నీ పనే నీ దైవం!

లక్ష్యం లేదు..
ఏ దారిన వెళ్లాలో కానరాదు..
మంచిచెడులను బేరీజు వేసుకోగల విచక్షణ లేదు..
జీవన పరమార్థం ఏమిటో అసలే తెలియదు..
ఇదీ ఆధునిక మానవుడి దారీతెన్నూ లేని జీవన పయనం..
అర్జునుడు చేతిలోని ధనస్సును జారవిడిచాడు..
మనం మనలోని ఆత్మవిశ్వాసాన్ని, ఆశావాదాన్ని వదిలేస్తున్నాం..
ఎదురుగా ఉన్న కౌరవ సైన్యాన్ని చూసి పార్థుడు కంగారెత్తాడు..
శత్రువులను చంపడానికి చేతులు రాక దిక్కులు చూశాడు..
మనం భ్రమల బందిఖానాలో చిక్కుకుంటున్నాం..
భయాల ఊబిలో దిగబడిపోతున్నాం..
అది కురుక్షేత్ర సంగ్రామం..
ఇది హృదయక్షేత్ర సమరం..
హృదయమే వాటిక.. మనోయజ్ఞమే యజ్ఞ సంకల్పం..
మనిషిలా సాధారణ జీవితం గడుపుతూనే యోగిలా ఎలా బతకాలో తెలుసుకోవాలంటే ఆత్మవిశ్వాసమనే పాశుపతంతో మనలోని అంతశత్రువుల్ని తుదముట్టించాల్సిందే..

మనసు నిండా అసూయ ద్వేషాలు.. ఇది దుర్యోధన దృక్పథం.. మర్యాదా మన్నన మరిచిన నడవడి.. ఇది దుశ్శాసన భావజాలం..
మనలోని మానవత దృతరాష్ట్రుడిలా కళ్లకు గంతలు కట్టుకుంటోంది. కర్ణుడిలోని దాత••త్వ భావాన్ని అతడి దుర్జన సాంగత్యమనే విష ప్రభావం హరించినట్టు మనలోని మంచీచెడుల విచక్షణను చెడు స్నేహాలు దిగజార్చుతున్నాయి. మనిషిని నిలువెల్లా కౌరవతత్వం అలముకుంటోంది.
అర్జునుడికి దారిచూపి కర్తవ్యాన్ని బోధించిన వాడే మనకూ దారి చూపకపోడు. అందుకే ‘ఓ కృష్ణా! అజ్ఞానం మమ్మల్ని కమ్మేసింది. ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది మంచో, ఏది చెడో తేల్చుకోలేకపోతున్నాం. మాకు మంచిని బోధించు. శ్రేయస్కరమైన మార్గాన్ని చూపించు’ అని వేడుకుందాం. పాండవులను గెలిపించినట్టే మనల్నీ ఒడ్డున పడేస్తాడు. అర్జునుడి రథాన్ని సవ్య మార్గంలో నడిపించినట్టే మన బతుకుబండినీ దారిలో పెడతాడు. తామరాకు మీద నీటి బిందువులా.. నిత్య జీవితంలో ఒడుపుగా నెట్టుకురావడం ఎలాగో నేర్పిస్తాడు.
అర్జునుడికి సంగ్రామ భూమిలో చేసిన గీతోపదేశం.. నేడు మనకు కర్మోపదేశం.
‘‘ఫలితాన్ని ఆశించకుండా నీ పని నువ్వు చెయ్‍..’’.. ఇదే మనిషిని మనిషిగా మార్చే కర్తవ్యబోధ. భగవద్గీత మూడో అధ్యాయంలో ఉంది కర్మయోగం. ఇందులో ఏముంది? కృష్ణుడు ఏం చెప్పాడు? అడవులకు పోయి తపస్సు చేసుకొమ్మని చెప్పలేదు.. బంధాల్ని వీడి కాషాయం కట్టుకొమ్మని సలహానివ్వలేదు..
పూజలూ, వ్రతాలూ, ఉపవాసాలూ, హోమాలు చేయమనలేదు.. బతుకు బుద్బుధప్రాయం.. సంసారం దు:ఖసాగరం అని నిరాశపరచలేదు.. ఆనంద విషాదాలు.. గెలుపోటముల మధ్య ఓ యోగిలా బతకడం మాత్రం సాధ్యమేనని చెప్పాడు. నువ్వో ఉద్యోగివైతే మనసావాచాకర్మణా అంకితభావంతో పని చేయడమే ముక్తి మార్గం.. నువ్వో గృహిణివైతే వంటిల్లే నీ ధ్యానకేంద్రం..

హృదయాన్ని యజ్ఞవాటికగా చేసుకుని చేయాల్సిన పనుల్ని హోమ ద్రవ్యాలుగా సమర్పించి మనోయజ్ఞం చేయండని కృష్ణుడు చెప్పాడు. భక్తి, జ్ఞానం, వైరాగ్యంతో సాధించగలిగే ఆధ్యాత్మిక ప్రగతిని ‘కర్మయోగ జీవనశైలి’తోనూ సాధించవచ్చని లోకానికి చాటిన గీతాచార్యుడాయన. ఇంతకీ కర్మ అంటే ఏమిటి?
కర్మ- అంటే పనిచేయడం. అకర్మ- ఏ పనీ చేయకపోవడం. సకామ కర్మ- ప్రతిఫలాన్ని ఆశించి పనిచేయడం. నిష్కామ కర్మ- ఎలాంటి ఫలాపేక్ష లేకుండా పనిచేయడం. ఈ నాలుగు అంశాల సారమే భగవద్గీతలోని కర్మయోగం.
నడవడం ఓ కర్మ. తినడం ఓ కర్మ. నిద్రపోవడం ఓ కర్మ. జీవితమంటే అనేకానేక శారీరక, మానసిక కర్మల సమాహారం. పని చేయడం (కర్మ) మనిషి సహజ స్వభావం. పని.. ఏదైనా కానీ అది చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం. ఏదొకటి చేస్తూ ఉండాల్సిందే. పని చేయడం ఎలాగూ తప్పదు కాబట్టి ఆ చేసేదేదో మంచి పనులు (మంచి కర్మలు) చేయండని చెబుతాడు శ్రీకృష్ణుడు. మనం చేసేది ఎంత మంచి పనైనా కాస్తోకూస్తో ఫలాపేక్ష లేకుండా ఉండదు. కాబట్టి ఆ ఫలాపేక్ష (ఆశించడం) అనే ఆసక్తిని తుంచేసుకొమ్మంటాడు. అప్పుడది నిష్కామ కర్మ అవుతుంది.
చేసే పనిలో నైపుణ్యం చూపాలి. కౌశలాన్ని ప్రదర్శించాలి. ఒక పని ఎలా చేస్తే అది సఫలీకృతమవుతుందో.. ఎలా చేస్తే అది సవ్యంగా పూర్తవుతుందో తెలిసి ఉండటమే కర్మ కౌశలం.. కర్మ నైపుణ్యం. ‘కష్టపడి పని చేయి. అందులో నైపుణ్యాన్ని ప్రదర్శించు. పనే లోకమన్నట్టు పని చేయి. ఎవరూ వేలెత్తి చూపనంత గొప్పగా పని చేయి. ఎవరూ అజమాయిషీ, పర్యవేక్షణ చేయాల్సిన అవసరమే లేనంతగా పని చేయి. అలా ఆ పని చేయడంలోనే, ఆ పనిలోనే ఆనందాన్ని అనుభవించు. అంతే! అంత వరకే నీ బాధ్యత!. ఫలితం గురించి ఆలోచించకు!.’ ఇదే శ్రీకృష్ణుడి కర్తవ్యబోధ. ప్రతిఫలాన్ని ఆశించకుండా ఓ యజ్ఞంలా పని చేయడమే కర్మయోగం.
జీవితం కూడా ఓ సంగ్రామ క్షేత్రమే. బతకాలంటే యుద్ధాలు చేయకతప్పదు.. మనలోని అంత:శత్రువులతో, ఇంటా బయట ఎదురయ్యే సమస్యలతో నిరంతరం పోరాడాల్సిందే. వాటి నుంచి తప్పించుకుని పోకూడదు. ‘యుద్ధం చెయ్‍.. ఎలాంటి అలజడి లేకుండా నీ జీవన యుద్ధాన్ని నిర్భయంగా, నిశ్చలంగా కొనసాగించు’ అనేది కర్మయోగంలోని కృష్ణుడి కర్తవ్యోపదేశం. మనం ఏదైనా పూజ చేసేటపుడు భగవంతుడికి నైవేద్యాలో, ఫలాలో, పుష్పాలో సమర్పిస్తాం. అలా సమర్పించేటపుడు ‘ఫలం సమర్పయామి’, ‘పుష్పం సమర్పయామి’ అంటాం. అలాగే మనం చేసిన కర్మల్ని పరమాత్మకు నైవేద్యంగా నివేదించాలి. భగవంతుడికి సమర్పించేందుకు తయారుచేసే
నై•వేద్యం చాలా రుచిగా ఉంటుంది. అలాగని అది మొత్తం తినేయమని కాదు. బంధువులు, ఆత్మీయులకు దాన్ని పంచుతాం. దానినే ‘ఈశ్వరార్పణ బుద్ధి’ అంటారు. మనం చేసిన కర్మల్ని భగవంతుడికే సమర్పించేస్తే దానిపై మనకిక ఎలాంటి అధికారమూ ఉండదు. ఆ ఫలితం మనది కాదు. ఇలాంటి సమర్పణ బుద్ధి వల్ల మనం చేసే పనుల్ని మరింత సమర్థవంతంగా, ప్రశాంతంగా చేయగలుగుతాం. పనిలో నాణ్యత పెరుగుతుంది. పని వేగవంతమవుతుంది. ఫలితాన్ని ఆశించో, ప్రయోజనాన్ని కోరుకునో చేసే సకామ కర్మలో.. అనుకున్న పని అనుకున్నట్టు అవుతుందో లేదోననే భయం ఉంటుంది. ఆ భయంలో నుంచి అనేక పరిమితులు పుడతాయి. చేసే పనిలో కొత్తగా ప్రయత్నించాలంటే భయం కలుగుతుంది. ధైర్యం చాలదు. చివరకు అలాంటి పనికి బానిసలైపోతాం. అదే నిష్కామ కర్మ భావంతో చేసే పనిలో స్వేచ్ఛగా, ధైర్యంగా ఉండగలుగుతాం. ఫలితం ఎలా ఉంటుందోన•

భయం ఉండదు. గెలుపోటముల జంజాటం కలగదు. స్వేచ్ఛ ఉన్నచోటనే సృజన ఉంటుంది. నైపుణ్యం వెల్లివిరుస్తుంది. ఊగిసలాటకు ఆస్కారం ఉండదు. అర్జునుడు చేప కంటిపై బాణాన్ని గురిపెట్టినట్టు నేరుగా లక్ష్యంపైనే గురిపెడతాం.
ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. అవార్డులను దృష్టిలో పెట్టుకుని తీసే సినిమా.. నిజానికి అవార్డులను గెలుచుకోదు. ఎలాగైనా అవార్డు గెలుపొందాలన్న తాపత్రయంతో ఆ సినిమా నిర్మాణం అనేక పరిమితుల మధ్య సాగుతుంది. నాణ్యత ఉండదు. అవార్డుల కమిటీకి ఏం నచ్చుతుందో అదే దృష్టితో తీస్తారు. కాబట్టి చివరకది ప్రేక్షకుల అభిమానాన్ని పొందదు. ఎందుకంటే అందులో ప్రేక్షకులకు నచ్చే అంశాలేమీ ఉండవు కనుక. అదే మంచి సినిమా తీయాలనే సంకల్పంలో స్వేచ్ఛగా తీస్తే అది కచ్చితంగా అవార్డులను పొందుతుంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుంది. మనం చేసే పనులు కూడా ఇలాగే ఉండాలి. పనిని ప్రేమించి, పనినే దైవంగా భావించే దేశాలు ప్రపంచంలో ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉంటాయి.
అందుకు ఉదాహరణ ఇలాంటి భావజాలం కలిగిన జపాన్‍, దక్షిణకొరియా వంటి దేశాలు. చాలామంది ఏ పనీ చేయకపోవడాన్ని కూడా గొప్పగా భావిస్తారు. తమకెలాంటి బాధ్యతలు లేనందుకు తమంత అదృష్టవంతులు లేరని అనుకుంటారు. అలాంటి వారి దృష్టిలో పని చేయడం అంటే ఓ శిక్ష. అలాంటి వారి విషయంలో కర్మ (పని) అనేది ‘ఖర్మ’గా మారుతుంది. భగవంతుడు ఇలాంటి వారిని గర్హిస్తాడు. బద్ధకాన్ని వీడమంటాడు. శ్రమజీవన సౌందర్యాన్నే భగవంతుడు ఇష్టపడతాడు. యుద్ధం (అదీ ఒక పనే) చేయడానికి నిరాకరించిన అర్జునుడికి ‘నువ్వింత పిరికివాడివా?’ అన్నట్టే ఏ పనీ చేయని వాళ్లని చీవాట్లు పెడతాడు.
ఒక్కోసారి పనిలో నైపుణ్యం సాధించగానే ‘నా అంతటి వారు లేరు’ అనే భావం కలుగుతుంది. అదే అహంకారంగా మారుతుంది. అహంకారులు తమ అజ్ఞానం కొద్దీ అన్ని పనులూ తామే చేస్తున్నామని అనుకుంటారు. ఫలానా పని నా వల్లే అవుతుంది.. నేను మాత్రమే చేయగలను అని అనుకోవడం వల్ల కలిగే నష్టాలు చాలా ఉంటాయి. కర్మయోగి అనేవాడు తాను చేస్తున్న పనికి బందీ అయిపోడు. మనిషి యోగిలా మారాలంటే సుఖాలను, స్వేచ్ఛను వదిలేసుకోవాలని ఎక్కడా చెప్పలేదు కృష్ణుడు. ‘నా’ అనే ఒక్క అక్షరాన్ని మాత్రం వదిలేయమన్నాడు. ‘నా’ అనేది అహంకార ప్రతీక. రామాయణంలోని జనక మహారాజుకు విదేహుడనే మరో పేరు కూడా ఉంది. దేహాన్ని గెలిచిన వాడని దానికి అర్థం. తాను చక్రవర్తి అయినా తానెప్పుడూ సార్వభౌముడినని ఆయన భావించే వాడు కాదట. తానొక ఆత్మననే స్ప•హతోనే ఉండేవాడట. అలాగని రాజవైభోగాలను అనుభవించకుండా ఉండలేదు. యుద్ధమైనా, పాలనైనా ఓ కర్మయోగంగానే భావించాడు జనకుడు. విజయం కలగగానే పొంగిపోతాం. ఓడిపోతే కుంగిపోతాం. నిజానికి గెలుపులో తీపీ లేదు. ఓటమిలో చేదూ లేదు. ఆ రెండూ పనితో పాటు వచ్చిన ఆనంద విషాదాలు కాదు. కర్మలతో, అంటే చేసే పనులతో మనల్ని మనం ముడిపెట్టుకోవడం వలన వచ్చిన ఇబ్బందులవి.
బడిలో లెక్కలు, సైన్స్, సామాజిక శాస్త్రం.. ఇంకా ఎన్నో సబ్జెక్టులు నేర్పుతారు.
కానీ, మనసుకు శిక్షణనిచ్చే, మనసును గెలిచే బడి లోకంలో ఒక్కటీ లేదు.
అందుకే కృష్ణుడు ఇక్కడో సులభోపాయం చెబుతున్నాడు.
‘నిజానికి కర్మయోగమంటే మనసు మీద మనిషి గెలుపే. ప్రయత్నం వరకు నాదే. ఫలితం భగవానుడిదే.’ అనుకొమ్మంటాడు. అలా అనుకోవాలంటే ఎంత మనో సాధన కావాలి? అలాగని అదేమంత కష్టసాధ్యమైన పని కాదు. ‘ముందు మీలోని అంత: శత్రువుల్ని గెలవండి. తరువాత బయటి సమస్యలపై విజయం సులువుగా సాధించవచ్చు’నని ధైర్యం చెబుతాడు. మన లోపలి శత్రువులంటే.. ఇంద్రియాలు, మనసు, బుద్ధి.. ఇవే. వీటిని అదుపులోకి తెచ్చుకోవడం, వాటిని సరైన దారిలో పెట్టడమే అసలైన మానసిక విజయం.
ఇది సాధించిన మనిషి ఎలాంటి విజయాలనైనా సాధించగలడు.
కర్మయోగి, కర్మయోగి కానివాడు.. ఇద్దరూ మనుషులే. ఇద్దరూ కష్టపడి పనిచేస్తారు. కానీ, ఇద్దరి జీవన దృక్పథాలూ వేరు. ఒకరు సమాజం గురించి ఆలోచిస్తారు. మరొకరు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. నలుగురి గురించి ఆలోచించే వారి జీవితమే ధన్యం. కర్మయోగం అంటే సమాజానికి ఉపయోగపడే పని కూడా. నువ్వు చేసిన పనిని, దాని తాలూకు ఫలితాన్ని నలుగురికీ పంచడం ఓ బాధ్యత.
ఒకసారి విష్ణువును ఎవరో అడిగారట.
‘నువ్వు స్వయంగా సర్వశక్తిమంతుడివి కదా! రాక్షసులను సంహరించడానికి ఏకంగా పది అవతారాలు ఎత్తాలా?.
అన్ని కష్టాలు పడాలా?’.
‘అవును! నేను ఏమీ చేయకుండా ఉంటే అందరూ నన్నే అనుసరిస్తారు. బద్ధకస్తులుగా తయారవుతారు. అది నాకిష్టం లేదు. ఓ ఆదర్శాన్ని లోకానికి చాటడానికే నా అవతారాలన్నీ. ఆయా అవతారాల్లో నేను చేసిన పనులన్నీ ఆ ఆదర్శం కోసమే’ అని మహావిష్ణువు బదులిచ్చాడట. అందుకే శేషతల్పంపై హాయిగా శయనించిన వాడే పాండవుల గుర్రాలను కడిగాడు.
అర్జునుడి రథాన్ని తోలాడు.
అవన్నీ నిష్కామ కర్మలే. మానవజాతికి మార్గసూచికలే!.

కర్మయోగ సారం..

  • సమస్త ప్రాణుల్లోని ఆత్మ.. తనలోని ఆత్మ ఒకటేనని తెలుసుకోగలిగితే ఆ మనిషిని ఏ కర్మలూ బంధించలేవు. అలాంటి వారి మనసు శుద్ధంగా ఉంటుంది. ఇంద్రియాలు కూడా ఏమీ చేయలేవు. ఆ మనోవికాసమే కర్మయోగానికి తొలిమెట్టు.
  • ధర్మబద్ధంగా నీ కర్మను నువ్వు నిర్వర్తించకపోతే స్వధర్మం నుంచి పారిపోయినట్టే. దీనివల్ల కీర్తి నశిస్తుంది. జనం నీ వైపు వేలెత్తి చూపుతారు. ఆ పరిస్థితి మరణం కంటే బాధాకరం.
  • శుభ్రత, నిరాడంబరత్వం మొదలైనవి శారీరక తపస్సులు. సత్యాన్ని మాట్లాడటం, వికాసాన్ని కలిగించే సంభాషణలు జరపడం, ఉత్తమ గ్రంథాల అధ్యయనం.. ఇవి వాక్కుతో చేసే తపస్సులు. ప్రశాంతచిత్తం, మనో నిగ్రహం, చక్కని భావాలు.. మానసికమైన తపస్సులు.
  • కోపంలో నుంచి అవివేకం పుడుతుంది. అవివేకం కారణంగా మతిమరుపు మొదలవుతుంది. ఆ ప్రభావంతో బుద్ధి నశిస్తుంది. దీంతో మనిషి పతనం ఆరంభమవుతుంది.
  • కామం, క్రోధం, లోభం.. ఈ మూడూ నరక ద్వారాలు. ఇవి మనిషి పతనానికి దారితీస్తాయి. వాటి నుంచి బయటపడిన మనిషి సర్వోన్నతుడు అవుతాడు.
  • భగభగ మండుతున్న నిప్పు కట్టెలని ఎలా బూడిద చేస్తుందో జ్ఞానమనే అగ్ని కూడా సమస్త కర్మల్నీ భస్మం చేస్తుంది. సృష్టిలో కర్మయోగానికి సమానమైనది లేదు.
  • నమ్రత, నిగర్వం, అహింస, ఓర్పు, నిజాయతీ, గురుసేవ, శారీరక, మానసిక శుభ్రత, ఇంద్రియ నిగ్రహం, అహంభావం లేకపోవడం, బంధాలకు అతీతంగా ఉండటం.. ఇవన్నీ వికాసానికి సోపానాలు.

డిసెంబరు 1, 2025
మార్గశిర శుద్ధ ఏకాదశి
గీతా జయంతి

Review నీ పనే నీ దైవం!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top