
రామాయణం అంటే మనిషి జీవనయానమే.,
రామకథ అంటే విలువల రాచబాటే..
రామాయణంలోని ప్రతి పాత్రా ఒక అక్షయపాత్ర. ఇందులోని ప్రతి పాత్ర వ్యక్తిత్వాన్ని, వికాసాన్ని, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్పుతాయి.
రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు, జాంబవంతుడు, వాలి, సుగ్రీవుడు, దశరథుడు, లవకుశులు, మయుడు, మేఘనాథుడు, జటాయువు, శూర్పణఖ, శబరి..
ఒకటా రెండా.. రామాయణంలో ఎన్నో పాత్రలు.. వీటిలో ఎలా బతకాలో నేర్పేని కొన్ని.. ఎలా ఉండకూడదో తెలిపేవి మరికొన్ని.. ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు కొన్నాళ్ల క్రితం ‘రామాయణ పరివారం’ అనే పుస్తకాన్ని రాశారు. అందులో రామాయణంలోని పాత్రలు.. వాటి తీరుతెన్నులు.. ఆయా పాత్రల లక్షణాలు.. వాటి ద్వారా నేర్చుకోకూడనవి.. నేర్చుకోవాల్సినవి ఏమిటో సచిత్రంగా వివరించారు. ఆ పుస్తకం ఆధారంగా రామాయణంలోని కొన్ని పాత్రల పరిచయం ఈ మాసం ‘ఆధ్యాత్మిక వికాసం’ ప్రత్యేకం..
రాముడు
రామాయణ మహాకావ్యంలోని ఏడు కాండాలలో రాముని జననం నుంచి సరయూ నదిలో రాముడు, అతడి సోదరుల అవతార పరిసమాప్తి వరకు రాముని పాత్ర, ప్రయాణం ఉంటుంది. అరణ్యవాసంలో ఉన్న సీతను రావణుడు తీసుకుపోవడంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్తూ సామాన్యుడిలా అన్ని బాధలనూ అనుభవించాడూ అంటే రాముడు సంపూర్ణ మానవుడిగానే పుట్టాడు. మనిషిగానే అనేక కష్టసుఖాలు అనుభవించాడు. ఒక అన్నగా తమ్ముళ్లపై అపారమైన ప్రేమను కురిపించాడు. తల్లులు వేరైనా ఏనాడూ తమ్ముళ్లతో గొడవ పడలేదు. శ్రీరాముడిని చూసి నేర్చుకోవాల్సిన లక్షణం- స్థితప్రజ్ఞత. సంతోషానికి పొంగిపోకుండా, బాధకు కుంగిపోకుండా స్థిరంగా ఉన్నాడు. సాయం చిన్నదో.. పెద్దదో చేసిన ఉపకారానికి కృతజ్ఞతా భావంతో జటాయువు పక్షికి అంత్యక్రియలు నిర్వహించాడు. శత్రువు సోదరుడైన విభీషణుడు శరణు కోరి వస్తే ఆశ్రయం కల్పించాడు. బద్ధ శత్రువులైనా సాయం అడిగితే కాదనకూడదని రాముని జీవితంలోని ఈ సందర్భాలు మనకు తెలియ చెబుతాయి. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టే వాల్మీకి మహర్షి రాముడిని, రామో లోకాభిరామ: ప్రియంవద:, నిత్యం ప్రశాంతాత్మా, సానుక్రోశ:’ అని కొనియాడాడు.
హనుమంతుడు
‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారాల కలయికే.. ‘హనుమ’ అనీ, హనుమనామం ప్రణవ స్వరూపమనీ అంటారు. హనుమంతుడు సప్త చిరంజీవులలో ఒకడు. శివాంశ సంభూతుడు.
రామాయణంలోని కిష్కింధకాండలో హనుమంతుడి పాత్ర ప్రవేశిస్తుంది. శ్రీరాముడి అవతార సమాప్తి వరకూ రాముడి సేవకుడిగానే హనుమంతుడు మనకు కనిపిస్తాడు. ‘నువ్వు ఎవరివి?’ అని ఎవరైనా అడిగితే, హనుమంతుడు తన గురించి తాను చెప్పుకునే మొదటి మాట.. ‘నేను కోసలేంద్రుడి దాసుడిని’ అనే. ఇది హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన వినయ గుణం. హనుమంతుడు బలానికి ప్రతీక. అష్టసిద్ధులనూ కలిగి ఉంటాడు. అయినప్పటికీ నిజాయతీ, వినయం, విధేయతల్లో ఎలాంటి మార్పు లేకుండా అత్యంత సాధారణంగా కనిపిస్తాడు. రాముడి సేవకుడిననే ప్రకటించుకుంటాడు. శ్రీరాముడికి, సుగ్రీవుడికి మధ్య సంధి కుదర్చడంలో హనుమంతుడు ప్రత్యేక పాత్ర పోషించాడు. హనుమంతుడి చక్కటి మాటతీరు అందుకు ఉపకరించింది. అలాగే అశోకవనంలో సీతమ్మతో జాగ్రత్తగా మాట్లాడాడు. అలాంటి మాటతీరును ఈ రోజుల్లో మనం
అలవర్చుకుంటే
మానవ సంబంధాలు
మరింత మెరుగవుతాయి.
లక్ష్మణుడు
ఆదిశేషుడి అవతారం లక్ష్మణుడు. ఈయనకు గల మరో పేరు సౌమిత్రి (సుమిత్ర కుమారుడు). దశరథుడి ఇంట్లో కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు జన్మించారు. బాల్యం నుంచీ రామలక్ష్మణులు ఒకరిని విడిచి ఒకరు ఉండే వారు కాదు. రాక్షస సంహారం కోసం విశ్వామిత్రుడి వెంట వెళ్లినా, సీతా స్వయంవరంలో శివధనుస్సు చేపట్టినా.. రాముడి వెన్నంటే లక్ష్మణుడు ఉన్నాడు. స్వయంవరంలో రాముడికి సీత చేతిని అందిస్తే.. లక్ష్మణుడికి ఆమె చెల్లెలు ఊర్మిళను ఇచ్చి వివాహం చేశారు. అలా రాముడికి లక్ష్మణుడు తమ్ముడే కాక తోడల్లుడు కూడా. లక్ష్మణుడు రాముడితో పాటే జననం, రాముడితో పాటే అరణ్యవాసం. రావణ సంహారం, వనవాసం ముగిసి రామరాజ్యం మొదలైన తరువాత కూడా లక్ష్మణుడు రాముడి సేవకుడిగానే ఉండిపోయాడు. నిరంతరం తన వెన్నంటి నిలిచి, తన ఆజ్ఞలను పాటించిన లక్ష్మణుడి రుణం ఎలాగైనా తీర్చుకోవాలని రాముడు అనుకున్నాడట. అందుకే కృష్ణావతారంలో లక్ష్మణుడు బలరాముడిగా జన్మించాడు. లక్ష్మణుడు సోదర ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. సద్గుణ సంపన్నుడు. ధైర్యశాలి.
శబరి
రామాయణంలో శ్రీరాముడి భక్తురాలు శబరి. రాముడి దర్శనం కోసం జీవితాంతం భక్తితో వేచి ఉండి, చివరికి రామ దర్శనం పొందిన ధన్యజీవి. శబరి ఒక గిరిజన మహిళ. తన గురువులకు సేవ చేసుకుంటూ ఆశ్రమంలో ఉండేది. ఈమెను గురించి, ‘శ్రమణీం ధర్మ నిపుణాం’ అని వర్ణిస్తాడు వాల్మీకి. ‘శ్రమణి’ అంటే సన్యాస జీవితంలో ఉన్న స్త్రీ. ధర్మం విషయంలో కూడా ఆమెకు సంపూర్ణమైన అవగాహన ఉంది. శబరి.. మాతంగాశ్రమాన్ని చిమ్మి అలుకు చల్లడంతోనే ఆమె కోరికలు గుండెల్లో చల్లబడ్డాయి. అక్కడ ముగ్గులు పెట్టడంలోనే ఆమె తల ముగ్గుబుట్టలా మారిపోయింది. పూజకు పూలు సేకరించడంలోనే ఆమె కనుచూపు సన్నగిల్లింది. ఆహారానికి పండ్లు ఏరడంలోనే ఆమె నోటి పండ్లన్నీ రాలిపోయాయి. మడి బట్టలు పిండటంలోనే శరీరమంతా ముడతలు పడిపోయింది.
ఏదైనా పదార్థం తినే ముందు దేవుడికి పెడతారు. ఆ తర్వాతే ఆరగిస్తారు. ఇదొక ఆచారం. దేవుడికి అర్పించాకే తింటేనే అది ప్రసాదం అవుతుంది. అందుకనే పిల్లలు తెలియక ఎక్కడ తింటారోనని ఎంగిలి చెయ్యొద్దని అంటారు. అయితే, దేవుడైనా రాముడు ఒకే ఒక్కరి ఎంగిలి తిన్నాడు. అది శబరి ఎంగిలి. తన చూపు మందగించడం వల్ల పళ్లను చూసి అందులో మంచివి, పండినవి, పండనివి అని వేరు చేయడం ఆమెకు సాధ్యపడలేదు. అందువల్ల రాముడు వచ్చినపుడు.. తాను కాస్త రుచి చూసి, మంచి మంచి పళ్లను రామలక్ష్మణులకు అందిస్తుంది. రామాయణంలో వాల్మీకి శబరిని ఒక రేఖాచిత్రంగా మాత్రమే చూపించాడు. అయినా, పాఠకులు ఆ పాత్ర దగ్గర ఆగి ఆలోచిస్తే చాలు.. అనిర్వచనీయమైన అనుభూతి ఏదో వారి హృదయాన్ని అలముకుంటుంది.
సీత
మహా విష్ణువు భార్య లక్ష్మీదేవి. లోక కల్యాణం కోసం స్వామి భూమిపై వివిధ అవతారాలు దాల్చారు. ఆయనతో పాటే అమ్మవారు కూడా. రామాయణంలో సీతగా, మహాభారతంలో రుక్మిణిగా, కలియుగంలో పద్మావతిలా వివిధ అవతారాలను దాల్చింది. సీతను జానకి, మైథిలి, వైదేహి, రమ అనే పేర్లతోనూ పిలుస్తారు. జనకుడికి భూమిని దున్నుతుండగా నాగలి చాలుకు ఒక పెట్టె తగిలింది. తెరిచి చూస్తే పసిగుడ్డు ఉంది. తల్లి గర్భం నుంచి జన్మించలేదు కాబట్టి ‘అయోనిజ’ అయింది. నాగటిచాలుకు సీత అని పేరు.
జనకుడికి భూమిలో దొరకడం, స్వయంవరంలో శ్రీరాముడితో వివాహం, రాముడితో కలిసి అరణ్యవాసానికి వెళ్లడం, అక్కడ రావణుడు ఆమెను అపహరించడం, రామరావణ యుద్ధం, సీత అగ్నిప్రవేశం, అయోధ్యలో నివాసం, మళ్లీ వనవాసం, లవకుశులకు జన్మనివ్వడం, తిరిగి భూమిలో అంతర్థానం కావడం.. ఇలా రామాయణంలోని ప్రతి మలుపులో సీత పాత్ర మహోన్నతంగా ఉంటుంది. క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన వ్యక్తిత్వం సీతది. సీత పతి ప్రేమనే పరమార్థంగా భావించింది. ఆయన సాహచర్యం కోసం అనేక కష్టాలు అనుభవించింది. సహధర్మచారిణిగా అన్ని సందర్భాల్లోనూ భర్తకు సహకరించింది. ఆయన ప్రభుధర్మ పాలన కోసం అగ్ని ప్రవేశం చేసింది. అందుకే సీత జీవితం ఆదర్శప్రాయం.
రావణుడు
బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రావసు బ్రహ్మ (బ్రాహ్మణుడు), దైత్య రాకుమారి కైకసి (రాక్షస స్త్రీ) కుమారుడే రావణుడు. రావణాసురుడి తండ్రి వైపు నుంచి తాత పులస్త్యుడు.
ఇతని తండ్రి బ్రహ్మ. రావణాసురుడి తల్లి వైపు నుంచి.. తాత మల్యవుడు. అమ్మమ్మ తాటకి. మామ మారీచుడు. రావణాసురుడికి ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. భార్య మండోదరి. వీరికి ఏడుగురు కొడుకులు. దశకంఠుడు (పది మంది జ్ఞానులతో సమానమైన జ్ఞానం గలవాడు) దశముఖుడు, దశగ్రీవుడు ఇతని ఇతర పేర్లు. రావణాసురుడు కైలాస పర్వతాన్ని తన రెండు చేతులతో పెకిలిస్తున్నపుడు పరమశివుడు అతని చేతివేళ్లను కాలితో తొక్కుతాడు. అప్పుడు దశకంఠుడు బిగ్గరగా అరవడంతో ఇతనికి రావణుడు (అరుపు= రావణ) అనే పేరు వచ్చింది. రావణుడు పుట్టినపుడు రక్తం వర్షంగా కురిసిందట. గద్దలు అరిచాయట. దేవతలు కూడా భయపడ్డారట. రావణుడి జన్మ శాప కారణంగా జరిగిందనీ, హిరణ్యకశిపుడిని వధించడంతో, ‘కపటంతో స్తంభం నుంచి వచ్చి ఇరవై గోళ్లతో నన్ను చంపితివి. ఇదా నీ పౌరుషం?’ అని ఆక్షేపించాడట. దాంతో విష్ణువు, ‘మరో జన్మలో నీకు ఇరవై బాహువులు, పది శిరస్సులను ఇచ్చి, నేను సామాన్యుడినై సంహరిస్తాను’ అన్నాడట.
రామాయణంలో అరణ్యకాండ, సుందరకాండ, యుద్ధకాండలో రావణుడి పాత్ర కనిపిస్తుంది. అరణ్యకాండలో వాసుకి పాలిస్తున్న పాతాళలోకానికి వెళ్లి తక్షకుని భార్యను అపహరించి తన భార్యగా చేసుకుంటాడు. కైలాస పర్వతం వైపు వెళ్లి తన సోదరుడైన కుబేరుడిని యుద్ధంలో జయించి పుష్పక విమానాన్ని కాంచనలంకకు తెచ్చుకుంటాడు. స్వర్గానికి వెళ్లి నందనవనాన్ని ధ్వంసం చేస్తాడు. సూర్యచంద్రులను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని వారి గమనాన్ని నిరోధిస్తాడు. పూర్తి కావస్తున్న యజ్ఞ యాగాదులను ధ్వంసం చేయడం అంటే రావణుడికి అత్యంత ప్రీతి. యజ్ఞాలలో ఇచ్చే సోమరసాన్ని ఇంద్రుడు సంగ్రహించకుండా తానే స్వీకరించి, యజ్ఞఫలాన్ని నాశనం చేస్తాడు. సీతను అపహరిస్తాడు. సుందరకాండలో.. అశోకవనంలో సీతను ఉంచుతాడు. యుద్ధకాండలో రాముడి చేతిలో మరణిస్తాడు. రావణుడు.. వేదవేదాంగాలను ఆవపోసన పట్టిన పండితుడు. నిత్య పూజా దురంధరుడు. తపస్వి. గొప్ప రాజనీతిజ్ఞుడు. సంగీత సాహిత్యాలలోనూ ప్రతిభావంతుడు. ఇన్ని సుగుణాలు ఉన్నప్పటికీ, అతడి పతనానికి ప్రధాన కారణం మాత్రం.. పరస్త్రీ వ్యామోహం. పాలకుండలో విషపుచుక్కలా, ఒక్క దుర్గుణం వేయి సుగుణాలను కప్పేస్తుంది. ఏ దేశమైనా, ఏ కాలమైనా ఈ సందేశం అందరికీ వర్తిస్తుంది.
జటాయువు
స్వామి కార్యం అనేసరికి ప్రతి ప్రాణీ తన శక్తి మేర కృషిచేసిన గాథలను అద్భుతంగా వర్ణించింది రామాయణ మహాకావ్యం. ఉడుత.. వారధి కోసం, సంపాతి.. లంకకు దారి చూపడం, అతని సోదరుడు జటాయువు.. సీతమ్మ ఆనవాలు చెప్పడం, వానర సైన్యం.. రావణుని వధించి ధర్మస్థాపన కోసం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవరాశులు శ్రీరాముడికి తోడ్పాటుగా నిలిచాయి. అందులో ఒక ఉదాత్తమైన ప్రాణి జటాయువు. ఇది అరణ్యకాండలో వచ్చే ఒక గద్ద పాత్ర. ఇతను అనూరుడు (సూర్యుడి రథసారథి), శ్యేని దంపతుల కుమారుడు. సంపాతి ఇతని సోదరుడు. దశరథుడి స్నేహితుడు. రావణుడు సీతను అపహరించడాని కంటే ముందే, సీతారామ లక్ష్మణులను జటాయువు కలుసుకుంటాడు. తనను తాను పరిచయం చేసుకుని, రామలక్ష్మణులు ఏదైనా పనిపై బయటికి వెళ్లినపుడు తాను సీతకు రక్షణగా ఉంటానని చెబుతాడు. రావణుడు సీతను అపహరించుకునిపోతున్నపుడు నిలువరించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. రావణుడితో యుద్ధం చేసి గాయపడతాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ రాముడు వచ్చాక, జరిగిన విషయం చెప్పి మరణిస్తాడు. జటాయువుకు రాముడే స్వయంగా అంత్యక్రియలు జరిపిస్తాడు. జటాయువు పాత్ర స్వచ్ఛమైన మైత్రికి ఆదర్శంగా నిలుస్తుంది.
ప్రహస్తుడు
శక్తిమంతుడైన రాక్షస యోధుడు ప్రహస్తుడు. రావణుని సేనాధిపతి. తరువాత యుగంలో మహాభారతంలో పురోచనుడిగా దుర్యోధనుని నమ్మకమైన సహాయకుడిగా, లక్క గృహ సంఘటనకు కారణమైన వాడిగా పునర్జన్మ పొందాడు. ప్రహస్తుడు నీలుడి చేతిలో మరణిస్తాడు. కొన్ని గ్రంథాలలో లక్ష్మణుడి చేతిలో చనిపోయినట్టు ఉంది. రావణుడి ఏడుగురు కుమారులలో ప్రహస్తుడు ఒకడు.
లంకా నగరపు నాలుగు ప్రముఖ ద్వారాలు నలుగురి ఆధీనంలో ఉంటాయి. తూర్పు ద్వారం ప్రహస్తుడి ఆధీనంలో, దక్షిణ ద్వారా మహోదరుడు, మహాపార్శ్వుని ఆధీనంలో, పడమర ద్వారం ఇంద్రజిత్తు ఆధీనంలో, ఉత్తర ద్వారం రాఆవణుడి ఆధీనంలో ఉంటాయి.
రామాయణంలో ప్రహస్తుడి పాత్ర యుద్ధకాండలో వస్తుంది. ఎంతోమంది వానరులను సంహరించాక, ప్రహస్తుడు నీలుడి చేతిలో మరణిస్తాడు. అకంపనుడు కూడా మరణించాడని తెలిసిన రావణుడు, ప్రహస్తుడిని పిలిచి, ‘యుద్ధానికి ముందుకు వెళ్దామా? వద్దా?’ అని అడుగుతాడు. దానికి ప్రహస్తుడు ‘అప్పుడే సీతను రాముడికి అప్పగించాలని చెప్పాడు. మీరు కుదరదని చెప్పారు. ఇక యుద్ధమే జరుగుతున్నపుడు వెనకడుగు ఎందుకు? మీ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను’ అని యుద్ధానికి బయల్దేరతాడు. ధర్మాన్ని ఆశ్రయించాలి. ధర్మాన్ని ఆచరించాలి. సీతమ్మను అప్పగించాలని ప్రహస్తుడు రావణుడితో ధర్మం చెప్పినా, దానిని ఆచరించడంలో విఫలమయ్యాడు. రోగానికి మందు తెలిసినప్పటికీ దానిని వాడకపోతే ప్రయోజనం ఏమీ లేనట్టుగానే ధర్మ విచక్షణ ఉన్నా దానిని ఆచరించకపోతే ప్రయోజనం ఏమీ లభించదు.
వీరే కాదు… ఇంకా రామాయణంలో ఎన్నో పాత్రలు.. ఒక్కోటి ఎన్నెన్నో పాఠాలను చెబుతాయి. వాటి నుంచి మంచిని గ్రహించాలి. అప్పుడే రామాయణ పఠనానికి సార్థకత.
Review నేర్చుకుంటే.. నేర్పుతాయి.