విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వయుజం. శివుడికి కార్తికం ప్రీతికరం. అలాగే, పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా తనను పూజించే వారి పట్ల శనీశ్వరుడు ప్రసన్నుడై శుభాలను ప్రసాదిస్తాడని పురాణ ప్రవచనం.
ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుడిని భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటారు. దీని వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. ఈ రెండు పదార్థాలు ఒంట్లో వేడిని పుట్టిస్తాయి. పుష్యంలో చలి కొరుకుతూ ఉంటుంది. కాబట్టే చలి నుంచి రక్షణకు ఈ నెలలో పై రెండు పదార్థాలు తినాలని నియమం
పుష్య మాసం తొలి అర్థభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు హరిని తులసీ దళాలలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని విశ్వాసం. అలాగే, పుష్య మాస సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ, ఆదివారాల్లో సూర్యుడిని జిల్లేడు పూలతోనూ అర్చించాలని శాస్త్ర వచనం.
శుక్ల పక్షంలో వచ్చే అష్టమి నాడు పితృదేవతలను ఆరాధించాలి. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని అంటారు. ఒక్కోసారి ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పుష్య మాసంలో కూడా వస్తుంది. ఈనాడు వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపు ద్వారా తెరచి ఉంచుతారు. భక్తులందరూ ఆ ద్వారం గుండానే స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించాడనడానికి చిహ్నం ఈ ఉత్తర ద్వార దర్శనం. పుష్య మాసంలో వస్త్ర దానం విశేష ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. చలితో బాధపడే వారిని ఆదుకోవడమే ఈ సదాచారం వెనుక గల సదుద్దేశం.
పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, కల్యాణైకాదశి అని పిలుస్తారు. ఈ రోజు- తెలగపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకుని తాగడం, తిలదానం చేయడం ఈ మాసపు విధాయ కృత్యాలు.
పై ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడం వల్ల ఆ రోజు (పుష్య బహుళ ఏకాదశి)ను షట్తివైకాదశి (షట్ + తిల + ఏకాదశి) అంటారు. ఈ మాసంలో చివరిదైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడుపాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ పాయ తూర్పుగోదావరి జిల్లాలోని చొల్లంగి వద్ద సముద్రంలో కలుస్తుంది. ఆ రోజున అక్కడ స్నానం చేయడం వల్ల విశేష పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం
Review పుష్య మాస విధులు.