్షులు చేరుకుంటాయో తెలియదు కదా!’ అంది. చివరకు యువరాజు భార్య వద్దకు వెళ్లి స్వామీజీ విషయం చెప్పాడు. అందుకామె- ‘స్వామీ! ప్రవహిస్తున్న గంగానదిపై ఉన్న దుంగలం మేమంతా. అలలకు కొన్ని కొట్టుకుపోతాయి. అందుకు చింతించాల్సిన పనిలేదు’ అని బదులిచ్చింది.
దీంతో స్వామీ అక్కడిక పనేమీ లేదని గ్రహించి తిరిగి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. యువరాజుతో- ‘రాజా! మీ రాజ్యాన్ని శత్రురాజులు ఆక్రమించుకున్నారు. మీ తల్లిని, తండ్రిని బంధించారు’ అని చెప్పాడు.

‘స్వామీ! ఇందులో విచిత్రమేముంది? యాత్రికులలాగా ఇక్కడికి వచ్చాం. యాత్ర ముగిసింది. అంతేకదా!’ అని యువరాజు అనగానే స్వామీజీలో ఆనందం రెట్టింపైంది.
ఆదిశంకరాచార్యులు ప్రబోధించిన నిర్మోహత్వం, నిస్సంగత్యం అంటే స్వామీజీకి చక్కగా బోధపడింది.

Review నిర్మోహత్వం.. నిస్సంగత్యం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top